Kalyanjyoti Sengupta
-
‘కార్యదర్శుల’ కేసులో నేడు హైకోర్టు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటరీ కార్యదర్శుల నియామకపు జీవోను నిలుపుదల చేయాలా? వద్దా? అన్న విషయంపై హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించనున్నది. పార్లమెంటరీ కార్యదర్శుల చట్టాన్ని, ఎమ్మెల్యేలు డి.వినయ్‌భాస్కర్, జలగం వెంకటరావు, వి.శ్రీనివాస్‌గౌడ్, జి.కిషోర్‌కుమార్, వి.సతీష్‌కుమార్, కోవా లక్ష్మీలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తూ జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డిలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలను గురువారం మరోసారి విచారించింది. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం రాజ్యాంగ విరుద్ధమని, నియామకాన్ని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. ఈ వాదనలను అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి తోసిపుచ్చారు. పార్లమెంటరీ కార్యదర్శులు మంత్రులు కాదని, వారికి మంత్రి హోదా మాత్రమే ఉంటుందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, మధ్యంతర ఉత్తర్వులపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామంటూ విచారణను వాయిదా వేసింది. -
రంగంలోకి ‘హైకోర్టు’ కమిటీ
గచ్చిబౌలి భవనాన్ని పరిశీలించిన జడ్జీలు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా ఇటీవల ఏర్పాటు చేసిన న్యాయమూర్తుల కమిటీ తన పని ప్రారంభించింది. కమిటీ చైర్మన్ జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బోస్లే నేతృత్వంలో సభ్యులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి సోమవారం గచ్చిబౌలి వెళ్లి ప్రతిపాదిత హైకోర్టు భవనాన్ని పరిశీలించారు. గంటపాటు అక్కడ గడిపారు. భవనానికి సంబంధించిన డ్రాయింగ్లు, మ్యాపులను తెప్పించుకుని, వాటి ఆధారంగా అధికారులను అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రతి ఫ్లోర్‌కూ వెళ్లి అక్కడి సదుపాయాలను పరిశీలించి, వాటిపై అధికారులను ఆరా తీశారు. హైకోర్టు విభజనకు సంబంధించిన ఈ వ్యవహారాలన్నింటినీ గోప్యంగా ఉంచాలని కమిటీ నిర్ణయించింది. అవసరమైతే మరోసారి భవనాన్ని సందర్శించాలని కమిటీ భావిస్తోంది. తర్వాత దీనిపై కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సీజే తన అభిప్రాయాన్ని కేంద్రానికి వివరించవచ్చని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే వెళ్లొచ్చిన సీజే... గచ్చిబౌలి భవనాన్ని జస్టిస్ సేన్‌గుప్తా కూడా గత వారం స్వయంగా వెళ్లి చూసొచ్చారు. తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డిని కూడా వెంటబెట్టుకు వెళ్లినట్లు తెలిసింది. ఆ తర్వాతే... హైకోర్టు విభజన వ్యవహారంతో పాటు, గచ్చిబౌలి భవనం తెలంగాణ హైకోర్టు ఏర్పాటునకు సరిపోతుందో లేదో తేల్చేందుకు జస్టిస్ బోస్లే నేతృత్వంలో కమిటీ వేశారు. హైకోర్టును విభజించి తెలంగాణ హైకోర్టును ఏర్పాటు చేయాలని, అందుకు గచ్చిబౌలిలో భవనం కూడా సిద్ధంగా ఉందని పేర్కొంటూ కేంద్ర న్యాయ మంత్రి సదానంద గౌడకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు లేఖ రాయడం... ఈ దిశగా చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు సీజేకు గౌడ లేఖ రాయడం తెలిసిందే. -
ఖాతా స్తంభనపై ముగిసిన వాదనలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి బ్యాంకు ఖాతా స్తంభన వ్యవహారంలో హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా, న్యాయమూర్తి పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ఏపీ పునర్విభజన చట్టంలోని పదవ షెడ్యూల్లో ఉన్న సంస్థలు తెలంగాణలో ఉంటే, వాటిపై అధికారం తమకే ఉంటుందని, ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. తమ బ్యాంకు ఖాతాను స్తంభింప చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, శాంతినగర్ బ్రాంచ్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని బుధవారం కోర్టు విచారించింది. పిటిషనర్ తరఫున ఏపీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ.. తాము దాఖలు చేసిన రిట్‌కు పోటీగా తెలంగాణ ప్రభుత్వం పదవ షెడ్యూల్లోని సంస్థలపై అధికారం కోరుతూ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. ఆ వ్యాజ్యానికి చట్ట ప్రకారం విచారణార్హత లేదన్నారు. అంతకుముందు తెలంగాణ ఏజీ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. పదో షెడ్యూల్లోని సంస్థలు ఏ ప్రభుత్వ పరిధిలో ఉంటే వాటిపై ఆ రాష్ట్రానికే అధికారం ఉంటుందని ఆ ప్రకారమే తాము ఏపీ ఉన్నత విద్యా మండలి బ్యాంకు ఖాతా స్తంభన కోసం ఎస్‌బీహెచ్‌కు లేఖ రాశామని తెలిపారు. ఈ నేపథ్యంలో తీర్పును వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. రాత పూర్వక వాదనలను స్వీకరించేందుకు వీలుగా కేసు విచారణను 7వ తేదీకి వాయిదా వేసింది. -
విభజన ప్రక్రియను ప్రారంభించాం
హైకోర్టుకు నివేదించిన కేంద్ర న్యాయ శాఖ హైకోర్టు విభజనపై స్పందించాల్సింది ఏపీ సర్కార్, హైకోర్టులే ఇప్పటివరకూ ఏపీ నుంచి ఎటువంటి సమాచారం లేదు హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది సర్కార్ నిర్ణయమే మౌలిక సదుపాయాలు కల్పించిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తాం ఆ తర్వాతే జడ్జీల చాయిస్ కోరుతామని సీజే చెప్పారు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసే విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తాము ఎటువంటి సమాచారం అందుకోలేదని హైకోర్టుకు కేంద్ర న్యాయ శాఖ నివేదించింది. ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియను తాము ఇప్పటికే ప్రారంభించామని, ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో స్పందించాల్సింది ఆ రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టులేనని తెలిపింది. హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత ఏపీదేనని స్పష్టం చేసింది. హైకోర్టు విభజన విషయంలో ఏపీ ప్రభుత్వం, హైకోర్టులు నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుని, మౌలిక సదుపాయాలను కల్పించిన వెంటనే తాము సంబంధిత చట్టం ప్రకారం విభజన కోసం నోటిఫికేషన్ జారీ చేస్తామని వివరించింది. హైకోర్టు విభజనకు తక్షణమే చర్యలు చేపట్టేలా కేంద్రంతో పాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన టి.ధన్‌గోపాల్‌రావు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖ లు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం దానిని మరోసారి విచారించింది. గతవారం ధర్మాస నం ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం తన వాదనలను వినిపిస్తూ కౌంటర్ దాఖలు చేసింది. కేంద్రం తరఫున న్యాయ శాఖ కార్యదర్శి ఎన్‌కేసీ థంగ్ ఈ కౌంటర్‌ను దాఖలు చేశారు. అలసత్వాన్ని ఆపాదించడం సరికాదు.. ‘విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు న్యాయమూర్తుల సం ఖ్యను ఖరారు చేయడం.. ఉమ్మడి హైకోర్టును విభజించి, ఇప్పుడున్న చోటనే రెండు హైకోర్టులు వేర్వేరుగా పని చేసేలా చేయడం సాధ్యమేనా.. అన్న అంశాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాశారు. హైకోర్టుకు కేటాయించిన 49 మంది న్యాయమూర్తులను ఇరు రాష్ట్రాల మధ్యా 60:40 నిష్పత్తిలో విభజించాలని కోరారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్యా న్యాయమూర్తుల సంఖ్యను 60:40 నిష్పత్తిలో విభజించేందుకు అంగీకరించాం. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులను గుర్తించి, వారి రాష్ట్ర కోటా ఆధారంగా కేటాయింపులు చేయాలని గత అక్టోబర్ 9న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం. ఇదే సమయంలో ఏపీకి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసే విషయంలో ఇద్దరూ మాట్లాడుకుని తగిన చర్యలు ప్రారంభించాలని ఏపీ సీఎం, హైకోర్టు సీజేని కోరాం. హైకోర్టు ఏర్పాటుపై తాను ఏపీ సీఎంకి లేఖ రాశానని, అయితే ఆయన నుంచి ఎటువంటి సమాధానం రాలేదని సీజే చెప్పా రు. న్యాయమూర్తుల కేటాయింపుపై తాను అందరి అభిప్రాయాలను తెలుసుకున్నానని, ఏపీ హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే న్యాయమూర్తులను ఏ రాష్ట్రంలో పనిచేయాలని భావి స్తున్నారో తెలుసుంటానని సీజే మాకు వివరించారు. హైకోర్టుకు మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. హైకోర్టు విభజనలో అలసత్వం ప్రదర్శిస్తున్నామన్న పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదు. హైకోర్టును ఏర్పాటు విషయంలో ఏపీ సర్కార్‌గానీ, ప్రధాన న్యాయమూర్తిగానీ తమ అభిప్రాయాలను ఇప్పటివరకు చెప్పలేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయండి’ అని థంగ్ ధర్మాసనాన్ని కోరారు. హైదరాబాద్‌లో ఏపీ హైకోర్టు ఏర్పాటు చట్టవిరుద్ధం: అమికస్ క్యూరీ ఈ వ్యాజ్యంలో కోర్టు సహాయకారి(అమికస్‌క్యూరీ)గా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది ఈ.