
సంపూర్ణేశ్‌బాబును హీరో చేసిన డైరెక్టర్ సాయి రాజేశ్ (Sai Rajesh). హృదయ కాలేయం చిత్రంతో సంపూ కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ మూవీ విజయం సాధించడంతో అతడు వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇతడు సోదరా సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీ ఏప్రిల్ 25న విడుదల కానుంది.
ఏ హీరో ఒప్పుకోలేదు
గురువారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సాయి రాజేశ్ అతిథిగా విచ్చేశాడు. ఆయన మాట్లాడుతూ.. నేను, సంపూర్ణేశ్ (Sampoornesh Babu) ఒక షార్ట్ ఫిలిం చూడటానికి ఇదే ప్రసాద్ ల్యాబ్‌కు వచ్చాం. ఆ సమయంలో నేను బాధలో ఉన్నాను. 'యార్క్ యార్' అనే తమిళ సినిమా చూసి ఓ పిచ్చి మూవీ తీయాలనుకున్నాను. దానిచుట్టూ కామెడీ క్రియేట్ చేయాలనుకున్నాను. ఈ కాన్సెప్ట్‌ను అప్పుడే ఎదుగుతున్న పలువురు హీరోలకు చెప్పాను. ఎవరూ ఒప్పుకోలేదు. నా బతుకు అయిపోయిందనుకున్నాను.
హీరో దొరికేశాడు
ఈ ప్రసాద్ ల్యాబ్‌లో షార్ట్ ఫిలిం చూసి బయట చెట్టు కింద నిల్చున్నప్పుడు సంపూ రంగురంగుల చొక్కాతో కనిపించాడు. అతడిని చూసి నాకు హీరో దొరికేశాడు అనుకున్నాను. ఇది జరిగి 13 ఏళ్లవుతోంది. ఇదంతా కలలా ఉంది. అప్పుడు నాకు రూ.60 వేలదాకా అప్పు ఉంది. కథ డిస్కషన్ కోసం సంపూ సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వచ్చేవాడు. ఏదో ఒక పార్క్‌లో కూర్చుని కథ గురించి మాట్లాడుకుని సాయంత్రానికి బస్‌స్టాప్‌లో దింపేసేవాడిని. ఇంటికి తిరిగెళ్లడానికి నీ దగ్గర డబ్బులున్నాయా? అని అడిగితే లేవన్నాడు.
గిల్టీగా ఫీలయ్యా
దాంతో నా దగ్గరున్న రూ.500లలో రెండు వందలు అతడికి ఇచ్చేవాడిని. ఒకసారి ఏమైందంటే నేనేదో పనిలో పడిపోయి అతడి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఆ విషయమే మర్చిపోయాను. అప్పుడు సంపూ కృష్ణానగర్‌లో మడత మంచం అద్దెకు తీసుకుని రోజంతా అక్కడే ఉన్నాడు. నాకు మళ్లీ ఫోన్ చేసి.. అన్నా, నేను వచ్చేశాను అని చెప్పాడు. నాకు చాలా గిల్టీగా అనిపించింది. సినిమా పిచ్చితో నేను చెడిపోయిందే కాక మరొకరిని చెడగొడుతున్నానా? డబ్బులు లేకుండా సినిమా తీయగలనా? ఇలా రకరకాలుగా అనుకున్నాను.
లక్షల్లో రెమ్యునరేషన్
చివరకు ఎలాగోలా సినిమా తీశాం. తను హీరో అయ్యాడు, నేను డైరెక్టర్ అయ్యాను. హృదయకాలేయం (Hrudaya Kaleyam Movie) సూపర్ హిట్ అయ్యాక సంపూర్ణేశ్‌కు లక్షల్లో రెమ్యునరేషన్ ఇచ్చేవారు. నేను సింగిల్ బెడ్‌రూమ్ ప్లాట్‌ఫామ్‌లో ఉండేవాడిని. సంపూ సిద్దిపేటలో నాలుగంతస్తుల ఇల్లు కట్టేశాడు. నేను ఈఎమ్‌ఐలో నానో కారు కొనుక్కుంటే మనోడు ఫోర్డ్ కొన్నాడు. కొబ్బరిమట్ట సినిమా సమయంలో నేను ఆర్థికంగా చితికిపోయానని సంపూ గ్రహించాడు. రూ.6 లక్షలు పెట్టి హోండా కారు కొనిచ్చాడు.
ఇల్లు కొనుగోలు..
మణికొండలో ఒక అపార్ట్‌మెంట్ కోసం రూ.12 లక్షలు కట్టి.. మిగతా రూ.13 లక్షలు నువ్వు ఎలాగైనా కట్టుకో అన్నాడు. ఆ ఇంటి విలువ ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగిపోయింది. తను సంపాదించిన డబ్బు.. నాకోసం, తన చుట్టూ ఉండేవాళ్లకోసం, సమాజం కోసం ఖర్చుపెడతాడు. ఓ వ్యక్తి నేను సంపూను రోడ్డు మీద వదిలేశాను అని కామెంట్ చేశాడు. రోడ్డు మీద వదిలేయడం ఏంట్రా? ఏ రోజుకైనా సంపూ కోసం నేనుంటా.. నాకోసం సంపూ ఉంటాడంతే! అని సాయి రాజేశ్ ఎమోషనలయ్యాడు.