ఆమంచి కృష్ణమోహన్
హైదరాబాద్: ఎన్నికలు, ఎన్నికల కష్టాలు అందరికీ తెలుసు. అదీ ఏ పార్టీతో సంబంధంలేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం అంటే మాటలు కాదు. అయినా ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ స్థానం నుంచి ఆమంచి కృష్ణమోహన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనకు ఫలితం లేకుండా పోయింది. సాదారణంగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యేని ఏ పార్టీలో చేర్చుకోవడానికైనా పెద్దగా అభ్యంతరాలు ఉండవు. పాపం కృష్ణమోహన్ విషయంలో మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కృష్ణమోహన్ టిడిపిలో చేరడానికి తీవ్రప్రయత్నాలు చేయవలసి వస్తోంది. ఆయన పార్టీలో చేరడాన్ని టిడిపి నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కృష్ణమోహన్ గెలిచిన వెంటనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని కలిశారు.ఆ తరువాత ఆమంచి టిడిపిలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగింది. అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలియడంతో కార్యకర్తలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా టిడిపి మినీ మహానాడులో ఈ విషయమై పెద్ద రభసే జరిగింది. ఆమంచికి వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. అతనిని పార్టీలోకి రానివ్వొద్దని ఆందోళన చేశారు. దీంతో ఆమంచిని పార్టీలో చేర్చుకోలేదు.
ఆమంచి తన ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉండటంతో కార్యకర్తలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ రోజు చీరాలకు చెందిన టిడిపి కార్యకర్తలు ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎక్కి ఆందోళనకు దిగారు. ఆమంచి కృష్ణమోహన్‌ను పార్టీలో చేర్చుకోవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఆమంచి టిడిపిలో చేరలేకపోతున్నారు.Follow @sakshinews