మనోహర్ వాదనలు వినిపిస్తూ, ఏపీ హైకోర్టును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమన్నారు. పునర్విభజన చట్టంలో అటువంటి అవకాశం లేదన్నారు. రాజ్యాంగంలోని 214 అధికరణ ప్రకారం ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఉండి తీరాల్సిందేనన్నారు. కేంద్ర న్యాయ మంత్రి ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపారు. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే ఇలా లేఖ రాసినట్లు కనిపిస్తోందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. శానససభ, సచివాలయం లాగా హైకోర్టును విభజించి, ఇక్కడే రెండు హైకోర్టులు పనిచేయడం సాధ్యం కాదా? అని ప్రశ్నించింది. దీనికి మనోహర్ స్పందిస్తూ.. వాటి విభజన కూడా చట్టవిరుద్ధమన్నారు. హైదరాబాద్‌లో హైకోర్టు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
ప్రస్తుత హైకోర్టు.. తెలంగాణ ఆస్తి
కొత్తగా రావాల్సింది ఏపీకేనన్న హైకోర్టు ధర్మాసనం అప్పటివరకు రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి హైకోర్టు తెలంగాణకు కోర్టు కావాలనడం విభజన చట్టానికి విరుద్ధం కేంద్ర న్యాయ మంత్రి రాసిన లేఖ సెక్షన్ 31కి వ్యతిరేకం మంత్రి లేఖనైనా సవరించాలి లేక పునర్విభజన చట్టాన్నైనా మార్చాలి ఇప్పటివరకు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ అందించాలని రిజిస్ట్రీకి ఆదేశం చట్టంలో నిర్దిష్ట కాలపరిమితి లేనప్పుడు జాప్యమన్న ప్రసక్తే లేదని వ్యాఖ్య హైకోర్టు విభజనపై కౌంటర్లు వేయాలని కేంద్రం, ఇరు రాష్ట్రాలకు ఆదేశం సమాధానాన్ని బట్టే నిర్ణయం తీసుకుంటామన్న ధర్మాసనం తీర్పు ఏదైనా న్యాయవాదులు ఆందోళనలు చేపట్టరాదని హితవు జరగరానిది జరిగితే కోర్టు ధిక్కార చర్యలు తప్పవని హెచ్చరిక విచారణలో అమికస్ క్యూరీలుగా మనోహర్, విద్యాసాగర్ నియామకం సాక్షి, హైదరాబాద్: ‘విభజన చట్టం ప్రకారం ప్రస్తుత హైకోర్టును తెలంగాణ ఆస్తిగానే భావించాలి.. కొత్తగా ఏర్పాటు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టే’ అని రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు విభజన విషయంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ రాసిన లేఖను తప్పుబట్టింది. ఈ అంశానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలను తమ ముందుంచాలని కోర్టు రిజిస్ట్రీని సోమవారం ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. దీనిపై లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఇందుకోసం సీనియర్ న్యాయవాదులు ఇ.మనోహర్, జి.విద్యాసాగర్‌ను కోర్టు సహాయకులు(అమికస్ క్యూరీ)గా నియమించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రంతోపాటు ఇరు రాష్ర్ట ప్రభుత్వాలను ఆదేశించింది. హైకోర్టు విభజనకు తక్షణమే చర్యలు చేపట్టేలా కేంద్రంతోపాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త టి.ధన్‌గోపాల్‌రావు హైకోర్టులో గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీని విచారణ సందర్భంగా హైకోర్టుకు ఇటీవల కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ రాసిన లేఖపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘తెలంగాణ హైకోర్టు ఏర్పాటు విషయాన్ని పరిశీలించాలనడం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత హైకోర్టే ఇరు రాష్ట్రాలకూ ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది. హైదరాబాద్‌లో ఉన్న ప్రస్తుత హైకోర్టును చట్ట ప్రకారం తెలంగాణ ఆస్తిగా భావించాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పాటు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టే. దీని ప్రకారం న్యాయ శాఖ మంత్రి లేఖనైనా సవరించాలి. లేకపోతే పునర్విభజన చట్టాన్నైనా