కరణం బలరాంకు భంగపాటు !
- ఎట్టకేలకు అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్ బదిలీ
- అద్దంకి కొత్త సీఐగా హైమారావు
- మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ
ఒంగోలు: టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం ఇటీవల పార్టీలో చేరిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ల అధిపత్య పోరులో మంగళవారం గొట్టిపాటి రవికుమార్ పైచేయి సాధించారు. మొదట అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్ వ్యవహారంలో, ఆ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టు ఎస్‌ఈ రమణమూర్తి బదిలీ వ్యవహారంలోనూ మాట నెగ్గించుకొని పైచేయి సాధించినా కరణం బలరాంను పట్టుమని 10 రోజులు తిరగకుండానే ఎట్టకేలకు గొట్టిపాటి దెబ్బ కొట్టి కరణంపై పైచేయి సాధించారు.
అద్దంకి సీఐ వ్యవహారంలో కరణంకు భంగపాటు తప్పలేదు. ఈ నెల 13వ తేదీన కరణం అనుకూలుడిగా ముద్ర వేసుకున్న అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌ను కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పట్టుపట్టి బదిలీ చేయించారు. ఆయన స్థానంలో గుంటూరు వీఆర్‌లో ఉన్న హైమారావును తెచుకున్నారు. ఈ మేరకు డీఐజీ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అయితే విషయం తెలుసుకున్న కరణం హుటాహుటిన పావులు కదిపి ఐజీతో పాటు ఏకంగా డీజీపీ పైనే ఒత్తిడి తెచ్చారు.
అదే రోజు సాయంత్రానికి సీఐ బేతపూడి ప్రసాద్ బదిలీని నిలిపేయించారు. దీంతో ఇరువర్గాల మధ్య వర్గ విభేదాలు పతాక స్థాయికి చేరాయి. తాను పార్టీలో చేరేటప్పుడే సీఐ బదిలీ ప్రధాన డిమాండ్‌గా చెప్పానని, ఇప్పుడు అది కూడా చేయకపోతే తాను పార్టీలో ఉండటం ఎందుకంటూ గొట్టిపాటి రవికుమార్ చినబాబు లోకేష్ వద్ద వాపోయినట్లు ప్రచారం జరిగింది.
మరో వైపు తన మాట నెగ్గకపోతే అమీతుమీకి సిద్ధమని కరణం సైతం అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా మంగళవారం జరిగిన సీఐల బదిలీల్లో అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో గతంలో గొట్టిపాటి ప్రతిపాదించిన హైమారావునే నియమిస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
దీంతో ముఖ్యమంత్రి కరణంకు కాకుండా గొట్టిపాటి రవికుమార్‌కే ప్రాధాన్యతనిచ్చినట్లు తెలుస్తోంది. సీఐ బదిలీ వ్యవహారంలో ఎట్టకేలకు కరణంకు భంగపాటు తప్పలేదు. కరణంతో వర్గపోరులో ఆదిలో గొట్టిపాటికి భంగపాటు ఎదురైనా చివరకు కరణంను దెబ్బతీసి ఎట్టకేలకు పైచేయి సాధించారు.