B.Narsan
-
తెలుగు భాష పరాయీకరణపై ప్రశ్నలు
భాషా శాస్త్రవేత్తలు భాష పుట్టుక, కాలమాన మార్పులు తదితర భౌతిక విషయాలను విశ్లేషించగలరేమోగాని, ఇతర భాషల ఆధిపత్యంలో ఒక భాష ఎలా చిన్నాభిన్నమవుతుందో భాషా, సమాజ ప్రేమికులు మాత్రమే పసిగట్టగలరు. ఈ నేపథ్యంలో తెలుగు భాషా పరిస్థితిని పరామర్శిస్తూ జయధీర్ తిరుమలరావు రాసిన వ్యాస పరంపర ‘భాషావరణం’. ఇందులోని 46 వ్యాసాలు ఏప్రిల్ 2008 నుండి డిసెంబర్ 2012 వరకు చూపు శీర్షికన ‘నడుస్తున్న చరిత్ర’ మాసపత్రికలో వచ్చినవి. శీర్షిక పరిమితులకు లోబడినట్లు కాకుండా రచయిత ఎత్తుకున్న అంశంపై సర్వస్వతంత్రంగా వ్యవహరించారు. అందువల్ల ఇవి పత్రికా వ్యాసాలుగా కాకుండా రచయిత భాష పట్ల సమర్పించిన ఒక పరిశోధక గ్రంథంగా కనిపిస్తాయి. జన సామాన్య భాషగా బతికిన తెలుగును ఆర్య భాష అయిన సంస్కృతంతో నింపి, దాని సహజ రూపాన్ని దూరం చేశారనీ, ఇలా వాడుక తెలుగును సామాన్యుడికి అర్థంకాని స్థాయికి తీసుకెళ్లి పండితులు తెలుగు సాహిత్యాన్ని తమ గుప్పిట్లో ఉంచేసుకున్నారనీ, జనం కళలు, భాష, సాహిత్యాన్ని న్యూనతా భావంలోకి నెట్టేశారనీ ఈ వ్యాసాలు ఆరోపిస్తాయి. ఆంగ్లం విషయ పరిజ్ఞాన సముపార్జనకు పరిమితం కాకుండా యావత్ తెలుగు జాతి జీవన రీతుల్నీ, వాటి మూలాల్నీ ధ్వంసం చేస్తున్న విధానాన్ని ప్రతిఘటించాల్సిన అవసరాన్ని ఈ వ్యాసాలు గుర్తు చేస్తాయి. భూస్వామ్య రాచరిక మత వ్యవస్థకు సంకేతమైన సంస్కృతాన్ని, సామ్రాజ్యవాద సంస్కృతిని విస్తరింపజేస్తున్న ఆంగ్ల భాషాదిపత్యాన్ని ప్రశ్నిస్తూ, తెలుగు భాష మనుగడ కోసం ప్రజలను ఆలోచించేలా చేయాలనేది తన వ్యాసాల ప్రధాన ఉద్దేశమని రచయిత పరిచయ వాక్యాల్లో పేర్కొన్నారు. పరభాషల దాడుల వల్ల తెలుగువారు స్వాభావికంగా తెలుగువానిగా లేడు. వాడు పాళీపండితుడు, వాడు నిరంతరం సంస్కృత పండితుడు. నివసిస్తున్న సమాజం సంస్కృత భూయిష్ట సమాజం. ఇంత జరిగినా భాషా శాస్త్రవేత్తలు భాషా పరిణామానికి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలు దోహదపడుతాయన్న దృష్టికోణాన్ని విస్మరించారని రచయిత ‘మన నాలుకపై పరభాష పొరలా!’ అని ప్రశ్నించారు. అన్ని రకాల యాసలు, మాండలికాలు, వ్యవహార భాషలు, వృత్తుల భాషలు భాషా వ్యవస్థలో అనివార్య విభాగాలనీ వాటిని ‘అపభ్రంశాలు’గా భ్రమ పడకూడదనీ హితవు పలికారు. 1963లో తెలుగు నానుడి కూటమి వారు అచ్చేసిన ‘తెలుగా, ఆంధ్రమా?’ అనే 68 పేజీల పుస్తకం, అదే రచయిత రాసిన 340 పేజీల ‘నుడి, నానుడి’ ప్రస్తావన ఈ వ్యాసాలకు వన్నె తెచ్చింది. ఈ రెండు పుస్తకాల రచయిత ‘వాగరి’. 1992లో చనిపోయిన వాగరి అసలు పేరు బి.సత్యానందం. అది సంస్కృత పదం కాబట్టి బంగారయ్యగా పేరు మార్చుకున్నట్టు తిరుమలరావు రాశారు. బంగారయ్య తెలుగును చుట్టేసిన సంస్కృతాన్ని తూర్పార బట్టారు. ‘తెలుగు చరితాకారులు పరిసోదకులు కారు, వారు చాటింపుదారులు. వారు చేసేపని నారు ఒక చోట నుండి తీసి మరి ఒక చోట నాటడము. తెలుగును తీసి ఆంధ్రమును నాటాలి. తెలుగు నాడును ఆంధ్రప్రదేశమును మొల ఎయ్యాలి. తెలుగు జాతిని ఆంధ్ర జాతిగా మార్చాలి. ఇంతకు మించి ఏమీ చేయలేదు’. ‘తెలుగునాటిలోని బడులలో తెలుగు అనే పేరున పిల్లలకు నేర్పింపబడుతూ ఉండినది తెలుగు లిపిలోని సమస్క్రుతము’ అని పలికిన బంగారయ్య వాదన మూడు వ్యాసాల్లో వివరించబడింది. ‘భాషావరణం’ పద బంధంలోనే విస్తృత అర్థం ఉంది. భాష అనగానే అక్షరమాల, లిపి, శాస్త్రాల గిరిగీసుకోక– భాషతో సమాజానికీ జీవనానికీ ఉన్న లెంకలన్నీ ఇందులో చర్చించబడ్డాయి. సాంప్రదాయ వాదుల నుండి, కార్పొరేట్ శక్తుల నుండి, తల్లినుడి కాపాడుకోవాలని ఉద్బోధించాయి. వ్యాసాలు కొనసాగించేందుకు రచయిత భాషతో బంధం గల పత్రికారంగం, పాఠశాల వ్యవస్థ విద్యాహక్కులను కూడా తడమక తప్పలేదు. కొన్ని వ్యాసాలు పేరుకు భాషతో మొదలై సాహిత్య చర్చలోకి జారిపోయాయి. ఈ సంపుటి బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్, గుంటూరు వారి ఆర్థిక సహాయంతో ప్రచురించబడింది. రూపకల్పన ఆకర్షణీయంగా ఉంది. - బి.నర్సన్ 9440128169 భాషావరణం (వ్యాసాలు); రచన: జయధీర్ తిరుమలరావు; పేజీలు: 310; వెల: 200; ప్రచురణ: సాహితీ సర్కిల్, 402, ఘరోండా అపార్ట్మెంట్స్, ఓ.యూ. మెయిన్ గేట్ దగ్గర, లేన్ –1, డీడీ కాలనీ, హైదరాబాద్–7. ఫోన్: 9951942242 -
జన గాయనిపై లక్షిత దాడి
సందర్భం ‘తెలంగాణ’ ఉద్యమకాలంలో తిండీ తిప్పలు మరచి కాళ్లకు గజ్జెలు కట్టి భుజాన గొంగడి వేసుకొని తన సాంస్కృతిక దళంతో తెలంగాణ నేలను చైతన్యపరచిన కళాకారిణి విమలక్క. ఆమె పేరు వింటే.. కోట్లాది తెలంగాణవాసుల కళ్లముందు ఆమె ఆటాపాటా తెరకడతాయి విమలక్క అరుణోదయ సాంస్కృతిక సంస్థకు అధ్యక్షురాలు. దశాబ్దాలుగా ప్రజలకు రాజ్యాంగబద్ధంగా రావలసిన హక్కులను తెలియజేస్తూ, ప్రభుత్వాల విధి విధానాలను నిలదీస్తూ, పాలనను ఎండగడుతూ ఆ సంస్థ తన సాంస్కృతిక పోరును కొనసాగి స్తోంది. ‘అరుణోదయ’ తెలంగాణ ఉద్యమంలో మమేకమవడం ఓ మజిలీ. కేవలం భౌగోళిక తెలంగాణ సాధన కోసం ఈ సంస్థ పురుడు పోసుకోలేదు, అంతటితో దాని లక్ష్యాలు నెరవేరలేదు. తెలంగాణ సాధనలో ప్రజా సంఘాల, సాంస్కృతిక సంస్థల పాత్ర ఎంతో కీలకమైనవి. వీటి మద్దతు లేకుండా ఏ రాజకీయ పార్టీ అయినా ఇంకా వందేళ్లు తండ్లాడినా తెలంగాణ వచ్చేది కాదు. పార్టీలు కాలానికి తగ్గట్లు పిల్లి మొగ్గలు వేస్తుంటే కోట్ల గొంతుకలను ఏకం చేసింది ఉద్యమకారులే. యువకుల, విద్యార్థుల, ఉద్యోగుల, కార్మిక కర్షకుల ఐక్య పోరాటం లేకుంటే అప్పటి కేంద్ర ప్రభుత్వానికి అంత సెగ తగిలేది కాదు. ఆయా వర్గాలను ఉద్యమంవైపు మలిపింది మాత్రం ప్రజా కళారూపాలే. అయితే వివిధ కళా రంగాలకు ఉద్యమకాలంలో ప్రాతినిధ్యం వహించినవారు చాలావరకు ప్రభుత్వం జేబులో చొరబడ్డారు. భౌగోళిక తెలంగాణను ప్రజాస్వామ్య తెలంగాణగా మలచాలనుకొన్నవారు మాత్రం ప్రజలతో ఉన్నారు. ప్రభుత్వ పథకాలకు బాకాగా మారకుండా ఉన్న ఈ వర్గాలు ప్రశ్నల కొడవళ్లు ఎత్తడమే ఏలుతున్నవారికి కంటగింపుగా ఉంది. ఇలా ప్రజల పక్షాన నిలబడ్డవాటిలో ప్రధానంగా తెలంగాణ జేఏసీ, అరుణోదయలను పేర్కొనవచ్చు. అరుణోదయకి సారథ్యం వహిస్తున్న విమలక్క జనం కోసం నిలబడే ప్రజాగాయని. ఇదేం తెలంగాణ అని సవాలు చేస్తోంది. కలిసి పంచుకున్న