
‘‘నేను నటించిన ‘హృదయ కాలేయం’ విడుదలై పదకొండేళ్లయింది. ఇన్నేళ్లలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించాను. ఈ నెల 25న ‘సోదరా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. మరో రెండు సినిమాలు కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి’’ అని సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu) తెలిపారు. సాయి రాజేశ్ నీలం స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘హృదయ కాలేయం’. ఈ మూవీ ద్వారా సంపూర్ణేష్ బాబు హీరోగా పరిచయమయ్యారు.
2014 ఏప్రిల్ 4న ఈ చిత్రం విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ మూవీ 11వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సంపూర్ణేష్ బాబు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నరసింహాచారిగా చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన నన్ను ‘హృదయ కాలేయం’తో సంపూర్ణేష్ బాబుగా మార్చిన సాయి రాజేశ్ అన్నకు రుణపడి ఉంటాను. ఈ మూవీ టైమ్‌లో డైరెక్టర్ రాజమౌళిగారు చేసిన ట్వీట్ వల్ల నాకెంతో గుర్తింపు దక్కింది.
‘హృదయ కాలేయం’ టైమ్‌లో సందీప్ కిషన్ అన్న, మారుతి, తమ్మారెడ్డి భరద్వాజగార్లు ఎంతో సపోర్ట్ చేశారు. నా జీవన విధానానికి, ‘బిగ్ బాస్’ పరిస్థితికి సరిపోక ఆ షోలో ఉండలేకపోయాను. నా సంపాదనలో కొంత విరాళంగా ఇవ్వడం ఎంతో సంతృప్తిని కలిగిస్తోంది. కనీసం కారులో తిరగ్గలనా? అనుకున్న నన్ను విమానంలో తిరిగేలా చేశారు సాయి రాజేశ్ అన్న’’ అని తెలిపారు.