
అది భావప్రకటన స్వేచ్ఛపై దాడే
కోదండరాంపై మంత్రుల ఎదురుదాడిని ఖండించిన ప్రొఫెసర్ హరగోపాల్
హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై మంత్రులు ఎదురుదాడికి దిగడం భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని, దీనిని పౌరహక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రజల పక్షాన గొంతెత్తుతున్నందుకు ప్రొఫెసర్ కోదండరాంపై ప్రభుత్వ యంత్రాంగమంతా దాడి చేయడాన్ని ప్రజా, హక్కుల సంఘాలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత, హక్కు కోదండారాంకు లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఆరోగ్యకర మైన విమర్శలు లేకుండా ఏ ప్రభుత్వమూ నడవదన్నారు. సమాజంలో భిన్నరంగాల వ్యక్తులు ఉంటారని, వారి విమర్శలను ప్రభుత్వం పాఠాలుగా తీసుకుని సవరించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తాను చెప్పిందే నడవాలనే ధోరణిని ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. తెలంగాణలో ఇలాంటి సంస్కృతి పనికిరాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కేసీఆర్, కోదండరాం మాట్లాడవద్దంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. సమావేశంలో పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు వి.రఘునాథ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.