
దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుదాం
టీయూఎఫ్ కో-చైర్‌పర్సన్ విమలక్క
జవహర్‌నగర్: తెలంగాణలో దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని టీయూఎఫ్(తెలంగాణ యుైనెటైడ్ ఫ్రంట్) కో-చైర్ పర్సన్ విమలక్క పిలుపునచ్చారు. శుక్రవారం జవహర్‌నగర్‌లోని కేవీఆర్ బెసిలైన్ రీసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జవహర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ సభకు ఆమె హాజరయ్యారు.
ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పర్మనెంట్ ఉద్యోగమనేది లేకుండా అవుట్ సోర్సింగ్ విధానాలతో పాలకులు ముందుకు వెళ్లడం శోచనీయమన్నారు. జవహర్‌నగర్‌లోని డంపింగ్‌యార్డ్‌లో రాంకీ సంస్థ మహిళా కార్మికులతో రాత్రి వేళల్లో కూడా పనిచేయించడం ఏమాత్రం సరికాదని మండిపడ్డారు.
ఏఐఎఫ్‌టీయూ జంటనగరాల ప్రధాన కార్యదర్శి శివబాబు మాట్లాడుతూ.. ప్రస్తు పరిస్థితుల్లో కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైందన్నారు. పోరాటాలతో కార్మికుల హక్కులు సాధించుకుంటామని చెప్పారు. అనంతరం అరుణోదయ కళాకారుల బృందం ఆటాపాట ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కేవీఆర్ బెసిలైన్ రీసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ మరియమ్మ, వర్కింగ్ అధ్యక్షుడు మల్లేష్, సభ్యులు బిచ్చయ్య, డి.తిమ్మమ్మ, పి.లక్ష్మి, సి.లక్ష్మి ఆర్గనైజింగ్ సెక్రెటరీ మాధవి, ఏఐఎఫ్‌టీయూ గ్రామ అధ్యక్షుడు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.