group politics
-
టీడీపీలో లోకల్ వార్.. నిస్తేజంలో కేడర్
నాయకత్వ లోపం తమ పార్టీ కొంప ముంచుతోందని దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకులు అంతర్మథనం చెందుతున్నారు. అభ్యర్థి ఎంపికలో గందరగోళం, గ్రూపు రాజకీయాలు నేటికీ సమసిపోకపోవడంతో టీడీపీ కేడర్‌లో నిస్తేజం నెలకొంది. దర్శి: దర్శి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా టీడీపీ తరఫున గొట్టిపాటి లక్ష్మిని ఖరారు చేసి బరిలోకి దించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 4వ తేదీన ఆమె దర్శిలో తొలిసారి ఎన్నికల ప్రచారం నిర్వహించగా ప్రజల నుంచి స్పందన కరువైంది. కేడర్‌లో పట్టుమని పది మంది కూడా ఆమె వెంట ప్రచారానికి రాకపోవడం గమనార్హం. దర్శిలో ఆమె అడుగుపెట్టినప్పటి నుంచి ముస్లిం మైనారిటీలు, బీసీ సామాజికివర్గానికి చెందిన 500 మందికి పైగా టీడీపీ సానుభూతిపరులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. దీనికితోడు గొట్టిపాటి లక్ష్మి ప్రచారంలో పైసా ఖర్చు చేయడం లేదని కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. టీడీపీ శ్రేణుల నుంచే వ్యతిరేకత 2009 సార్వత్రిక ఎన్నికల్లో దర్శి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మన్నం వెంకటరమణతో చంద్రబాబు పోటీ చేయించారు. ఆయనతో టీడీపీ అధిష్టానం భారీగా డబ్బు ఖర్చు చేయించగా.. సొంత సామాజిక వర్గం వారే నాన్ లోకల్ అంటూ ఓడించారు. రాబోయే ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేసేందుకు ఒంగోలు చెందిన గోరంట్ల రవికుమార్ ఉవిళ్లూరగా స్థానికుడే కావాలని ప్రధాన నాయకులు పట్టుబట్టడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. దర్శిలో బూచేపల్లిని ఎదుర్కొనే సత్తా ఉన్న నేతలెవరూ లేకపోవడంతో మల్లగుళ్లాలు పడిన టీడీపీ అధిష్టానం చివరికి గొట్టిపాటి లక్ష్మిని బరిలోకి దించింది. చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాన్ని స్థానిక టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానికేతరురాలైన వ్యక్తికి సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని అంతర్గత సమావేశాల్లో టీడీపీ నేతలు తెగేసి చెబుతున్నారు. నియోజకవర్గంలో సొంత పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుండటం, గెలుపు అవకాశాలు అంతంతమాత్రమేనని గ్రహించిన గొట్టిపాటి లక్ష్మి కాస్తో కూస్తో కూడా డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దర్శిలో అడుగుపెట్టిన తొలిరోజే‘నేను పక్కా లోకల్’ అని గొట్టిపాటి లక్ష్మి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులతోపాటు ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. ‘నరసరావుపేట నుంచి దర్శికి వచ్చిన ఆమె ఎలా లోకల్ అవుతుంది.. వచ్చిన తొలిరోజే ఇలా అబద్ధాలు మాట్లాడమేంటి’ అని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. లక్ష్మి వ్యాఖ్యలపై నెటిజన్లు సైతం విరుచుకుపడ్డారు. ‘దర్శిలో ఇల్లూవాకిలి లేదు.. నీ పూర్వీకులు, కుటుంబీకులు కూడా ఎప్పుడూ ఇక్కడ నివాసం ఉండలేదు. అలాంటపుడు ఎలా లోకల్ అవుతావు’ అని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు నిలదీస్తున్నారు. బూచేపల్లిని ఢీకొట్టలేం! వైఎస్సార్ సీపీ దర్శి అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఆయన తల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సతీమణి నందిని సైతం గడప గడపకూ వెళ్లి ప్రజలతో మమేకం అవుతున్నారు. బూచేపల్లి ఇప్పటికే దర్శి నియోజకవర్గంలో 80 శాతం ప్రచారం పూర్తి చేయడం విశేషం. గత 20 ఏళ్లుగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి స్థానికంగా నివాసం ఉంటూ నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ ప్రజాభిమానం ఏమాత్రం తగ్గని బూచేపల్లిని రాజకీయంగా ఢీకొట్టడం కష్టమని దర్శికి చెందిన టీడీపీ నేత ఒకరు పేర్కొన్నారు. -
కొత్త గ్రూపులకు ‘సారథి’!
నూజివీడు: ఇంకా టీడీపీలో చేరనేలేదు... ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించలేదు... టికెట్ ఇస్తామని ప్రకటించలేదు... కానీ, అప్పుడే కొలుసు పార్థసారథి నూజివీడులో గ్రూపు రాజకీయాలు మొదలు పెట్టారు. దీంతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వర్గం మండిపడుతోంది. ఇప్పటికే ఇక్కడ టీడీపీలో ఉన్న గ్రూపుల గోల సరిపోదన్నట్లు... పార్థసారథి రాకముందే మరో కొత్త గ్రూపును తయారు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మొదట ప్రగల్బాలు.. చివరకు సొంత సామాజికవర్గ నేతకు ఎసరు గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పెనమలూరు నియోజకవర్గం నుంచి కొలుసు పార్థసారథి పోటీ చేసి విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ పెనమలూరు నుంచి సీటు ఇవ్వడం సాధ్యం కాదని, ప్రత్యామ్నాయం ఆలోచిద్దామని వైఎస్సార్సీపీ అధిష్టానం పార్థసారథికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. ఇందుకు ఆయన అంగీకరించకుండా తాను పెనమలూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. అదే సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును రహస్యంగా కలిసి ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. కానీ, అక్కడ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడ్డం తిరగడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. పెనమలూరు తనకు కావాల్సిందేనని బోడే ప్రసాద్ గట్టిగా పట్టుపట్టారని, బీసీ నేత ముద్దరబోయిన అయితే మౌనంగా వెళ్లిపోతారని పార్థసారథిని నూజివీడు నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించినట్లు ప్రచారం సాగుతోంది. చివరకు తాను పెనమలూరు నుంచే పోటీ చేసి గెలుస్తానని ప్రగల్బాలు పలికిన పార్థసారథి కూడా అస్త్రసన్యాసం చేశారు. పెనమలూరులో బోడే ప్రసాద్‌ను తప్పించి తనకు సీటు ఇవ్వాలని చంద్రబాబును అడిగే ధైర్యం చేయలేక నూజివీడు వచ్చి పదేళ్లుగా టీడీపీని నమ్ముకుని ఉన్న తన సొంత సామాజికవర్గ నేతకు అన్యాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ముద్దరబోయిన ఫొటోల తొలగింపు నూజివీడు మండలం రావిచర్లలోని ఓ టీడీపీ నాయకుడి ఇంట్లో బుధవారం జరిగే శుభకార్యానికి పార్థసారథి హాజరుకానున్నట్లు తెలిసింది. ఆయనకు స్వాగతం పలుకుతూ మంగళవారం నూజివీడు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిలో ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫొటో కూడా ఉంది. పార్థసారథి కనీసం టీడీపీలో చేరకుండానే ఆయనకు స్వాగతం పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ముద్దరబోయిన వర్గం కంగుతింది. దీనిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తిని వారు నిలదీయగా.. తనకు ఇద్దరు నాయకులు కావాలని, అందుకే ఇద్దరి ఫొటోలు వేశానని అతను చెప్పినట్టు సమాచారం. ఇద్దరి ఫొటోలు ఉండటానికి వీల్లేదని ముద్దరబోయిన వర్గం స్పష్టం చేసింది. ముద్దరబోయిన ఫొటోను తీసేయాలని, లేకపోతే తామే తమ నాయకుడి ఫొటోను తొలగిస్తామని హెచ్చరించింది. ఆ తర్వాత ఫ్లెక్సీలపై ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫొటోను వారే కట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం నూజివీడులో హాట్ టాపిక్‌గా మారింది. పార్థసారథి అధికారికంగా టీడీపీలోకి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఈ గ్రూపుల గోల మరింత పెరిగే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పదేళ్ల నుంచి పార్టీ ఇన్చార్జిగా ఉన్న నేతను అధిష్టానం విస్మరించడం, మరోసారి వలస నేతను తీసుకురావడం, ఆయన మరో కొత్త వర్గాన్ని తయారు చేసుకునే పని ప్రారంభించడంపై నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నాయకులు సైతం మండిపడుతున్నారు. నియోజకవర్గంలో గ్రూపుల గోల వల్ల ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఓడిపోయామని, తాజా పరిణామాలు కూడా రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
భీమిలి నియోజక వర్గంపై గంటా కర్చీఫ్
-
విశాఖ: ఉత్తరాంధ్ర టీడీపీలో ముసలం!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయల నడుమ చిచ్చు ఒక్కసారిగా భగ్గుమంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్ర టీడీపీ లుకలుకలు బయటపడ్డాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రాధాన్యత ఇవ్వడంపై చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వెల్లగక్కారు. ఈ క్రమంలోనే అలిగిన అయ్యన్న.. చంద్రబాబు సభకు దూరంగా ఉండాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. నిన్న బీసీ కార్యక్రమానికి సైతం అయ్యన్న డుమ్మా కొట్టారు. అలాగే తన తనయుడు విజయ్‌కి ఎంపీ టికెట్.. తమ ఎమ్మెల్యే టికెట్‌పైనా స్పష్టత ఇవ్వాలని అయ్యన్న అధిష్టానం వద్ద డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. గత నాలుగేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న గంటాకు ఉన్నపళంగా అధిక ప్రాధాన్యత ఇవ్వడంపైనా అయ్యన్న వర్గీయులు టీడీపీని నిలదీస్తున్నారు. ఇదిలా ఉండగా.. పాయకరావుపేట టీడీపీలోనూ వర్గ విభేదాలు బయటపడ్డాయి. వంగలపూడి అనితకు వ్యతిరేకంగా పార్టీలో ఓ వర్గం సమావేశం అయినట్లు సమాచారం. ఆమె ఫిర్యాదుతో ఇద్దరు నేతలపై వేటు పడడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. -
బాబు ఏం చెప్పారు?.. జ్యోతుల నెహ్రూ ఎందుకు రగిలిపోతున్నారు?
తమది క్రమశిక్షణ గల పార్టీ అని డబ్బా కొట్టుకుంటారు తెలుగుదేశం నాయకులు. కాని ఆ పార్టీలో ఉన్నన్ని గ్రూప్‌లు ఎక్కడా కనిపించవు. కాకినాడ జిల్లా టీడీపీలో తాజాగా జరుగుతున్న కొట్లాటలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. జిల్లాలోని సీనియర్ నేతల మధ్య నడుస్తున్న గ్రూప్ పాలిటిక్స్ కేడర్‌కు ఆందోళన కలిగిస్తున్నాయని టాక్. ఇంతకీ కాకినాడ దేశంలో ఏం జరుగుతోందో మీరే చదవండి. కాకినాడలో కస్సు బుస్సు కాకినాడ జిల్లా తెలుగు దేశం పార్టీలోని కొందరు మాజీ ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందట. టీడీపీ నాయకుల ఈ కష్టానికి కారణం అధికార పక్షం అనుకుంటే పొరపాటే. సొంత పార్టీలో నడుస్తున్న గ్రుప్ రాజకీయాలతోనే ఈ పరిస్ధితి దాపురించిందని ఆ పార్టీ నాయకులే వాపోతున్నారు. కాకినాడ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ వ్యవహరిస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీ చేయ్యాలని నవీన్ భావిస్తున్నారు. ఎప్పటి లానే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట ఎమ్మెల్యే సీటుకు పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే తండ్రీ, కొడుకులు పోటీ చేయాలనే ప్రతిపాదనలు పార్టీలోని కొందరు సీనియర్లకు రుచించడంలేదు. ఈ నేపథ్యంలో కొంతకాలం క్రిందట చంద్రబాబును కలిసిన పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల నేతలు ఈ విషయం గురించి చర్చించారు. నవీన్ ఎంపీగా పోటీ చేస్తే.. తమ నియోజక వర్గాల్లో ఆ ఖర్చును తామే భరించాల్సి వస్తే కష్టంగా ఉంటుందని బాబుకు చెప్పారట. ఈ విషయం ఆ జ్యోతుల నెహ్రూకు తెలిసిందట. దీనిపై రగిలిపోతున్న జ్యోతుల నెహ్రూ తన వ్యతిరేకులకు సమయం చూసి ఝలక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. కోల్డ్ వార్ c/o హీట్ పాలిటిక్స్ జ్యోతుల నెహ్రూ ఎదురు చూసిన సందర్భం వచ్చింది. చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో తన గ్రూప్ పాలిటిక్స్ ను ప్రయోగించారు. ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లో తనను, తన కుమారుడిని అడ్డుకునే నేతలకు వ్యతిరేకంగా తన మద్దుతదారులతో నెహ్రూ ఆందోళన చేయించారు. ప్రత్తిపాడు సీటు బీసీలకు ఇవ్వాలని.. పిఠాపురం సీటు జ్యోతుల నవీన్‌కు కేటాయించాలని ఆ నేతలు చంద్రబాబును కలిసి తమ డిమాండ్లు వినిపించారు. ఐతే కొద్ది రోజులకు ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ వరుపుల రాజా అకాల మరణం చెందారు. ఇక నెహ్రూకు వ్యతిరేకంగా మిగిలింది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మనే. దీంతో వర్మను టార్గెట్ చేసుకుని జ్యోతుల నెహ్రూ తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. వర్మకు గాడ్ ఫాదర్ గా ఉండే టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పార్టీలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా.. కాపాడుతూ వస్తున్నారు. జిల్లా పార్టీలో తొలి నుంచీ జ్యోతుల నెహ్రూ.. యనమల రామకృష్ణుడు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పార్టీలో ఎంతో పలుకుబడి ఉన్న యనమల రామకృష్ణుడి కుటుంబంలోనే ప్రస్తుతం టిక్కెట్ వార్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో యనమల తనను కాపాడుతాడనే నమ్మకం వర్మకు కనిపించడంలేదు. దీంతో జ్యోతుల నెహ్రూ బారి నుంచి నెలా బయటపడాలో... భవిష్యత్‌లో జరిగే పరిణామాలు ఎలా తట్టుకోవాలో వర్మకు అర్థం కావడంలేదట. జ్యోతుల టెన్షన్‌తో వర్మకు కంటి మీద కునుకులేకుండా పోయిందనే టాక్ నడుస్తోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయం
సాక్షిప్రతినిధి, వరంగల్: ఓరుగల్లు కాంగ్రెస్‌లో వర్గ పోరు తారస్థాయికి చేరింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నేతల మధ్య నెలకొన్న గందరగోళం పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యంతో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్, జనగామ జిల్లా మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి మధ్య పొలిటికల్ వార్ సాగుతోంది. వ్యక్తిగత విమర్శలతోపాటు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని జంగాను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించి.. సస్పెండ్ చేస్తూ సోమవారం అధిష్టానానికి సిఫార్సు చేశారు నాయిని రాజేందర్‌రెడ్డి. జంగా తానేమీ తక్కువ కాదన్నట్లు తనను సస్పెండ్ చేసే అధికారం నాయినికి లేదంటూ, అవసరమైతే ఆయననే సస్పెండ్ చేస్తున్నట్లు జంగా ప్రకటించి పార్టీకి లేఖ రాయనున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించారు. రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయం పకడ్బందీ వ్యూహంతో పార్టీ అధిష్టానం ముందడుగు వేస్తుంటే.. పార్టీలో నెలకొన్న అంతర్గత ప్రజాస్వామ్యం, నేతల మధ్య గ్రూప్ రాజకీయాలు పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌లో ఈ పరిస్థితి నాలుగైదు నియోజకవర్గాల్లో ఉన్నా.. అందుకు మొదటగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం వేదికగా మారింది. రాజకీయ జగడం నాయిని వర్సెస్ జంగా అన్నట్లు సాగుతోంది. పలుమార్లు ప్రయత్నించినా చివరి నిమిషంలో టికెట్ దక్కని నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ దక్కించుకోవడమే లక్ష్యంగా రాజేందర్‌రెడ్డి పని చేస్తున్నారు. ఇదే సమయంలో 2018లో పాలకుర్తి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన జంగా రాఘవరెడ్డి కూడా ఈసారి ఇక్కడి నుంచే పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇద్దరు నేతలు పోటాపోటీగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్ర కూడా వేర్వేరుగా చేస్తున్నారు. పోటాపోటీ ప్రెస్మీట్లు.. కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం సోమవారం జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు ఉండగా.. కాజీపేటలో జంగా రాఘవరెడ్డి పోటీ నిరసన దీక్ష చేపట్టడం కలవరం సృష్టిస్తోంది. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి దీనిని తీవ్రంగా పరిగణిస్తూ జంగా రాఘవరెడ్డిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ సస్పెన్షన్‌కు పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేశారు. నాలుగేళ్లలో 20 సార్లు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశానని, జంగాపై చర్యలు తీసుకోని పక్షంలో తాను నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన జంగా రాఘవరెడ్డి కాజీపేటలో మీడియాతో మాట్లాడుతూ ‘కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసే అధికారం డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డికి లేదు.. ఆయననే నేను సస్పెండ్ చేస్తూ అధిష్టానానికి లేఖ రాస్తున్నా..’ అంటూ వ్యక్తిగత ఆరోపణలు చేశారు. తాను స్థానికుడినని.. రాజేందర్‌రెడ్డి కాదని.. ఎట్టి పరిస్థితుల్లో వరంగల్ పశ్చిమలో పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. కాగా.. తాజా ఘటనపై టీపీసీసీ ముఖ్యులు ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది. -
విజయవాడ పశ్చిమలో టీడీపీ నాలుగు స్తంభాలాట
సాక్షి, కృష్ణా: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అధినేత మరో నాయకుడికి రంగప్రవేశం కల్పిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు నాయకులతో మూడుముక్కలాట ఆడిస్తున్న చంద్రబాబు.. తాజాగా నాలుగు స్తంభాలాటకు తెరతీయిస్తున్నారు. విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని)కు పశ్చిమ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించి అక్కడి నాయకుల మధ్య పొగ ఆరనీయకుండా నిప్పు రాజేస్తూనే ఉన్న బాబు తాజాగా ఎం.ఎస్. బేగ్‌ను రంగంలోకి దించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా కేశినేని, బేగ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను వెంటపెట్టుకెళ్లి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పించారు. ఈ సందర్భంగా బేగ్‌కు బాబు బలమైన హామీ ఇచ్చారనే చర్చ నియోజకవర్గ టీడీపీ నాయకుల్లో జరుగుతోంది. ఎంపీ కేశినేని నానికి పశ్చిమ నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. బుద్దా వెంకన్న, నాగుల్‌మీరాలు ఓ వర్గంగా వ్యవహరిస్తూ ఎంపీని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నది బహిరంగ రహస్యమే. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పతాకస్థాయికి చేరిన రగడ ఎప్పటికప్పుడు రగులుకుంటూనే ఉంది. ఇటీవలే కాల్‌మనీ సెక్స్ రాకెట్ నడిపే వారు, భూ కబ్జాదారులు, రౌడీలు నగరంలో నాయకులుగా చెలామణి అవుతామంటే ససేమిరా అంగీకరించేది లేదంటూ బుద్దా, మీరా, బొండా తదితర నేతలను ఉద్దేశించి ఎంపీ పరోక్షంగా కుండబద్దలు కొట్టారు. పశ్చిమ మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కేశినేని వైపే మొగ్గుచూపుతుండేవారు. కొన్ని నెలల కిందట ఎంకే బేగ్ కార్యాలయాన్ని నాని ప్రారంభించినప్పటి నుంచి జలీల్‌ఖాన్ కూడా ఎంపీ పట్ల గుర్రుగా ఉంటున్నారు. గత సాధారణ ఎన్నికల్లో జలీల్ కుమార్తె షబానాఖాతూన్ టీడీపీ తరఫున పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ పర్యాయం కూడా తమ కుటుంబానికే టికెట్టు దక్కుతుందనే ఆశలో ఉన్న జలీల్‌ఖాన్‌కు ఆదివారం నాటి పరిణామాలు మింగుడుపడనీయడం లేదని ఆయన వర్గీయులు గుర్తుచేస్తున్నారు. నాలుగు పర్యాయాలు పోటీ చేసినా.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, జనరల్ అభ్యర్థిగా ఎం.ఎస్.బేగ్ తండ్రి ఎం.కె. బేగ్ 1985, 1989, 1994, 2004 ఎన్నికల్లో పోటీచేసి మూడు పర్యాయాలు సీపీఐ అభ్యర్థుల చేతిలో ఓటమి చవిచూశారు. 1989లో మాత్రమే బేగ్ విజయం సాధించారు. చంద్రబాబును కలిసిన బేగ్.. విదేశాల్లో ఉంటూ రాజకీయాల్లో తనవంతు ప్రయత్నాలు ఎన్నికల వేళ కొనసాగిస్తుంటారనే గుర్తింపు ఉంది. గత ఎన్నికలప్పుడు కూడా విభిన్న పార్టీల నుంచి టికెట్‌ను ఆశించినట్లు స్థానిక నాయకులు గుర్తు చేస్తున్నారు. -
నకిరేకల్ బీఆర్ఎస్లో వర్గపోరు.. వీరేశంపై ఎమ్మెల్యే చిరుమర్తి ఫైర్..
నల్లగొండ: నకిరేకల్ బీఆర్ఎస్లో వర్గపోరు మరోసారి బయటపడింది. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని టార్గెట్ చేస్తూ ప్రస్తుత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర విమర్శలు చేశారు. నాలుగు సంవత్సరాలుగా ఆయనకు పార్టీలో సభ్యత్వమే లేదని వ్యాఖ్యానించారు. వీరేశం ఎక్కడ ఉంటున్నాడో, ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. 'ఒకసారి ఎంపీగా పోటీ చేస్తా అంటావు. మరొకసారి ఇంకో నియోజకవర్గం పేరు చెప్తావు. ఇంకోసారి ఎమ్మెల్సీ, మంత్రి అంటున్నావు. గతంలో తొడలుకొట్టి ఓ పేపరు చూపించారు. ఇప్పుడు అది ఎటుపోయిందో ఎవరికీ తెలియదు. ప్రజల్ని అనుచరులని అయోమయానికి గురి చేస్తున్నావు. గతంలో జిల్లాలో ఎక్కడపడితే అక్కడ కబ్జాలు జరిగేవి. నకిరేకల్‌కు గతంలో కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నా.' అని చిరుమర్తి వ్యాఖ్యానించారు. చదవండి: రాజకీయం రసకందాయం! సబిత పెత్తనం ఏమిటంటున్న తీగల -
ఎన్టీఆర్ వర్ధంతి రోజున టీడీపీలో బట్టబయలైన వర్గ విబేధాలు
-
పెనుకొండ టీడీపీలో ముసలం..
సాక్షి, పెనుకొండ: పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. కురుబ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సవిత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప వరుస కార్యక్రమాలతో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రాబోవు ఎన్నికల్లో గెలుపు మాట అటుంచితే పార్టీ టికెట్ పార్థుడికి దక్కడం కష్టమేనన్న వాదన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. సవిత ధీమా రాబోవు ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువతకు ప్రాధాన్యతనిస్తున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించడంతో కురుబ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సవితలో ఆశలు రేకెత్తాయి. దీంతో పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేశారు. రాబోవు ఎన్నికల్లో పార్టీ టికెట్ తనకేనంటూ ఇప్పటికే పార్టీ శ్రేణులకు స్పష్టం చేసిన ఆమె.. ఇతర జిల్లాల్లోనూ పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటూ తన ఇమేజ్ను పెంచుకునే చర్యలు ముమ్మరం చేశారు. కలిసొచ్చిన రాజకీయ శత్రువు.. మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు మధ్య ఉన్న రాజకీయ శత్రుత్వం సవితకు కలిసొచ్చింది. పార్థుడిని ఎలాగైనా దెబ్బ తీయాలన్న కసి నిమ్మలలో వ్యక్తమవుతోంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న బీకే ప్రతి సమావేశంలోనూ నిమ్మలను అవమానపరుస్తూ వచ్చారు. దీంతో పార్థుడి ఓటమే లక్ష్యంగా కిష్టప్ప తన రాజకీయ అస్త్రాలను ఎక్కు పెట్టారు. ఈ క్రమంలో సవితకు కిష్టప్ప మద్దతు ఇస్తున్నట్లుగా పార్టీ శ్రేణులు బాహటంగానే పేర్కొంటున్నాయి. దీనికి తోడు తన కుమారులు అంబరీష్, శిరీష్‌లో ఎవరో ఒకరికి పార్టీ టికెట్ దక్కించుకునేందుకు కిష్టప్ప పావులు కదుపుతున్నారు. పుట్టపర్తి లేక పెనుకొండ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి కుమారులను బరిలో దించేందుకు కిష్టప్ప ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఎలాగైనా తన భార్యకు పార్టీ టికెట్ దక్కించుకునేందుకు సవిత భర్త వెంకటేశ్వర చౌదరి పెద్ద ఎత్తున లాబీయింగ్ మొదలు పెట్టారు. కానీ బీకే మాత్రం అధిష్టానానికి తనపైనే ఎంతో గురి ఉందని, ప్రజల్లోనూ తనకే పట్టు ఉందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ధీమాతోనే పార్టీలో ఏ ఒక్కరినీ ఆయన ఖాతరు చేయడం లేదు. ఎడమొహం.. పెడమొహం.. పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. బీకే పార్థసారథి ఓ కార్యక్రమాన్ని చేపడితే దానికి ప్రతిగా సవిత మరో కార్యక్రమానికి పిలుపునిస్తోంది. దీంతో నిన్నామొన్నటి వరకూ బీకే వెంట నడిచిన పలువురు ముఖ్య నాయకులు సవితమ్మ గ్రూపులోకి చేరారు. ఇక ఏదైనా కార్యక్రమంలో ఇరు వర్గాలు ఎదురుపడ్డా.. ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నాయి. అంతటితో ఆగకుండా దూషణల పర్వానికి తెర తీస్తున్నాయి. ఇటీవల పెనుకొండలోని బోయగేరిలో పార్థుడి నేతృత్వంలో జరిగిన ఓ కార్యక్రమం ఇందుకు అద్దం పడుతోంది. తమ ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు ఆ కార్యక్రమంలో పాల్గొనరాదంటూ పార్థుడి ముఖ్య అనుచరుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాడు. ఇది వర్గ పోరుకు మరింత ఆజ్యం పోసింది. పోటాపోటీగా కార్యాలయాలు.. పెనుకొండలో టీడీపీ నాయకులు రెండు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. తన స్వగృహంలోనే పార్థుడు కార్యాలయం నిర్వహిస్తుండగా.. ప్రతిగా ఎన్టీఆర్ సర్కిల్లో సవితమ్మ చేత మరో కార్యాలయాన్ని ఆమె వర్గీయులు ఏర్పాటు చేయించారు. అంతటితో ఆగకుండా పోటాపోటీగా కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కిందిస్థాయి కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర కాలం ఉండడంతో ముగ్గురు నాయకుల మధ్య తీవ్ర విభేధాలు చంద్రబాబు, లోకేష్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ( చదవండి: నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే కేతిరెడ్డి ) -
నువ్వా? నేనా?.. సైకిల్ పార్టీలో ఏం జరుగుతోంది?
గత ఎన్నికల్లో సీమలో తెలుగుదేశం పార్టీ రెండు సీట్లు గెలుచుకున్న జిల్లా అది. ఈసారి ఒకటి కూడా కష్టమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అటువంటి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరాయి. వీలున్నప్పుడల్లా నువ్వా? నేనా అన్నట్లుగా ముష్టి యుద్ధాలకు దిగుతున్నారు. పచ్చపార్టీలో అనంత వివాదాలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఫైట్ పీక్ స్టేజ్‌కు చేరింది. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఇద్దరు నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి.. కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు మధ్య చాన్నాళ్ళుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. అనంతపురం జిల్లా టీడీపీలో వృద్ధ నేత హనుమంతరాయచౌదరి 2014 నుంచి 2019 దాకా కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో హనుమంతరావు చౌదరికి టిక్కెట్ నిరాకరించిన చంద్రబాబు.. ఉమామహేశ్వర నాయుడుని బరిలో దింపారు. గత ఎన్నికల్లో ఉమామహేశ్వర నాయుడు ఘోరంగా ఓడిపోయారు. సైకిల్‌కు ఫ్లెక్సీ వార్ ఉమామహేశ్వర నాయుడుకి జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. 2019లో ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి ఇప్పటివరకు.. టీడీపీ చేపట్టే అన్ని కార్యక్రమాలను ఉన్నం, ఉమా మహేశ్వరుడు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఎవరికి వారుగా ఫ్లెక్సీలు చేయించుకోవడం.. బలప్రదర్శన చేయడం.. ఒకరిపై మరొకరు బాహాటంగా విమర్శించుకోవటం కల్యాణదుర్గంలో సాధారణ విషయంగా మారింది. బహిరంగంగా కుస్తీలాట కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ పదవుల ఎంపిక జరుగుతోంది. కళ్యాణదుర్గంలోనే సమావేశం నిర్వహిస్తే రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతుందని భావించిన టీడీపీ అధిష్టానం ఆ సమావేశాన్ని అనంతపురంలో జరపాలని ఆదేశించింది. మాజీ మంత్రులు కాలువ శ్రీనివాస్, అమర్నాథ్ రెడ్డి, టీడీపీ జిల్లా ఇంఛార్జి బీటీ నాయుడు సమక్షంలో కళ్యాణదుర్గం పార్టీ సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే.. ఉన్నం హనుమంతరాయచౌదరి, ఉమామహేశ్వర నాయుడు పార్టీ పదవులు తమ వర్గానికే ఇవ్వాలని పట్టుబట్టారు. మాటల యుద్ధంతో ఇరు వర్గాలు రెచ్చిపోయాయి. వాగ్వాదం, తోపులాటలతో పాటు పరస్పరం కొట్టుకోవడం.. కుర్చీలు విసురుకోవడం జరిగింది. రెండు వర్గాలకు సర్ది చెపచెప్పేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు ముఖ్య నేతలు. దీంతో చేసేది లేక అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించారు. లాబీయింగ్ బాబు కళ్యాణదుర్గం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు పొందేందుకు మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి తీవ్ర స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో తనకు గాని.. తన కొడుకు మారుతీ చౌదరికి గానీ టిక్కెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు ఇంఛార్జి పదవిని కాపాడుకుంటూనే వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని ఉమా మహేశ్వర నాయుడు భావిస్తున్నారు. అందుకే ప్రతి విషయం లోనూ రెండు వర్గాలు బాహాబాహీకి దిగుతున్నాయి. నియోజకవర్గంలో నాయకులు అనుసరిస్తున్న తీరుపై పార్టీ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
అక్కడ జానారెడ్డి నిర్ణయమే ఫైనల్ ..
కాంగ్రెస్ పార్టీకి ఇంటిపోరు ఎక్కువైంది. గ్రూపు రాజకీయాలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని.. అది కాంగ్రెస్ పార్టీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కిస్తుందని చెబుతున్న రాష్ట్ర నేతలకు ఉమ్మడి జిల్లాలో గ్రూపుల లొల్లి ప్రధాన అడ్డంకిగా మారబోతోంది. ముఖ్యనేతలే పార్టీలో విభేదాలకు, వర్గపోరుకు ఆజ్యం పోస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీకి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సఖ్యత లేదు. మండల స్థాయిలో గొడవలు పడి రచ్చకెక్కుతున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకుంటున్నారు. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలతో క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో అద్దంకి దయాకర్ ఓటమికి కారణమంటూ సస్పెండ్ చేసిన వడ్డేపల్లి రవిని రెండు రోజుల క్రితం తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకోవడం పార్టీలో గ్రూపు రాజకీయాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. తుంగతుర్తి నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో అద్దకి దయాకర్‌తో పాటు వడ్డేపల్లి రవి టికెట్ అశించారు. పార్టీ టికెట్ దయాకర్‌కు ఇవ్వడంతో రవి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని అప్పట్లో సస్పెండ్ చేసింది. ఆ తరువాత ఆయన టీఆర్ఎస్లో చేరినా అక్కడ సరైన గుర్తింపు లభించలేదని తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చే ప్రయత్నాలు చేశారు. ఇంకోవైపు నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం లేదని దయాకర్‌పైనా విమర్శలు ఉన్నాయి. దాన్ని ఆసరాగా చేసుకొని రవి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రవిపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయకముందే ఎలా పార్టీలో చేర్చుకుంటారని, ఆ చేరిక చెల్లదని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న ప్రకటించారు. మరోవైపు దయాకర్ కూడా ఆయన చేరికపై పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. సూర్యాపేటలోనూ.. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డికి అనుచరులు ఉన్నారు. ఆయన్ని రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నాలను సొంత పార్టీ వారే చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఒకప్పుడు దామోదర్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న రవి వర్గీయులు 2018 ఎన్నికల్లో సూర్యాపేటలో దామోదర్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. దీంతో రవిని దామోదర్‌రెడ్డి దూరంపెట్టారని అంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేయాలని భావిçస్తున్న రవి తనకు పార్టీ పెద్దల మద్దతు అవసరమనే యోచనతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని సంప్రదించారని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. పైగా సూర్యాపేట కాంగ్రెస్ నేత, రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు పటేల్ రమేష్‌రెడ్డి మద్దతు కూడా రవికి ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో దామోదర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వారు కోమటిరెడ్డి వద్దకు చేరుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎవరి ప్రయత్నాలు వారివే.. దేవరకొండ నియోజకవర్గంలో వర్గ పోరు ఉన్నా పెద్దగా బయట పడటం లేదు. అక్కడ మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్, కాంగ్రెస్ పార్టీ ఆదివాసి జాతీయ కోఆర్డినేటర్ నేనావత్ కిషన్‌నాయక్ టికెట్ ఆశించి ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడతాడనే ప్రచారంతో మాజీ మంత్రి పాల్వాయి స్రవంతి తన వర్గాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. నల్లగొండ, హుజూర్నగర్, కోదాడ, నాగార్జునసాగర్‌లో గ్రూపు రాజకీయాలు లేవు. నల్లగొండలో కోమటిరెడ్డి, హుజూర్నగర్, కోదాడలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నాగార్జునసాగర్‌లో జానారెడ్డికి ఎదురుగా వెళ్లి టికెట్ కావాలని సాహసించే నాయకులు పెద్దగా లేరు. బీఎల్ఆర్ వర్సెస్ శంకర్‌నాయక్ మిర్యాలగూడలో సామాజిక వేత్త బత్తుల లక్ష్మారెడ్డి(బీఎల్ఆర్), డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ మధ్య వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎవరికి వారే కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అయితే, అక్కడ జానారెడ్డి నిర్ణయమే ఫైనల్ కానుంది. దీంతో ఆయన శంకర్‌నాయక్ వైపు మొగ్గితే తన పరిస్థితి ఏంటనే ఉద్దేశంతో బీఎల్ఆర్ సొంత ఇమేజీ పెంచుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి కూడా మిర్యాలగూడ టికెట్ ఆశిస్తున్నారు. ఆలేరులో ఆధిపత్య పోరు.. ఆలేరు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ఇటీవలే బయట పడ్డాయి. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైన కల్లూరి రామచంద్రారెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. భువనగిరిలో ఇటీవల జరిగిన సమావేశంలో ఐలయ్య, నగేష్ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. ఐలయ్య సీనియర్లను పట్టిచుకోవడం లేదని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఆరోపణలు చేసుకున్నారు. దీనికి తోడు మరికొంత మంది నాయకులు ఎవరికి వారే ఎమ్మెల్యే అభ్యర్థులం తామేనంటూ గ్రామాల్లో తిరుగుతుండటంతో కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు. భువనగిరిలోనూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గీయులు డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి సహకరించడం లేదనే చర్చ సాగుతోంది. అక్కడ కోమటిరెడ్డి మరొకరిని ప్రత్యామ్నాయంగా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. నకిరేకల్‌లో రెండు గ్రూపులు నకిరేకల్‌లోనూ పార్టీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ప్రస్తుత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరడంతో నాయకత్వ కొరత ఏర్పడింది. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు రంగంలోకి దిగారు. టీపీసీసీ కార్యదర్శి కొండేటి మల్లయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ దైద రవీందర్ మధ్య పోరు మొదలైంది. ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహిస్తుండటంతో పార్టీ శ్రేణులు గందరగోళంలో పడ్డారు. అక్కడ జనాకర్షణ, ఆర్థిక బలం కలిగిన నేతను పార్టీలో చేర్చుకునేందుకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలిసింది. -
ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో చంద్రబాబుకు చేదు అనుభవాలు
-
తాండూరులో ‘కారు’చిచ్చు.. దుమారం రేపిన వాయిస్ రికార్డింగ్
తాండూరు ‘కారు’లో చిచ్చురేగింది. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఆధిపత్య పోరు చినికిచినికి గాలివానలా మారింది. అధికార పార్టీలో ఉన్న ఇద్దరు నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు తార స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాలుగా విడిపోయిన నాయకులు ఒకరిపై ఒకరు మాటల కత్తులు దూసుకుంటున్నారు. చదవండి: కేసీఆర్ క్లారిటీకి వచ్చారా? తాండూరు(వికారాబాద్ జిల్లా): ఇద్దరు బలమైన నేతల నడుమ.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు నలిగిపోతున్నారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గాల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. ప్రస్తుతం ఈ గొడవ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ విషయం పలుమార్లు అధిష్టానం దృష్టికి వెళ్లినా రాజీ కుదరలేదు. దీంతో సదరు నాయకులిద్దరూ ఎవరికివారే తెరవెనుక గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ వచ్చారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టికెట్ తనకేనని ఇరువురూ బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డిని ఫోన్లో దూషించారనే ఆడియో వైరల్‌గా మారింది. తివాచీతో ముదిరిన వివాదం జిల్లాలో తాండూరు రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అసెంబ్లీకి ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చనే సంకేతాల నేపథ్యంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇదే సమయంలో ఇరు వర్గాలకు చెందిన నాయకులు పైచేయి కోసం ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న ఈ వ్యవహారం ఇటీవల జరిగిన భద్రేశ్వర రథోత్సవం నేపథ్యంలో మరోసారి బయటపడింది. ప్రొటోకాల్ ప్రకారం అధికారులు, నిర్వాహకులు నేతలకు సరైన ప్రాధాన్యం ఇవ్వాలి. రథోత్సవానికి ముందుగా హాజరైన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి వెళ్లి కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన వేదికపై కూర్చున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వచ్చారు. ఆయన ఎమ్మెల్సీ పక్కన కూర్చోకుండా.. వారి ముందు మరో తివాచీ వేయించుకుని తన వర్గీయులతో కూర్చున్నారు. దీంతో ఎమ్మెల్సీ వర్గం వారు వెనుక వరుసలోకి వెళ్లారు. దీనిపై లోలోపల మండిపడిన మహేందర్‌రెడ్డి వర్గీయులు వేడుకలకు ఆటంకం కలిగించవద్దనే ఉద్దేశంతో మిన్నకుండిపోయారు. ఈ విషయంలో తమకు అవమానం జరిగిందని భావించిన ఎమ్మెల్సీ మరునాడు సీఐ రాజేందర్‌రెడ్డికి ఫోన్ చేసి మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఐని దుర్భాషలాడినట్లు ఉన్న ఆడియోలను ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తోఫాల పంపిణీలో రగడ రంజాన్ సందర్భంగా గత మంగళవారం యాలాల, బషీరాబాద్, తాండూరులో తోఫాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సమయంలో ప్రొటోకాల్ పాటించలేదని ఎమ్మెల్సీ వర్గీయులు అధికారులపై మండిపడ్డారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ అరవింద్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండున్నరేళ్లుగా వార్.. తాండూరు టీఆర్ఎస్లో రెండున్నరేళ్లుగా రచ్చ సాగుతోంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి పోటీ చేసిన మహేందర్‌రెడ్డిపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రోహిత్‌రెడ్డి విజయం సాధించారు. ఆరు నెలల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత రోహిత్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఆరోజు నుంచి ఇరువర్గాల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంపై పట్టుసాధించేందుకు నేతలిద్దరూ సిద్ధమయ్యారు. పోటాపోటీగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సర్వాత్ర విమర్శలు.. తాండూరులో టీఆర్ఎస్ పార్టీ నేతల తీరుపై సర్వ త్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ టీఆర్ఎస్ బలంగా ఉంది. ఇద్దరు బలమైన నేతలు ఒకే పార్టీలో ఉండటం, ఇరువురికి పొసగక తరచూ గొడవలు జరగడంపై అధికార పార్టీ అభిమానులు, ప్రజలు విమర్శలు చేస్తున్నారు. -
మంత్రి మల్లారెడ్డి తీరుపై ఆగ్రహం.. సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తమపై అవాకులు చెవాకులు పేలుతూ గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఆయన కుమారుడు, మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. సంస్థాగత కమిటీల్లో మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, గ్రూపు రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నందున జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని శరత్ చంద్రారెడ్డి చెప్పారు. చదవండి: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం ఈ నేపథ్యంలో శుక్రవారం శాసనసభ ఆవరణలో మల్లారెడ్డి, సుధీర్‌రెడ్డి, శరత్‌లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను వేర్వేరుగా కలిశారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్ సూచించడంతోపాటు, ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత జిల్లా టీఆర్ఎస్ నేతలతో సమావేశమవుతానని కేసీఆర్ సర్దిచెప్పినట్లు సమాచారం. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారని, అందువల్ల తాను రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శరత్ చంద్రారెడ్డి వెల్లడించారు. కాగా అసెంబ్లీకి వచ్చిన శరత్ చంద్రారెడ్డికి విజిటర్ పాస్ లేకపోవడంతో పోలీసులు లోనికి అనుమతించలేదు. ఈ విషయం తెలుసుకున్న మల్లారెడ్డి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఆయనను లోనికి తీసుకెళ్లారు. చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి -
విజయనగరం టీడీపీలో ముదిరిన వర్గపోరు
సాక్షి, విజయనగరం: విజయనగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వర్గపోరు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వద్దకు వెళ్లింది. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, టీడీపీ కార్యకర్తలు బంగ్లా రాజకీయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల వేరేగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై అశోక్ గజపతిరాజు, ఆయన వర్గీయులు అధిష్టానానికి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశారు. అధిష్టానం నుంచి గాని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచిగానీ పార్టీ కార్యాలయం మూసివేయాలని ఆదేశాలు రాకపోవడంతో అశోక్ వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ విషయాన్ని వెలగపూడిలోనే అధినేత వద్దే తేల్చుకుందామని అశోక్ సూచనలతో నియోజకవర్గ నేతలు మంగళవారం విజయవాడకు బస్సు, కార్లలో బయలుదేరి వెళ్లారు. అధినేత అపాయింట్మెంట్ బుధవారం లభించడంతో వారు చంద్రబాబుతో భేటీ కానున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గీత కు అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నా యుడు లోపాయికారీగా మద్దతు అందిస్తున్నారని తెలుగు తమ్ముళ్లే గుసగుసలాడుకోవడం విశేషం. చదవండి: (అచ్చెన్నాయుడికి అక్కడ మాట్లాడే దమ్ముందా..?) టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడికి పరాభవం గుర్ల: తెలుగుదేశం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు పరాభావం ఎదురయ్యింది. అక్రమణదారుల కు మద్దతు తెలిపేందుకు వెళ్లిన ఆయనకు చేదు అనుభవం ఎ దురైంది. మండలంలోని చింతలపేటలో గ్రామకంఠం భూమి సర్వే నంబర్ 34, 36లో 22 సెంట్ల భూమిని టీడీపీ నేతలు అక్రమించుకున్నారు. ఆ స్థలంలో అధికారులు రైతు భరోసా కేంద్రం, పాలశీతలీకరణ కేంద్రం నిర్మించాలని నిర్ణయించారు. ఆ అభివృద్ధి పనులను టీడీపీ నేతలు అడ్డుకోవడంతో గ్రామంలో వివాదం నెలకొంది. నాగార్జున కారును అడ్డుకున్న చింతలపేట గ్రామస్తులు ఆ స్థలాన్ని అక్రమించిన అక్రమణదారులకు మద్దతు తెలిపేందుకు నాగార్జున మంగళవారం ఆ గ్రామానికి వచ్చారు. విషయం తెలుసుకు న్న గ్రామస్తులు ఆయన్ను అడ్డుకొని గ్రామంలో అభివృద్ది పనులను అడ్డుకుంటారా... పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే మీరెందుకు ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. కాసే పు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకొని నాగార్జునను, మండల టీడీపీ నేతలను పంపించేశారు. చదవండి: (ఈ తీర్పు అమరావతికీ వర్తిస్తుందా?!) -
కమలంలో కుమ్ములాట!
పేరుకే జాతీయ పార్టీ. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. జిల్లాలో మాత్రం చతికిలపడింది. కార్యకర్తలు పిడికెడే.. గ్రూపులు మాత్రం గంపెడు.. నిజాయితీగా పార్టీ కోసం పనిచేసేవారు కొందరు.. పబ్లిసిటీ కోసం ఫోజులు కొట్టేవారు మరికొందరు.. వీరికి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం.. విలువలు, విధివిధానాలు అవసరంలేదు.. నిత్యం టీవీలు, పత్రికల్లో కనిపించేందుకే పోటీ పడుతుంటారు.. ఎవరైనా కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఫొటో కోసం నిలబడి వెంటనే జారుకుంటారు. ఈ క్రమంలో నిజమైన కార్యకర్తలు మాత్రం గ్రూపు రాజకీయాల్లో నలిగిపోతున్నారు. ఎవరి వెంట నడిస్తే ఏం ముంచుకొస్తుందో అనే సందిగ్ధంలో అవస్థలు పడుతున్నారు. సాక్షి, తిరుపతి : జిల్లా బీజేపీలో వేళ్ల మీద లెక్కపెట్టగలిగే నాయకులు మాత్రమే ఉన్నారు. అయితే ఒక్కొక్కరిది ఒక్కో గ్రూపు. కార్యకర్తలను నాయకులుగా చెప్పుకునేవారు స్వప్రయోజనాలకే వాడుకుంటుంటారు. ముఖ్యంగా పబ్లిసిటీ బ్యాచ్‌లోని నేతలు ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంటారు. పార్టీ విధానాలతో పని లేకుండా టీడీపీ, జనసేన, కాంగ్రెస్ వారితోనూ సత్సంబంధాలు సాగిస్తుంటారు. ఇది చూసి నిజమైన కార్యకర్తలు ఎవరితో ఎలా మెలగాలో తెలియక జుట్టుపీక్కోవాల్సి వస్తోంది. రెండు రోజుల క్రితం జరిగిన సీఎం పర్యటనలో పబ్లిసిటీ బ్యాచ్ చేసిన రాద్ధాంతమే ఇందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా ఎలాంటి నిరసనలు చేయరాదని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి ఆదేశించారు. అయినా కొందరు స్థానిక నేతలు వినలేదు. పత్రికలు, టీవీలో పబ్లిసిటీ కోసం నానా హంగామా సృష్టించారు. ఈ క్రమంలో దయాకర్‌రెడ్డి తాము ఎలాంటి నిరసనలకు పిలుపు ఇవ్వలేదని ఓ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. లాబీయింగ్‌పైనే దృష్టి కొందరు ఘనులు బీజేపీ కీలక నేతలు, కేంద్రమంత్రులు, రాష్ట్ర పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కలరింగ్ ఇస్తుంటారు. ఆయా ముఖ్యనేతలు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు వీరే ముందుండి హడావుడి చేస్తుంటారు. తిరుపతి, శ్రీకాళహస్తి నుంచి లాబీయింగ్ చేసే ఆ నాయకులకు ఒకరంటే ఒకరికి పడదు. ఎప్పటికప్పుడు అధిష్టానానికి పరస్పరం ఫిర్యాదు చేసుకుంటుంటారు. ‘నా వల్లే నీకు గుర్తింపు వచ్చింది’ అని ఒకరంటే.. ‘లేదు లేదు నా వల్లే నీ రాజకీయ మనుగడ సాగుతోంది’ అని మరొకరు విమర్శలు చేసుకుంటుంటారు. వీరెవరూ నిజాయితీగా పార్టీ కోసం పనిచేసేవారు కాదని కార్యకర్తలే విమర్శిస్తున్నారు. వీరిలో ఇద్దరు నాయకులు సెటిల్మెంట్లలో ఆరితేరినట్లు ఆరోపిస్తున్నారు. తమకు కేంద్రమంత్రి బాగా తెలుసని, ఏపనైనా చేసిపెడతామని చెప్పి వ్యవహారాలు నడిపినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పలువురు అధికారులను సైతం బెదిరించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పబ్లిసిటీ బ్యాచ్ స్వప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెట్టేస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘గద్వాల’ గులాబీలో వర్గపోరు
సాక్షి, మహబూబ్‌నగర్: గద్వాల అధికార టీఆర్ఎస్ స్వపక్షంలోనే మరో విపక్షం పుట్టికొచ్చిందా? గత కొన్నాళ్లుగా స్థానిక ఎమెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి.. మంత్రి నిరంజన్‌రెడ్డి మధ్య సాగుతోన్న వర్గపోరు తారా స్థాయికి చేరుకుందా? అవుననే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. గద్వాలలో మంత్రి ప్రమేయం పెరిగిందని, స్థానికంగా ఆయనకు అనుకూలంగా మరో వర్గాన్ని తయారు చేస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే క్రమంలో తాజాగా ఎమ్మెల్యే సైతం అనూహ్యంగా తన వ్యక్తిగత భద్రత సిబ్బందిని ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే వ్యక్తిగత కారణాలతోనే భద్రత సిబ్బందిని ఉపసంహరించుకున్నానని ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ మంత్రి ప్రమేయమే కారణమని గులాబీ శ్రేణులు అంటున్నాయి. ఇటీవల జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులందరూ ఓ చోట సమావేశమై.. విందు చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఎమ్మెల్యే కలత చెందారని ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తన అంగరక్షకులను ఉపసంహరించుకున్నారని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గద్వాల టీఆర్ఎస్లో కొనసాగుతోన్న వర్గపోరు అధిష్టానం దృష్టికి వెళ్లింది. పరిస్థితి ఇలానే ఉంటే దాని ప్రభావం త్వరలోనే జరగనున్న ‘పుర’ పోరు ఫలితాలపై పడుతుందని భావించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అంగరక్షకులను ఉపసంహరించుకున్న విషయం తెలుసుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. వెంటనే హైదరాబాద్‌కు రావాలని ఆదేశించడంతో ఆయన హుటాహుటీనా బయల్దేరి వెళ్లారు. వర్గపోరే కారణామా? మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి నిరంజన్‌రెడ్డి గతంలోనే రెండు వర్గాలుగా విడిపోయింది బహిరంగ రహస్యమే. 2014 ఎన్నికల్లో గెలిచిన కృష్ణారావు మంత్రిగా ఉన్న సమయంలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆయనకు సన్నిహితంగా ఉన్నారు. దీంతో బండ్లకు కృష్ణారావు వర్గీయుడిగా పేరు పడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జూపల్లి ఓడిపోయారు. అదే సమయంలో వనపర్తి నుంచి గెలిచిన నిరంజన్‌రెడ్డికి అనూహ్యంగా వ్యవసాయశాఖ మంత్రి దక్కింది. దీంతో మంత్రి నిరంజన్‌రెడ్డి.. జూపల్లిపై ఉన్న వ్యతిరేకతతోనే.. ఆయన వర్గీయుడైన బండ్లకు ప్రత్యామ్నాయంగా గద్వాలలో మరో వర్గాన్ని తయారు చేస్తున్నారనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది. ఫలితంగా గత వారం జిల్లాకేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపనకు మంత్రి నిరంజన్‌రెడ్డి రావడంపై ఎమ్మెల్యే అయిష్టత వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలో మంత్రి కూడా కనీసం అరగంట కూడా గద్వాలలో గడపలేదు. మరోపక్క.. మంత్రి గద్వాలలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా నూతన జెడ్పీ చైర్పర్సన్ సరితకు, ఆమె వర్గానికి మంత్రి నిరంజన్‌రెడ్డి అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. -
పాయకరవుపేటలో తారాస్థాయికి చేరిన టీడీపీ వర్గ విభేదాలు
-
చంద్రబాబుపై సెటైర్ వేసిన జేసీ
సాక్షి, అనంతపురం: అధికార టీడీపీలో మరోసారి గ్రూపు రాజకీయాలు తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీ ప్రయోజనాలు పట్టించుకోకుండా స్వలాభాల కోసం కొందరు నాయకులు పనిచేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు పలు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో గ్రూపు రాజకీయాలు, కుటుంబపాలనను ప్రోత్సహిస్తున్న నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీకి చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులకు పెత్తనం కట్టబెట్టడంపై అభ్యంతరం తెలుపుతూ.. పరోక్షంగా మంత్రి పరిటాల సునీతకు చురకలు అంటించారు. సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తానని, పార్టీకు అనుగుణంగా నాయకులు నడుచుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. అందరూ కలసికట్టుగా పనిచేయాలని లేకుంటే సీనియర్లనైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై జేసీ దివాకర్ రెడ్డి సెటైర్ వేశారు. తమకు చెప్పిన సూత్రాలు, సూచనలను చంద్రబాబు ఫాలో అవుతారా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. -
కాంగ్రెస్‌లో కొనసాగుతున్న గ్రూపు రాజకీయాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్ రాజకీయాలు ఆ పార్టీ శ్రేణులకే అంతుచిక్కడం లేదు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ను మట్టి కరిపించేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామని కాంగ్రెస్ పెద్దలు పదే పదే చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అది కానరావడం లేదు. అతి కీలకమైన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు స్పష్టంగా వెలుగుచూశాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో జైపాల్‌రెడ్డి వర్గం పూర్తిగా దూరంగా ఉండడంతో పాటు... ఆయన వర్గీయులుగా పేరు పడిన వారి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించలేదు. ఇటీవల మూడు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ప్రచారం మాజీ మంత్రి డీకే.అరుణ ఆధ్వర్యాన నడిపించారు. ప్రచార కార్యక్రమంలో జైపాల్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, చిన్నారెడ్డి పాల్గొనకపోవడం కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. గెలుపే లక్ష్యంగా.. రాష్ట్రంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నట్లు పలు సర్వేల్లో వెల్లడైనట్లు చెబుతారు. పలు నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం, కేడర్ ఉండడంతో పార్టీ పటిష్టంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత ఎన్నికల సందర్భంగా కూడా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ హవా వీచినా... పాలమూరులో మాత్రం గట్టి పోటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో మరోసారి గట్టి పోటీ ఇచ్చి మెరుగైన స్థానాలు గెలుపొందాలని భావిస్తోంది. అందులో భాగంగా సీట్ల అంశంకొలిక్కి రాకపోయినా సరే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. అంతేకాదు ఆయా నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేస్తూ కాంగ్రెస్ కేడర్‌లో జోష్ నింపేందుకు యత్నించారు. బట్టబయలైన గ్రూపులు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరులోని గ్రూపులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే జిల్లాలో సీనియర్ నేతలు డీకే అరుణ, జైపాల్‌రెడ్డి రెండు వర్గాలు విడిపోగా.. మిగిలిన నేతలు కూడా చీలిపోయి వేర్వేరుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం పలు సందర్భాల్లో బహిర్గతం కాగా.. తాజా ఎన్నికల ప్రచారంలోనూ అదే ఒరవడి కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సాగిన ప్రచారానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డితో పాటు చిన్నారెడ్డి, రేవంత్‌రెడ్డి పూర్తి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగిన ప్రచారంలో పాల్గొంటారని పలువురు చెప్పినా... ఆయన మాత్రం దూరంగా ఉన్నారు. అంతేకాదు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న జి.చిన్నారెడ్డి సైతం ప్రచారం విషయంలో తనకేమీ పట్టనట్లు వ్యవహరించారు. ఇక రేవంత్‌రెడ్డి సైతం మూడు రోజుల ప్రచారంలో ఏ ఒక్క రోజు కూడా పాల్గొనలేదు. అంతేకాదు ఒకవైపు సొంత జిల్లాలో ఎన్నికల ప్రచారం జరుగుతుంటే రేవంత్ మాత్రం... నిజామాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లో చేపట్టిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం. ఆ నియోజకవర్గాలకు దూరం.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ప్రచారం తీరుపైనా ఉమ్మడి జిల్లాలో చర్చ జరుగుతోంది. మొత్తం 14 నియోజకవర్గాలకు గాను షాద్‌నగర్ పూర్తిగా రంగారెడ్డి జిల్లాలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో 13 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించాల్సి ఉండగా... కేవలం 9 నియోజకవర్గాల్లో మాత్రమే సాగింది. ఇందులో నాగర్‌కర్నూల్‌లో మాత్రం నాగం జనార్ధన్‌రెడ్డి పెద్ద కుమారుడు మృతి కారణంగా వాయిదా వేశారు. ఇక మిగిలిన మూడింట్లో ప్రచార రథం అడుగుపెట్టకపోవడం కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్, మరో ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి నియోజకవర్గమైన కల్వకుర్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు. వనపర్తి నియోజకవర్గానికి పక్కనే ఉండే దేవరకద్ర, కొల్లాపూర్‌లో ఎన్నికల ప్రచారం జరిగినా.. చిన్నారెడ్డి నియోజకవర్గంలో మాత్రం అడుగుపెట్టలేదు. అలాగే రేవంత్ విషయంలో అలాగే జరిగింది. ఇక కల్వకుర్తి ఎన్నికల ప్రచారంలో అనేక ట్విస్ట్‌లు నెలకొన్నాయి. మొదట్లో కల్వకుర్తిలో రోడ్డుషోలు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. కానీ ఆఖరి క్షణంలో వంశీచంద్‌రెడ్డి రద్దు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి అందుబాటులో లేరన్న ఒకే కారణంతో కల్వకుర్తిలో ప్రచారాన్ని నిలిపేయడాన్ని బట్టి చూస్తే పార్టీలో గ్రూపు తగాదాలు ఏ మేరకు కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. -
ఎవరికి వారే..!
సాక్షి, జనగామ: జిల్లాలోని కాంగ్రెస్ నాయకుల్లో సమన్వయం కరువైందని కార్యకర్తలు పేర్కొంటున్నారు. నాయకులు పోటాపోటీగా ప్రజలను కలవడానికి ప్రయత్నిస్తుండడంతో వారు అయోమయానికి గురవుతున్నారు. సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో నాయకులు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం మినహా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్యనే పోటీ నెలకొంది. జనగామ నియోజకవర్గంలో పట్టు కోసం మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జనగామ అంతర్భాగంగా ఉంది. 2009–14 మధ్య కాలంలో భువనగిరి ఎంపీగా రాజగోపాల్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. ఎంపీగా ఉన్న సమయంలో జనగామ ప్రాంతంలో ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికి రాజగోపాల్‌రెడ్డి సొంత క్యాడర్‌ను కలిగి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటారనే పేరున్న రాజగోపాల్‌రెడ్డి ఇటీవల జనగామలో పర్యటించారు. అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు దంపతుల కుటుంబాన్ని సిద్ధంకిలో పరామర్శించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనే జనగామలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని వ్యాఖ్యానించారు. రాజగోపాల్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. జనగామ నుంచి 2019లో జరుగనున్న ఎన్నికల్లో ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మీని బరిలోకి దించే ఆలోచన చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 2009 ఎన్నికల్లో భర్త రాజగోపాల్‌రెడ్డి గెలుపు కోసం ఈ ప్రాంతంలో ఆమె స్వయంగా ప్రచారం నిర్వహించారు. ప్రచార సరళిలో ఆమె ప్రజలను విశేషంగా ఆకర్షించారు. ప్రజలకు పరిచయం ఉండడంతో టికెట్‌ను ఆశిస్తున్నట్లు కొమటిరెడ్డి వర్గీయులు చెబుతుండడం గమనార్హం. ఘన్‌పూర్‌లో మూడు ముక్కలాట.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలాటగా మారింది. మాజీ మంత్రి జి.విజయరామారావు, బి.ఆరోగ్యం, సిం గపురం ఇందిర మూడు వర్గాలుగా విడిపోయారు. ముగ్గురు నేతలు ఎవరికి వారుగా వర్గాలు విడిపోయి ప్రజలను కలుస్తున్నారు. ముగ్గురు టికెట్ల ను ఆశిస్తూ సొంత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నా రు. అయితే కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు ముందు టీపీసీసీ నియోజకవర్గ సభ్యులుగా జి.విజయరామారావు, గంగా రపు అమృతరావును నియమించింది. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో బస్సు యాత్ర నియోజకవర్గంలో కొనసాగినా ఎలాంటి కార్యక్రమాలను చేపట్టలేదు. కనీసం రోడ్ షోను సైతం చేపట్టక పోవడంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. యాత్రను ప్రజల చైతన్యవంతం కోసం ఉపయోగించుకోవడంలో స్థానిక నాయకులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పొన్నాలపై ఏఐసీసీ కార్యదర్శికి ఫిర్యాదు.. ఇటీవల భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ సమావేశంలో జనగామ నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు పొన్నాల లక్ష్మయ్యపైనే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. 2014 సాధారణ ఎన్నికల తర్వాత నుంచి పొన్నాల కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఈ నెల 17వ తేదీన జరిగిన పార్టీ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శికి విన్నవించారు. దీంతో ఆ పార్టీలోని అంతర్గత కలహాలు బహిర్గతమయ్యాయి. కానీ, జనగామ నుంచి పొన్నాల నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు పర్యాయాలు కేబినెట్ మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో మంచి మేధావిగా, బీసీ నేతగా గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీలో జనగామ అనగానే పొన్నాల అనే స్థాయిలో పేరుంది. అయితే పొన్నాల, కోమటిరెడ్డి ఒకే పార్టీ అయినా వేర్వేరుగా పర్యటనలు చేయడం రాజకీయ చర్చకు దారితీస్తోంది. పాలకుర్తిలో గ్రూపులకుతావివ్వకుండా.. పాలకుర్తి నియోజకవర్గంలో జంగా రాఘవరెడ్డి మాత్రమే ఎలాంటి గ్రూపులకు తావివ్వకుండా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నిత్యం అందుబాటులో ఉంటూ కార్యకర్తలను సమన్వయం చేస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల మధ్యలో ఎండగడుతూనే నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఏప్రిల్‌లో పాలకుర్తిలో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రను సక్సెస్ చేయడంతో జంగాకు అధిష్టానం నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇటీవల రైతు దీక్ష సందర్భగా పాలకుర్తి నుంచి జనగామ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలను ఆకర్షించారు. -
షరతుల చిచ్చు!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వ్యవహారం జిల్లా టీడీపీలో చిచ్చు రేపింది. వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలంటే యర్రగొండపాలెం, కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మార్కాపురం ఇన్చార్జిని తప్పించాల్సిందేనని ఆయన సీఎం వద్ద పంచాయితీ పెట్టారు. మాగుంట ప్రతిపాదనకు సీఎం సైతం ఓకే చెప్పారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పునకు కసరత్తు మొదలైంది. దీంతో ఎమ్మెల్సీ మాగుంటపై బాధిత సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కొందరు నియోజకవర్గ ఇన్చార్జులు మండిపడుతున్నారు. ఇది జిల్లా టీడీపీలో వర్గ విభేధాలను మరింత పెంచింది. మాగుంటకు బాబు బుజ్జగింపు.. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటికే అధికార టీడీపీ వెనుకబడిపోయింది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులురెడ్డి ఓటమి చెందారు. పశ్చిమ ప్రకాశంలో వైఎస్సార్ సీపీకి తిరుగులేని ఆదరణ ఉంది. అన్ని వర్గాలు ఆ పార్టీకి మద్దతు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవరూ ముందకు రాని పరిస్థితి. దీంతో తిరిగి మాగుంటను పోటీ చేయిస్తే కొంతమేరైనా పోటీ ఇస్తాడని సీఎం భావించారు. మంత్రి పదవి ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ మాగుంటను సీఎం బుజ్జగించారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేయాలని, తాను అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని మాగుంటకు హామీ ఇచ్చారు. సీఎం ఒత్తిడితో మాగుంట అంగీకారం తెలిపినట్లు సమాచారం. షరతులకు సీఎం అంగీకారం.. తాను పోటీ చేయాలంటే పార్లమెంటు పరిధిలో టీడీపీలో భారీ మార్పులు చేయాలని మాగుంట సీఎం వద్ద ఆంక్షలు పెట్టారు. ప్రధానంగా కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, యర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యే డేవిడ్‌రాజులను మార్చి కొత్త అభ్యర్థులకు అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలని షరతు పెట్టారు. కనిగిరి నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేకు టిక్కెట్ ఇవ్వాలంటూ మాగుంట కండిషన్ పెట్టారు. ఇక యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఓ ఐఏఎస్ అధికారిని తానే తీసుకొచ్చి పోటీకి నిలుపుతానని మాగుంట చెప్పినట్లు సమాచారం. ఇక మార్కాపురం ఇన్చార్జిగా ఉన్న కందుల నారాయణరెడ్డికి కాకుండా వేరొక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వాలని మాగుంట డిమాండ్ చేశారు. దర్శి నియోజకవర్గం నుంచి కూడా మంత్రి శిద్దా రాఘవరావును తప్పించే పక్షంలో ఎమ్మెల్సీ కరణం బలరాం కుటుంబానికి చెందిన వ్యక్తిని అక్కడి నుంచి పోటీ చేయించాలని సూచించినట్లు సమాచారం. మాగుంట షరతులకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. మార్పు చేర్పులకు కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని కొత్త అభ్యర్థుల విజయానికి సహకరించాలని, మీకు తగిన న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కనిగిరి, యర్రగొండపాలెం ఎమ్మెల్యేలతో పాటు మార్కాపురం ఇన్చార్జి కందుల నారాయణరెడ్డికి కూడా చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్సీపై ఫైర్.. వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్లు ఇవ్వవద్దంటూ ముఖ్యమంత్రికి చెప్పడంపై కనిగిరి, వై.పాలెం ఎమ్మెల్యేలె బాబూరావు, డేవిడ్‌రాజు, మార్కాపురం ఇన్చార్జ్ కందుల నారాయరెడ్డిలు మాగుంటపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న తమను తప్పించడమేమిటంటూ వారు మంత్రి శిద్దా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, సీనియర్ నేత ఎమ్మెల్సీ కరణం బలరాం తదితరుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. తమను కాదని వేరొకరికి అసెంబ్లీ టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని వారు రాష్ట్ర స్థాయి టీడీపీ ముఖ్య నేతలకు సైతం తేల్చి చెప్పారు. తనకు టికెట్ రాకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆరు నూరైనా తానే వచ్చే ఎన్నికల్లో కనిగిరి నుంచి పోటీ చేస్తానని బాబూరావు ఇప్పటికే సవాల్ విసురుతున్నట్లు తెలుస్తోంది. కాదూ కూడదని కొత్త అభ్యర్థిని పోటీలో నిలిపితే తాను వ్యతిరేకంగా పనిచేస్తానంటూ పార్టీ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇక డేవిడ్ రాజు సైతం వచ్చే ఎన్నికల్లో యర్రగొండపాలెం కాకపోయినా జిల్లాలో వేరొక చోటైనా తనకు టిక్కెట్ ఇస్తేనే పార్టీ అభ్యర్థుల విజయానికి పనిచేస్తానని, అలా కాకుండా తనను వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పిస్తే యర్రగొండపాలెం, సంతనూతలపాడులో టీడీపీ అభ్యర్థుల ఓటమికి పనిచేస్తానని హెచ్చరించినట్లు తెలుస్తోంది. మార్కాపురం నియోజకవర్గంలో ఇన్నాళ్లూ పార్టీకోసం పనిచేసిన తనను కాదని వేరొకరికి టికెట్ ఇవ్వాలనుకోవడంపై కందుల నారాయణరెడ్డి మండిపడుతున్నట్లు సమాచారం. మాగుంట ఒత్తిడితోనే టీడీపీ అధిష్టానం అభ్యర్థుల మార్పుకు సిద్ధపడిందన్న ప్రచారం నేపథ్యంలో బాధిత నేతలు అధిష్టానంతో పాటు మాగుంట పైనా రగిలిపోతున్నారు. ఇప్పటికే జిల్లాలో గ్రూపుల గోలతో సతమతమవుతున్న టీడీపీని మాగుంట తాజా డిమాండ్ల వ్యవహారం మరింత ఇరకాటంలోకి నెట్టింది. -
బద్వేలు టీడీపీలో బహిర్గతమైన వర్గపోరు
-
మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం..
సాక్షి, బద్వేలు: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తార స్థాయికి చేరింది. నియోజకవర్గంలో పార్టీ నాయకుల మధ్య ఉన్న గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. గత కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు, ఎమ్మెల్యే జయరాములు విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో విజయమ్మపై ఆయన మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఉండగా, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నారు. జిల్లా స్థాయి నాయకులు సైతం కుల వివక్ష చూపుతూ ఎస్సీలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. పార్టీని నమ్మి టీడీపీ కండువా వేసుకుంటే, ఎస్సీ ఎమ్మెల్యే అని అగ్రవర్గాలవారు అణగదొక్కే యత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనపై జరుగుతున్న అన్యాయాలపై అధిష్టానం వెంటనే స్పందించపోతే ఏ ప్రభుత్వ కార్యకలాపాలలో పాల్గొనని ఆయన హెచ్చరించారు. లేకుంటే నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌లతో కలిసి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ఆయన వెల్లడించారు. -
తాడిపత్రిలో ముదురుతున్న టీడీపీ గ్రూపు రాజకీయాలు
-
ఈ రక్తపాతానికి బాధ్యులెవరు?
తిరువనంతపురం: ఇక్కడికి సరిగ్గా 20 కిలోమీటర్ల దూరంలో ఉంది కల్లమ్‌పల్లి. ఊర్లోకి అడుగుపెట్టగానే ఎవరికో నివాళిగా విద్యుత్ స్తంభాలకు నల్ల జెండాలు కనిపిస్తాయి. పక్కనే గోడల మీద 34 ఏళ్ల ఎస్ఎల్ రాజేష్‌కు నివాళి అర్పిస్తూ పోస్టర్లు అతికించి ఉన్నాయి. కల్లమ్‌పల్లి ఆరెస్సెస్ వార్డు శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న రాజేష్‌ను జూలై 29వ తేదీన 12 మంది సభ్యుల బృందం నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపింది. ఆయన ఒంటిపై 83 గాయాలను పోలీసులు గుర్తించారు. అలా నల్లజెండా, ఓ పోస్టర్ అతికించిన గోడకు సమీపంలో తెలుపు, నీలి రంగులో కనిపించే ఓ ఇంటిలో తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలతో రాజేష్ నివసించేవాడు. ఆ ఇంటికి ఓ మూలన విషాధ వదనంతో రాజేష్ తండ్రి సుదర్శన్ కూర్చొని ఉన్నారు. ఆయన్ని మీడియా వెళ్లి పలకరించగా ‘నా కుమారుడి చేతులను హంతకులు ముక్కలు ముక్కలుగా నరికేశారు. ప్రాణాపాయం స్థితిలో ఉన్న నా కుమారుడిని ఆస్పత్రికి తరలించేందుకు, వాడి అవయవాలను పట్టుకెళ్లేందుకు పోలీసులకు దుప్పట్లు కావాల్సి వచ్చింది. ముక్కలు, ముక్కలుగా తెగిన చేతులతో అప్పుడు మా వాడు ఎంత నరకం అనుభవించాడో చెప్పలేను’ అంటూ కన్నీరు మున్నీరయ్యారు. ‘నా కుమారుడు చిన్న వయస్సులో ఇంటి బరువు బాధ్యతలు నెత్తికెత్తుకున్నారు. నేను చాలా ఏళ్లపాటు సౌదీ అరేబియాలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేశాను. కానీ పెద్దగా సంపాదించలేకపోయాను. నా పరిస్థితిని అర్థం చేసుకున్న రాజేష్ తన మాధ్యమిక విద్యాభ్యాసం ముగియగానే ఇంటిల్లి పాదిని పోషించడానికి పనిలో స్థిరపడ్డారు’ అని చెప్పిన ఆ 60 ఏళ్ల వద్ధుడు వెక్కివెక్కి ఏడిస్తూ ఇంకేమీ మాట్లాడలేక పోయారు. ఆ ఇంట్లో మరో గదిలో రాజేష్ భార్య ఇద్దరు చిన్న పిల్లలను పట్టుకొని శూన్యంలోకి చూస్తూ కూర్చొని ఉంది. మీడియా ప్రతినిధులెవరూ ఆమెను పలకరించేందుకు సాహసించలేదు. బయట వేసిన టెంట్ కింద 30 మంది ఆరెస్సెస్ కార్యకర్తలు కూర్చొని ఉన్నారు. వారంతా రాజేష్ హత్య గురించే మాట్లాడుకుంటున్నారని తెలుస్తోంది. బయటకు వినిపించకుండా గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. రాజేష్ హత్యకు దారితీసిన పరిస్థితులు సంఘ్ పరివార్, పాలకపక్షమైన సీపీఎం పార్టీ విద్యార్థి విభాగం మధ్య జూలై 18వ తేదీన తలెత్తిన ఉద్రిక్తతలే రాజేష్ హత్యకు దారితీశాయి. భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న అఖిల భారత విద్యార్థి పరిషద్ విద్యార్థులు సిటీ కాలేజీకి వెళ్లి కాలేజీ ఆవరణలోని ఎస్ఎఫ్ఐ విద్యార్థుల జెండాలను కూల్చేశారు. జూలై 24వ తేదీన ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ర్యాలీగా కాలేజీకి వెళ్లి కొత్తగా మరో పది జెండాలను ఎగురవేశారు. దీంతో రెండు విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సీపీఎం కార్యకర్తలు జూలై 28వ తేదీన బీజేపీ రాష్ట్రపార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఆ సమయంలో కార్యాలయంలోఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మనం రాజశేఖరన్ దాడి నుంచి తప్పించుకొని పారిపోయారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే బీజేపీ, ఏబీవీపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు ఓ బృందంగా ఏర్పడి కేరళ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకష్ణన్ కుమారుడి ఇంటిపై దాడి చేశారు. బీభత్సం సష్టించారు. ఆయన కుమారుడు గాయాలతో బయట పడినట్లు తెల్సింది. ఆ మరుసటి రోజు, అంటే జూలై 29వ తేదీన రాత్రి 8.45 గంటలకు దళితుడైన రాజేష్ శాఖా కార్యక్రమం ముగించుకొని ఇంటికి వస్తుండగా 12 మంది సభ్యులుగల బృందం ఆయనపై దాడి చేసింది. తీవ్ర గాయాలతో ఆయన ఆస్పత్రిలో మరణించారు. సీపీఎం నాయకులే ఈ హత్యకు కుట్రపన్ని అమలు చేశారని సంఘ్ పరివార్ సభ్యులు ఆరోపించారు. ఆ మరుసటి రోజు జూలై 30వ తేదీన సీపీఎం నాయకుడు బాలకృష్ణన్, తిరువనంతపురంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి హత్యను ఖండించారు. ఆ హత్యతో సీపీఎంకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 31వ తేదీన రాజేష్ హత్య కేసులో మొత్తం 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న మణికుట్టన్ ఉన్నారు. ఆయన ఇంతకుముందు రెండుసార్లు జైలుకెళ్లి వచ్చిన రౌడీ షీటర్. మిగిలిన వారిలో ఇద్దరికి మాత్రమే సీపీఎంతో సంబంధాలు ఉన్నాయి. వారిలో ఒకరు సీపీఎంకు అనుబంధమైన సీఐటీయు క్రియాశీలక సభ్యుడుకాగా, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా క్రియాశీలక సభ్యుడు మరొకరు. బీజేపీ, సీపీఎం పార్టీల మధ్య తలెత్తిన ఘర్షణ పరిస్థితులే రాజేష్ హత్యకు దారితీశాయని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. కేరళలో రాజకీయ హింసాకాండ కొనసాగడం ఇప్పుడే కొత్తకాదు. కొన్ని దశాబ్దాలుగా బీజేపీ, వామపక్ష పార్టీలకు మధ్య హత్యలు, ప్రతీకార హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతకుముందు కన్నూర్ జిల్లాలో ఎక్కువగా జరిగేవి. ఉత్తర కేరళాకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఇప్పుడు రాజధాని పరిసర ప్రాంతాలకు కూడా విస్తరించాయి. కేరళలో 9.8 శాతం మంది దళితులు ఉన్నారు. మొదటి నుంచి సీపీఎం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంటూ వస్తోంది. కల్లమ్పల్లిలో కూడా దళితులే ఎక్కువగా నివసిస్తున్నారు. వారిపై సీపీఎం ప్రభావమే ఎక్కువగా ఉంది. వారిపై పట్టు సాధించేందుకు బీజేపీ ఇప్పుడిప్పుడే కషి చేస్తోంది. బీజేపీ ప్రోద్బలంతో రాజీష్ గత ఫిబ్రవరి నెలలోనే అక్కడ ఆరెస్సెస్ శాఖను ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే దళిత యువత ఆరెస్సెస్ శాఖకు ఆకర్షితులవుతున్నారు. ఈ కారణంగానే ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, అవి ఘర్షణలకు దారితీస్తున్నాయని తిరువనంతపురంలో ‘దళిత్ రైట్స్ అకాడమిక్ రీసర్చ్ ఇన్షియేటివ్’ సంస్థ డైరెక్టర్ వీబీ అజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఏ పార్టీ ప్రాబల్యం కోసం ప్రయత్నించినా సామాజిక అభివృద్ధికి నోచుకోని దళితులే బలవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
టీడీపీకి సన్‌స్ట్రోక్
