సుపారీ తీసుకొని చంపేశారు | Taked Supari and killed | Sakshi
Sakshi News home page

సుపారీ తీసుకొని చంపేశారు

Published Mon, Apr 4 2016 4:59 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

సుపారీ తీసుకొని చంపేశారు - Sakshi

సుపారీ తీసుకొని చంపేశారు

♦ వీడిన వరలక్ష్మి హత్య మిస్టరీ
♦ కేసును తొలగిస్తామని నమ్మబలికి హత్య
♦ నిందితుల్లో ‘టఫ్’ నాయకులు..విమలక్కపై అభియోగాలు
♦ వివరాలు వెల్లడించిన డీఎస్పీ
 
 వికారాబాద్: రంగారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన మహిళా నేత వరలక్ష్మి హత్య మిస్టరీ వీడింది. కేసును తొలగించేందుకు సాయం చేస్తామన్న వ్యక్తులే ఆమెను అంతం చేశారు. ఈ హత్య కేసులో పలువురు ‘టఫ్’ నాయకుల ప్రమేయం కూడా ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఈ నెల ఒకటవ తేదీన వికారాబాద్ సమీపంలో మామిళ్ల వరలక్ష్మి(37) హత్య వెలుగు చూసిన విషయం విదితమే. కేసు వివరాలను  డీఎస్పీ స్వామి ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

తాండూరు పట్టణానికి చెందిన వరలక్ష్మి వడ్డెర సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు. ఈమెకు అదే పట్టణానికి చెందిన జనార్దన్‌రెడ్డి, విజయలక్ష్మి పండిత్‌తో పాత కక్షలు ఉన్నాయి. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అదేవిధంగా వరలక్ష్మిపై తాండూరు పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. ఈ క్రమంలో వరలక్ష్మి తనపై ఉన్న కేసును తొలగించేందుకు సహకరించాలని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి (టఫ్) షాబాద్ మండలం నరెడ్లగూడకు చెందిన భీంభరత్‌తో పాటు అదే గ్రామానికి చెందిన ముక్కు రవికుమార్ అలియాస్ శ్యామ్, చేవెళ్లకు చెందిన జిల్లా కార్యదర్శి నారాయణదాస్‌ను కలిసింది.

టఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క ద్వారా అవసరమైతే సీఎం, లేదా హోంమంత్రిని కలసి కేసులు తొలగించేలా చూస్తామని వారు నమ్మబలికారు. గతనెల 31న వరలక్ష్మి పని నిమిత్తం తాండూరు నుంచి హైదరాబాద్‌కు బస్సులో వెళ్లింది. వెళ్లిన పని కాలేదని వరలక్ష్మి సాయంత్రం వీరి ముగ్గురికి ఫోన్ చేసింది. తాను హైదరాబాద్ నుంచి వస్తున్నానని చెప్పింది. తాము మొయినాబాద్‌లో ఉన్నామని, ఇక్కడ కలుద్దామని వరలక్ష్మికి వారు సూచించారు. జనార్దన్‌రెడ్డి, విజయలక్ష్మి పండిత్‌తోపాటు భీంభరత్, నారాయణదాస్‌లకు గతంలో ఏఐఎస్‌ఎఫ్‌లో పనిచేసిన కాలంలో పరిచయం ఉంది. తమతో కక్షలున్న వరలక్ష్మిని హతమారిస్తే రూ.3 లక్షలిస్తామని జనార్దన్‌రెడ్డి, విజయలక్ష్మి, భీంభరత్ తదితరులకు చెప్పి సుపారీ కుదుర్చుకున్నారు.  

 సుపారీ కుదుర్చుకొని..
 వరలక్ష్మి హత్యకు పథకం పన్నిన నిందితులు ఆమెను మొయినాబాద్‌లో కలిశారు. ఈ రోజు పనులు ఏమీ కాలేవు.. మూడ్ బాగాలేదని వరలక్ష్మి చెప్పింది. అనంతరం మొయినాబాద్‌లో రెండు బీర్లు, ఫాస్ట్‌ఫుడ్‌లో చికెన్, మటన్ కొనుగోలు చేశారు. తాండూరులో వదిలిపెడతామని  భీంభరత్ తదితరులు వరలక్ష్మిని నమ్మించి, తమ ఇన్నోవా (ఏపీ 28డీటీ1040) వాహనంలో ఎక్కిం చుకొని బయలుదేరారు. మత్తుమందు కలిపిన బీరును వరలక్ష్మికి తాగించారు. ఇంతలో ఆమె సోదరి నిర్మల ఫోన్ చేయగా విమలక్క కారులో ఉన్నాను.. ఇంటికి రావడానికి లేట్ అవుతుందని చెప్పింది.

  కొద్దిసేపటికి ఆమె మత్తులోకి జారుకున్నాక.. వారు చేవెళ్లలో రెండు మీటర్ల తాడును కొనుగోలు చేశారు. చేవెళ్ల-తాండూరు దారిలో ముగ్గురు నిందితులు కారులోనే తాడుతో ఉరి బిగించి వరలక్ష్మిని చంపేశారు. ఆమె కాళ్లకు ఉన్న చెప్పులను వికారాబాద్ రైల్వేబ్రిడ్జిపై నుంచి ట్రాక్‌పై పడేశారు. ఆమె ఫోన్‌ను వేగంగా వెళ్తున్న ఓ లారీలో పడేశారు. అనంతరం ఇన్నోవాను అనంతగిరి మీదుగా కెరేళ్లి వైపు తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రదేశం కోసం కేరెళ్లి నుంచి బుగ్గ రామలింగేశ్వరం మీదుగా వికారాబాద్ వస్తూ అనంతగిరి సమీపంలోని రెసిడెన్షియల్ స్కూల్ సమీపంలో మృతదేహాన్ని పడేసి పరారయ్యారు. మరుసటి రోజు హత్య వెలుగుచూసింది.
 
 కాల్ డేటా ఆధారంగా దొరికిన నిందితులు
  వరలక్ష్మి ఫోన్‌కాల్ డేటా ద్వారా పోలీసులు విచారణ చేపట్టారు. ఏఎస్పీ వెంకటస్వామి ఆధ్వర్యంలో నాలుగు బృందాలతో కేసు దర్యాప్తు చేసి భీంభరత్‌తో పాటు మిగతా ముగ్గురిని పట్టుకున్నారు. అయితే, తన సోదరి హత్యకు జనార్దన్‌రెడ్డి, విజయలక్ష్మి పండిత్, ప్రభు, విమలక్కనే కారణం అని వరలక్ష్మి సోదరి నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరలక్ష్మిని చంపేసిన నారాయణదాసు, భీంభరత్, ముక్కు రవికుమార్‌లను అరెస్టు చేశామ ని, వారిని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ స్వామి తెలిపారు. దీంతోపాటు అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రభు, విమలక్కపై విచారణ జరుపుతామని తెలిపారు. ప్రధాన నిందితులు జనార్దన్‌రెడ్డి, విజయలక్ష్మి పరారీలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement