amanchi krishnamohan
-
నువ్వా.. నేనా !
♦ పోతుల సునీతకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఆమంచికి షాక్ ♦ ఆమంచి జీర్ణించుకుంటారా? ♦ ఇప్పటికే రెండు వర్గాల మధ్య నిత్యం గొడవలే ♦ పార్టీ క్యాడర్, అధికారులకు ఇబ్బందే ♦ సునీత ఇక దూకుడు పెంచడం ఖాయం ♦ చీరాలలో ఇక రెండు అధికార కేంద్రాలు చీరాల టీడీపీలో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కుంపటి రాజేశారు. ఇప్పటికే పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి నాయకులు నిత్యం తన్నుకుని తలకు పోసుకుంటున్నారు. ఉప్పు..నిప్పులా ఉన్న రెండు వార్గాల నాయకులు ఎవరికి వారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ నాయకురాలు పోతుల సునీతకు సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు పార్టీ అధిష్టానం షాకిచ్చినట్లయింది. నాయకుల సంగతి అంటుంచితే ఈ పరిణామం పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్, అధికారులకు తలనొప్పి కావడం ఖాయం. మున్ముందు ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి. ప్రకాశం జిల్లా : చీరాల తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు, గ్రూపు రాజకీయాలు నిత్యం భగ్గుమంటుంటాయి. అధికార పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా రగడే. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నుంచి.. నాలుగు విడతులుగా జరిగిన జన్మభూమి గ్రామసభలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల వరకూ ఆ పార్టీ నేతలు ప్రజలకు మేలు చేసిందేమీ లేదు. తరుచూ నేతల మధ్య ఘర్షణలతో చీరాల నడిరోడ్డులో టీడీపీ పరువు బజారున పడింది. ఇప్పటి వరకూ పోతుల సునీత ముందుకు రాకుండానే వెనుకుండి మాజీ మంత్రి పాలేటి రామారావు సహకారంతో తమ వర్గానికి అండగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఊహించని రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చీరాల నియోజకవర్గ నాయకురాలు పోతుల సునీతకు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సునీత నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో నవోదయం పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. 2016 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు, సహకారం కోసం ఆమంచిని సీఎం టీడీపీలోకి చేర్చుకున్నారు. అంతే వేగంగా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బాధ్యతల నుంచి సునీతను తప్పించారు. ఆమెను జన్మభూమి కమిటీ సభ్యురాలిగా మాత్రమే కొనసాగించారు. అప్పటి వరకూ సునీత వెంట ఉన్న మున్సిపల్ చైర్మన్ ఎం.రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు ఎమ్మెల్యే వర్గంలోకి జంప్ అయ్యారు. ఈ పరిస్థితిల్లో ఆమెతో ఉన్న కొందరు నాయకులతో పాటు, పాలేటి వర్గంలో ఉన్న మరికొందరిని కలుపుకుని ఆమంచికి వ్యతిరేకంగా టీడీపీ రెండో వర్గం నడుపుతూ వచ్చారు. బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి కూడా పోతులకే మద్దతు తెలిపారు. ఇటీవల తన ఎంపీ నిధులను కూడా పోతుల వర్గీయులకే కట్టబెట్టారు. టీడీపీ రెండు వర్గాల బలాబలాలు ఎలా ఉన్నా వర్గపోరుకు మాత్రం కొదువ లేదు. విభేదాలకు అంతే లేదు.. పార్టీ ఒక్కటైనా ఆ రెండు వర్గాల మధ్య విభేదాలకు అంతేలేదు. ఇప్పటి వరకూ సునీతకు ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టి నియోజకవర్గం నుంచి దూరం చేస్తారని అటు పార్టీ నాయకులు, ఇటు ప్రజల్లో ప్రచారం జరిగింది. సునీత కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం గట్టిగానే ప్రయత్నించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ కోసం సునీత కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు నియోజకవర్గంలో వారం నుంచి ప్రచారం జరిగింది. ఊహించని