జన గాయనిపై లక్షిత దాడి | B.Narsan writes on Vimalakka | Sakshi
Sakshi News home page

జన గాయనిపై లక్షిత దాడి

Published Sun, Dec 18 2016 2:21 AM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

జన గాయనిపై లక్షిత దాడి

జన గాయనిపై లక్షిత దాడి

సందర్భం
‘తెలంగాణ’ ఉద్యమకాలంలో తిండీ తిప్పలు మరచి కాళ్లకు గజ్జెలు కట్టి భుజాన గొంగడి వేసుకొని తన సాంస్కృతిక దళంతో తెలంగాణ నేలను చైతన్యపరచిన కళాకారిణి విమలక్క. ఆమె పేరు వింటే.. కోట్లాది తెలంగాణవాసుల కళ్లముందు ఆమె ఆటాపాటా తెరకడతాయి

విమలక్క అరుణోదయ సాంస్కృతిక సంస్థకు అధ్యక్షురాలు. దశాబ్దాలుగా ప్రజలకు రాజ్యాంగబద్ధంగా రావలసిన హక్కులను తెలియజేస్తూ, ప్రభుత్వాల విధి విధానాలను నిలదీస్తూ, పాలనను ఎండగడుతూ ఆ సంస్థ తన సాంస్కృతిక పోరును కొనసాగి స్తోంది. ‘అరుణోదయ’ తెలంగాణ ఉద్యమంలో మమేకమవడం ఓ మజిలీ. కేవలం భౌగోళిక తెలంగాణ సాధన కోసం ఈ సంస్థ పురుడు పోసుకోలేదు, అంతటితో దాని లక్ష్యాలు నెరవేరలేదు.
తెలంగాణ సాధనలో ప్రజా సంఘాల, సాంస్కృతిక సంస్థల పాత్ర ఎంతో కీలకమైనవి. వీటి మద్దతు లేకుండా ఏ రాజకీయ పార్టీ అయినా ఇంకా వందేళ్లు తండ్లాడినా తెలంగాణ వచ్చేది కాదు. పార్టీలు కాలానికి తగ్గట్లు పిల్లి మొగ్గలు వేస్తుంటే కోట్ల గొంతుకలను ఏకం చేసింది ఉద్యమకారులే. యువకుల, విద్యార్థుల, ఉద్యోగుల, కార్మిక కర్షకుల ఐక్య పోరాటం లేకుంటే అప్పటి కేంద్ర ప్రభుత్వానికి అంత సెగ తగిలేది కాదు. ఆయా వర్గాలను ఉద్యమంవైపు మలిపింది మాత్రం ప్రజా కళారూపాలే.

అయితే వివిధ కళా రంగాలకు ఉద్యమకాలంలో ప్రాతినిధ్యం వహించినవారు చాలావరకు ప్రభుత్వం జేబులో చొరబడ్డారు. భౌగోళిక తెలంగాణను ప్రజాస్వామ్య తెలంగాణగా మలచాలనుకొన్నవారు మాత్రం ప్రజలతో ఉన్నారు. ప్రభుత్వ పథకాలకు బాకాగా మారకుండా ఉన్న ఈ వర్గాలు ప్రశ్నల కొడవళ్లు ఎత్తడమే ఏలుతున్నవారికి కంటగింపుగా ఉంది. ఇలా ప్రజల పక్షాన నిలబడ్డవాటిలో ప్రధానంగా తెలంగాణ జేఏసీ, అరుణోదయలను పేర్కొనవచ్చు. అరుణోదయకి సారథ్యం వహిస్తున్న విమలక్క జనం కోసం నిలబడే ప్రజాగాయని. ఇదేం తెలంగాణ అని సవాలు చేస్తోంది. కలిసి పంచుకున్న వేదికల్లోంచి ప్రజలకిచ్చిన హామీలను గుర్తు చేస్తోంది. ఆ క్రమంలో పాలకులకు పంటికింద రాయిలా, ఇంటిపోరులా తయారైతోంది.

