కిందిస్థాయి న్యాయ వ్యవస్థ విభజనతో మాకు సంబంధం లేదు
♦ హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం
♦ పోస్టుల భర్తీలోనూ మా పాత్ర ఉండదు
♦ విభజన కోసం హైకోర్టే స్వీయ నిబంధనలు రూపొందించుకోవాలి
♦ తెలంగాణ సర్కారు వాదనలు వింటామన్న ధర్మాసనం
♦ ఆ తరువాతే ఈ కేసులో తీర్పును వాయిదా వేస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని కింది స్థాయి న్యాయవ్యవస్థ విభజనతో తమకు ఎటువంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. కింది స్థాయి న్యాయవ్యవస్థ విభజన కోసం హైకోర్టే స్వీయ నిబంధనలను రూపొందించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ స్వీయ నిబంధనలను తమ ఆమోదం కోసం పంపాల్సి ఉంటుందని వివరించింది. అంతేగాకుండా కింది స్థాయి న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ ప్రక్రియలో కూడా తమ జోక్యం ఉండదని తెలిపింది. దీంతో ఈ విషయాన్ని రాతపూర్వకంగా అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక కింది స్థాయి న్యాయవ్యవస్థ విభజన, జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ వాదనలు వినాలని భావిస్తున్నామని పేర్కొంటూ విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలె, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్రం తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది..
రాష్ట్ర విభజన నేపథ్యంలో కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన పూర్తయ్యేంత వరకు జూనియర్ సివిల్ జడ్జిల పోస్టులను భర్తీ చేయరాదంటూ సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, మరికొందరు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాత్కాలిక సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్ వాదనలు వినిపిస్తూ... కింది స్థాయి న్యాయవ్యవస్థ విభజన విషయంలో హైకోర్టు స్వీయ నిబంధనలను రూపొందించుకోవాలని, వాటిని తమ ఆమోదం కోసం పంపినప్పుడు మాత్రమే పునర్విభజన చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం తాము జోక్యం చేసుకుంటామని వివరించారు. దీంతో మరి పోస్టుల భర్తీ సంగతి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. అందులోనూ తమకు ఎటువంటి పాత్ర ఉండదని నటరాజ్ చెప్పారు.
అనంతరం పిటిషనర్ సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ... పునర్విభజన చట్టాన్ని చూపి చేతులు దులుపుకొనేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన విషయంలో ఉభయ రాష్ట్రాలు తగవులాగుడుతుంటే... కేంద్రం ఏమీ పట్టనట్లు చూస్తోందని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు ముందు దాఖలైన వ్యాజ్యాల్లో హైకోర్టు రిజిస్ట్రీ తన వైఖరిని స్పష్టంగా చెప్పలేదని, దీనివల్లే సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పారు.
మరో సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ... తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రానికి సొంత జ్యుడిషియల్ సర్వీసు నిబంధనలు వచ్చాయని, అవి అమల్లో ఉండగా ఏపీ సర్వీసు నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టడం సరికాదని పేర్కొన్నారు. ఇంప్లీడ్ పిటిషనర్ తరఫున ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ప్రస్తుత పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తే, తరువాత వారి కేటాయింపుల సమయంలో తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశముందన్నారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం... తెలంగాణ ప్రభుత్వ వాదనలు వింటామని, ఆ తర్వాతే ఈ వ్యవహారంలో తీర్పును వాయిదా వేస్తామని పేర్కొంటూ విచారణను మార్చి 3కి వాయిదా వేసింది.