► వచ్చే ఎన్నికల్లో చోడవరం నుంచి పోటీ చేస్తా ► బాంబు పేల్చిన మంత్రి గంటా తనయుడు ► ఇక్కడే రాజకీయం చేస్తానని ఎమ్మెల్యే రాజు కౌంటర్ ► రవితేజ వ్యాఖ్యలపై తీవ్ర అసహనం ► గంటాకు ప్రత్యేక వర్గం ఉండటంతో లోలోన కలవరం ► అధికార టీడీపీలో సరికొత్త రాజకీయం సినీరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మంత్రి గంటా తనయుడు రవితేజ రాజకీయ వ్యాఖ్యలు.. దానికి చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ఇచ్చిన కౌంటర్ టీడీపీలో కలకలం రేపుతున్నాయి. మంత్రి గంటాను ఇరకాటంలోకి నెట్టాయి.. చోడవరం నియోజకవర్గంలో చిచ్చు రగిల్చాయి. సాక్షి, విశాఖపట్నం: ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది అధికార టీడీపీలో సీట్ల గోల. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగానే సమయమున్నా.. ఆ సీటు నాది.. ఈ సీటు నాది అంటూ ఇప్పటినుంచే నేతలు, వారి వారసులు కర్చీఫ్‌లు వేసేస్తున్నారు. తెరంగేట్రం చేసి సినీరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు వారసుడు రవితేజ.. అక్కడితో ఆగకుండా రాజకీయాల్లోకి వస్తున్నట్టు చేసిన ప్రకటన అధికార పార్టీలో చిచ్చు రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని ఆయన మీడియా ముందే బయటపడటంతో చోడవరం టీడీపీలో ముసలం ఏర్పడింది. గతంలో గంటా చోడవరం ఎమ్మెల్యేగా ఉండటం.. ఆయనకంటూ అనుచర వర్గం ఉండడంతో.. సిటింగ్ టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు వర్గీయుల్లో కలవరం మొదలైంది.ఎవరికి టికెట్ ఇచ్చినా నాకు అభ్యంతరం లేదని ఎమ్మెల్యే రాజు పైకి చెబుతున్నా.. అంతర్గత చర్చల్లో తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆర్నెల్ల క్రితం తండ్రి సరిగ్గా ఆర్నెల్ల క్రితం గౌరీ మహోత్సవాల సందర్భంగా అనకాపల్లి వెళ్లిన మంత్రి గంటా శ్రీనివాసరావు రానున్న ఎన్నికల్లో తాను అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు తావిచ్చాయి. ఎంపీగా పీలా గోవింద్.. ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తామని ఎంపీ అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ‘గతంలో ఇక్కడ నుంచే పోటీ చేశా? కాబట్టి మరోసారి ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలనుకుంటున్నా’ అని మంత్రి గంటా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు మింగుడుపడని స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద్ ‘అబ్బే అదేం లేదు.. మళ్లీ నేనే ఇక్కడి నుంచి పోటీ చేస్తాను’ అని కౌంటర్ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు తనయుడు.. తాను నటించిన జయదేవ్ చిత్రం విజయాన్ని కాంక్షిస్తూ చోడవరంలోని స్వయం భూ వినాయకుని ఆలయంలో గురువారం పార్టీ నేతలతో కలిసి రవితేజ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడే మీడియాతో చిత్ర విశేషాలు చెబుతూ.. తన రాజకీయ ఆకాంక్షను కూడా బయటపెట్టేశారు. ‘నా తండ్రిని ఆదరించిన చోడవరం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని చెప్పుకొచ్చారు. స్వయంభూ వినాయకుని సన్ని« దిలో వెల్లడించినందున రవితేజ ఆకాంక్ష తప్పకుండా నెరవేరుతుందని పక్కనే ఉన్న పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. గతంలో చోడవరం ఎమ్మెల్యేగా పని చేయడంతో గంటా శ్రీనివాసరావుకు ఇక్కడ ప్రత్యేకంగా అనుచరవర్గం ఉంది. రవి వ్యాఖ్యలు వీరిలో ఉత్సాహాన్ని నింపగా.. సిటింగ్ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు వర్గీయుల్లో అలజడి, ఆగ్రహం రేపాయి. ఆయన నటించిన సినిమా ఇంకా విడుదలే కాలేదు. అప్పుడే తానేదో గొప్ప హీరోనైనట్టు.. ఆ దన్నుతో రాజకీయాల్లో రాణించేస్తానని భ్రమపడుతున్నారని మండిపడుతున్నారు. కాగా దీనిపై ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు చోడవరంలోనే రాజకీయాలు చేస్తానని నర్మగర్భంగా తన అంతరంగాన్ని వెల్లడించడం.. టీడీపీలో వేడి పుట్టించింది. ‘రాజకీయాల్లోకి వస్తా.. తలరాత బాగుంటే వచ్చే ఎన్నికల్లోనే బరిలోకి దిగుతా. నాకు ఎంతో ఇష్టమైన చోడవరం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉంది. నాన్న లాగే నన్ను ఆదరిస్తారన్న ఆశపడుతున్నా.’ – రవితేజ, మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు చోడవరం వదిలిపోయే ప్రసక్తే లేదు నేను పుట్టింది.. పెరిగింది.. రాజకీయాలు చేస్తున్నది.. అంతా చోడవరంలోనే. మళ్లీ టికెట్ ఇస్తే ఇక్కడే పోటీ చేస్తా. కాదని ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు. నేను మాత్రం ఇక్కడే ఉండి రాజకీయాలు చేస్తా. –కేఎస్ఎన్ రాజు, టీడీపీ ఎమ్మెల్యే చోడవరం -
అధికార పార్టీలో కుమ్ములాటలు
కనగానపల్లి (రాప్తాడు) : అధికార తెలుగుదేశం పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య గ్రూపు తగాదాలు, కుమ్ములాటలు రోజూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గం రాప్తాడులో ఇవి మరింత ఎక్కువగా ఉన్నాయి. నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో టీడీపీ మండల నూతన కమిటీలను ఏర్పాటు చేసేందుకు పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రతి మండలం, గ్రామంలో రెండు, మూడు గ్రూపులుగా విడిపోయిన పార్టీ నాయకులు ఈ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నిక చేయలేకపోతున్నారు. దీంతో పాటు పార్టీ కమిటీల ఎంపికలో కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మండల ఇన్‌చార్జ్‌ల అభిప్రాయాలకే విలువ ఇస్తుండటంతో చాలా చోట్ల నాయకులు, కార్యకర్తల్లో అసమ్మతి నెలకొంటోంది. రాప్తాడులో ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్‌కు చెక్ పెట్టేందుకు టీడీపీ మండల ఇన్చార్జ్ మురళీ ఎంపీపీ అసమ్మతి వర్గానికి చెందిన వారికి మండల కన్వీనర్ పదవిని కట్టబెట్టారని తెలుస్తోంది. దీంతో ఎంపీపీతో పాటు పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు దీనిపై అసమ్మతిగా ఉన్నారు. అలాగే మండలంలోని హంపాపురం, గొందిరెడ్డిపల్లి, రాప్తాడు, హంపాపురం, మారూరు గ్రామాల్లో టీడీపీ గ్రూపు రాజకీయాలు ఎక్కువగా నడుస్తున్నాయి. దీంతో టీడీపీ మండల కమిటీని నియమించటంలో పార్టీ నాయకులు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. కనగానపల్లి మండలంలో మాజీ ఎంíపీపీ రాజేంద్రను పదవి నుంచి తొలగించినపుడు కురుబ సామాజిక వర్గంలో టీడీపీపై నెలకొన్న అసమ్మతిని పోగొట్టుకునేందుకు ప్రస్తుతం అదే సామాజిక వర్గానికి చెందిన ఎంపీటీసీ జోగి అంజనేయులకు మండల కన్వీనర్ పదవిని కట్టబెట్టారు. అయితే అదే సామాజిక వర్గంతో పాటు మిగిలిన ఎస్సీ, బీసీ వర్గాల్లోని చాలా మంది నాయకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తికే తిరిగి పార్టీ పదవిని కట్టబెట్టటంపై పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఇక మండల కమిటీ ఎంపిక కోసం గత రెండు రోజులుగా మండల కేంద్రం కనగానపల్లిలో పార్టీ కార్యకర్తల సమావేశాలు జరుపుతున్నారు. కాని పార్టీ నాయకుల మధ్య నెలకొన్న గ్రూపు రాజకీయాలతో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేయలేకపోయారు. మండల తెలుగు యువత అధ్యక్షుని ఎంపిక చేయలేక గతంలో ఉన్న మనోహర్‌నే కొనసాగిస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. ఇక మండల కేంద్రం కనగానపల్లితో పాటు ముక్తాపురం, ముత్తువకుంట్ల, తగరకుంట, తూంచర్ల, వేపకుంట, భానుకోట గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారు. ఆత్మకూరు మండలంలో టీడీపీ మండల మాజీ కన్వీనర్ కృష్ణమోహన్, వడ్డిపల్లి సర్పంచ్ నారాయణస్వామి రెండు వర్గాలుగా ఉన్నారు. ఈ సమయంలో సర్పంచ్ వర్గానికి చెందిన వడ్డిపల్లి సూర్యనారాయణకు ప్రస్తుతం కన్వీనర్ పదవి ఇవ్వటంతో మాజీ కన్వీనర్ వర్గం దీనిని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మండలంలోని పలుచోట్ల అధికార పార్టీ నాయకుల కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. చెన్నేకొత్తపల్లి మండలంలో ఓటు బ్యాంకు కోసం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కన్వీనర్ పదవిని ఇవ్వటంతో బీసీ, ఎస్సీలతో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక మంత్రి సొంత మండలమైన రామగిరిలో కూడా టీడీపీ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేయటంలో టీడీపీ నాయకులు విఫలమైనట్లు తెలిసింది. గ్రూపు రాజకీయాలతో అధికారుల ఇక్కట్లు : అధికార పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలతో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పథకాలలో లబ్దిదారుల ఎంపిక నుంచి కాంట్రాక్టు పనుల వరకు అన్ని అధికార పార్టీ నాయకులు చెప్పినట్లే జరుగుతున్నాయి. కాని టీడీపీలో నెలకొన్న వర్గ రాజకీయాలతో అధికారులు ఎవరి పనిచేయాలన్నా ఇబ్బంది పడుతున్నారు. కనగానపల్లిలో సామాజిక పింఛన్ల జాబితా తయారీ విషయంలో తమ వారి పేర్లు తొలగించారని ఎంపీపీ పద్మగీత భర్త ముకుందనాయుడు అధికారులపై దాడి చేసిన విషయం తెల్సిందే. ఇక వేపకుంటలో ఒక జాతర సందర్భంగా టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగితే, దాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసుల జీపులపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు వేశారు. ఈ విధంగా అధికార పార్టీ నాయకులు చేస్తున్న గ్రూపు రాజకీయాలతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడటంతో పాటు శాంతి భద్రతలు కూడా లోపిస్తున్నాయని పలువురు ప్రభుత్వ అధికారులు వాపోతున్నారు. -
తాడిపత్రి టీడీపీలో చీలికలు
– రెండు గ్రూపులుగా విడిపోయిన నేతలు – సీనియర్ నేత జగదీశ్వరరెడ్డి, ఎమ్మెల్యే వర్గీయులు వేర్వేరుగా పయనం అనంతపురం : తాడిపత్రి తెలుగుదేశం పార్టీలో చీలికలు మొదలయ్యాయి. రాష్ట్ర గ్రామీణ గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి జిల్లాకు వస్తున్న కాలవ శ్రీనివాసులుకు స్వాగతం పలికేందుకు శుక్రవారం తాడిపత్రి నుంచి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ టీడీపీ నాయకులు జగదీశ్వరరెడ్డి వేర్వేరుగా వాహనాలలో గుత్తి బాటసుంకులమ్మ వద్దకు తరలివెళ్లడం నేతల మధ్య విభేదాలను బట్టబయలు చేసింది. జగదీశ్వరరెడ్డితోపాటు ఆయన సోదరుడు మునిసిపల్ కౌన్సిలర్ జయచంద్రారెడ్డి, కార్యకర్తలతో కలిసి దాదాపు 30 వాహనాలలో గుత్తికి తరలివెళ్లారు. ఇది వరకు జయచంద్రారెడ్డికి, ఎమ్మెల్యే జేసీకి మధ్యæ కౌన్సిల్ సమావేశంలో వాగ్వాదం జరిగింది. అనంతరం మూడు నెలల పాటు కౌన్సిల్ సమావేశాలకు రాకుండా జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేయించారు. ఆ తరువాత జగదీశ్వరరెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఇరువర్గాల వారూ ఫిర్యాదులు చేసుకున్న విషయం విదితమే. అలాగే మార్కెట్‌యార్డు చైర్మన్ రాకుండా అడ్డుకోవడంతో పాటు గ్రానైట్ ఫ్యాక్టరీ అసోసియేషన్ అధ్యక్ష పదవి తొలగింపు విషయంలో రెండు వర్గాల మధ్య మనస్పర్దలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మంత్రి కాలవకు స్వాగతం పలికేందుకు జగదీశ్వరరెడ్డి ఇంటి నుంచి వేరుగా కార్యకర్తలతో కలసి వాహనాలలో తరలివెళ్లడం చర్చనీయాంశంగా మారింది. -
బాలయ్యా.. ఇటువైపూ చూడయ్యా..
- సినిమా షూటింగుల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ బిజీ - హిందూపురం వైపు కన్నెత్తి చూడని వైనం - మునిసిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న కోల్డ్‌వార్ - పరిష్కారానికి నోచుకోని ప్రజాసమస్యలు - ఎవరికి విన్నవించుకోవాలో తెలియక జనం అవస్థలు హిందూపురం అర్బన్ : సీఎం చంద్రబాబు వియ్యంకుడు, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా పరిష్కరించే నాథులే కరువయ్యారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమా షూటింగ్లకే పరిమితమై నియోజకవర్గానికి చుట్టపుచూపుగానే వస్తున్నారు. మరోవైపు స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులైనా పట్టించుకుంటున్నారా అంటే అదీ లేదు. వారు ఆధిపత్యపోరు, వర్గ విభేదాల్లో మునిగితేలుతూ ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్నారు. హిందూపురం పట్టణంలో తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. లేపాక్షి మండల కేంద్రంలో నంది ఉత్సవాల సందర్భంగా మొదలుపెట్టిన రోడ్ల నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు. ఎన్నికల సమయంలో బాలయ్య ఇచ్చిన అనేక హామీలు అమలుకు నోచుకోలేదు. ఎవరికి వారే యమునా తీరే.. నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారింది. బాలయ్య పాలన మొత్తం ఇంతకుముందు పీఏ శేఖర్ చేతుల్లో పెట్టగా.. ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆయన అవినీతిపై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేసి..చివరకు సాగనంపారు. ఈ వివాదం సమసిపోయిందనుకున్న తరుణంలోనే మునిసిపాలిటీలో పోరు మొదలైంది. పీఏ శేఖర్ స్థానికంగా ఉన్న సమయంలో మునిసిపాలిటీలో కూడా పెత్తనం చెలాయించారు. కమిషనర్ విశ్వనాథ్‌తో పాటు కొందరు కౌన్సిలర్లు కూడా ఆయనకు సహకారం అందించారు. శేఖర్ పెత్తనానికి చైర్పర్సన్ లక్ష్మి, ఆమె భర్త నాగరాజు ఎప్పటికప్పుడు అడ్డు తగులుతూ వచ్చారు. ఈ క్రమంలోనే చైర్పర్సన్, కమిషనర్ మధ్య దూరం మరింత పెరిగింది. మొదలైందిలా.. గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా శానిటేషన్ సిబ్బందితో రాత్రి విధులు నిర్వహిస్తూ వచ్చారు. ఇది నిబంధనలకు విరుద్ధమని కమిషనర్ నైట్ శానిటేషన్‌ను రద్దు చేశారు. దీంతో కమిషనర్, చైర్పర్సన్ మధ్య అంతర్యుద్ధం మొదలైంది. అంతేకాకుండా ఏ పథకం కింద నిధులు వచ్చినా గతంలో అనుకూలమైన కాంట్రాక్టర్లకే కమిషనర్ బిల్లులు మంజూరు చేశారు. అలాగే శానిటేషన్ సిబ్బందికి బయోమెట్రిక్ విధానం అమలు చేయడాన్ని వ్యతిరేకించారు. ఈ విషయం ఇద్దరి మధ్య సఖ్యతను దెబ్బతీసింది. కాగా.. అసమ్మతి నేపథ్యంలో పీఏ శేఖర్ అడ్డు తొలగిపోవడంతో తన మాట వినని మునిసిపల్ కమిషనర్‌ను చైర్పర్సన్ వర్గం టార్గెట్ చేసింది. ఎలాగైనా బదిలీ చేయించాలని తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి విభేదాల కారణంగా పట్టణ పాలన పడకేసింది. -
గతం..పునరావృతం!
- ధర్మవరంలో అశాంతి – పరిటాల, వరదాపురం మధ్య తారస్థాయికి ఆధిపత్యపోరు – ఇరువర్గాల విభేదాలతో ధర్మవరం వాసుల్లో ఆందోళన – ప్రశాంతతకు భంగం వాటిల్లే ప్రమాదం – సునీత, సూరిని చంద్రబాబు హెచ్చరించినా ఖాతరు చేయని వైనం – తాజా ఘటనతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం – పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వకపోతే పరిస్థితి చేజారే ప్రమాదం – ఘటనపై ముఖ్యమంత్రి ఆరా.. ఇరు వర్గాలకు హెచ్చరిక (సాక్షి ప్రతినిధి, అనంతపురం) ధర్మవరం... పాతికేళ్ల కిందట రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనమైన పేరు. రెండు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలతో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించారు. 2003 వరకూ ఇదే పరిస్థితి. అయితే.. ఆ తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొంది. 2004–2014 వరకూ పదేళ్లపాటు ప్రజలు ప్రశాంతంగా జీవించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ధర్మవరంలో మళ్లీ మరో రెండు వర్గాల మధ్య పోరు మొదలైంది. మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి మధ్య కొంతకాలం కిందట మొదలైన ఆధిపత్య పోరు శుక్రవారం నాటి ఘటనతో మరింత తీవ్రమైంది. ధర్మవరం ప్రజలను మళ్లీ అశాంతిలోకి నెట్టేశారు. దూరం పెంచిన 2009 ఎన్నికలు 2009 ఎన్నికల టికెట్ వ్యవహారం సునీత, సూరి మధ్య చిచ్చు రేపినట్లు తెలుస్తోంది. 2004–09 మధ్యకాలంలో పరిటాల వర్గానికి చెందిన గోనుగుంట్ల జయమ్మ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2009లో ఎమ్మెల్యే టికెట్‌కు వరదాపురం సూరి పోటీపడ్డారు. కానీ జయమ్మ కుమారుడు విజయ్‌కుమార్‌కు ఇవ్వాలని సునీత ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సూరికి, విజయ్‌కు ఇద్దరికీ కాకుండా పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించారు. ఈ ఎన్నికల్లో వరదాపురం సూరి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల కరపత్రాల్లో పరిటాల రవి ఫొటో కూడా ముద్రించుకోలేదు. ఇది ఇరువర్గాల మధ్య విభేదాలకు బీజం పడింది. తర్వాత దూరం పెరుగుతూ వచ్చింది. గత ఏడాది పరిటాల రవి వర్ధంతి ముందురోజు సూరి.. పరిటాల స్వగ్రామమైన వెంకటాపురానికి వెళ్లగా కొందరు పరిటాల వర్గీయులు అవమానించారని, దీంతో ఆయన వెంటనే వెనుదిరిగి వచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సునీత వర్గానికీ అవమానం చేయాలని సూరి భావించారు. ధర్మవరంలో చంద్రబాబు పర్యటన సమయంలో పట్టణం మొత్తాన్ని ఫ్లెక్సీలతో నింపి, ఏ ఒక్కదానిలోనూ సునీత ఫొటో లేకుండా చేశారు. ఇది సునీతకు తీరని అవమానాన్ని మిగిల్చింది. మరోఫ్లెక్సీ ఘటనలోనూ ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. ధర్మవరంలో పరిటాల పెత్తనం లేకుండా టీడీపీ కార్యకర్తలంతా తన చేతుల్లోనే ఉండేలా సూరి రాజకీయం చేస్తున్నారు. ఈయన వ్యవహారంతో ధర్మవరంలో తాము పట్టుకోల్పోతున్నామని, ఎలాగైనా దెబ్బతీయాలనే ఆలోచన పరిటాల వర్గంలో పడింది. ఈ విభేదాలు సాగునీరు, టెండర్లు ఇలా పలు సందర్భాల్లో పొడచూపాయి. వీరి ఆధిపత్య పోరు ప్రజల అభివృద్ధి కోసం కాదనేది ధర్మవరంతో పాటు రాప్తాడు ప్రజలూ గ్రహించారు. తమ ప్రాంత అభివృద్ధి విషయంలో విభేదాలు పెట్టుకుంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ ఇద్దరూ స్వప్రయోజనాల కోసం పోరు నడిపిస్తున్నారు. దీన్ని గ్రహించిన ప్రజలు రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీపై తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. చంద్రబాబు హెచ్చరించినా... ఇటీవల చంద్రబాబు ఇద్దరినీ అమరావతికి పిలిపించి మందలించారు. ఒకరి నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. అయినప్పటికీ కయ్యానికి దిగుతున్నారు. పవన విద్యుత్‌కు సంబంధించి రామగిరి నుంచి అండర్ గ్రౌండ్ కేబుల్‌ను ధర్మవరానికి లాగుతున్నారు. ఇందులో భాగంగా రూ.2.5కోట్ల పనులు ధర్మవరం నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఈ పనుల్లో సూరి గుడ్‌విల్ అడిగారని, ఇవ్వనందుకే అడ్డుకున్నారనేది పరిటాల వర్గం వాదన. కేబుల్ పాతే దారిలోనే తాము రోడ్డు పని చేస్తున్నామని, ఈ నెల 15లోపు అది పూర్తవుతుందని, ఆ తర్వాత కేబుల్ పనులు చేసుకోవాలని సూచించినా వినలేదనేది సూరి వర్గం వాదన. ఈ క్రమంలోనే శుక్రవారం ధర్మవరంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ధర్మవరంలోని సూరి వర్గీయులు, రామగిరి, చెన్నేకొత్తపల్లి నుంచి ధర్మవరానికి వచ్చిన 200మంది పరిటాల వర్గీయులు రాళ్ల వర్షం కురిపించుకున్నారు. దీనిపై ఇరువర్గాలు శుక్రవారం ఎస్పీకి ఫిర్యాదు చేశాయి. రాత్రి మొత్తం ధర్మవరంలో పోలీసు గస్తీ నిర్వహించారు. శనివారం సూరి జిల్లా కేంద్రంలోని ఎస్పీ బంగ్లా వద్ద ధర్నా చేపట్టారు. పరిటాల అనుచరులు, పోలీసులు తమ వర్గీయులను దారుణంగా కొట్టారని, వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం హెచ్చరిక తాజా ఘటన నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు సూరి, సునీతకు ఫోన్ చేసినట్లు తెలిసింది. తాను స్వయంగా హెచ్చరించి పంపిన నెలలోపే తిరిగి గొడవ పడటంపై తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. అనంతపురంలో పార్టీ పరువును బజారుకు ఈడ్చారని, ఇప్పటికే పార్టీకి 92శాతం నష్టం జరిగిందని, విభేదాలు ఇలాగే ఉంటే వందశాతం నష్టం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని మండిపడినట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు ఇరువురూ ఎవరి వాదన వారు వినిపించినట్లు సమాచారం. క్షణ క్షణం...భయం భయం పరిటాల, సూరి మధ్య తలెత్తిన విభేదాలతో ధర్మవరం వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 2004కు ముందు పరిస్థితి భయంకరంగా ఉండేదని, ఇప్పుడు ప్రశాంతంగా ఉందనుకుంటే మళ్లీ పాత రోజులు వస్తున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇవ్వకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదముందని ప్రజలు భయపడుతున్నారు. -
