సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి బ్యాంకు ఖాతా స్తంభన వ్యవహారంలో హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా, న్యాయమూర్తి పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదే సమయంలో ఏపీ పునర్విభజన చట్టంలోని పదవ షెడ్యూల్‌లో ఉన్న సంస్థలు తెలంగాణలో ఉంటే, వాటిపై అధికారం తమకే ఉంటుందని, ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. తమ బ్యాంకు ఖాతాను స్తంభింప చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, శాంతినగర్ బ్రాంచ్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాన్ని బుధవారం కోర్టు విచారించింది. పిటిషనర్ తరఫున ఏపీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ.. తాము దాఖలు చేసిన రిట్‌కు పోటీగా తెలంగాణ ప్రభుత్వం పదవ షెడ్యూల్‌లోని సంస్థలపై అధికారం కోరుతూ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. ఆ వ్యాజ్యానికి చట్ట ప్రకారం విచారణార్హత లేదన్నారు.
అంతకుముందు తెలంగాణ ఏజీ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. పదో షెడ్యూల్‌లోని సంస్థలు ఏ ప్రభుత్వ పరిధిలో ఉంటే వాటిపై ఆ రాష్ట్రానికే అధికారం ఉంటుందని ఆ ప్రకారమే తాము ఏపీ ఉన్నత విద్యా మండలి బ్యాంకు ఖాతా స్తంభన కోసం ఎస్‌బీహెచ్‌కు లేఖ రాశామని తెలిపారు. ఈ నేపథ్యంలో తీర్పును వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. రాత పూర్వక వాదనలను స్వీకరించేందుకు వీలుగా కేసు విచారణను 7వ తేదీకి వాయిదా వేసింది.
ఖాతా స్తంభనపై ముగిసిన వాదనలు
Published Thu, Apr 2 2015 2:54 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement