ఐక్యంగా పోరుబాట సాగిద్దాం
-
ప్రజా ఉద్యమకారులకు విమలక్క పిలుపు
-
కాకినాడలో విప్లవవీరుల సంస్మరణ సభ
-
అలరించిన ‘అరుణోదయ’ సాంస్కృతిక ప్రదర్శనలు
కాకినాడ సిటీ :
అమరవీరుల ఆశయ స్ఫూర్తితో ప్రజా ఉద్యమకారులంతా ఏకమై పోరాడాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీసంఘం ఆధ్వర్యంలో స్థానిక సూర్యకళా మందిరంలో గురువారం విప్లవ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విమలక్క మాట్లాడుతూ ఒక మందిరంలో జరిగే సమావేశానికి కూడా అనుమతి తీసుకోవాలనడం ఎక్కడా చూడలేదన్నారు. ఈ సంస్మరణ సభకు చివరి వరకూ అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని ఆమె పేర్కొన్నారు. భారత విప్లవోద్యమ చరిత్రలో నవంబర్ నెల ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకుని శ్రీకాకుళం రైతాంగ మేఘగర్జన వరకూ ఎంతోమంది విప్లవ వీరులు నవంబర్ బూటకపు ఎన్‌కౌంటర్లలోనే నేలకొరిగారని ఆమె గుర్తుచేశారు. పీడిత ప్రజల పక్షాన పోరాడుతున్న విప్లవకారులను అక్రమ అరెస్టులతో నిర్బంధిస్తూ, ప్రజా ఉద్యమాలను విచ్ఛిన్నం చేయాలని పాలకులు చూస్తున్నాయన్నారు.
మట్టి మాఫియా : కర్నాకుల
ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ హోం శాఖామంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం మండలంలో మట్టి మాఫియా పడగ విప్పిందన్నారు. దళితుల అభివృద్ధి కోసం ఎన్టీ రామారావు తెలుగు మాగాణి సమారాధన పథకంలో కేటాయించిన రామేశంపేట ఎర్రమట్టి కొండల నుంచి తెలుగు తమ్ముళ్లు, మంత్రి అనుచరులు అక్రమంగా మట్టిని తరలించుకుపోతున్నారని ఆరోపించారు. మరోపక్క తొండంగి మండలంలో పర్యావరణానికి ముప్పు కలిగించే దివీస్ ఫార్మా కంపెనీకి 550 ఎకరాల భూమిని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అక్రమంగా కట్టబెట్టారన్నారు. ముందుగా సభలో విప్లవ అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు కె.రామలింగేశ్వరరావు, బి.రమేష్ పాల్గొన్నారు.