విధంగా ఆదివారం రాత్రి పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవిని కేటాయించినట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఎమ్మెల్యే ఆమంచి వర్గాని గట్టిషాక్ తగిలినట్లయింది. ఆమంచికి ఎదురు దెబ్బే నియోజకవర్గంలో రెండో నాయకత్వాన్ని సహించలేని ఎమ్మెల్యే ఆమంచికి ఇది ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. పోతులకు ఎమ్మెల్సీ పదవి దక్కడంతో నియోజకవర్గంలో ఆమె రెండో అధికార కేంద్రం అవుతుందనే విషయంలో సందేహం లేదు. చేతిలో అధికారం ఉండటంతో సునీత తన వర్గాన్ని బలోపేతం చేయడంతో పాటు అబివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, అధికారుల విషయంలో, లబ్ధిదారుల ఎంపికలో ఆమె జోక్యం ఉండటం ఖాయం. ప్రొటోకాల్ ప్రకారం అన్నీ అధికార కార్యక్రమాల్లో సునీత తన వర్గంతో కలిసి పాల్గొంటారు. దీన్ని ఎమ్మెల్యే ఆమంచి అంగీకరించే అవకాశం ఉండకపోవచ్చు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నా సునీతతో కలిసి ఆమంచి పనిచేసే అవకాశం లేదన్న ప్రచారం కూడా సాగుతోంది. చీరాల టీడీపీలో ఇక రోజూ రచ్చే. ఎవరూ ఊహించని విధంగా సునీతకు ఎమ్మెల్సీ ఇవ్వడం ఆమంచి దూకుడుకు చెక్ పెట్టడానికేనా.. అని నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది. తన ప్రత్యర్థిగా ఉన్న సునీతకు ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని ఆమంచి ఏ విధంగా అర్థం చేసుకుంటారో కాలమే సమాధానం చెప్పాలి. -
లోకేష్‌కు గొట్టిపాటి, ఆమంచి ఫిర్యాదు
► టీడీపీలో ముదిరిన వర్గపోరు ► కొత్త నేతలను అడ్డుకుంటున్న పాత నేతలు ► చీరాల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోతుల సునీత, ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి వర్గాలు ► చీరాలలో రెండు మహానాడులు ► గొట్టిపాటిదీ అదే పరిస్థితి ఒంగోలు: అధికార పార్టీలో కొత్తగా చేరిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లకు ఆ పార్టీ పాత నేతల నుంచి అడుగడుగునా అడ్డంకులు తప్పడం లేదు. వారి రాకను పాత నేతలు జీర్ణించుకోలేకున్నారు. అడుగడుగునా అవమానకర రీతిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాత నేతల వ్యవహారం ఎప్పటికప్పుడు పత్రికలకు ఎక్కుతుండటంతో కొత్త నేతలకు ఇది తల కొట్టేసినట్లవుతోంది. వారితో పాటు వారి అనుచర గణం, దిగువ శ్రేణి కార్యకర్తలు ఇది జీర్ణించుకోలేకున్నారు. వారిలో అంతర్మథనం మొదలైంది. ఆదివారం ఒంగోలు మినీమహానాడులో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పాత నేత కరణం బలరాం వర్గాల గొడవ కొత్త నేతలకు తలకొట్టేసినట్లయింది. పార్టీలోకి తెచ్చుకొని అవమానిస్తారా.. అంటూ గొట్టిపాటి, ఆమంచిలు చినబాబు లోకేష్‌కు మహానాడు అనంతరం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సమావేశంలో కరణం తీరును వారు లోకేష్‌కు వివరించినట్లు తెలుస్తోంది. కొంత సహనం వహించాలని, అన్నీ సర్దుబాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్‌లు ఎన్ని హామీలిచ్చినా క్షేత్రస్థాయిలో పాత నేతలకు, కొత్త నేతలకు మధ్య పొంతన కుదిరే పరిస్థితి లేదు. చీరాల టీడీపీలో మూడు ముక్కలాట కొత్తగా అధికార పార్టీలో చేరిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆమంచిపై పోటీ చేసిన అధికార పార్టీ అభ్యర్థి సునీత, మాజీ మంత్రి పాలేటి రామారావులు కలిసి ఆమంచిని వ్యతిరేకిస్తున్నారు. బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి వర్గం సైతం ఇదే బాటలో నడుస్తోంది. ఆమంచిపై అడుగడుగునా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన పార్టీలో చేరతారనగానే సునీత వర్గం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. జిల్లాలో ఆమంచి చేరికను పదే పదే అడ్డుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఏకంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లోనే నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి నుంచి వారికి పొసగటం లేదు. తాజాగా ఈ నెల 20న ఆమంచి చీరాలలో మినీమహానాడు నిర్వహించగా పోతుల సునీత వర్గం హాజరుకాలేదు. ఆదివారం సాయంత్రం సునీత వర్గం చీరాలలో మరో మినీమహానాడు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆమంచి వర్గం హాజరుకాలేదు. మొత్తంగా చీరాల అధికార పార్టీ మూడు వర్గాలుగా చీలిపోయి అడుగడుగునా ఘర్షణలకు దిగుతున్నారు. పతాక స్థాయికి గొట్టిపాటి, కరణం గొడవలు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ రాకను సీనియర్‌నేత కరణం బలరాం మొదట్లోనే వ్యతిరేకించారు. ఈ విషయం ముఖ్యమంత్రి ఎదుటే స్పష్టం చేశారు. అయినా ముఖ్యమంత్రి గొట్టిపాటిని పార్టీలో చేర్చుకున్నారు. కరణం మాత్రం గొట్టిపాటిపై బహిరంగ విమర్శలకు దిగారు. సాక్షాత్తు మంత్రులు, రాష్ట్ర పరిశీలకులు, జిల్లా నేతలందరి ముందే ప్యాకేజీల కోసమే వచ్చినోళ్లు... అదే చూసుకోవాలని.. మాపై స్వారీ చేస్తే బంగాళాఖాతంలో వేస్తామంటూ గొట్టిపాటికి తీవ్ర హెచ్చరికలు చేశారు. అమితుమీకి సిద్ధమైన కరణం గొట్టిపాటి విషయంలో కరణం వర్గం అమితుమీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అవసరమైతే ముఖ్యమంత్రితోనే తేల్చుకోవాలని వారు ఉన్నట్లు సమాచారం. తెగే దాకా లాగితే కరణంతో తలబొప్పి కట్టడం ఖాయమని ఇదే జరిగితే గొట్టిపాటిని తెచ్చుకొని కూడా లాభం ఉండదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. దీంతోనే ముఖ్యమంత్రి, లోకేష్ అచితూచీ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత వరకు ఇరువర్గాలను సర్దుబాటు చేసేందుకు బాబు ప్రయత్నాలను సాగిస్తున్నట్లు సమాచారం. పార్టీలో చేరినా కలుపుకొని పోయేవారు లేకపోవడం మంత్రులు, జిల్లా నేతలు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో పాత నేతలు మరింత రెచ్చిపోతూ అడుగగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. పైగా బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా పార్టీలో చేరిన గొట్టిపాటి రవికుమార్, ఆమంచి కృష్ణమోహన్ తదితర నేతల్లో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. బుద్ధి లేక వచ్చామంటూ... ఇద్దరు ఎమ్మెల్యేలు మదనపడుతున్నట్లు సమాచారం. -
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తల ఆందోళన
ఒంగోలు: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో పాటు ఆయన అనుచరులు తమపై దాడులకు దిగి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. అందుకు నిరసనగా బుదవారం ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట వారు ఆందోళనకు దిగి.... తమ నిరసన తెలిపారు. ఈ నిరసనలో జిల్లాలోని వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్య కాలనీకి చెందిన సుమారు 200 మంది టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే తమ్ముని ఇసుక లారీల సీజ్
చీరాల: ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు స్వాములు ఇసుక క్వారీపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు లారీలను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. -
ఎమ్మెల్యే సోదరుడి అక్రమాలపై విచారణ జరపండి
సాక్షి, హైదరాబాద్ : చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసులు ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై స్వయంగా విచారణ జరిపి నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. అంతేకాక ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి రికార్డులను సైతం తమ ముందుంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమంచి శ్రీనివాసులు ఇసుక అక్రమ రవాణాపై విచారణ జరిపిన గనులశాఖ డిప్యూటీ డెరైక్టర్ రూ.4.56 కోట్ల మేర సీనరేజీ చార్జీల కింద చెల్లించాలంటూ శ్రీనివాసులకు నోటీసు జారీ చేస్తే.. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి రద్దు చేశారని, ఇది అన్యాయమంటూ ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్.మోహన్‌కుమార్, మాచర్ల మోహన్‌రావులు హైకోర్టులో గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున వసుధా నాగరాజ్ వాదనలు వినిపిస్తూ చినగంజాం మండలం, మోటుపల్లి, కడవకుదురు గ్రామాల్లోని పలు సర్వే నంబర్లలో ఆమంచి శ్రీనివాసులు భారీ యంత్రాలతో ఇసుక తవ్వి రవాణా చేస్తున్నారంటూ అందిన ఫిర్యాదులపై విచారణ జరిపిన అధికారులు, అక్రమాలను నిర్ధారించారని తెలిపారు. 1.27 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక రవాణా చేసినట్లు నిర్ధారించి, అందుకు రూ.4.56 కోట్ల మేర సీనరేజీ చార్జీలు చెల్లించాలంటూ గనులశాఖ డిప్యూటీ డెరైక్టర్ నోటీసు జారీ చేశారని, దాన్ని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రద్దు చేశారని ఆమె తెలిపారు. నోటీసుకు ఆమంచి పూర్తిస్థాయి వివరణ ఇవ్వనప్పటికీ ఎటువంటి కారణాలు చూపకుండానే ముఖ్య కార్యదర్శి ఆ నోటీసును రద్దు చేయడం అన్యాయమన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, పిటిషనర్ చెప్పిన ప్రాంతాలకు స్వయంగా వెళ్లి, అక్కడ అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతుందో లేదో చూసి, ఎవరు అలా చేస్తున్నారో గమనించి, పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
ఎమ్మెల్యే ఆమంచి వర్గంపై టీడీపీ రాళ్లదాడి
చీరాల : ప్రకాశం జిల్లా చీరాల స్వతంత్ర ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గంపై తెలుగుదేశం పార్టీ వర్గీయులు రాళ్లదాడి చేశారు. చీరాల మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆమంచి వర్గం మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో ఎస్ఐ రామిరెడ్డి గాయపడ్డారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. -
ఆ ఎమ్మెల్యేకి చుక్కలు చూపుతున్న కార్యకర్తలు!
ఒంగోలు: టిడిపి కార్యకర్తలు ప్రకాశం జిల్లా చీరాల స్వతంత్ర శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌ను వదిలిపెట్టడంలేదు. ఆయనను పార్టీలోకి రానివ్వకుండా శతవిధాలా అడ్డుపడుతున్నారు. ఆమంచి గెలిచిన రెండవ రోజు నుంచే టిడిపిలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి చీరాలలోని టిడిపి నేతలు, కార్యకర్తలు ఆమంచిని టీడీపీలోకి తీసుకోవద్దంటూ ఆందోళన మొదలు పెట్టారు. చీరాల, ఒంగోలు, హైదరాబాద్‌లలో ఆందోళనలు చేశారు. ఈ రోజు మళ్లీ ఒంగోలులోని జిల్లా టిడిపి కార్యాలయం ముందు పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఆమంచిని టీడీపీలోకి తీసుకోవద్దని నినాదాలు చేశారు. ఆమంచి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రకాశం జిల్లా టిడిపి మినీ మహానాడులో ఈ విషయమై పెద్ద రభసే జరిగింది. ఆమంచికి వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నిన్న చీరాలకు చెందిన టిడిపి కార్యకర్తలు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎక్కి ఆందోళన చేశారు. ఆమంచి కృష్ణమోహన్‌ను పార్టీలో చేర్చుకోవద్దని వారు డిమాండ్ చేశారు. మళ్లీ ఈరోజు ఒంగోలులో ఆందోళన చేశారు. టిడిపిలో చేరడానికి ఆమంచి ఎంత ప్రయత్నించినా కార్యకర్తలు మాత్రం ఆయన ప్రయత్నాలను తిప్పికొడుతూ చుక్కలు చూపిస్తున్నారు. ఆయనను పార్టీలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. చీరాల శాసనసభ స్థానం నుంచి టిడిపి తరపున పోటీచేసి ఓడిపోయిన పోతుల సునీత నిన్న హైదరాబాద్‌లో మాట్లాడుతూ నైతికంగా తనదే విజయం అని చెప్పారు. ఆమంచి కృష్ణమోహన్‌ను టీడీపీలో చేర్చుకోవద్దని పార్టీ అధిష్టానాన్ని ఆమె కోరారు. గతంలో ఆమంచి టీడీపీ కార్యకర్తలను దూరంగా ఉంచారని ఆమె ఆరోపించారు. ఆమంచి అవినీతిపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అధికారులను మేనేజ్ చేశారని ఆమె ఆరోపించారు. -
నైతికంగా నాదే విజయం
హైదరాబాద్: నైతికంగా తనదే విజయం అని సార్వత్రిక ఎన్నికలలో ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయిన పోతుల సునీత అన్నారు. చీరాలలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్‌ను టీడీపీలో చేర్చుకోవద్దని పార్టీ అధిష్టానాన్ని ఆమె కోరారు. గతంలో ఆమంచి టీడీపీ కార్యకర్తలను దూరంగా ఉంచారని ఆమె ఆరోపించారు. ఆమంచి అవినీతిపై విచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అధికారులను మేనేజ్ చేశారని ఆమె ఆరోపించారు. ఆ ఎన్నికలలో నైతికంగా తనదే విజయం అని పోతుల సునీత చెప్పారు. టిడిపిలో చేరడం కోసం ఆమంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే చీరాల ప్రాంత కార్యకర్తలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు కూడా చీరాలకు చెందిన టిడిపి కార్యకర్తలు ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎక్కి ఆందోళనకు దిగారు. ఆమంచి కృష్ణమోహన్‌ను పార్టీలో చేర్చుకోవద్దని వారు డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యేగా గెలిచి కూడా...
హైదరాబాద్: ఎన్నికలు, ఎన్నికల కష్టాలు అందరికీ తెలుసు. అదీ ఏ పార్టీతో సంబంధంలేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం అంటే మాటలు కాదు. అయినా ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ స్థానం నుంచి ఆమంచి కృష్ణమోహన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనకు ఫలితం లేకుండా పోయింది. సాదారణంగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యేని ఏ పార్టీలో చేర్చుకోవడానికైనా పెద్దగా అభ్యంతరాలు ఉండవు. పాపం కృష్ణమోహన్ విషయంలో మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కృష్ణమోహన్ టిడిపిలో చేరడానికి తీవ్రప్రయత్నాలు చేయవలసి వస్తోంది. ఆయన పార్టీలో చేరడాన్ని టిడిపి నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కృష్ణమోహన్ గెలిచిన వెంటనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని కలిశారు.ఆ తరువాత ఆమంచి టిడిపిలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగింది. అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలియడంతో కార్యకర్తలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా టిడిపి మినీ మహానాడులో ఈ విషయమై పెద్ద రభసే జరిగింది. ఆమంచికి వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. అతనిని పార్టీలోకి రానివ్వొద్దని ఆందోళన చేశారు. దీంతో ఆమంచిని పార్టీలో చేర్చుకోలేదు. ఆమంచి తన ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉండటంతో కార్యకర్తలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ రోజు చీరాలకు చెందిన టిడిపి కార్యకర్తలు ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎక్కి ఆందోళనకు దిగారు. ఆమంచి కృష్ణమోహన్‌ను పార్టీలో చేర్చుకోవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఆమంచి టిడిపిలో చేరలేకపోతున్నారు.Follow @sakshinews -
ఎసరు?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా కాంగ్రెస్ వర్గ రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. జిల్లా కాంగ్రెస్(డీసీసీ) అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ చాపకిందకు నీళ్లు వస్తున్నాయి. ఆయన్ను డీసీసీ పీఠం నుంచి తప్పించాలని పీసీసీ చీఫ్ బొత్స సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సీఎం కిరణ్ వర్గీయుడిగా ఉండేందుకే ఆమంచి మొగ్గుచూపడమే బొత్స ఆగ్రహానికి కారణం. మరోవైపు కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కూడా ఆమంచి తీరుపై గుర్రుగా ఉన్నారు. దాంతో ఆమంచి ఉద్వాసనకు రంగం సిద్ధమైంది. ఎన్నికల నాటికి సీఎం కిరణ్వర్గంపై పైచేయి సాధించాలన్నది బొత్స వ్యూహం. అందులో భాగంగానే జిల్లాలో ఆమంచిపై వేటు పడనుందని తెలుస్తోంది. జిల్లా కాంగ్రెస్‌లో సరికొత్త రాజకీయ సమీకరణలిలా ఉన్నాయి.. సీఎంతో సాన్నిహిత్యం...బొత్సకు దూరం రాజకీయంగా రంగులు మార్చే ఆమంచి కృష్ణమోహన్ నైజమే ప్రస్తుత పరిస్థితికి కారణం. బొత్స వర్గీయుడిగా మెలిగి డీసీసీ అధ్యక్ష పీఠాన్ని ఆయన దక్కించుకున్నారు. ప్రధానంగా మంత్రి మహీధర్ రెడ్డి సీఎం కిరణ్‌కు సన్నిహితుడిగా ఉన్నందున బొత్స తన వర్గీయుడిగా ఉంటారన్న నమ్మకంతో ఆమంచిని డీసీసీ అధ్యక్షుడిని చేశారు. కానీ మారిన పరిస్థితుల్లో ఆయన బొత్సకు దూరం జరుగుతూ వచ్చారు. పూర్తిగా సీఎం వర్గీయుడిగా ముద్ర పడేందుకే మొగ్గుచూపారు. దీన్ని గమనించినప్పటికీ బొత్స ఏమాత్రం బయటపడకుండా వేచిచూసే ధోరణి అవలంబించారు. దీన్ని గుర్తించలేని ఆమంచి పూర్తిగా సీఎం కిరణ్ వర్గీయుడిగా మారిపోయి ఒకానొక దశలో బొత్సను బేఖాతరు చేసే స్థితికి చేరుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే ఊపులో ఆయన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మితో కూడా వైరం కొనితెచ్చుకున్నారు. తన అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమె ఏమాత్రం జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న రీతిలో వ్యవహరించారు. సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో తన మాట చెల్లుబాటు అవుతున్నప్పటికీ... చీరాలలో తనకు కనీస గౌరవం దక్కడం లేదని ఆమె కొంతకాలంగా ఆమంచిపై గుర్రుగా ఉన్నారు. బొత్సకు అందివచ్చిన అవకాశం... ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన - తదనంతర పరిణామాలు బొత్సకు కలసివచ్చాయి. అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పీసీసీకి అధిష్టానం ఆదేశించింది. వాస్తవానికి ఆమంచి అధిష్టానికి వ్యతిరేకంగా పెద్దగా వ్యాఖ్యలు ఏమీ చేయలేదు. మొదట్లో కాస్త హడావుడి చేసినప్పటికీ ఆయన విభజనకు సహకరించేందుకు మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తున్నారు. కానీ ఆమంచిని డీసీసీ పీఠం నుంచి తప్పించాలని భావిస్తున్న బొత్స మాత్రం దీన్ని అవకాశంగా తీసుకున్నారు. అందుకే అధిష్టానానికి సమర్పించిన నివేదికను జాగ్రత్తగా రూపొందించారు. ‘అధిష్టానాన్ని ఆమంచి విమర్శించారని... కాబట్టి ఆయన్ని డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించలేమని’ బొత్స నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. తద్వారా ఆమంచిని తప్పించి మరొకర్ని డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలన్నది ఆయన ఉద్దేశం. తదుపరి డీసీసీ అధ్యక్షుడిపై కూడా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. అధిష్టానానికి సన్నిహితంగా ఉండే కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ఎంపీ మాగుంట సూచించిన మేరకు కొత్త డీసీసీ అధ్యక్షుడి నియామకానికి బొత్స నిర్ణయించారు. తద్వారా ఇటు జిల్లాలోనూ అటు అధిష్టానం వద్ద తన పట్టును పెంచుకోవాలన్నది ఆయన లక్ష్యం. దీనిపై అధికారిక ప్రకటన వారంరోజుల్లోనే వెలువడనుందని తెలుస్తోంది. జిల్లా పార్టీలో వర్గ రాజకీయాలను ప్రభావితం చేయనున్న ఈ పరిణామాలను కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అటు సీఎం కిరణ్ సన్నిహితుడైన మంత్రి మహీధర్ రెడ్డి వర్గంతో వైరం... ఇటు పీసీసీ చీఫ్ బొత్స, కేంద్రమంత్రి పనబాకతో విరోధం... వెరసి ఆమంచి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని వ్యాఖ్యానిస్తున్నాయి. -
వట్టిదే..!
చీరాల, న్యూస్‌లైన్: ‘భారీ వర్షాలు, వరదలకు ముంపునకు గురైన పొలాల రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇన్పుట్ సబ్సిడీతో పాటు రైతులకు సబ్సిడీతో కూడిన వరి, శనగ విత్తనాలందిస్తాం.’ ఇటీవల వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా పర్చూరులో జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పిన మాటలివి. సబ్సిడీ విత్తనాలు ఇస్తామన్న కిరణ్‌కుమార్‌రెడ్డి సాగు సమయం మించిపోతున్నా వాటి ఊసే మరిచిపోయారు. స్వయంగా ముఖ్యమంత్రే సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేస్తామని చెప్పగా వ్యవసాయాధికారులు మాత్రం అటువంటి విత్తనం వచ్చే అవకాశం లేదనడం చూస్తే ప్రభుత్వానికి రైతులపై ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు కొమ్మమూరు ఆయకట్టు కింద ఉన్న కారంచేడు, చీరాల, వేటపాలెం, చినగంజాం, నాగులుప్పలపాడు మండలాల్లో వేలాది ఎకరాల్లో వేసిన వరి ముంపునకు గురై పనికి రాకుండా పోయింది. కొమ్మమూరు ఆయకట్టు కింద లక్ష ఎకరాల్లో వరి సాగవుతుంది. మామూలుగా 92 రకం వరి పైరును సాగు చేస్తారు. అకాల వర్షాలకు ముంపునకు గురై, సాగుకు సమయం లేకపోవడంతో ఈ ప్రాంత రైతులకు ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం వరి విత్తనాలను అందించాలని వ్యవసాయాధికారులు, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ముఖ్యమంత్రిని పర్చూరులో జరిగిన సమీక్ష సమావేశంలో కోరారు. వెంటనే సీఎం ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం విత్తనాలు నెల్లూరు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, అక్కడ నుంచి తెప్పించి రైతులకు సబ్సిడీ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం హామీ ఇచ్చి రెండు వారాలు గడుస్తున్నా ఎన్‌ఎల్‌ఆర్ 145 విత్తనం జిల్లాకు రాలేదు. అలానే నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఈ విత్తనం అందుబాటులో లేదని వ్యవసాయాధికారులంటున్నారు. ఈ విత్తనం వచ్చే అవకాశం కూడా లేదని తేలింది. అంటే ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన సబ్సిడీ విత్తనాలు రైతులకు అందే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే ఇప్పటికే నవంబర్ కూడా రావడంతో వరి సాగు చేసే సమయం మించిపోతోంది. ప్రస్తుతం ఆ విత్తనం వచ్చినప్పటికీ రైతులకు ప్రయోజనం ఉండదు. ఇప్పటికే రైతులు ప్రైవేటు వ్యాపారుల నుంచి 10010 అనే రకం విత్తనాన్ని 30 కేజీల బస్తా రూ 1200 చొప్పున కొనుగోలు చేసి నార్లు పోశారు. ఎన్‌ఎల్‌ఆర్ 145తో మేలు... ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం వరి విత్తనం సాగుకు అనుకూలంగా ఉంటుంది. 145 రోజుల్లో పంట దిగుబడి వస్తుంది. ముఖ్యంగా పైర్లకు తెగుళ్లు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ దిగుబడి వస్తుంది. అదే 10010 రకానికి అయితే తెగుళ్లు అధికంగా ఆశిస్తాయి. దిగుబడి కూడా ఆశాజనకంగా ఉండదు. ఏడీఏ ఏమంటున్నారంటే... ‘ఈ ప్రాంతంలో ఎన్‌ఎల్‌ఆర్ 145 రకం విత్తనం సాగు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో నివేదించాం. కానీ నెల్లూరు జిల్లాలో కూడా ఆ విత్తనం అందుబాటులో లేదు. రైతులు ప్రస్తుతం వేస్తున్న 10010 రకం విత్తనాలకు తెగుళ్లు అధికంగా ఆశించే అవకాశం ఉంది. రైతులు ఎన్‌ఎల్‌ఆర్ 145 బదులుగా ఎన్‌ఎల్‌ఆర్ 344499 రకాన్ని సాగు చేయడం మంచిది’ అని ఏడీఏ మస్తానమ్మ తెలిపారు.