
సంపూర్ణ తెలంగాణ కోసం పోరాటం
‘పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా ఉం డాలి. ఇలా ఉండడానికి ఉమ్మడి వ్యవస్థను విభజన చేయాలి.
- తెలంగాణ విద్యావంతుల వేదిక ముగింపు మహాసభలో ప్రొఫెసర్ కోదండరాం
- పౌర సమాజ పాత్ర కీలకం: ప్రొఫెసర్ హరగోపాల్
- కొత్త కార్యవర్గం, ఏడుగురితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ‘పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా ఉం డాలి. ఇలా ఉండడానికి ఉమ్మడి వ్యవస్థను విభజన చేయాలి. ఉమ్మడి రాజధాని, హైకోర్టు, కార్పొరేషన్ల విభజన జరగాలి. ఇలా.. సంపూర్ణ తెలంగాణ కోసం పోరాటం చేద్దాం..’ అని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. రెండు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) 5వ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. చివరిరోజైన ఆదివారం ప్రతినిధులసభ జరిగింది.
అనంతరం విలేకరులతో మాట్లాడిన కోదండరాం టీవీవీ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. తెలంగాణలో అభివృద్ధి ఫలాలు అంద రికీ అందాలని, ఆ దిశగా పారిశ్రామిక, వ్యవసాయ, సామాజిక సంక్షేమ విధానాలు ఉండాలని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక రం గాల్లో తెలంగాణ ప్రజలకు అభివృద్ధి ఫలాల్లో వాటా దక్కేలా, అన్ని వర్గాల ప్రజలకు గౌరవప్రదమైన జీవితం దక్కేలా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా పోరాటం చేస్తామని కోదండరాం వివరించారు.
టీవీవీ మహాసభల్లో ప్రొఫెసర్ హరగోపాల్ కూడా ప్రసంగించారు. ప్రతినిధుల ద్వారా అందిన సమాచారం మేరకు ‘పౌరసమాజ పాత్ర ఎంతో కీలకం. ఎక్కడైనా స్వేచ్ఛగా మాట్లాడుకునే వీలుండాలి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి..’ అని ఆయన పరోక్షంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి అభిప్రాయపడ్డారు. విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రజల గొం తుకగా ఉండాలని ఆయన అభిలషించారు. ‘మేము అకడమిషన్స్.. చరిత్ర చెప్పే అవకాశం వచ్చింది. దానిని సద్వినియోగం చేస్తాం. అంతేకానీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వంతో సంబంధం ఉందని అనుకోవద్దు..’ అని హరగోపాల్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. టీఎన్జీవోల నేత దేవీప్రసాద్ కూడా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.
పదహారు అంశాలపై తీర్మానాలు
టీవీవీ మహాసభల్లో పదహారు అంశాలపై తీర్మానాలు చేశారు. తెలంగాణలోని ప్రైవేటు పరిశ్రమల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని, రైతుల ఆత్మహత్యల నివారణకు నూతన వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలని వేదిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సినీ పరిశ్రమకు రాచకొండ, ఇతర చారిత్రక ప్రదేశాల్లో భూముల కేటాయింపుపై పునరాలోచించాలని, మానవ, పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న ఫార్మాసిటీల ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేసింది. రెండు రాష్ట్రాల మధ్యా ఉద్యోగుల విభజనను వెంటనే పూర్తి చేసి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, సీమాంధ్రలో విలీనం చేసిన ముంపు మండలాలను.. ఆ ప్రాంత ఆదివాసీల అభీష్టం మేరకు తెలంగాణలో ఉండేలా విభజన బిల్లును సవరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అభివృద్ధి పేరుతో హుస్సేన్‌సాగర్ చుట్టూ భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణంపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరింది. మిషన్ కాకతీయకు వేదిక సంపూర్ణ మద్దతు తెలిపింది.
ఏడుగురితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు
టీవీవీ అధ్యక్షుడిగా పనిచేసిన మల్లేపల్లి లక్ష్మయ్య ఈసారి పక్కకు తప్పుకున్నారు. కానీ, టీవీవీ విధాన నిర్ణయాలు ఖరారు చేసేందుకు, రోజువారీ కార్యక్రమాలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీకి ఆయన కన్వీనర్‌గా పనిచేయనున్నారు. కన్వీనర్ సహా ఏడుగురితో ఏర్పాటైన స్టీరింగ్ కమిటీలో ప్రొఫెసర్ కోదండరాం, ప్రస్తుత అధ్యక్షుడు రవీందర్‌రావు, ధర్మార్జున్, స్వర్ణలత, టి.యాదయ్య, ఆర్.విజయ్‌కుమార్‌లు సభ్యులుగా ఉన్నారు. కాగా, 26 మందితో నూతన కార్యవర్గం ఏర్పాటు కాగా.. ఇందులో 15 మంది సభ్యులుగా ఉన్నారు.