కేటీఆర్, లోకేశ్..ఇద్దరూ ఒక్కటే!
వరంగల్ (హన్మకొండ) : వ్యాపార లావాదేవీలపై మాట్లాడుకునేందుకే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కుమారులు విదేశీ పర్యటనకు వెళ్లారని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కో చైర్‌పర్సన్ విమలక్క ఆరోపించారు. హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలు చూడడానికే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటారని, లోలోపల ఇద్దరూ ఒక్కటేనన్నారు. ఈక్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుమారుడు కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారన్నారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విఫలమయ్యారని విమర్శించారు. ఎన్నికలు ముందు చేసిన వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నించిన వారిపై కుట్ర కేసులు పెడుతున్నారని, ఎవరూ మాట్లాడుకుండా చేస్తున్నారన్నారు. ప్రజల పక్షాన కలిసి పోరాడేందుకు పౌరసమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశానికి వెన్నెముక రైతులని చెబుతున్నా, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాలను పాలకులు కనీసం పరామర్శించడం లేదని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు జరిగితే..అవి వెలుగులోకి రాకుండా అధికారులు తొక్కిపెట్టారన్నారు.