అందరికీ న్యాయం చేసే న్యాయ వ్యవస్థలోనే మహిళలకు తగిన న్యాయం జరగడం లేదు. న్యాయమూర్తుల పోస్టుల్లో సముచిత స్థానం దక్కడం లేదు. దేశంలో న్యాయస్థానాలు ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు పరిస్థితి ఇలానే ఉంది. 1959లో జస్టిస్ అన్నా చాందీ దేశంలనే తొలిసారిగా హైకోర్టు మహిళా న్యాయమూర్తిగా నియమితులైనప్పుడు.. ఉన్నత న్యాయ వ్యవస్థలో మహిళలకు తగినంత ప్రాతినిధ్యం లభిస్తుందని భావించారు. కానీ వాస్తవం మాత్రం అందుకు భిన్నంగానే ఉంది. దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుతో పాటు అన్ని హైకోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య ఇప్పటికీ అతి తక్కువగా ఉండడం ఈ దుస్థితికి తార్కాణంగా నిలుస్తోంది. కిందిస్థాయి న్యాయవ్యవస్థలో మహిళల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా సముచిత స్థానం మాత్రం దక్కడం లేదు.
– సాక్షి, హైదరాబాద్
సుప్రీంకోర్టులో 68 ఏళ్లలో ఆరుగురే..
సుప్రీంకోర్టులో ప్రస్తుతమున్న 25 మంది న్యాయమూర్తుల్లో కేవలం ఒక్క మహిళా న్యాయమూర్తే ఉన్నారు. భారత సుప్రీంకోర్టు 1950 జనవరి 26న ఏర్పాటైంది. అప్పటినుంచి ఇప్పటివరకు అంటే 68 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో న్యాయమూర్తులుగా నియమితులైన మొత్తం మహిళల సంఖ్య ఆరుగురు మాత్రమే. ఇటీవలే సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా ప్రముఖ న్యాయవాది ఇందూ మల్హోత్రాను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అయితే ఆమెకు అవకాశం లభించే పరిస్థితి లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 1989లో సుప్రీంకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా కేరళ నుంచి జస్టిస్ ఫాతిమా బీవీ నియమితులయ్యారు. అంటే సుప్రీంకోర్టు ఏర్పాటైన 39 సంవత్సరాలకు ఓ
మహిళ న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 29 ఏళ్లలో సుప్రీం న్యాయమూర్తులుగా నియమితులైన మహిళలు ఐదుగురే. మొత్తంగా 1950 నుంచి ఇప్పటివరకు సుప్రీంకోర్టుకు 229 మంది న్యాయమూర్తులు నియమితులైతే.. అందులో పురుష న్యాయమూర్తులు 223 మందికాగా.. మహిళా న్యాయమూర్తులు ఆరుగురే. 2014 నుంచి సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తి లేరు.
హైకోర్టుల్లో 10 శాతమే..
హైకోర్టుల్లోనూ మహిళల పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. దేశవ్యాప్తంగా 24 హైకోర్టుల్లో ప్రస్తుతం పనిచేస్తున్న మొత్తం న్యాయవాదులు 676 మందికాగా.. అందులో మహిళా న్యాయమూర్తులు కేవలం 74 మంది మాత్రమే. అసలు ఏడు హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తి కూడా లేరు. ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, ఉత్తరాఖండ్ హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తి లేరు. ఇక దేశంలోకెల్లా అలహాబాద్ హైకోర్టు పెద్దది. ఇక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న 104 మంది న్యాయమూర్తుల్లో మహిళా న్యాయమూర్తులు ఆరుగురే. అత్యధికంగా బొంబే హైకోర్టులో 70 మంది న్యాయమూర్తులకు గాను 11 మంది.. మద్రాసు హైకోర్టులో 58 మంది న్యాయమూర్తులకు గాను 11 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. మన ఉమ్మడి హైకోర్టులో ముగ్గురు మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారు.
ఉమ్మడి ఏపీ హైకోర్టులో 8 మందే..
