విభజన ప్రక్రియను ప్రారంభించాం | We started the process | Sakshi
Sakshi News home page

విభజన ప్రక్రియను ప్రారంభించాం

Published Thu, Apr 2 2015 12:54 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

విభజన ప్రక్రియను ప్రారంభించాం - Sakshi

విభజన ప్రక్రియను ప్రారంభించాం

  • హైకోర్టుకు నివేదించిన కేంద్ర న్యాయ శాఖ
  • హైకోర్టు విభజనపై స్పందించాల్సింది ఏపీ సర్కార్, హైకోర్టులే
  • ఇప్పటివరకూ ఏపీ నుంచి ఎటువంటి సమాచారం లేదు
  • హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది సర్కార్ నిర్ణయమే
  • మౌలిక సదుపాయాలు కల్పించిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తాం
  • ఆ తర్వాతే జడ్జీల చాయిస్ కోరుతామని సీజే చెప్పారు
  • సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసే విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తాము ఎటువంటి సమాచారం అందుకోలేదని హైకోర్టుకు కేంద్ర న్యాయ శాఖ నివేదించింది. ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియను తాము ఇప్పటికే ప్రారంభించామని, ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో స్పందించాల్సింది ఆ రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టులేనని తెలిపింది. హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత ఏపీదేనని స్పష్టం చేసింది.

    హైకోర్టు విభజన విషయంలో ఏపీ ప్రభుత్వం, హైకోర్టులు నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుని, మౌలిక సదుపాయాలను కల్పించిన వెంటనే తాము సంబంధిత చట్టం ప్రకారం విభజన కోసం నోటిఫికేషన్ జారీ చేస్తామని వివరించింది. హైకోర్టు విభజనకు తక్షణమే చర్యలు చేపట్టేలా కేంద్రంతో పాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన టి.ధన్‌గోపాల్‌రావు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖ లు చేసిన విషయం తెలిసిందే.

    ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం దానిని మరోసారి విచారించింది. గతవారం ధర్మాస నం ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం తన వాదనలను వినిపిస్తూ కౌంటర్ దాఖలు చేసింది. కేంద్రం తరఫున న్యాయ శాఖ కార్యదర్శి ఎన్‌కేసీ థంగ్ ఈ కౌంటర్‌ను దాఖలు చేశారు.
     
    అలసత్వాన్ని ఆపాదించడం సరికాదు..

    ‘విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు న్యాయమూర్తుల సం ఖ్యను ఖరారు చేయడం.. ఉమ్మడి హైకోర్టును విభజించి, ఇప్పుడున్న చోటనే రెండు హైకోర్టులు వేర్వేరుగా పని చేసేలా చేయడం సాధ్యమేనా.. అన్న అంశాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాశారు. హైకోర్టుకు కేటాయించిన 49 మంది న్యాయమూర్తులను ఇరు రాష్ట్రాల మధ్యా 60:40 నిష్పత్తిలో విభజించాలని కోరారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్యా న్యాయమూర్తుల సంఖ్యను 60:40 నిష్పత్తిలో విభజించేందుకు అంగీకరించాం.

    ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులను గుర్తించి, వారి రాష్ట్ర కోటా ఆధారంగా కేటాయింపులు చేయాలని గత అక్టోబర్ 9న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం. ఇదే సమయంలో ఏపీకి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసే విషయంలో ఇద్దరూ మాట్లాడుకుని తగిన చర్యలు ప్రారంభించాలని ఏపీ సీఎం, హైకోర్టు సీజేని కోరాం. హైకోర్టు ఏర్పాటుపై తాను ఏపీ సీఎంకి లేఖ రాశానని, అయితే ఆయన నుంచి ఎటువంటి సమాధానం రాలేదని సీజే చెప్పా రు. న్యాయమూర్తుల కేటాయింపుపై తాను అందరి అభిప్రాయాలను తెలుసుకున్నానని, ఏపీ హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే న్యాయమూర్తులను ఏ రాష్ట్రంలో పనిచేయాలని భావి స్తున్నారో తెలుసుంటానని సీజే మాకు వివరించారు. హైకోర్టుకు మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. హైకోర్టు విభజనలో అలసత్వం ప్రదర్శిస్తున్నామన్న పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదు. హైకోర్టును ఏర్పాటు  విషయంలో ఏపీ సర్కార్‌గానీ, ప్రధాన న్యాయమూర్తిగానీ తమ అభిప్రాయాలను ఇప్పటివరకు చెప్పలేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయండి’ అని థంగ్ ధర్మాసనాన్ని కోరారు.
     
    హైదరాబాద్‌లో ఏపీ హైకోర్టు ఏర్పాటు చట్టవిరుద్ధం: అమికస్ క్యూరీ

    ఈ వ్యాజ్యంలో కోర్టు సహాయకారి(అమికస్‌క్యూరీ)గా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది ఈ.మనోహర్ వాదనలు వినిపిస్తూ, ఏపీ హైకోర్టును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమన్నారు. పునర్విభజన చట్టంలో అటువంటి అవకాశం లేదన్నారు. రాజ్యాంగంలోని 214 అధికరణ ప్రకారం ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఉండి తీరాల్సిందేనన్నారు. కేంద్ర న్యాయ మంత్రి ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపారు. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే ఇలా లేఖ రాసినట్లు కనిపిస్తోందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. శానససభ, సచివాలయం లాగా హైకోర్టును విభజించి, ఇక్కడే రెండు హైకోర్టులు పనిచేయడం సాధ్యం కాదా? అని ప్రశ్నించింది. దీనికి మనోహర్ స్పందిస్తూ.. వాటి విభజన కూడా చట్టవిరుద్ధమన్నారు. హైదరాబాద్‌లో హైకోర్టు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయాలన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement