
నల్లమల ఎన్‌కౌంటర్‌లో సిరిసినగండ్ల కవిత?
కొండపాక : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పాలుట్ల సమీపంలోని మురారి కురవ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టు సభ్యుల్లో ఒక మహిళ కొండపాక మండలం సిరిసినగండ్ల పంచాయతీ పల్లెచింతలు గ్రామానికి చెందిన పడిగె కవిత అలియాస్ విమలక్క (26)గా పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై ప్రకాశం జిల్లా పోలీసులు తొగుట పోలీసులకు వివరాలు అందించారు. దీంతో ఎస్‌ఐ జార్జ్ శుక్రవారం కవిత తల్లిదండ్రులు పడిగె మల్లయ్య, శంభవ్వలకు విషయం తెలిపి కానిస్టేబుల్‌ను తోడుగా ఇవ్వడంతో వారు మృతదేహాన్ని గుర్తించడానికి ప్రత్యేక వాహనంలో సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు.
చదువుకోని కవిత..
అక్షర జ్ఞానం లేని కవిత వ్యవసాయ పనులు, పశువులను కాస్తూ తల్లిదండ్రులు మల్లయ్య, శంభవ్వ దంపతులకు సహాయంగా ఉండేది. మల్లయ్య దంపతులకు ఆరుగురు కుమార్తెలు కాగా నాలుగో కుమార్తె పడిగె కవిత అలియాస్ విమలక్క. మొదటి నుంచి నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా పేరుగాంచిన గిరాయిపల్లి కూడా సిర్సినగండ్ల మదిర గ్రామమే. ఈ క్రమంలో 2004లో మావోయిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితురాలైన కవిత గిరాయిపల్లి దళంలో చేరింది. అప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలోనే ఉంది. కాగా ప్రకాశం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కవిత అలియాస్ విమలక్క మృతి చెందిందన్న వార్తతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మల్లయ్య, శంభవ్వలు కన్నీటి పర్యంతమయ్యారు