వేదికల్లోంచి ప్రజలకిచ్చిన హామీలను గుర్తు చేస్తోంది. ఆ క్రమంలో పాలకులకు పంటికింద రాయిలా, ఇంటిపోరులా తయారైతోంది. ప్రగతిశీల భావాలున్న తెలంగాణ వాగ్గేయకారులు, కళాకారులు కొందరు రెండు గుర్రాలపై స్వారీ చేస్తుండగా, మరికొందరు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. సంపూర్ణంగా ప్రజలవైపు నిలబడింది మాత్రం విమలక్కనే. ఇచ్చేదాకా నిలబడాలిగానీ నిలదీయడం సహించని ప్రభుత్వానికి ఈ వైఖరి రుచించలేదు. నయానో, భయానో విమలక్కను దారిలోకి తెచ్చుకోవాలనుకున్న ప్రభుత్వం పావులు కదపడం మొదలెట్టింది. మొదటి వేటుకు నిజామాబాద్ జిల్లా మాచారెడ్డిలో 23.3.2015 నాడు జరిగిన బీడీ కార్మికుల సమావేశం వేదిక అయ్యింది. సమావేశం శాంతియుతంగా ముగిసినా అదే నెల 26నాడు ఆరుగురిని అరెస్టు చేయడంతోపాటు పలురకాల కర్కశ చట్టాలు బిగించి విమలక్కను కట్టేయచూశారు. ఆ తర్వాత, ఇదే సంవత్సరం ఏప్రిల్లో వరలక్ష్మి హత్యకేసులో నలుగురు నిందితుల్లో విమలక్కను ఒకరుగా ప్రకటించడం జరిగింది. తనకు తెలియని వరలక్ష్మితో హత్య జరిగిన రోజు ఆమెతో కారులో కలిసి ప్రయాణించినట్లు చిత్రిం చడం అన్యాయమని విమలక్క పేర్కొంది. తిరిగి, ఇదే నెల రెండవ తేదీన హైదరాబాద్లో ఉన్న అరుణోదయ సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాచారెడ్డి సమావేశంలో భాగంగా ఈ మధ్య పోలీసులు అదుపులోకి తీసుకున్న జనశక్తి కార్యకర్త భీంభూషణ్ చెప్పిన మాటలు ఆధారంగా అరుణోదయ ఆఫీసును సీజ్ చేయడం జరిగిందని పోలీసులు చెప్పినట్లు పత్రికల్లో వచ్చింది. ఇది కేవలం కక్షపూరిత చర్యగా భావించవచ్చు. ఎందుకంటే భీంభూషణ్ చెబుతున్నట్లుగా పోలీసులు భావించి, ఎంత వెదికినా అరుణోదయ ఆఫీసు నుండి విప్లవ కార్యకలాపాలు సాగుతున్నట్లు అక్కడ నిషేధిత సాహిత్యం ఉన్నట్లు ఏ ఆధారాలు దొరికినట్లు లేదు. అయినా ఆఫీసునే ఇంటిగా చేసుకొని ఉంటున్న విద్యార్థినులను బయటికి పంపి సీలు వేయడం జరిగిందని వార్తలొచ్చాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనుంది. చట్టాలను తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై ఉసిగొల్పడం మాత్రం ప్రభుత్వాలకు తగనిది. తెలంగాణ ఉద్యమ సమయంలో అమర్ పాటలను, విమలక్క గొంతును అద్భుతమని మెచ్చుకున్న కేసీఆర్కు ఇప్పుడు అవే పాటలు, అదే గొంతుక వినడం కష్టంగా ఎందుకుందనే విమలక్క ప్రశ్నలో న్యాయముంది. మా ప్రభుత్వాలను ప్రజా కళాకారులు ఎంతగా విమర్శించినా వారి వాక్ స్వేచ్ఛను గౌరవించామంటూ కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రస్తుత ప్రభుత్వ చర్యను నిరసిస్తున్నారు. ఒక్క గొంతుకను నొక్కేయడానికి ప్రభుత్వం పాట్లు పడుతుందంటేనే.. ఆ గొంతు సామర్థ్యం ఎంతో బయటపడుతోంది. ప్రజల పక్షాన ఉన్నామనుకొనేవారిపై దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఉంది. ఆ గొంతు ఒంటరి కాదని కోట్లాది జన సామాన్యపు వేదనలకు వాహికని గొంతుక విప్పాల్సిన అవసరం ప్రజాస్వామ్యవాదుల ముందుంది. - బి. నర్సన్ వ్యాసకర్త రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ‘ మొబైల్ : 94401 28169