సవరించాలి’ అని వ్యాఖ్యానించింది. కౌంటర్లు పరిశీలించాకే నిర్ణయం తొలుత పిటిషనర్ ధన్‌గోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజనలో ఆలస్యం జరుగుతోందని, ఈ విషయంలో తక్షణమే చర్యలు చేపట్టేందుకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఇందుకు పునర్విభజన చట్టంలో నిర్దిష్ట కాల పరిమితేమీ లేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పునర్విభజన చట్టంలో నిర్దిష్ట కాల పరిమితి లేనప్పుడు, ఇక ఆలస్యమన్న మాటే ఉత్పన్నం కాదని వ్యాఖ్యానించింది. వెంటనే తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ.. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడ గత వారం రాసిన లేఖ విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు విషయాన్ని చూడాలని అందులో కోరినట్లు పేర్కొంటూ... ఆ లేఖను ధర్మాసనం ముందుంచారు. దాన్ని పరిశీలించిన ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఆ లేఖ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 31కి విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందంటూ పలు వ్యాఖ్యలు చేసింది. ఏదేమైనా ఈ వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కౌంటర్లను పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫు న్యాయవాదులను ఆదేశిస్తుండగా, ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకున్నారు. హైకోర్టు విభజనపై ఏపీ సర్కారు ఇప్పటికే తన అభిప్రాయాలను సుప్రీంకోర్టుకు విన్నవించినట్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే ఏం చెప్పినా కౌంటర్లోనే చెప్పాలని కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఈ కేసులో తీర్పు ఏదైనప్పటికీ న్యాయవాదులు ఏ రకంగానూ ఆందోళనలు చేయడానికి వీల్లేదని, ఏదైనా జరగరానిది జరిగితే న్యాయవాదులపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. విభజనకు సంబంధించి హైకోర్టులో జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలను తమ మందుంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. -
ఛాతీ ఆసుపత్రి తరలింపుపై జోక్యం చేసుకోం: హైకోర్టు
ఛాతీ ఆసుపత్రి తరలింపుపై జోక్యం చేసుకోం: హైకోర్టు సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ, టీబీ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా అనంతగిరికి తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఆసుపత్రిని తరలిచాలన్న నిర్ణయం ఎలా చట్ట విరుద్ధమవుతుందని పిటిషనర్లను ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణ యం చట్ట విరుద్ధమని నిరూపించినప్పుడే తాము జోక్యం చేసుకోగలమని తేల్చి చెప్పింది. ఈ వ్యాజ్యాలను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఛాతీ, టీబీ ఆసుపత్రిని ఎర్రగడ్డ నుంచి తరలించకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని, ఎర్రగడ్డలో టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన బక్కా జెడ్సన్ వేర్వేరుగా గతవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను సోమవారం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ కేసులో వాదనలు వినేందుకు నాగం జనార్దన్‌రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. నాగం తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపించారు. వారసత్వ సంపదకు ఆధారాలు చూపండి.. ఎర్రగడ్డలోని ఛాతీ, టీబీ ఆసుపత్రిని అక్కడి నుంచి తరలించి, దాని స్థానంలో సచి వాలయ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ ఆసుపత్రుల ప్రాంగణంలో చారిత్రక భవనాలు ఉన్నాయని, అందువల్ల సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు బి.మద్దిలేటి, తెలంగాణ నవ నిర్మాణ సేన అధ్యక్షుడు కె.వెంకటయ్య దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. వాదనలు విన్న తర్వాత ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలోని చారిత్రక భవనాలకు సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ ఉంటే చూపాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. -
పరిమితికి మించి ఖర్చు చేస్తున్న పార్టీలపై ఏం చర్యలు తీసుకున్నారు?
పూర్తి వివరాలను కోర్టు ముందుంచండి కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో నిర్దేశించిన దాని కంటే అధిక మొత్తాలు ఖర్చు చేస్తున్న రాజకీయ పార్టీలపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో, ఇకపై ఏం చర్యలు తీసుకుంటారో వివరించాలని హైకోర్టు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ విషయంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని, అసలు దేశంలో ఎన్ని గుర్తింపు పొందిన, రిజిస్టర్ అయిన పార్టీలు ఉన్నాయో కూడా తెలియజేయాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నాయని, ఈ విషయంలో కొత్త నిబంధనలను రూపొందించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన కింగ్షుక్ నాగ్ అనే వ్యక్తి హైకోర్టుకు లేఖ రాశారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు.. పిల్‌గా పరిగణించి హైకోర్టు విచారించింది. -
ఎమ్మెల్యే సోదరుడి అక్రమాలపై విచారణ జరపండి
సాక్షి, హైదరాబాద్ : చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసులు ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై స్వయంగా విచారణ జరిపి నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. అంతేకాక ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి రికార్డులను సైతం తమ ముందుంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమంచి శ్రీనివాసులు ఇసుక అక్రమ రవాణాపై విచారణ జరిపిన గనులశాఖ డిప్యూటీ డెరైక్టర్ రూ.4.56 కోట్ల మేర సీనరేజీ చార్జీల కింద చెల్లించాలంటూ శ్రీనివాసులకు నోటీసు జారీ చేస్తే.. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి రద్దు చేశారని, ఇది అన్యాయమంటూ ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్.మోహన్‌కుమార్, మాచర్ల మోహన్‌రావులు హైకోర్టులో గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున వసుధా నాగరాజ్ వాదనలు వినిపిస్తూ చినగంజాం మండలం, మోటుపల్లి, కడవకుదురు గ్రామాల్లోని పలు సర్వే నంబర్లలో ఆమంచి శ్రీనివాసులు భారీ యంత్రాలతో ఇసుక తవ్వి రవాణా చేస్తున్నారంటూ అందిన ఫిర్యాదులపై విచారణ జరిపిన అధికారులు, అక్రమాలను నిర్ధారించారని తెలిపారు. 1.27 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక రవాణా చేసినట్లు నిర్ధారించి, అందుకు రూ.4.56 కోట్ల మేర సీనరేజీ చార్జీలు చెల్లించాలంటూ గనులశాఖ డిప్యూటీ డెరైక్టర్ నోటీసు జారీ చేశారని, దాన్ని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రద్దు చేశారని ఆమె తెలిపారు. నోటీసుకు ఆమంచి పూర్తిస్థాయి వివరణ ఇవ్వనప్పటికీ ఎటువంటి కారణాలు చూపకుండానే ముఖ్య కార్యదర్శి ఆ నోటీసును రద్దు చేయడం అన్యాయమన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, పిటిషనర్ చెప్పిన ప్రాంతాలకు స్వయంగా వెళ్లి, అక్కడ అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతుందో లేదో చూసి, ఎవరు అలా చేస్తున్నారో గమనించి, పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
ఏ అధికారంతో ఈ కేటాయింపులు?
పార్టీలకు నామమాత్రపు రేట్లతో భూములపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు సామాన్యుడికి మార్కెట్ రేటు.. పార్టీలకు మాత్రం నామమాత్రపు ధరా? మీది ధనిక పార్టీయే కదా.. మార్కెట్ ధర చెల్లించమనండి కాంగ్రెస్ పార్టీ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రిమండలి ఏ అధికారంతో రాజకీయ పార్టీలకు నామమాత్రపు ధరకు భూములను కట్టబెట్టిందో చెప్పాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏ నిబంధనలకు అనుగుణంగా, ఏ విధి విధానాలకు లోబడి పార్టీలకు నామమాత్రపు ధరలకు భూములు కట్టబెట్టారో అఫిడవిట్ రూపంలో వివరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట ప్రకారం భూమిని కోరే పౌరుల నుంచి మార్కెట్ ధర వసూలు చేసే ప్రభుత్వం, అదే భూమికి రాజకీయ పార్టీల నుంచి మాత్రం నామమాత్రపు ధరను వసూలు చేయటంలో ఔచి త్యాన్ని ప్రశ్నించింది. భూముల కేటాయింపు వ్యవహారంలో ప్రభుత్వ తీరు తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోందని వ్యాఖ్యానిం చింది. నెల్లూరు జిల్లా గూడూరులో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)కి దాదాపు ఎకరా భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం 2009లో జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ వి.గోపీకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. పార్టీలకు భూముల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం గత వారం సమర్పించిన మంత్రి మండలి తీర్మానాలను ధర్మాసనం పరిశీలించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సి.దామోదర్‌రెడ్డి లేచి తాను కాంగ్రెస్ పార్టీ తరఫున వాదనలు వినిపిస్తానని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘మీ పార్టీ ధనిక పార్టీ కదా? మరి మీరు పొందిన భూమికి మార్కెట్ ధర చెల్లించవచ్చు. అందులో ఇబ్బందేముంది..? మీ నాయకులను చూస్తూ ఉన్నాం. వారు ఎప్పుడూ విమానాల్లో తిరుగుతూ ఉంటారు. వారు ధనికులే కదా. మార్కెట్ ధర చెల్లించమని వారికి చెప్పండి’ అని దామోదర్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అనంతరం విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
స్కూళ్లు 9 నుంచి 4.30 గంటల వరకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలల పని వేళల విషయంలో విద్యార్థులకు ఎంతో ఊరటనిచ్చే తీర్పును హైకోర్టు వెలువరించింది. అన్ని పాఠశాలలు ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు మాత్రమే పనిచేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల పనివేళల విషయంలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) చేసిన ప్రతిపాదనలను రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు కచ్చితంగా వర్తింపజేయాల్సిందేనని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. పాఠశాలలు ఇష్టారాజ్యంగా పనివేళలను నిర్దేశిస్తున్నాయని, దీనివల్ల విద్యార్థులకు తమ తల్లిదండ్రులతో గడిపేందుకు సైతం సమయం దొరకడం లేదంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన రామ్‌గోపాల్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టుకు లేఖ రాశారు. పనివేళల విషయంలో నియంత్రణ లేకపోవడం విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, దీని వల్ల అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని కోర్టుకు నివేదించారు. ఈ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు, దీనిపై విచారణ చేపట్టింది. ఇందులో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసి కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా కౌంటర్ దాఖలు చేసిన విద్యాశాఖ, పాఠశాలల పనివేళల విషయంలో ఎస్సీఈఆర్టీ స్పష్టమైన ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపిందని, దీని ప్రకారం రాష్ట్రంలోని ప్రతీ పాఠశాల కూడా ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మాత్రమే పనిచేయాల్సి ఉంటుందన్నారు. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్నం 12.15 నుంచి 1.15 గంటల వరకు భోజన విరామంగా ప్రతిపాదించారని, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 12.15 నుంచి ఒంటి గంట వరకు, ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 1.45 వరకు భోజన విరామ సమయాన్ని నిర్ణయించారని అధికారులు కోర్టుకు నివేదించారు. ఈ ప్రతిపాదనలను అన్ని పాఠశాలలూ తప్పనిసరిగా పాటించాలని, అందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, జిల్లాల కలెక్టర్లను, జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.