దర్శిలో టీడీపీకి ఘోర పరాభవం తప్పదంటున్న సొంత పార్టీ శ్రేణులు
నియోజకవర్గంలో అడుగుపెడుతూనే పక్కా లోకల్ అని చెప్పిన గొట్టిపాటి లక్ష్మి
టీడీపీ శ్రేణులతోపాటు ప్రజల్లోనూ విస్తృత చర్చకు దారితీసిన లక్ష్మి వ్యాఖ్యలు
మీ పార్టీకో దండమంటూ రోజుకో గ్రూపు వైఎస్సార్ సీపీలో చేరిక
మరోవైపు ప్రచారంలో దూసుకెళ్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
నాయకత్వ లోపం తమ పార్టీ కొంప ముంచుతోందని దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకులు అంతర్మథనం చెందుతున్నారు. అభ్యర్థి ఎంపికలో గందరగోళం, గ్రూపు రాజకీయాలు నేటికీ సమసిపోకపోవడంతో టీడీపీ కేడర్‌లో నిస్తేజం నెలకొంది.
దర్శి: దర్శి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా టీడీపీ తరఫున గొట్టిపాటి లక్ష్మిని ఖరారు చేసి బరిలోకి దించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 4వ తేదీన ఆమె దర్శిలో తొలిసారి ఎన్నికల ప్రచారం నిర్వహించగా ప్రజల నుంచి స్పందన కరువైంది. కేడర్‌లో పట్టుమని పది మంది కూడా ఆమె వెంట ప్రచారానికి రాకపోవడం గమనార్హం. దర్శిలో ఆమె అడుగుపెట్టినప్పటి నుంచి ముస్లిం మైనారిటీలు, బీసీ సామాజికివర్గానికి చెందిన 500 మందికి పైగా టీడీపీ సానుభూతిపరులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. దీనికితోడు గొట్టిపాటి లక్ష్మి ప్రచారంలో పైసా ఖర్చు చేయడం లేదని కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.
టీడీపీ శ్రేణుల నుంచే వ్యతిరేకత
2009 సార్వత్రిక ఎన్నికల్లో దర్శి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మన్నం వెంకటరమణతో చంద్రబాబు పోటీ చేయించారు. ఆయనతో టీడీపీ అధిష్టానం భారీగా డబ్బు ఖర్చు చేయించగా.. సొంత సామాజిక వర్గం వారే నాన్ లోకల్ అంటూ ఓడించారు. రాబోయే ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేసేందుకు ఒంగోలు చెందిన గోరంట్ల రవికుమార్ ఉవిళ్లూరగా స్థానికుడే కావాలని ప్రధాన నాయకులు పట్టుబట్టడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. దర్శిలో బూచేపల్లిని ఎదుర్కొనే సత్తా ఉన్న నేతలెవరూ లేకపోవడంతో మల్లగుళ్లాలు పడిన టీడీపీ అధిష్టానం చివరికి గొట్టిపాటి లక్ష్మిని బరిలోకి దించింది. చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాన్ని స్థానిక టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానికేతరురాలైన వ్యక్తికి సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని అంతర్గత సమావేశాల్లో టీడీపీ నేతలు తెగేసి చెబుతున్నారు. నియోజకవర్గంలో సొంత పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుండటం, గెలుపు అవకాశాలు అంతంతమాత్రమేనని గ్రహించిన గొట్టిపాటి లక్ష్మి కాస్తో కూస్తో కూడా డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
దర్శిలో అడుగుపెట్టిన తొలిరోజే‘నేను పక్కా లోకల్’ అని గొట్టిపాటి లక్ష్మి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులతోపాటు ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. ‘నరసరావుపేట నుంచి దర్శికి వచ్చిన ఆమె ఎలా లోకల్ అవుతుంది.. వచ్చిన తొలిరోజే ఇలా అబద్ధాలు మాట్లాడమేంటి’ అని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. లక్ష్మి వ్యాఖ్యలపై నెటిజన్లు సైతం విరుచుకుపడ్డారు. ‘దర్శిలో ఇల్లూవాకిలి లేదు.. నీ పూర్వీకులు, కుటుంబీకులు కూడా ఎప్పుడూ ఇక్కడ నివాసం ఉండలేదు. అలాంటపుడు ఎలా లోకల్ అవుతావు’ అని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు నిలదీస్తున్నారు.
బూచేపల్లిని ఢీకొట్టలేం!
వైఎస్సార్ సీపీ దర్శి అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఆయన తల్లి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సతీమణి నందిని సైతం గడప గడపకూ వెళ్లి ప్రజలతో మమేకం అవుతున్నారు. బూచేపల్లి ఇప్పటికే దర్శి నియోజకవర్గంలో 80 శాతం ప్రచారం పూర్తి చేయడం విశేషం. గత 20 ఏళ్లుగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి స్థానికంగా నివాసం ఉంటూ నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ ప్రజాభిమానం ఏమాత్రం తగ్గని బూచేపల్లిని రాజకీయంగా ఢీకొట్టడం కష్టమని దర్శికి చెందిన టీడీపీ నేత ఒకరు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment