లోకేష్‌కు గొట్టిపాటి, ఆమంచి ఫిర్యాదు
► టీడీపీలో ముదిరిన వర్గపోరు
► కొత్త నేతలను అడ్డుకుంటున్న పాత నేతలు
► చీరాల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోతుల సునీత, ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి వర్గాలు
► చీరాలలో రెండు మహానాడులు
► గొట్టిపాటిదీ అదే పరిస్థితి
ఒంగోలు: అధికార పార్టీలో కొత్తగా చేరిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లకు ఆ పార్టీ పాత నేతల నుంచి అడుగడుగునా అడ్డంకులు తప్పడం లేదు. వారి రాకను పాత నేతలు జీర్ణించుకోలేకున్నారు. అడుగడుగునా అవమానకర రీతిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాత నేతల వ్యవహారం ఎప్పటికప్పుడు పత్రికలకు ఎక్కుతుండటంతో కొత్త నేతలకు ఇది తల కొట్టేసినట్లవుతోంది. వారితో పాటు వారి అనుచర గణం, దిగువ శ్రేణి కార్యకర్తలు ఇది జీర్ణించుకోలేకున్నారు. వారిలో అంతర్మథనం మొదలైంది.
ఆదివారం ఒంగోలు మినీమహానాడులో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పాత నేత కరణం బలరాం వర్గాల గొడవ కొత్త నేతలకు తలకొట్టేసినట్లయింది. పార్టీలోకి తెచ్చుకొని అవమానిస్తారా.. అంటూ గొట్టిపాటి, ఆమంచిలు చినబాబు లోకేష్‌కు మహానాడు అనంతరం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సమావేశంలో కరణం తీరును వారు లోకేష్‌కు వివరించినట్లు తెలుస్తోంది. కొంత సహనం వహించాలని, అన్నీ సర్దుబాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్‌లు ఎన్ని హామీలిచ్చినా క్షేత్రస్థాయిలో పాత నేతలకు, కొత్త నేతలకు మధ్య పొంతన కుదిరే పరిస్థితి లేదు.
చీరాల టీడీపీలో మూడు ముక్కలాట
కొత్తగా అధికార పార్టీలో చేరిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆమంచిపై పోటీ చేసిన అధికార పార్టీ అభ్యర్థి సునీత, మాజీ మంత్రి పాలేటి రామారావులు కలిసి ఆమంచిని వ్యతిరేకిస్తున్నారు. బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి వర్గం సైతం ఇదే బాటలో నడుస్తోంది. ఆమంచిపై అడుగడుగునా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన పార్టీలో చేరతారనగానే సునీత వర్గం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. జిల్లాలో ఆమంచి చేరికను పదే పదే అడ్డుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఏకంగా హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ భవన్‌లోనే నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి నుంచి వారికి పొసగటం లేదు. తాజాగా ఈ నెల 20న ఆమంచి చీరాలలో మినీమహానాడు నిర్వహించగా పోతుల సునీత వర్గం హాజరుకాలేదు. ఆదివారం సాయంత్రం సునీత వర్గం చీరాలలో మరో మినీమహానాడు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆమంచి వర్గం హాజరుకాలేదు. మొత్తంగా చీరాల అధికార పార్టీ మూడు వర్గాలుగా చీలిపోయి అడుగడుగునా ఘర్షణలకు దిగుతున్నారు.
పతాక స్థాయికి గొట్టిపాటి, కరణం గొడవలు
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ రాకను సీనియర్‌నేత కరణం బలరాం మొదట్లోనే వ్యతిరేకించారు. ఈ విషయం ముఖ్యమంత్రి ఎదుటే స్పష్టం చేశారు. అయినా ముఖ్యమంత్రి గొట్టిపాటిని పార్టీలో చేర్చుకున్నారు. కరణం మాత్రం గొట్టిపాటిపై బహిరంగ విమర్శలకు దిగారు. సాక్షాత్తు మంత్రులు, రాష్ట్ర పరిశీలకులు, జిల్లా నేతలందరి ముందే ప్యాకేజీల కోసమే వచ్చినోళ్లు... అదే చూసుకోవాలని.. మాపై స్వారీ చేస్తే బంగాళాఖాతంలో వేస్తామంటూ గొట్టిపాటికి తీవ్ర హెచ్చరికలు చేశారు.
అమితుమీకి సిద్ధమైన కరణం
గొట్టిపాటి విషయంలో కరణం వర్గం అమితుమీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అవసరమైతే ముఖ్యమంత్రితోనే తేల్చుకోవాలని వారు ఉన్నట్లు సమాచారం. తెగే దాకా లాగితే కరణంతో తలబొప్పి కట్టడం ఖాయమని ఇదే జరిగితే గొట్టిపాటిని తెచ్చుకొని కూడా లాభం ఉండదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. దీంతోనే ముఖ్యమంత్రి, లోకేష్ అచితూచీ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత వరకు ఇరువర్గాలను సర్దుబాటు చేసేందుకు బాబు ప్రయత్నాలను సాగిస్తున్నట్లు సమాచారం. పార్టీలో చేరినా కలుపుకొని పోయేవారు లేకపోవడం మంత్రులు, జిల్లా నేతలు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో పాత నేతలు మరింత రెచ్చిపోతూ అడుగగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. పైగా బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా పార్టీలో చేరిన గొట్టిపాటి రవికుమార్, ఆమంచి కృష్ణమోహన్ తదితర నేతల్లో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. బుద్ధి లేక వచ్చామంటూ... ఇద్దరు ఎమ్మెల్యేలు మదనపడుతున్నట్లు సమాచారం.