సందర్భం
బతుకమ్మ వంటి ప్రజా సంప్రదాయాలు ఉత్తి మతాచారాలు కావు. ఆయా ప్రాంతాల ప్రజల జీవన విధానానికి ప్రతీకలు. కానీ నేడు జాతీయత, దేశభక్తి పేరిట ఆధిపత్య, నియంతృత్వ భావజాలాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.
భిన్నాభిప్రాయాలను సహిం చని మధ్యయుగాల నాటి మనుధర్మ శాస్త్రాలు, పండుగ లను మార్కెట్ చేస్తున్న కార్పొ రేట్ వ్యాపారాలు కలగలసి ఏలుతున్న కాలంలో కూడా బతుకమ్మ పండుగ తెలం గాణలో నిలదొక్కుకుంటు న్నది. స్థానికత అంటే ప్రపం చీకరణ వ్యతిరేక దేశీయతే అంటూ చాటుతూ బతు కమ్మ ముక్కోటి తెలంగాణీయులను ఏకతాటిపై నడి పించి తెలంగాణ రాష్ట్ర సాధనలో సాంస్కృతిక వార థిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న మూడేండ్ల తరువాత ఉద్యమం లేవనెత్తిన అంతర్గత వలస విముక్త స్వావలంబన, నూటికి 93 శాతంగా ఉన్న బహుజనులకు రాజకీయ అధికారం అనే అంశాల ద్వారా నవ తెలంగాణ నిర్మాణం జరుగు తుందా? లేదా? అనేదే బతుకమ్మ సందర్భంగా మనం బేరీజు వేసుకోవాల్సిన అంశాలు.
‘బతుకమ్మా బతుకుమంటూ’ వ్యాఖ్యానించిన కాళోజీ జన్మదినమైన సెప్టెంబర్ మాసంలో వస్తున్న సద్దుల బతుకమ్మను అంతరాలు లేని సమాజం కోసం ‘బహుజన బతుకమ్మ’ ఉద్యమంగా జరుపుకుంటాం. కాగితపు పూలతో, డీజే శబ్దాలతో కృత్రిమ వ్యాపార తంతుగా మార్చకుండా, గడ్డిపూలతో నవధాన్యాలకు స్వాగతమిచ్చే ప్రకృతి ఆరాధనగా బహుజన బతు కమ్మను మలచుకుందాం. పర్యావరణోద్యమంతో జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటూ చైతన్యం పొందుతున్న ప్పుడే నిజమైన హరితహారం అనుభవంలోకి వస్తుంది. తెలంగాణ సహజత్వాన్ని కాపాడుతుంది. అందుకే పర్యావరణ పరిరక్షణ బతుకమ్మలో భాగం కావాలి. చెరువులు కుంటలు పొంగి పొర్లాలి.
ఎంగిలి బతుకమ్మకు 11 రోజుల ముందునుండే బొడ్డెమ్మల పౌర్ణమి ఆరంభమవుతుంది. మా చిన్న తనంలో చెక్కపీటల మీద మట్టి ముద్దలతో వివిధ అంచెలుగా బొడ్డెమ్మలను అలంకరించి, వాటిపై పెరట్లో దొరికే రుద్రాక్ష పూలను, ఎనుగులపై దొరికే బీరపూలు తదితర పూలు అమర్చి ప్రతి సాయంకాలం బొడ్డెమ్మలు ఆడేవాళ్లం. బొడ్డెమ్మ నుంచి సద్దుల బతు కమ్మ వరకు నవధాన్యాల్లో ఏదో ఒక పలహారాన్ని పిల్లలనుంచి పెద్దల వరకు ఇచ్చిపుచ్చుకోవడం అనేది బహుజన సమూహాల్లో గమనించినప్పుడు, ఇది నవ ధాన్యాల పండుగగా కూడా కనబడుతుంది.
మేదరులు కనక బొంగుతో చేసే సిబ్బి, కంచ రులు చేసే ఇత్తడి తాంబాలం, పద్మశాలి నేసే బట్టలు, రోజూ బట్టలను ఉతికి అందించే రజకులు, పూలు ఏరి తెచ్చే అన్నాదమ్ములు, కలవారి బతుకమ్మలను పేర్చి మోసుకెళ్లే రజకులు, చిన్న బొంగు సాధనాలతో ఆటలాడే పసిపిల్లలు ఇలా బహుజనులందరి సామూ హిక వేడుక ఇది. స్త్రీలంతా పుట్టింటికి చేరి తమ కష్టా లను, జీవితానుభవాలను పురాణేతిహాస గాథలను పనిస్థలాల్లో నేర్చుకుని ఇక్కడ శ్రావ్యంగా చప్పట్లు కొడుతూ, అడుగులేస్తూ ఆలపిస్తారు. ఉత్పత్తి కులా లందరి వేడుకగా ఉన్న బతుకమ్మను దళితులు ఆడిన దాఖలాలు లేవు.
బతుకమ్మ శిఖరాగ్రంలో గుమ్మడి పువ్వు అందాన్ని గౌరమ్మగా (ప్రకృతే పార్వతి) అలం కరించే స్థానంలో, దళితులు ఎద్దు బొక్కను పెట్టారనీ, అది కాకి ఎత్తుకుపోయి వారికి బతుకమ్మ లేకుండా పోయిందనే కట్టుకథను ప్రచారం చేస్తున్నారు. అందుకే ఒక సాంస్కృతిక ఉత్సవాన్ని మతాచారంగా మార్చే క్రతువును, దళితులను దూరంగా ఉంచే వివక్షను రూపుమాపి ప్రజా సంస్కృతిని ప్రజాస్వామీ కరించే ప్రక్రియలో భాగంగా వివిధ రూపాల్లో బతు కమ్మను మేము ప్రారంభించాము. ఒక వ్యాసాల సంక లనాన్ని, పాటల సీడీలను రూపొందించి అంతిమంగా బహుజన బతుకమ్మగా ప్రజల్లోకి వెళుతున్నాము. ఊరు–వాడలను కలిపే ఉద్యమంగా నిర్వహిస్తున్నాం.
భారతదేశం భిన్న జాతుల, భాషల, తెగల, సంస్కృతుల సమ్మేళనంగా ఉన్నా.. మాతృస్వామ్యా నికి ప్రతీకగా ఉన్న బోనాలు, గ్రామ దేవతలు, బతుకమ్మలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకే ఆదివాసీ కోయ మహిళలైన సమ్మక్క–సారలమ్మల పోరాటం వారి ఆరాధ్యంగా ప్రసిద్ధిగాంచి ఆదివాసుల సంప్రదాయాలకు భంగం కలుగకుండా కొనసాగుతు న్నది. పూల కలశం చుట్టూ 9 రోజులు దాండియా ఆడటంగానీ, దేవీ నవరాత్రుల ఉత్సవాలు గానీ మాతృస్వామ్యానికి ప్రతీకలే. వీటిని కూడా క్రమంగా మతీకరిస్తున్నారు.
మతాలకు అతీతంగా ఒక్కో ప్రాంతంలో ఉండే ఆహారపు అలవాట్లు, సంప్ర దాయాలు గమనిస్తే, మరో ప్రాంతంలోని అదే మత ప్రజలతో అవి ఎక్కడా సరిపోలవు. కావున ప్రజా సంప్రదాయాలు ఉత్తి మతాచారాలు కాదని ఆయా ప్రాంతాల ప్రజల జీవన విధానానికి, ఆచార– వ్యవ హారాలకు ప్రతీక అని గమనించవచ్చు. దీనిని జాతీ యత, దేశభక్తి పేరిట ‘ఒకే దేశం– ఒకే ప్రజ – ఒకే సంస్కృతి’ అంటూ ఆధిపత్య నియంతృత్వ భావజా లాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.
అందువల్ల ఈ సాంస్కృతిక ఆధిపత్యాన్ని కార్పొ రేట్ వ్యాపారాన్ని నిరసిస్తూ ఊరువాడలను కలిపే ఉత్సవంగా బలవన్మరణాలకు తావులేని సహజ వనరుల రక్షణోద్యమంగా, భూవనరులన్నీ ప్రజలకు చెంది అంతరాలు లేని సమాజ సాధనకు బతుకమ్మ వేదిక కావాలి. అందుకు బహుజనులు బాటలు వేయాలి. అదే నిజమైన బహుజన బతుకమ్మ.
వ్యాసకర్త తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్‌పర్సన్
విమలక్క