ప్రజలు కోరితే చీప్ లిక్కర్ బంద్ : హోంమంత్రి నాయిని
న్యూశాయంపేట (వరంగల్ జిల్లా) : ప్రజలు కోరితే చీప్ లిక్కర్ ప్రవేశ పెట్టే ప్రయత్నాన్ని విరమిస్తామని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం వరంగల్ నగరానికి వచ్చిన సందర్భంగా సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గుడుంబా మహమ్మారితో గ్రామాల్లో అనేక మంది చనిపోతున్నారన్నారు. గుడుంబాతో ప్రతి గ్రామంలో 10 నుంచి 20 మంది దాకా మహిళలు చిన్న వయస్సులోనే వితంతువులు అవుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గుడుంబాను అరికట్టేందుకే చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వరంగల్ జిల్లాలో 265 గ్రామాల్లో అధికారయంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల కృషితో గుడుంబాకు వ్యతిరేకంగా పోరాటం చేసి నాటు సారా ముట్టకుండా చేశారని తెలిపారు. అదే స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజలు చైతన్యవంతులైతే సారా రక్కసిని పారద్రోలొచ్చన్నారు. గుడుంబాకు ప్రత్యామ్నాయమే చీప్ లిక్కర్ అని, ప్రజలు కోరితే కేబినెట్‌లో చర్చ జరిపి చీప్ లిక్కర్‌పై పునరాలోచిస్తామని చెప్పారు.
మేడే రోజున కేసీఆర్ లారీ, ఆటో, టాక్సీ డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు రూ.5 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా ప్రకటించారని తెలిపారు. నయా పైసా ఖర్చులేకుండా సామాజిక భద్రత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటిసారిగా అనేక వినూత్న సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి సామాజిక తత్వవేత్తగా మారారని కితాబునిచ్చారు. అవినీతి నిర్మూలన పోలీసు స్టేషన్ నుంచే ప్రారంభమన్నారు. ఎవరికీ చేయి చాపకుండా ప్రాధాన్య క్రమంలో ప్రతి పోలీసుస్టేషన్‌కు నిధులు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పోలీసులు కూడా సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారన్నారు. కింది స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారుల వరకు స్వచ్ఛ తెలంగాణ, మిషన్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న మంచిపనులతో ప్రతిపక్షాల కాలి కింద భూమి కదులుతుందని, ప్రభుత్వంపై అనవసర విమర్శలు మాని వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. సమావేశంలో జడ్‌పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే శంకర్ నాయక్, నాయకులు పెద్దిసుదర్శన్‌రెడ్డి, ముద్దసాని సహోదర్‌రెడ్డి, మర్రి యాదవరెడ్డి, ఇండ్ల నాగేశ్వర్‌రావు, నన్నపనేని నరేందర్, నయీముద్దీన్, గుడిమల్ల రవికుమార్‌లు పాల్గొన్నారు.