ప్రగతిశీల భావాలున్న తెలంగాణ వాగ్గేయకారులు, కళాకారులు కొందరు రెండు గుర్రాలపై స్వారీ చేస్తుండగా, మరికొందరు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. సంపూర్ణంగా ప్రజలవైపు నిలబడింది మాత్రం విమలక్కనే. ఇచ్చేదాకా నిలబడాలిగానీ నిలదీయడం సహించని ప్రభుత్వానికి ఈ వైఖరి రుచించలేదు. నయానో, భయానో విమలక్కను దారిలోకి తెచ్చుకోవాలనుకున్న ప్రభుత్వం పావులు కదపడం మొదలెట్టింది. మొదటి వేటుకు నిజామాబాద్‌ జిల్లా మాచారెడ్డిలో 23.3.2015 నాడు జరిగిన బీడీ కార్మికుల సమావేశం వేదిక అయ్యింది. సమావేశం శాంతియుతంగా ముగిసినా అదే నెల 26నాడు ఆరుగురిని అరెస్టు చేయడంతోపాటు పలురకాల కర్కశ చట్టాలు బిగించి విమలక్కను కట్టేయచూశారు. ఆ తర్వాత, ఇదే సంవత్సరం ఏప్రిల్‌లో వరలక్ష్మి హత్యకేసులో నలుగురు నిందితుల్లో విమలక్కను ఒకరుగా ప్రకటించడం జరిగింది. తనకు తెలియని వరలక్ష్మితో హత్య జరిగిన రోజు ఆమెతో కారులో కలిసి ప్రయాణించినట్లు చిత్రిం చడం అన్యాయమని విమలక్క పేర్కొంది.

తిరిగి, ఇదే నెల రెండవ తేదీన హైదరాబాద్‌లో ఉన్న అరుణోదయ సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాచారెడ్డి సమావేశంలో భాగంగా ఈ మధ్య పోలీసులు అదుపులోకి తీసుకున్న జనశక్తి కార్యకర్త భీంభూషణ్‌ చెప్పిన మాటలు ఆధారంగా అరుణోదయ ఆఫీసును సీజ్‌ చేయడం జరిగిందని పోలీసులు చెప్పినట్లు పత్రికల్లో వచ్చింది.
ఇది కేవలం కక్షపూరిత చర్యగా భావించవచ్చు. ఎందుకంటే భీంభూషణ్‌ చెబుతున్నట్లుగా పోలీసులు భావించి, ఎంత వెదికినా అరుణోదయ ఆఫీసు నుండి విప్లవ కార్యకలాపాలు సాగుతున్నట్లు అక్కడ నిషేధిత సాహిత్యం ఉన్నట్లు ఏ ఆధారాలు దొరికినట్లు లేదు. అయినా ఆఫీసునే ఇంటిగా చేసుకొని ఉంటున్న విద్యార్థినులను బయటికి పంపి సీలు వేయడం జరిగిందని వార్తలొచ్చాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనుంది. చట్టాలను తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై ఉసిగొల్పడం మాత్రం ప్రభుత్వాలకు తగనిది.

తెలంగాణ ఉద్యమ సమయంలో అమర్‌ పాటలను, విమలక్క గొంతును అద్భుతమని మెచ్చుకున్న కేసీఆర్‌కు ఇప్పుడు అవే పాటలు, అదే గొంతుక వినడం కష్టంగా ఎందుకుందనే విమలక్క ప్రశ్నలో న్యాయముంది. మా ప్రభుత్వాలను ప్రజా కళాకారులు ఎంతగా విమర్శించినా వారి వాక్‌ స్వేచ్ఛను గౌరవించామంటూ కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రస్తుత ప్రభుత్వ చర్యను నిరసిస్తున్నారు.
ఒక్క గొంతుకను నొక్కేయడానికి ప్రభుత్వం పాట్లు పడుతుందంటేనే.. ఆ గొంతు సామర్థ్యం ఎంతో బయటపడుతోంది. ప్రజల పక్షాన ఉన్నామనుకొనేవారిపై దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఉంది. ఆ గొంతు ఒంటరి కాదని కోట్లాది జన సామాన్యపు వేదనలకు వాహికని గొంతుక విప్పాల్సిన అవసరం ప్రజాస్వామ్యవాదుల ముందుంది.

- బి. నర్సన్‌
వ్యాసకర్త రిటైర్డ్‌ బ్యాంక్‌ మేనేజర్,
తెలంగాణ గ్రామీణ బ్యాంకు ‘ మొబైల్‌ : 94401 28169

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement