హన్మకొండ (వరంగల్ జిల్లా) : రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. శనివారం వరంగల్ జిల్లా హన్మకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ పాలనపై అసంతృప్తితో ఉన్నారన్నారు. రుణమాఫీ వడ్డీలకు సర్దుకొంటున్నారని, రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకొంటున్నారన్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారన్నారు. రోజుకు కనీసం నలుగురు రైతులు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, కాలేజీల్లో పని చేసే అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో యాజమాన్యాలు అధ్యాపకులకు జీతాలు చెల్లించడం లేదన్నారు. తెలంగాణకు విమోచనం కలిగిందని, ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారికంగా చేస్తే ఇందులో పాల్గొంటామని లేకపోతే తామే విమోచన దినాన్ని నిర్వహిస్తామన్నారు. మజ్లిస్ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మగా మారారని దుయ్యబట్టారు. మజ్లిస్ పార్టీ రజాకార్ల వారసత్వ పార్టీ అని ఆపార్టీకి కాంగ్రెస్‌కు దగ్గరి సంబంధం ఉందని గతంలో కాంగ్రెస్ సీఎంలు చెప్పారని, ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇదే చెపుతున్నారని విమర్శించారు.
ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య సీఎంగా ఉన్నపుడు కేసీఆర్ సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించుకొనే హక్కు తెలంగాణ ప్రజలకు లేదా అని ప్రశ్నించారన్నారు. ఆనాడు ప్రశ్నించిన కేసీఆర్ నేడు సీఎంగా ఉన్నారని ఇప్పుడు ఎందుకు అధికారికంగా నిర్వహించరని నిలదీశారు. గుడుంబా నిర్మూలన పేరుతో చీప్ లిక్కర్‌ను ప్రవేశ పెట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బెల్ట్‌షాపుల నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం కక్షగట్టిందన్నారు. హైదరాబాద్‌లో 1300 మంది కార్మికులను తొలగించిందన్నారు. కేసీఆర్ పాలన రాచరికపు పాలనకు అద్దం పడుతుందని ధ్వజమెత్తారు.
రిజర్వాయర్లు లేకుండా వాటర్‌గ్రిడ్ పైపులైన్ వేయడంవల్ల ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. 26 ప్యాకేజీలు చేసి 20 ప్యాకేజీలకు టెండర్లు పిలిచారని, మరో అరు ప్యాకేజీలకు పిలువబోతున్నారన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.4వేల కోట్లు కేటాయించి రూ.35 వేల కోట్లకు టెండర్లు పిలుస్తుందన్నారు. దీనిపై అసెంబ్లీలో ప్రశ్నిస్తామన్నారు. ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండానే కొత్త ప్రాజెక్టులు చేపడుతుందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31వ తేదీన మహబూబ్‌నగర్ నుంచి ఉద్యమం చేపడుతామన్నారు. ప్రభుత్వం తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలన్నారు.
తెలంగాణలో గాడి తప్పిన పాలన : కిషన్‌రెడ్డి
Published Sat, Aug 22 2015 7:37 PM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM
Advertisement