పట్టు వీడని ‘అసమ్మతి’
- ‘పురం’ టీడీపీలో కొనసాగుతున్న విభేదాలు - పీఏ శేఖర్ మద్దతుదారులపై ‘అసమ్మతి’ నేతల గురి - చిలమత్తూరు, లేపాక్షి ఎంపీపీలను తొలగించాల్సిందేనంటూ పట్టుబట్టిన వైనం -రాజీ యత్నాలను కొనసాగించిన పార్టీ పరిశీలకుడు హిందూపురం అర్బన్ : హిందూపురం నియోజకవర్గ టీడీపీ నేతల్లో విభేదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే బాలకృష్ణఽ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శేఖర్‌ను తొలగించాలంటూ పట్టుబట్టి పంతం నెగ్గించుకున్న మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ, వారి వర్గీయులు.. ఇప్పుడు పీఏ వర్గంగా ముద్ర వేసుకున్న చిలమత్తూరు, లేపాక్షి ఎంపీపీలపై దృష్టి పెట్టారు. పీఏ అడుగులకు మడుగులొత్తడంతో పాటు ప్రతి పనిలో కమీషన్లు, పర్సెంటేజీలు వసూలు చేసిన ఆయన వర్గీయులపైనా వేటు వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లోని అసమ్మతి నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు వరుస సమావేశాలు నిర్వహించారు. ఆ ఇద్దరు ఎంపీపీలను పదవుల నుంచి తొలగిస్తేనే పార్టీలో ప్రక్షాళన జరిగినట్లు అవుతుందని అసమ్మతి వాదులు చెబుతున్నారు. లేపాక్షి ఎంపీపీ హనోక్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ.2 కోట్లతో ఇల్లు కట్టాడని, ప్రతి పనిలో పర్సెంటేజీలు తీసుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. చిలమత్తూరు ఎంపీపీ నౌజియాబాను మరిది అన్సార్ కూడా అవినీతిలో మునిగిపోయారని విమర్శిస్తున్నారు. ఇదిలావుండగా.. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గానికి వచ్చేలోపు పార్టీ నేతలందరూ ఏకం కాకుంటే చర్యలు తప్పవని పార్టీ సంస్థాగత ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన కృష్ణమూర్తి నాయకులను హెచ్చరించినట్లు సమాచారం. ఆయన మూడురోజులుగా నియోజకవర్గ టీడీపీ నాయకులను వేర్వేరుగా కలిసి ప్రస్తుత పరిణామాలపై ఆరా తీస్తున్నారు. అందరినీ సమన్వయ పరచడానికి ప్రయత్నాలు సాగిస్తున్నా.. నాయకులు మాత్రం తమ డిమాండ్లు చెబుతున్నారు తప్ప సర్దుకుపోయే పరిస్థితి కనిపించడం లేదు. శుక్రవారం ఉదయం లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన స్థానిక టీడీపీ నాయకులతో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమాలోచనలు చేశారు. ప్రస్తుతం పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయని, సర్దుకుపోవాలని సూచించారు. బాలకృష్ణ ఆదేశాల మేరకే తాను హిందూపురం వచ్చినట్టు చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీపీ హనోక్, ఎంపీటీసీ సభ్యులు చలపతి, చిన్న ఓబన్న తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత చిలమత్తూరులో మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, టీడీపీ నాయకులతో భేటీ అయ్యారు. మరవకొత్తపల్లి బీసీ కాలనీ సమీపంలో జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణరెడ్డి వర్గీయులతో మాట్లాడారు. కొడికొండ గ్రామంలో ఎంపీపీ నౌజియాబాను వర్గీయులను కలిశారు. గ్రూపు రాజకీయాలు, అసమ్మతి సమావేశాలు మానుకోవాలని హితవు పలికినట్లు తెలిసింది. -
టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం
హిందూపురం అర్బన్ : మున్సిపల్ చైర్పర్సన్ భర్త నాగరాజు, టీడీపీ కౌన్సిలర్ రోషన్ అలీలు శనివారం రాత్రి ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసం వద్ద పీఏ శేఖర్ ఎదుట వాగ్వాదాలు చేసుకుంటూ తోపులాడుకున్నారని సమాచారం. మున్సిపల్ నిధుల్లో తన వార్డుకు కావాలనే పనులు పెట్టలేదని రోషన్‌అలీ ఎమ్మెల్యే పీఏ శేఖర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పీఏ ఇద్దరినీ పిలిపించి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఇద్దరు ఆగ్రవేశాలతో ఊగిపోయి ఒకరిపై ఒకరు విమర్శలకు దిగారు. టీడీపీ కౌన్సిలర్ అయి ఉండి కౌన్సిల్ డీసెంట్ చెప్పారని రోషన్‌అలీపై నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరినొకరు తోసులాడుకోవడంతో అక్కడే ఉన్న పీఏ శేఖర్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు అమర్, ఇతర నాయకులు ఇద్దరికీ సర్దిచెప్పి శాంతింపజేసేందుకు ప్రయత్నింఽచారు. కాగా ఈవిషయం పట్టణంలో చర్చనీయంశంగా మారింది. -
అధికార పార్టీలో.. అసమ్మతి రాగం
- ఎంపీ నిమ్మల, ఎమ్మెల్యే బీకే మధ్య ఆధిపత్య పోరు - కొల్లు రవీంద్ర రాజీయత్నాలు విఫలం - కదిరిలో కందికుంట వర్సెస్ అత్తార్ చాంద్‌బాషా - ‘అనంత’, రాయదుర్గంలోనూ కుమ్ములాటలు సాక్షిప్రతినిధి, అనంతపురం : తెలుగుదేశం పార్టీలో కీలక నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా? అధిష్టానం ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా ఎవరి రాజకీయం వారు చేస్తున్నారా? నేతల తీరుతో ద్వితీయశ్రేణి నాయకత్వం రెండుగా చీలిందా? ఈ పరిణామాలు ‘అనంత’ టీడీపీని మరింత బలహీనపరిచాయా?.. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య కొంతకాలంగా ఉన్న వర్గవిభేదాలు తారాస్థాయికి చేరి ఆధిపత్యపోరుగా మారాయి. ఇవి ఏకంగా పార్టీని తీవ్రంగా నష్టపరిచే స్థాయికి వెళ్లాయి. దీన్ని గ్రహించిన అధిష్టానం తక్షణమే నష్టనివారణ చర్యలు చేపట్టాలని పార్టీ జిల్లా ఇన్చార్జ్ కొల్లు రవీంద్రకు బాధ్యతలు అప్పగించింది. రవీంద్ర నేతల మధ్య మంత్రాంగం నడిపి సమన్వయపరిచేందుకు యత్నించారు. అయితే.. నేతలు మాత్రం కడుపులో కత్తులు దాచుకుని రవీంద్ర ముందు కౌగిలించుకున్నట్లు నటించి, తిరిగి ఎవరి రాజకీయం వారు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీని ఏకతాటిపై నడపాల్సిన జిల్లా అధ్యక్షుడు, ఆ తర్వాత అంతటి బాధ్యతను తీసుకోవాల్సిన ఎంపీలే విభేదాలకు ఆజ్యం పోయడం గమనార్హం. పార్థ...కిష్టప్ప మధ్య ఆగని పోరు! ఎంపీ నిమ్మల కిష్టప్ప, పార్టీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే బీకేపార్థసార«థి మధ్య కొంతకాలం విభేదాలు నడుస్తున్నాయి. పార్థ ప్రాతినిథ్యం వహిస్తోన్న పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని గోరంట్ల మండలం కిష్టప్ప సొంత మండలం. దీంతో మండలంలో జోక్యం చేసుకోవద్దని పార్థకు కిష్టప్ప చెప్పారు. పార్థ కూడా గోరంట్లను పూర్తిగా వదిలేసి తక్కిన మండలాలపైనే దృష్టి సారించేవారు. అయితే గోరంట్ల మండలంలోని పార్టీశ్రేణులను కిష్టప్ప గాలికి వదిలేయడం, పార్థ పట్టించుకోకపోవడంతో టీడీపీ బలహీనపడింది. పార్టీశ్రేణులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నారు. దీన్ని గ్రహించిన పార్థ మరింత జాప్యం జరిగితే పార్టీకి ప్రమాదం తప్పదన్న ఉద్దేశంతో గోరంట్ల మండల, గ్రామస్థాయి కన్వీనర్ల నియామకంలో జోక్యం చేసుకున్నారు. తన వర్గీయులను నియమించుకున్నారు. దీంతో కిష్టప్పకు చిర్రెత్తింది. గోరంట్లలో జోక్యంపై ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ పరిణామాల తర్వాత గోరంట్ల పార్టీ కేడర్ రెండుగా చీలింది. తన వర్గానికి పార్థ కాంట్రాక్టు పనులు ఇచ్చి ఆర్థికంగా అండగా నిలుస్తూ కేడర్‌ను నిలుపుకునే యత్నం చేస్తున్నారు. ఇదే తరహాలో తన వర్గీయులను కాపాడుకునేందుకు ఇన్నాళ్లూ నిర్లక్ష్యం వహించిన కిష్టప్ప కూడా ఎంపీ నిధులను కేటాయిస్తున్నారు. ఎవరికివారు వర్గాలను ప్రోత్సహించారు. చివరకు ఒకే వేదికపై ఇద్దరూ ఉన్నా మాట్లాడుకోలేని పరిస్థితి తలెత్తింది. ఇది అధిష్టానం దృష్టికి చేరడంతో మంత్రి కొల్లు రవీంద్రకు సయోధ్య బాధ్యత అప్పగించింది. రవీంద్ర.. పార్థసారథిని కిష్టప్ప ఇంటికి తీసుకెళ్లి రాజీ యత్నాలు చేశారు. ఆ తర్వాత కూడా పార్థసారథి, కిష్టప్ప తమ వర్గీయులను యథావిధిగా ప్రోత్సహిస్తున్నారు. ఇరువర్గాలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకత్వం కూడా కలిసి పనిచేయలేమని తేల్చిచెప్పింది. ఈ పరిణామాల తర్వాత గోరంట్లతో పాటు పెనుకొండ, ఇతర మండలాల్లో కూడా పార్థను బలహీనపరిచే చర్యలకు కిష్టప్ప ఉపక్రమిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కందికుంట, అత్తార్దీ అదే పరిస్థితి వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే చాంద్‌బాషాను కందికుంటతో పాటు ఆయన వర్గీయులు ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. పదవిని అడ్డుపెట్టుకుని కందికుంటను బలహీనపరిచేలా అత్తార్ ఎత్తులు వేశారు. అలాగే అత్తార్‌ను పూర్తిగా డమ్మీ చేసేలా కందికుంట పావులు కదిపారు. కదిరిలో టీడీపీ పరిస్థితి అంతంతమాత్రమే! ఈ క్రమంలో ఈ విభేదాలు ఆ పార్టీని మరింత దిగజార్చాయి. వీరిద్దరినీ కలిపేందుకు కొల్లు యత్నించారు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవని గతేడాది కళ్యాణదుర్గం మినీమహానాడులో చెప్పిన కందికుంట అన్నట్లుగానే అత్తార్‌తో కలవలేకపోతున్నారు. నకిలీ డీడీల కేసులో కందికుంటకు శిక్ష పడటంతో కన్విక్షన్(ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు) ఉంది. ఎన్నికల వరకూ అది అలాగే ఉండేలా చేసేందుకు అత్తార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఒక్క అంశంలో సఫలమైతే కందికుంటకు చెక్‌పెట్టి టిక్కెట్టు దక్కించుకోవచ్చని, లేదంటే టిక్కెట్టు తనకు దక్కదనే యోచనలో ఉన్నారు. అత్తార్‌కు మంత్రి పల్లె రఘునాథరెడ్డి, బీకే పార్థసారథి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. దీంతో కందికుంట.. నిమ్మలతో చేతులు కలిపి వీరిద్దరికీ వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఈ పరిణామాలతో హిందూపురం పార్లమెంట్ పరిధిలో టీడీపీ బలహీనపడింది. ‘అనంత’లో అదే లొల్లి ‘అనంత’ టీడీపీలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ప్లాస్టిక్రద్దు పేరుతో జేసీ అవలంబించిన చర్యలు ప్రజలకు చిర్రెత్తించాయి. నేతలా కాకుండా వీధిరౌడిలా ప్రజలను, వ్యాపారులను కొట్టి బెదిరించారని నగరవాసులు చర్చించుకుంటున్నారు. రాకరాక ‘అనంత’ సీటు టీడీపీకి వస్తే నేతల చర్యలతో భవిష్యత్తులో మరోసారి ప్రజలు ఆ అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఇది తెలిసి ఏకంగా చంద్రబాబు వీరిద్దరి మధ్య పంచాయితీ చేశారు. ఈ వ్యవహారంపై తనూ ఓ నివేదికను తెప్పించుకున్నారు. అన్ని అంశాలను బేరీజు వేసిన చంద్రబాబు.. ‘ప్రభాకర్‌చౌదరి ఏరోజూ పార్టీ కోసం శ్రమించిన దాఖలాలు లేవు. గతిలేక అతనికి టిక్కెట్టు ఇవ్వాల్సి వచ్చింది. అతన్ని అదుపులో ఉంచండ’ని జిల్లా నాయకత్వాన్ని ఆదేశించినట్లు పార్టీ కీలక నేత ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఇదే క్రమంలో దివాకర్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి వరకూ పరిమితం చేయడం ఉత్తమమని, ఇతని వ్యవహారశైలితో ఇతర నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ ఇబ్బందులు పడుతోందనే అభిప్రాయాన్ని చంద్రబాబు బయటపెట్టినట్లు సమాచారం. ఇది గ్రహించిన జేసీ ‘అనంత’లో మునుపటి దూకుడు తగ్గించారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు కులచిచ్చు తెరపైకి తెచ్చి రాజకీయం చేస్తున్నారని తెలుస్తోంది. ఏదిఏమైనా నేతల వైఖరితో వర్గాలుగా చీలిపోయిన ద్వితీయ, తృతీయశ్రేణి నాయకుల మధ్య భవిష్యత్తులో కలవలేనంత దూరం ఏర్పడింది. ఈ క్రమంలో నేతలు ఏకమైనా కేడర్ ఏకం కాదని, ఇది ప్రతిపక్షానికి అనుకూలంగా మారి, టీడీపీకి ప్రతికూలమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. -
తాడిపత్రిలో ముసలం
- అధికార పార్టీలో విభేదాలు - మునిసిపల్ కౌన్సిల్ వేదికగా ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్ జయచంద్రారెడ్డి గొడవ - ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సొంత పార్టీ కౌన్సిలర్ తాడిపత్రి : తాడిపత్రిలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. ముఖ్యంగా జేసీ వర్గానికి, టీడీపీలోని పాత వర్గీయులకు మధ్య సఖ్యత లేదన్న విషయం బహిర్గతమైంది. బుధవారం తాడిపత్రి మునిసిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ముగియడమే ఇందుకు నిదర్శనం. మునిపాలిటీలో అవినీతి జరుగుతోందని, షాపింగ్ కాంప్లెక్స్ గదులను బినామీలకు తక్కువ «అద్దెకు కట్టబెట్టారని ప్రచారం చేస్తూ కౌన్సిలర్ జయచంద్రారెడ్డి తనపైనే కరపత్రాలు వేశారంటూ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అలాగే ఆయన మూడు సమావేశాల వరకు రాకుండా సస్పెండ్ చేయించారు. దీనికి నిరసనగా బాధిత కౌన్సిలర్ మునిసిపల్ కార్యాలయంలోనే బైఠాయించడం, తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనమైంది. కొంతకాలంగా 23వ వార్డు టీడీపీ కౌన్సిలర్ జయచంద్రారెడ్డి, ఆయన సోదరుడు జగదీశ్వరరెడ్డి.. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి మధ్య మనస్పర్థలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే తనను, కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరిస్తున్నారని జయచంద్రారెడ్డి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన కూడా చేపట్టారు. జేసీ సోదరులు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే టీడీపీ నాయకులైన జయచంద్రారెడ్డి, ఆయన సోదరుడు జగదీశ్వరరెడ్డితో విభేదాలుండేవి. చాలాసార్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దాడులు, ప్రతిదాడులకూ పూనుకొని పోలీస్టేషన్లో కేసులు కూడా పెట్టుకున్నారు. అయితే..2014 ఎన్నికల్లో జేసీ సోదరులు అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. అప్పట్లోనూ వీరి చేరికను జయచంద్రారెడ్డి సోదరులు వ్యతిరేకించారు. అధిష్టానం బుజ్జగించినా అంగీకరించలేదు. చివరికి అధిష్టానం ఒత్తిడితో ఆ ఎన్నికల్లో కలిసి పని చేసేందుకు అంగీకరించినా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి వారిని అంతగా ఆదరించలేదు. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత టీడీపీ అధిష్టానం జగదీశ్వరరెడ్డికి తాడిపత్రి మార్కెట్‌యార్డు చైర్మన్ పదవిని ఖరారు చేసినా చివరి నిమిషంలో మరొకరికి ఇచ్చింది. జేసీ జోక్యం వల్లే తమకు ఆ పదవి రాలేదని జగదీశ్వరరెడ్డి సోదరులు ఆరోపించారు. అంతేకాకుండా జగదీశ్వరరెడ్డి గ్రానైట్ ముడిసరుకు రవాణా చేసే విషయంలోనూ ఎమ్మెల్యే కావాలనే అధికారులను పంపించి దాడులు చేయించి కేసులు నమోదు చేయించారని జయచంద్రారెడ్డి, జగదీశ్వరరెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అలాగే పది రోజుల క్రితం ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అభివృద్ధి పేరుతో తాడిపత్రి మున్సిపాలిటీని దోచుకుంటున్నారని, విచారణ చేయించాలని మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. జన్మభూమి కార్యక్రమంలోనూ జయచంద్రారెడ్డి సొంతంగానే పర్యటించారు. ఇలా చాలా విషయాల్లో వీరి మధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరుకున్నాయి. -
'మూడు’ ముక్కలాట