1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు 8 మంది మహిళా న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. 1977లో ఉమ్మడి హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ కె.అమరేశ్వరి నియమితులయ్యారు. అంటే హైకోర్టు ఏర్పాటైన 21 సంవత్సరాలకు తొలి మహిళా న్యాయమూర్తి నియామకం జరిగింది. 1992లో జస్టిస్ ఎస్.వి.మారుతి, 1998లో జస్టిస్ టి.మీనాకుమారి, 2001లో జస్టిస్ రోహిణి, 2013లో జస్టిస్ అనిస్, 2017లో జస్టిస్ జె.ఉమాదేవి, జస్టిస్ తేలప్రోలు రజని, జస్టిస్ కొంగర విజయలక్ష్మి న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ప్రస్తుతం జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ రజని, జస్టిస్ విజయలక్ష్మి న్యాయమూర్తులుగా కొనసాగుతున్నారు. మొత్తంగా దేశంలోని అన్ని హైకోర్టుల్లో కలిపి.. మహిళా న్యాయమూర్తుల సంఖ్య 10.94 శాతమే కావడం గమనార్హం.
మహిళా న్యాయాధికారులు 27.7శాతమే
దేశవ్యాప్తంగా కిందిస్థాయి న్యాయవ్యవస్థలో మొత్తం 11,382 మంది పురుష న్యాయాధి కారులు పనిచేస్తుంటే.. 4,408 మంది మహిళా న్యాయాధికారులు ఉన్నారు. అంటే మహిళా న్యాయాధికారుల శాతం 27.7 మాత్రమే. చిన్న రాష్ట్రాలైన గోవా, మేఘాలయ, సిక్కింలలో మహిళా న్యాయాధికారుల సంఖ్య 60 శాతానికి మించి ఉంది. అత్యధికంగా మేఘాలయలో 73.08 శాతం న్యాయాధికారులు మహిళలే. ఆ రాష్ట్రంలో 42 మంది న్యాయాధికారులుంటే.. అందులో 31 మంది మహిళలే కావడం విశేషం. అత్యల్పంగా బిహార్‌లో 11.52% మాత్రమే మహిళా న్యాయాధికారులు ఉన్నారు. అక్కడ 967 మంది న్యాయాధికారులు ఉండగా.. మహిళలు 110 మంది మాత్రమే. బిహార్‌లో దేశంలోనే అత్యధికంగా 35 శాతం మేర మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నా.. మహిళా న్యాయాధికారుల సంఖ్య తక్కువగా ఉండడం గమనార్హం. బిహార్ తర్వాత గుజరాత్‌లో తక్కువ శాతం మహిళా న్యాయాధికారులు ఉన్నారు. ఇక్కడ మొత్తం 959 మంది న్యాయాధికారులు ఉండగా.. 148 మంది మాత్రమే మహిళా న్యాయాధికారులు కావడం ఆందోళనకరం.
పలు హైకోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య...
అలహాబాద్ (06), ఏపీ–తెలంగాణ (03), బాంబే (11), కోల్‌కతా (04), ఢిల్లీ (10), గౌహతి (01), గుజరాత్ (04), కర్ణాటక (03), కేరళ (05), మధ్యప్రదేశ్ (03), మద్రాస్ (11), ఒడిశా (01), పట్నా (02), పంజాబ్–హరియాణా (06), రాజస్థాన్ (02), సిక్కిం (01), జార్ఖండ్ (01).
దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలే టాప్...
దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే అత్యధిక శాతం మహిళా న్యాయాధికారులు పనిచేస్తుండటం విశేషం. తెలంగాణలో 197 మంది పురుష న్యాయాధికారులు పనిచేస్తుంటే, 155 మంది మహిళా న్యాయాధికారులు బాధ్యతలు నిర్వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జూనియర్ సివిల్ జడ్జీల్లో 51.98 శాతం మంది మహిళలు ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో 37.54 శాతం మంది మహిళా న్యాయాధికారులున్నారు. మొత్తం 549 మంది న్యాయాధికారులు పనిచేస్తుండగా, 208 మంది మహిళా న్యాయాధికారులున్నారు. ప్రస్తుతం ఉన్న జూనియర్ సివిల్ జడ్జీల్లో 44.13 శాతం మంది మహిళలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment