సాక్షి, హైదరాబాద్ : చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసులు ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై స్వయంగా విచారణ జరిపి నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. అంతేకాక ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి రికార్డులను సైతం తమ ముందుంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమంచి శ్రీనివాసులు ఇసుక అక్రమ రవాణాపై విచారణ జరిపిన గనులశాఖ డిప్యూటీ డెరైక్టర్ రూ.4.56 కోట్ల మేర సీనరేజీ చార్జీల కింద చెల్లించాలంటూ శ్రీనివాసులకు నోటీసు జారీ చేస్తే.. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి రద్దు చేశారని, ఇది అన్యాయమంటూ ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్.మోహన్‌కుమార్, మాచర్ల మోహన్‌రావులు హైకోర్టులో గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున వసుధా నాగరాజ్ వాదనలు వినిపిస్తూ చినగంజాం మండలం, మోటుపల్లి, కడవకుదురు గ్రామాల్లోని పలు సర్వే నంబర్లలో ఆమంచి శ్రీనివాసులు భారీ యంత్రాలతో ఇసుక తవ్వి రవాణా చేస్తున్నారంటూ అందిన ఫిర్యాదులపై విచారణ జరిపిన అధికారులు, అక్రమాలను నిర్ధారించారని తెలిపారు. 1.27 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక రవాణా చేసినట్లు నిర్ధారించి, అందుకు రూ.4.56 కోట్ల మేర సీనరేజీ చార్జీలు చెల్లించాలంటూ గనులశాఖ డిప్యూటీ డెరైక్టర్ నోటీసు జారీ చేశారని, దాన్ని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రద్దు చేశారని ఆమె తెలిపారు.
నోటీసుకు ఆమంచి పూర్తిస్థాయి వివరణ ఇవ్వనప్పటికీ ఎటువంటి కారణాలు చూపకుండానే ముఖ్య కార్యదర్శి ఆ నోటీసును రద్దు చేయడం అన్యాయమన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, పిటిషనర్ చెప్పిన ప్రాంతాలకు స్వయంగా వెళ్లి, అక్కడ అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతుందో లేదో చూసి, ఎవరు అలా చేస్తున్నారో గమనించి, పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఎమ్మెల్యే సోదరుడి అక్రమాలపై విచారణ జరపండి
Published Tue, Jul 8 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM
Advertisement
Advertisement