–ఎంపీ జేసీ, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మధ్య ఆధిపత్యపోరు – అనంతపురంపై ప్రత్యేక దృష్టి సారిస్తోన్న జేసీ – 2019లోపు 'అనంత' అసెంబ్లీలోని టీడీపీ వర్గీయులను గుప్పిట్లో పెట్టుకునే వ్యూహం – మేయర్‌తో పూర్తిగా విభేదిస్తున్న ఎమ్మెల్యే చౌదరి వర్గీయులు – ఎంపీ, ఎమ్మెల్యేతో విభేదించి ఏకాకిగా మారిన మేయర్ స్వరూప సాక్షి ప్రతినిధి, అనంతపురం : 'అనంత' టీడీపీ మూడు ముక్కలైంది. కీలక ప్రజాప్రతినిధులైన ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్ మూడు గ్రూపులుగా విడిపోయారు. వీరితో పాటు ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు కూడా వర్గాలుగా చీలిపోయారు.వీరి విభేదాల కారణంగా అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్‌తో పాటు పలుశాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ నేత ఆదేశాలు, మరోనేత బెదిరింపులతో ఎటు వెళ్లాలో పాలుపోనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 'అనంత'ది ప్రత్యేక స్థానం. జిల్లా కేంద్రం కావడం, ఇక్కడ టీడీపీ అత్యంత బలహీనంగా ఉండటంతో ఆ పార్టీ కూడా ఈ అసెంబ్లీపై ఎప్పుడూ ఆశలు పెట్టుకోలేదు. టీడీపీ ఆవిర్భావంలో మినహా ఆపై మూడు దశాబ్దాలలో ఆ పార్టీకి ఇక్కడ విజయం దక్కలేదు. అయితే.. 2014 ఎన్నికల్లో ఊహించనివిధంగా అప్పటికే రెండుసార్లు పోటీచేసి ఓడిపోయిన మహాలక్ష్మి శ్రీనివాస్‌ను కాదని ప్రభాకర్‌చౌదరికి టిక్కెట్టు ఇచ్చారు. ఎన్నికల్లో ఈయన విజయం సాధించారు. ఆ తర్వాత ఎంపీ జేసీ, ఎమ్మెల్యే చౌదరి వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. 'అనంత'లోని ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేస్తూ రాజకీయంగా, వ్యక్తిగతంగా 'మైలేజీ' సాధించేందుకు ఇరువురూ యత్నిస్తున్నారు. రాంనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటే, మంచినీటి పైపులైన్ పనుల్లో జేసీ వర్గం జోక్యం చేసుకుంటోంది. కార్పొరేషన్లో కులపిచ్చి పెరిగిపోయిందని, అవినీతి ఉచ్చులో కూరుకుపోయిందని జేసీ చేసిన వ్యాఖ్యలతో కార్పొరేషన్లో కుదుపు ఏర్పడింది. దీనిపై ఏకంగా సీఎంకు లిఖిత పూర్వక ఫిర్యాదు కూడా జేసీ చేశారు. ఈక్రమంలో అవినీతి మరకలు తనకు అంటకుండా బయటపడేందుకు చౌదరి యత్నించారు. కమిషనర్ ఓబులేసుకు పొగ»పెట్టి, ఆపై స్వరూపపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో రాజారావు మినహా తక్కిన సభ్యులు మేయర్‌కు వ్యతిరేకంగా పనిచేశారు.ఎన్నికలను కూడా వారు బహిష్కరించి మేయర్ తీరుపై విమర్శలు గుప్పించారు. ఇవన్నీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతున్నాయని భావించిన మేయర్ వర్గం ఆయనతో విభేదిస్తోంది. అసలు వ్యూహం ఇదేనా?! 'అనంత'లో ఆధిపత్యపోరు వెనుక అసలు వ్యూహం ఏంటనే విషయంపై నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో 'అనంత' అసెంబ్లీని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని జేసీ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. జిల్లాలో సామాజిక సమీకరణలను బేరీజు వేస్తూ ఆ ఖాతాలో 'అనంత'ను తమ చేతుల్లోకి తీసుకోవాలన్న యోచనతో ముందుకెళుతున్నట్లు సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇటీవల ఓ వెబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా 'అనంత' అసెంబ్లీపై జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ..'అనంత చౌదరి జాగీరు కాదు. మాకూ ఇక్కడ హక్కు ఉంది. రాజకీయ చదరంగం ఎవరు ఎలాగైనా ఆడొచ్చని' పరోక్షంగా తమ ఉద్దేశాన్ని బయటపెట్టారు. ఈ వ్యాఖ్యలకు బలం చేకూరేలా ఎంపీ దివాకర్‌రెడ్డి కూడా పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తక్కిన ఆరింటిని పక్కనపెట్టి 'అనంత'పైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కాలువల పూడికతీత పేరుతో రెండురోజులుగా నగరంలో స్వయంగా పనులు పర్యవేక్షిస్తున్నారు. గురువారం ఆయన తనయుడు పవన్‌కుమార్‌రెడ్డితో కలిసి నగరంలో పర్యటించారు. వీరిద్దరితో పాటు జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా ఇటీవల 'అనంత నగరాభివృద్ధి వేదిక’ పేరుతో వారి అనుచరుడు కోగటం ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరయ్యారు. టీడీపీకి చెందిన కార్పొరేటర్ హరిత భర్త జయరాంనాయుడుతో పాటు ఉమామహేశ్వర్, పలువురు కార్పొరేటర్లు జేసీ బాటలో నడుస్తున్నారు. మొత్తమ్మీద కార్పొరేటర్ల నుంచి కిందిస్థాయి కేడర్ దాకా నియోజకవర్గంలో టీడీపీ మూడు వర్గాలుగా చీలిపోయింది. అధికారుల అవస్థ టీడీపీ నేతల ఆధిపత్యపోరుతో అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి చేస్తున్న పనులకు వెళితే ఎమ్మెల్యే, మేయర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెళ్లకపోతే జేసీతో ఇబ్బందులు. ఇదే క్రమంలో కార్పొరేషన్ పనుల్లో మేయర్ ఒకలా, ఎమ్మెల్యే మరోలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో ఎటు మొగ్గాలో, ఎవరు చెప్పినట్లు వినాలో తెలీక అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకానొకదశలో ఈ ఉద్యోగం వద్దు...ఎక్కడికైనా బదిలీ చేయించుకుని వెళదామనేలా తమ పరిస్థితి ఉందని కార్పొరేషన్‌కు చెందిన ఓ అధికారి 'సాక్షి'తో ఆవేదన వ్యక్తం చేశారు. నేతల వైఖరి కారణంగా టీడీపీ కేడర్ కూడా మూడు ముక్కలుగా చీలిపోవడంతో ప్రస్తుతం ఆ పార్టీ అత్యంత బలహీనంగా తయారైంది. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న తాము అధికారం మిగిలిఉన్న ఈ రెండున్నరేళ్లలోనైనా కాస్త లబ్ధిపొందాలనే యోచనలో కేడర్ మౌనంగా ఉందని, 2019 ఎన్నికల్లో మాత్రం పార్టీతో పాటు ప్రజాప్రతినిధులకు తీవ్ర ప్రతికూల పరిస్థితులు తప్పవని ఆ పార్టీలోని కీలక వ్యక్తులు అంటున్నారు. -
తన్నుకున్న తమ్ముళ్లు
– వీఆర్ పురం సర్పంచ్ చేరిక సమయంలో భగ్గుమన్న విభేదాలు – జెడ్పీ చైర్పర్సన్ ఎదుటే బాహాబాహీ నందివాడ : మండలంలో తెలుగుతమ్ముళ్ల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సర్పంచ్‌ను పార్టీలోకి చేర్చుకునే విషయంపై రెండు వర్గాలవారు గొడవకు దిగారు. జెడ్పీ చైర్పర్సన్ ఎదుటే దుర్భాషలాడుకుంటూ ముష్టిఘాతాలకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు... మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కాకరాల సురేష్, పార్టీ మండల అధ్యక్షుడు ఆరెకపూడి రామశాస్త్రులు వర్గాల మధ్య ఎంతోకాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంకటరాఘవాపురం గ్రామ సర్పంచ్ మోరుగుమాల సత్యనారాయణమ్మ, కుదరవల్లి పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు వర్రి రంగారావును టీడీపీలో చేర్చుకునేందుకు బుధవారం ముహూర్తం నిర్ణయించారు. వెంకటరాఘవాపురం గ్రామంలో జరిగే ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. గద్దె అనూరాధ, టీడీపీ గుడివాడ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు, గుడివాడకు చెందిన మరికొందరు నేతలు గ్రామానికి వస్తున్నట్లు ఉదయం స్థానికంగా ప్రచారం చేశారు. దీంతో టీడీపీ సీనియర్ నాయకుడు, ఆ గ్రామ పార్టీ అధ్యక్షుడు కాకరాల సురేష్ తన అనుచరులతో వచ్చి జెడ్పీ చైర్పర్సన్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. గ్రామంలో ఉన్న తమకు చెప్పకుండా కొత్తవారిని చేర్చుకోవడం ఏమిటని జెడ్పీ చైర్‌పర్సన్‌ను ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. అయితే కాన్వాయ్‌ను అడ్డుకోవడం ఏమిటని సురేష్‌పై రావి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పరస్పరం బూతులు తిట్టుకున్నారు. అంతటితో అగకుండా రావి చేయిచేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాలవారు పరస్పరం దాడులకు దిగారు. పోలీసులు వచ్చి కాకరాల సురేష్ వర్గీయులను చెదరగొట్టారు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన సురేష్ వర్గీయులు రావి డౌన్ డౌన్.. అంటూ నినాదాలు చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు చైర్పర్సన్ అనూరాధ శంకుస్థాపన చేశారు. అంగన్వాడీ భవనం వద్ద సర్పంచ్ మోరుగుమాల సత్యనారాయణమ్మ, ఆమె కుమారుడు మోరుగుమాల లక్ష్మణరావు, కుదరవల్లి పీఎసీఎస్ అధ్యక్షుడు వర్రి రంగరావు తదితరులను టీడీపీలో చేర్చుకున్నారు. తప్పుకున్న పిన్నమనేని వర్గీయులు సర్పంచ్ చేరికపై గొడవ జరుగుతుందని ముందే తెలుసుకున్న పిన్నమనేని వెంకటేశ్వరరావు వర్గీయులు ముందుగానే గ్రామం నుంచి తప్పుకున్నారు. జెడ్పీ చైర్పర్సన్ వస్తున్నారని తెలిసినా సర్పంచ్ చేరిక సభకు హాజరు కాలేదు. -
టీడీపీలో విభేదాలు బట్టబయలు
-
విభేదాలు బట్టబయలు
– పరిటాల సునీత వర్సెస్ వరదాపురం సూరి – సీఎం పర్యటనలో ఫ్లెక్సీలపై కనిపించని మంత్రి సునీత ఫొటోలు – ధర్మవరం బ్రాంచ్ కెనాల్ విభేదాల నేపథ్యంలో ఫొటోలపై సూరి నిషేధం! సాక్షిప్రతినిధి, అనంతపురం : తెలుగుదేశంపార్టీలో మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇన్నిరోజులు ఇద్దరి మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు శనివారం ధర్మవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా బట్టబయలయ్యాయి. ముఖ్యమంత్రి రాకను స్వాగతిస్తూ ధర్మవరంలో హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకూ భారీ సంఖ్యలో రోడ్లకు ఇరువైపులా ఎమ్మెల్యే అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలో ఎక్కడా మంత్రి సునీత ఫొటో కన్పించలేదు. కేవలం పల్లె రఘునాథరెడ్డి ఫొటో మాత్రమే కన్పించింది. సునీత ఫొటోలు కన్పించకపోయేందుకు వారిద్దరి మధ్య కొద్దిరోజులుగా నడుస్తున్న అంతర్గత విభేదాలకు తోడు ఇటీవల ధర్మవరం బ్రాంచ్ కెనాల్ అంశంలో భేదాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కాలువ ఆధునికీకరణకు 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుంది. దీని కోసం రూ.13.11 కోట్లు కేటాయించారు. ఈ పనుల్ని 2008– 09లో రత్నా ఇన్ఫ్రా ప్రారంభించింది. తర్వాత ఈ పనులు అనివార్య కారణాలతో నిలిచిపోయాయి. ఈక్రమంలో ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.32.94కోట్లకు టీడీపీ ప్రభుత్వం పెంచింది. ఈ పనులు దక్కించుకునేందుకు ఇరువర్గాలు ఎవరికివారు తీవ్ర ప్రయత్నాలు చేశారు. తమ నియోజకవర్గంలోనూ కొంతమేర కాలువ ఉంటుంది కాబట్టి పనులు తమకే ఇవ్వాలని సునీత వర్గీయులు, లేదు పనులు మంజూరు చేయించింది సూరి కాబట్టి తమకే పనులు కావాలని సూరీ వర్గీయులు పట్టుబట్టారు. ఈ అంశం అధికారులకు కూడా తలనొప్పిగా మారింది. చంద్రబాబు పర్యటన సందర్భంగా శనివారం ఈ పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఈ క్రమంలో శుక్రవారం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు సునీత ధర్మవరం వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, సునీత ఎదురుపడినా మాట్లాడుకోలేదు. శంకుస్థాపన పనులు వాయిదా వేయాలని సునీత అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. తన నియోజకవర్గంలో పనులు తాను చెప్పినట్లు జరగాలని, సునీత చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని సూరి అధికారులను హెచ్చరించినట్లు తెలిసింది. వెరసి ఈ తతంగం ఇటు టీడీపీతో పాటు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఫ్లెక్సీల్లో ఫొటోపై కచ్చితమైన ఆదేశాలు : ఈ క్రమంలో ఫ్లెక్సీల్లో మంత్రి సునీత ఫొటోలు ప్రచురించకూడదని ఎమ్మెల్యే సూరితో పాటు ఆయన వర్గీయులు నిర్ణయించుకున్నారు. దీంతోనే సభావేదికపై ప్రోటోకాల్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మినహా తక్కిన ఏ ఒక్క ఫ్లెక్సీలో కూడా ఆమె ఫొటో ప్రచురించలేదు. -
ముఖం చాటేసిన తమ్ముళ్లు!
అధికార తెలుగుదేశం పార్టీ తిరుపతిలో అట్టహాసంగా మహానాడును ప్రారంభించింది. ఈ కార్యక్రమం అంటే ఎంతో ఉత్సాహంగా హాజరయ్యే తెలుగు తమ్ముళ్లు జిల్లా నుంచి నామమాత్రంగానే తరలివెళ్లారు. దీనికి ప్రధాన కారణం గ్రూపు తగాదాలేననేది బహిరంగ రహస్యం. పాస్‌లు వచ్చినవారంతా వెళ్లారని జిల్లా నాయకులు చెబుతున్నా ద్వితీయ శ్రేణిలో చాలామంది డుమ్మాకొట్టినట్లు సమాచారం. టీడీపీ మహానాడుకు డుమ్మా! * ఇచ్ఛాపురంలో ఏఎంసీ చిచ్చు * మిగతాచోట్ల గ్రూపుల గొడవ * జిల్లా నుంచి నామమాత్ర హాజరు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తొలినుంచి టీడీపీకి కంచుకోట అని పేరొందిన ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది కార్యకర్తలు మహానాడు కార్యక్రమానికి వెళ్లేవారు. ఇచ్ఛాపురం పట్టణం నుంచి కూడా 50 మందికి తక్కువ కాకుండా హాజరయ్యేవారు. ఈసారి మాత్రం స్థానికంగా పదవుల కేటాయింపులతో తలెత్తిన వివాదాలు, గ్రూపు రాజకీయాలతో తమ్ముళ్లు చాలామంది అలకపాన్పు ఎక్కారు. ఇచ్ఛాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవిని పట్టణానికి చెందిన నేతలకు కాకుండా రూరల్ ప్రాంతానికి చెందిన సాడి సహదేవ్రెడ్డికి కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ కార్యక్రమాలకు పట్టణ క్యాడర్ కొన్నాళ్లుగా దూరం పాటిస్తోంది. దాదాపుగా ముఖ్య నాయకులు చాలామంది మహానాడు కార్యక్రమానికి సైతం హాజరుకాలేదని తెలిసింది. వారిలో ఇచ్ఛాపురం పట్టణ టీడీపీ అధ్యక్షుడు కె.ధర్మారావు, మరో ముఖ్యనేత జగన్నాథరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు అంబటి లింగరాజు, జిల్లా పార్టీ నాయకుడు చాట్ల తులసీదాస్‌రెడ్డి ఉన్నారు. ఈ విషయమై స్థానిక టీడీపీ కార్యకర్తలు ఆరా తీస్తే... శనివారం నాటి కార్యక్రమానికి హాజరవుతున్నారని కొంతమంది సర్దిచెబుతున్నట్లు సమాచారం. అలాగే నరసన్నపేట నియోజకవర్గం నుంచి గతంలో క్రమం తప్పక మహానాడుకు హాజరైన కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఈసారి వెళ్లలేదు. నరసన్నపేట మండలాధ్యక్షురాలు పార్వతమ్మ, సర్పంచ్ జి.చిట్టిబాబు కూడా ఉండటం చర్చనీయాంశమైంది. పలాస నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో టిక్కెట్ ఆశించిన మద్దిల చిన్నయ్య కూడా ఈసారి మహానాడుకు దూరంగా ఉన్నారు. గ్రూపులుగా విడిపోయి టీడీపీలో మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, ఇతర ఎమ్మెల్యేల మధ్యనున్న గ్రూపు తగాదాలు మహానాడు కార్యక్రమంలోనూ కనిపించాయి. నియోజకవర్గంలో అంతా ఒక్కరిగా గాకుండా గ్రూపులుగా విడిపోయి తిరుపతి ప్రయాణమయ్యారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో అచ్చెన్న గ్రూపు, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గ్రూపు వేర్వేరుగానే వెళ్లారు. అయితే ఈ రెండు గ్రూపుల్లోనూ ఉన్న కళింగ కోమటి సామాజికవర్గం నేతలు మాత్రం ఒకే బృందంగా వెళ్లడం మారుతున్న రాజకీయ పరిణామాలకు అద్దం పట్టింది. గుండ లక్ష్మీదేవి భర్త, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రెండ్రోజుల క్రితం పార్టీ సమావేశానికి హాజరుకావడం, రాబోయే శ్రీకాకుళం నగరపాలకసంస్థ ఎన్నికలలో మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారనే ప్రచారం నేపథ్యంలో కళింగ కోమటి సామాజిక వర్గం నాయకులు ఏకతాటిపైకి వస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే రాజాం నియోజకవర్గంలో కూడా కళావెంకటరావు గ్రూపు, ఎమ్మెల్సీ ప్రతిభాభారతి గ్రూపులను మహానాడు ఏకం చేయలేకపోయింది. పాతపట్నంలోనూ మూడు గ్రూపులదీ అదే పరిస్థితి. ఎంపీ రామ్మోహన్నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడుల గ్రూపు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు గ్రూపులకు ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యే కలమట వెంకటరమణ గ్రూపు తోడయ్యింది. ఎంపీ, మంత్రిల గ్రూపు, ఎమ్మెల్యే కలమట గ్రూపు ఒకే మాటపై ఉండటంతో అసహనంతో ఉన్న శత్రుచర్ల గ్రూపు ఈసారి మహానాడుకు వెళ్లరనే ప్రచారం జరిగింది. అయితే ఆఖరి నిమిషంలో కొంతమంది బయల్దేరి వెళ్లారని తెలిసింది. -
ఎమ్మెల్యే రాజు (వెర్సెస్) పీవీఎస్ఎన్ రాజు
‘రాజు’కుంటోంది! • ఎమ్మెల్యే రాజు వెర్సెస్ పీవీఎస్ఎన్ రాజు • తారస్థాయికి టీడీపీ గ్రూపు రాజకీయాలు • భక్తులకు సేవల్లోనూ రాజకీయ ద్వేషాలు రావికమతం : చోడవరం టీడీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. రావికమతం మండలం కళ్యాణపులోవ తిరునాళ్లలో తారాస్థాయికి చేరుకున్నాయి. ఏటా ఇక్కడి పోతురాజుబాబు ఆలయం వద్ద టీడీపీ నాయకుడు పీవీఎస్ఎన్ రాజు రెండెకరాల స్థలాన్ని చదును చేయించి భారీగా షామియానాలు వేయించేవారు. శివరాత్రి జాతరకు ఇక్కడికి వచ్చే వేలాది మందికి ఉచిత భోజన సదుపాయం కల్పించి, జాతరలో జాగారానికి పెద్ద శివలింగాన్ని ఏర్పాటు చేసేవారు. చిటెకెల భజన, చెట్టుభజన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు ప్రత్యేకంగా టెంట్లు వేయించి, స్నానాల రేవుకు చేరుకోలేని వృద్ధులు ,చిన్నారుల కోసం ప్రత్యేక మోటార్లు,పైపులైన్‌తో గట్టువద్ద నీటిజల్లు ఏర్పాటు చేసేవారు. దీనికి వివిధ పంచాయతీల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు సహాకరించేవారు. ఇదంతా ఎమ్మెల్యే రాజుతో పాటు, ఆయన వర్గీయులకు కంటగింపుగా మారింది. ఒకే పార్టీలో మరోబలమైన గ్రూపును తయారుచేస్తున్నందున పీవీఎస్ఎన్ రాజు వద్దకు వెళ్లవద్దంటూ పార్టీలోని ద్వితీయశ్రేణి నాయకులకు పరోక్షంగా హుకుం జారీఅయింది. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని ఆయన వద్దకు వెళ్లే సర్పంచ్‌లు,ఎంపీటీసీ సభ్యులకు నిధుల కేటాయింపు ఉండదంటూ ఎమ్మెల్యేతో పాటు, ఎమ్మెల్యే మాటగా ఎంపీపీ దంగేటి రామకృష్ణ పదేపదే తెగేసి చెబుతున్నారు. దీంతో ఆపార్టీకి చెందిన వారెవ్వరూ పీవీఎస్ఎన్ను నేరుగా కలవడంలేదు. ఈ ఏడాది కళ్యాణపులోవ తిరునాళ్లులో పీవీఎస్ఎన్ రాజు భారీ స్థాయిలో భోజన ఏర్పాట్లు చేసినా నలుగురు ఐదుగురు మినహా టీడీపీ వారంతా దూరంగా ఉన్నారు. ఈ ఏడాది ఎమ్మెల్యే వర్గీయులు ఇంకా పట్టుబిగించారు. తిరునాళ్లలో అన్నసమారాధన చేపట్టాలన్నా తన అనుమతి తీసుకోవాలని సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే రాజు నొక్కి చె ప్పారు. ఎవరెవరు ఏఏ సేవా కార్యక్రమాలు చేపడుతున్నదీ తనకు ముందుగా చెబితే క్రమ పద్ధతిలో నిర్వహించేలా సూచనలిస్తానని ఉత్సవకమిటీ సభ్యులచే దాతలందరికీ చెప్పించారు. ముందెన్నడూ లేని విధంగా ఈ ఏడాది తిరునాళ్లుకు రూ.22 లక్షలు ప్రత్యేక గ్రాంటు మంజూరు చేయించి సుమారు 20 ఎకరాల్లో చదును చేయించారు. ఇప్పుడు ఎమ్మెల్యే రాజు కనుసన్నల్లోనే పనులన్నీ జరుగుతున్నాయి. ఉచిత అన్నసమారాధనకు 24 కౌటర్లు సిద్ధం చేశారు. అందులో ఒకటి పీవీఎస్ఎన్ రాజుకు కేటాయిస్తున్నట్టు ఆయనకు అనుచరుల ద్వారా కబురు పంపారు. అదీకూడా ఒకే కూర,సాంబారు అన్నం పెట్టాలని.. ధనబలముందని రెండు మూడు కూరలు పెట్టకూడదని, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయకూడదని సమాచారం పంపారు. దీంతో పీవీఎస్ఎన్ రాజు మనస్థాపం చెంది ఏర్పాట్లు ఆపేశారు. -
గ్రేటర్లో ముసలం
-
టి-పిసిసిలో బయటపడ్డ విభేదాలు!
-
గ్రూప్ రాజకీయాలపై అన్నాడీఎంకే సీరియస్
హెచ్చరించి పంపిన అధిష్టానం హొసూరు : క్రిష్ణగిరి జిల్లాలో అధికార అన్నాడీఎంకే పార్టీలో గ్రూప్ రాజకీయాలపై అధిష్టాన వర్గం సీరియస్ అయ్యింది. క్రిష్ణగిరి మున్సిపాలిటీలో గత 28న జరిగిన మున్సిపల్ సమావేశంలో అన్నాడీఎంకే కౌన్సిలర్లు ముష్టియుద్ధానికి దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై అధిష్టాన వర్గం సూచనల మేరకు చెన్నైలో క్రమశిక్షణ కమిటీ క్రిష్ణగిరి మున్సిపల్ చైర్మన్ తంగముత్తు, వైస్ చైర్మన్ వెంకటాచలంను, అన్నాడీఎంకే కౌన్సిలర్లను సోమవారం రప్పించి చెన్నైలో విచారణ జరిపింది. ఈ సంఘటనపై ఈ రెండు వర్గాల మద్య రాతపూర్వక వివరణ కోరింది. మున్సిపాలిటీ సమావేశంలో జరిగే సంఘటనలకు మున్సిపల్ చైర్మన్‌దే బాధ్యత అని, కౌన్సిలర్లను అనుసరించి ప్రవర్తించాలని సూచించింది. అంతే కాక పార్టీలో గ్రూపు రాజకీయాలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మంత్రులు నత్తం విశ్వనాథం, వైద్యలింగం, పళణిస్వామి, పళణియప్పన్‌లు ఇరువర్గాలను తీవ్రంగా హెచ్చరించి ఇది చివరి సారిగా ఉండాలని సూచించినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అన్నాడీఎంకే కౌన్సిలర్ తెలిపారు. -
అన్నాడీఎంకేలో పెరుగుతున్న గ్రూపు రాజకీయాలు
హొసూరు:క్రిష్ణగిరి జిల్లాలో అధికార అన్నాడీఎంకే పార్టీలో గ్రూప్ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ఒకే పార్టీకి చెందిన వారు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మున్సిపల్ సమావేశంలో ఒకే పార్టీకి చెందిన కౌన్సిలర్లు ముష్టి యుద్ధానికి పాల్పడుతున్నారు. జిల్లాలో అన్నాడీఎంకేలో రెండు గ్రూపులు ఉన్నాయి. వాటికి మాజీ మంత్రి కేపీ మునిస్వామి, ప్రస్తుత పార్లమెంట్ డెప్యూటి స్పీకర్ తంబిదురై ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేపీ మునిస్వామి మంత్రిగా ఉన్నంతవరకు ఆ వర్గానిదే జిల్లాలో పై చేయిగా ఉండేది. పార్లమెంటు ఎన్నికల అనంతరం మంత్రి పదవి కోల్పోవడంతో ఆయన వర్గీయులకు జిల్లాలో చుక్కెదురైంది. జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శిగా తంబిదురై వర్గీయులైన గోవిందరాజుకు పదవి కట్టబెట్టారు. జిల్లాలో మాజీ మంత్రి కేపీ మునిస్వామి వర్గీయుల్లో క్రిష్ణగిరి మున్సిపల్ చైర్మన్ తంగముత్తు కూడా ఉన్నారు. తంగముత్తుకు వ్యతిరేక వర్గం పార్టీలోనే సమస్యలను రాజేస్తున్నారు. మున్సిపల్ సమావేశాల్లో స్వంత పార్టీ కౌన్సిలర్లే రెండు సమావేశాల నుంచి సమస్యలను లేవనె త్తుతూ బాహాబీహ కి దిగారు. కుర్చీలు, బల్లలు ధ్వంసం చేశారు. పార్టీలో కుమ్ములాట జరుగుతున్నా జిల్లా కార్యదర్శిగా గోవిందరాజు పట్టించుకోవడం లేదు. జిల్లాలో రెండు వర్గాలు కొట్లాడుకోవడంతో అధిష్టానం సీరియస్ అయ్యింది. సోమవారం ఇరువర్గాల వారిని చెన్నైలో వివరణలు ఇచ్చుకోవాలని సూచించింది. దీంతో ఇరువర్గాల వారు చెన్నై బయలుదేరి వెళుతున్నారు. గ్రూప్ రాజకీయాలతో జిల్లాలో అధికార అన్నాడీఎంకే పరిస్థితి దిగజారుతోందని, వెంటనే సరిచేయాలని పార్టీ అభిమానులు కోరారు. ఇరువర్గాల వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని పరిశీలకులు భావిస్తున్నారు. -
గ్రూపులు వీడండి..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్/నిర్మల్‌టౌన్ : ఇకనైనా గ్రూపు రాజకీయాల కు స్వస్తి చెప్పాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా ముఖ్య నాయకత్వానికి హితభోద చేశారు. నియోజకవర్గ ఇన్చార్జిలందరినీ కలుపుకుని పోవాలని, లేకుంటే పార్టీ మరోమారు నష్టపోవాల్సి వస్తుందని ఆయన కొత్తగా ఎంపికైన డీసీసీ అధ్యక్షుడు ఎ.మహేశ్వర్‌రెడ్డికి సూచించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ న మోదు కార్యక్రమంలో భాగంగా నిర్మల్‌కు వచ్చిన పొన్నాల నేరుగా మహేశ్వర్‌రెడ్డి నివాసంలో జిల్లా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. కొన్ని నియోజకవర్గాల ఇన్చార్జీలు కొంత అభద్రతా భావం తో ఉన్నారని బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల ఇన్చార్జీలనుద్దేశించి పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పొన్నాల కార్యకర్తలనుద్దేశించి మా ట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గాల్లో అభిప్రాయ భేదాలుంటాయి కానీ నేతలందరూ కార్యకర్తల మనోభావాలకు అణుగునంగా వ్యవహరించాలని నాయకులకు సూచించారు. సభ్యత్వ నమోదు ప్రగతిపై ఈనెల 23న నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తామన్నారు. కేసీఆర్ పాలన తీరుపై తనదైన శైలిలో విమర్శించిన పొన్నాల.. కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. అనంతరం నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నాయకులు, కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. దసరా, దీపావళి వాయిదాలు చెల్లవు.. రెండు బెడ్రూంల ఇల్లు నిర్మించి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేసీఆర్ దసరా, దీపావళి వాయిదాలు పెడుతున్నారని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఎద్దేవా చేశారు. కేసీఆర్ హామీ మేరకు దళితులందరికీ మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని పక్షంలో తాము అధికార పార్టీ నేతల ఇళ్ల ఎదుట ధర్నాలు, శవయాత్రలు చేపడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జిల్లాలో జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మంజూరైందని మాజీ ఎంపీ వివేక్ పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ నెరవేరేలా బడ్జెట్ కేటాయింపులు లేవని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే సీఎం కేసీఆర్ కూతురు కవిత మాత్రం లండన్‌లో హాలీడే ట్రిప్పుల్లో ఉన్నారని డీసీసీ అధ్యక్షుడు ఎ.మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ సింగాపూర్‌కు మరో ట్రిప్పు కోసం సిద్ధమవుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతోందని విమర్శించారు. జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రూ.15 లక్షలు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి, మాజీ మంత్రి వినోద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టీపీసీసీ కార్యదర్శి నరేష్‌జాదవ్, నియోజకవర్గాల నాయకులు అనిల్‌జాదవ్, హరినాయక్, నారాయణరావు పటేల్, సూరిబాబు, శంకర్, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దుర్గాభవాని పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
కలహాల కమలం
* బీజేపీ ధర్నాలో బయటపడ్డ వర్గపోరు * దత్తాత్రేయ పర్యటనలో తేటతెల్లం * జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డికి అవమానం * నగర పార్టీ నేతల తీరుతో ఇబ్బంది * గ్రూపు రాజకీయాలపై శ్రేణుల అసంతృప్తి సాక్షి ప్రతినిధి, వరంగల్ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో వర్గపోరు మళ్లీ బహిర్గతమైంది. కరెంట్ కోతలు, రైతు సమస్యలపై మంగళవారం బీజేపీ నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడిలో విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ కార్యక్రమం బీజేపీ నగర శాఖ, జిల్లా శాఖ నేతల మధ్య పోరుకు వేదిక కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ కార్యక్రమానికిసికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా వచ్చారు. ధర్నా ప్రారంభానికి ముందు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, మరికొందరు ముఖ్య నేతలు మడికొండ వద్దకు వెళ్లి దత్తాత్రేయకు స్వాగతం పలికారు. వీరు హ న్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్దకు చేరుకునే లోపే బీజేపీ నగర శాఖ నేతలు ధర్నా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. పార్టీ జి ల్లా అధ్యక్షుడు, ముఖ్య అతిథి రాకముందే కార్యక్రమం ప్రారంభించడంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మైక్ లాక్కున్న నగర నేతలు ప్రధానంగా జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డికి ఈ పరిస్థితుల్లో నగర పార్టీ నేతలు ఇబ్బందికర పరిస్థితి తెచ్చారు. ధర్నాలో పాల్గొనే నేతలను మాట్లాడేందుకు పిలిచే క్రమంలో అశోక్‌రెడ్డి దగ్గర ఉన్న మైక్‌ను బీజేపీ నగర అధ్యక్షుడు చింతాకుల సునీల్ లాక్కున్నారు. దీంతో చిన్నబుచ్చుకున్న అశోక్‌రెడ్డి వేదికపై నుంచి కిందికి వెళ్లిపోయారు. ధర్నా కార్యక్రమం నుంచి దూరంగా వెళ్లేందుకు ముందుకుసాగారు. దీని కోసం తన వాహనాన్ని తెప్పించుకున్నారు. అశోక్‌రెడ్డితోనే వెళ్లిపోవాలని బీజేపీ గ్రామీణ నేతలు భావించారు. కార్యక్రమానికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో పలువురు నేతలు వెళ్లి అశోక్‌రెడ్డిని వారించారు. వీరు సర్దిచెప్పడంతో ఆయన వేదికపైకి వచ్చారు. బండారు దత్తాత్రేయకు అశోక్‌రెడ్డి పరిస్థితి వివరించారు. అనంతరం మిగిలిన నేతలు ఎవరు మాట్లాకుం డా దత్తాత్రేయ ప్రసంగించారు. తర్వాత కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ర్యాలీలో వెళ్లకూడదని అశోక్‌రెడ్డి భావించారు. అక్కడే ఆగిపోయేందుకు ప్రయత్నించారు. రాష్ట్ర నేత రావు అమరేందర్‌రెడ్డి మరికొందరు ఆయనను వారించి ర్యాలీకి తీసుకెళ్లారు. ధర్నా దగ్గర జిల్లా ముఖ్యనేతల మధ్య విభేదాలను చూసిన బీజేపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆ రోజే విభేదాలకు బీజం గతంలో జిల్లాలో బలమైన పార్టీగా ఉన్న బీజేపీ ఇప్పడు దయనీయంగా ఉంది. ముఖ్యమైన అంశాల్లో పార్టీ విధానాలు, జిల్లా నేతల గ్రూపు రాజకీయాల వల్లే పరిస్థితి దిగజారిందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ జిల్లా ముఖ్యనేతల మధ్య వర్గపోరు ఎప్పటి నుంచో ఉండగా, ఇటీవల కాలంలో బాగా ముదిరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చే ముందు జిల్లాలోని ముఖ్యనేతలు కొందరు ఢిల్లీ వెళ్లారు. రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చాక వీరంతా తిరిగొచ్చారు. అదే రోజున మడికొండ నుంచి హన్మకొండ చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆ రోజు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద జరిగిన సంఘటన బీజేపీ జిల్లా, నగర పార్టీ నేతల మధ్య విభేదాలను బాగా పెంచింది. అమరవీరుల స్తూపం వద్ద నగర పార్టీ నేతల వైఖరి అశోక్‌రెడ్డికి ఇబ్బంది కలిగించింది. అవమానంగా భావించిన అశోక్‌రెడ్డి అక్కడి నుంచే వెళ్లిపోయారు. అప్పటి నుంచి రెండు కమిటీల నేతల మధ్య వర్గపోరు పెరుగుతూనే ఉంది. నగరంలో పార్టీ కార్యక్రమాలన్నీ ఇద్దరు నేతల ఇష్టప్రకారమే జరుగుతున్నాయని.. వీరి వైఖరితో పార్టీ ప్రతిష్ట దిగజారుతోందని బీజేపీ శ్రేణులు వాపోతున్నాయి. ఇలా రెండు కమిటీల మధ్య విభేదాలకు తోడు జిల్లాలోని ముఖ్య నేతలు మార్తినేరి ధర్మారావు, టి.రాజేశ్వరరావు మధ్య వర్గపోరు పార్టీకి మరింత నష్టం చేస్తోంది. రాష్ట్ర నేతలుగా ఉన్న ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు. జిల్లా పార్టీని పటిష్టం చేయడం పక్కన బెట్టి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. బీజేపీ జిల్లా, నగర అధ్యక్ష పదవుల విషయంలోనూ ఇదే వర్గపోరు పార్టీకి నష్టంగా మారిందనే అభిప్రాయం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఉన్న బలంతో.. రాష్ట్రంలోని సమస్యలపై పోరాడి ప్రజల మద్దతును పెంచుకోవాల్సిన బీజేపీ ముఖ్యనేతలు ఇలా వర్గపోరులో మునిగిపోతుండడం కమలం పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేస్తోంది. -
కాంగ్రెస్‌లో లొల్లి
►పొన్నాల సమక్షంలోనే బాహాబాహీ ►ఫ్లెక్సీలో ఫొటో పెట్టలేదంటూ ఫారూక్ వర్గం రచ్చ ►వేదికపైనే ఫారూక్, జానారెడ్డి వాగ్వాదం ►దుబ్బాకలో కార్యకర్తల సమావేశం రసాభాస సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/దుబ్బాక రూరల్: జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు మరోమారు భగ్గుమన్నాయి. అయితే ఈసారి దుబ్బాక వేదిక కావడం గమనార్హం. ఐక్యంగా ఉండి అభ్యర్థిని గెలిపించుకుని, సోనియమ్మకు బహుమతిగా ఇద్దామంటూనే సీనియర్ నేతలు వాగ్వాదానికి దిగటం.. కార్యకర్తలు కూడా రెచ్చిపోవడం విస్మయానికి గురిచేసింది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర పరిశీలకుడు కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలోనే కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు దుర్భాషలాడుతూ బాహాబాహీకి దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. గొడవకు కారణమైన బిజ్జ సత్తయ్య అనే కార్యకర్తను సమావేశం నుంచి బయటకు పంపాలని మాజీ మంత్రి జానారెడ్డి పోలీసులను ఆదేశించడంతో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ వేదిక మీదనే జానారెడ్డితో గొడవపడ్డారు. వీరి గొడవను చూస్తూ పొన్నాల లక్ష్మయ్య మిన్నకుండిపోవడం గమనార్హం. వివరాలలోకి వెళ్తే.. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంతో సోమవారం దుబ్బాకలో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. స్థానిక నీలకంఠ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఈ సమావేశం వద్ద కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకుల ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్ ఫొటో, పేరు లేకపోవడంతో ఆయన వర్గం నాయకులైన బిజ్జ సత్తయ్యతో పాటు మరికొంత మంది సీనియర్లతో వాగ్వాదానికి దిగారు. వెంటనే ఫ్లెక్సీని తొలగించాలని డిమాండ్ చేశారు. ఫారూక్ హుస్సేన్ ఫొటోను పెట్టకుండా అవమానపరిచారంటూ బిజ్జ సత్తయ్య సీనియర్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఐక్యత అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో సమావేశం వేదిక రసాభాసగా మారింది. నాయకుల ఎదుటే సమావేశంలో గొడవ జరగడం విశేషం. గొడవ చేస్తున్న ఫారూక్ హుస్సేన్ వర్గాన్ని సమావేశం నుంచి బయటకు పంపాలని మాజీ మంత్రి జానారెడ్డి పోలీసులను కోరారు. దీంతో పోలీసులు కల్పించుకుని బిజ్జ సత్తయ్యను సమావేశం నుండి బయటకు తీసుకుపోయవారు. కేవలం తన వర్గం వారిని మాత్రమే బయటి పంపడంపై ఎమ్మెల్సీ ఫారూఖ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా ఆయన జానారెడ్డి వద్దకు వెళ్లి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేయగా, జానారెడ్డి తీవ్రంగానే స్పందించారు, దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది చూసి కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. పోలీసుల రంగప్రవేశంతో ఇరు వర్గాలు శాంతించాయి. -
విపక్షంలోనూ గ్రూపు రాజకీయాలు
-
గ్రూప్ పాలిటిక్స్
-
దేశంలో లుకలుకలు!
పార్టీలో చేరే కాంగ్రెస్ నేతలపై మండిపడుతున్న తమ్ముళ్లు ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయం అధినేత చంద్రబాబు ఎదుట పంచాయతీకి సిద్ధం ఆధిపత్య పోరు తెలుగుదేశం పార్టీని కుదిపేస్తోంది. కొత్తగా పార్టీలో చేరే కాంగ్రెస్ నాయకుల వల్ల అసమ్మతి పెరిగిపోతోంది. తమకు ప్రాధాన్యం తగ్గిపోతోందంటూ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చేవారి దూకుడుకు అడ్డుకట్ట వేయకపోతే పార్టీని వీడతామంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: గ్రూపు రాజకీయాలు, అసమ్మతి సెగలతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ రగిలిపోతోంది. కొత్తగా పార్టీలో చేరి అధికారం చెలాయించాలన్న నాయకులకు, ఆది నుంచీ పార్టీలో ఉంటూ అవకాశం కోసం ఎదురు చూస్తున్న మునుపటి నేతలకు మధ్య తలెత్తుతున్న సరికొత్త విభేదాలతో అతలాకుతలమవుతోంది. ఒకపక్క అయ్యన్న, గంటా వివాదం సృష్టిం చిన కలకలం ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటే, మరోపక్క కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల పెత్తనం పాత నేతల్లో ఆగ్రహావేశాలు సృష్టిస్తోంది. ఇప్పటికే పార్టీలో ఉన్న పాత నేతలు పరిస్థితి చక్కదిద్దాలని కోరడానికి ప్రజాగర్జనకు ముందే బాబు వద్ద పంచాయతీ పెట్టనున్నారంటే పరిస్థితి అర్ధమవుతుంది. గొడవకు ‘గంటా’రావం! నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చంద్రబాబు సమక్షంలో హైదరాబాద్‌లో పార్టీలో చేరనున్న నేపథ్యంలో రగడ ముదురుపాకాన పడింది. ఈ పరిణామం నియోజక వర్గాల్లో క్యాడర్లో, నేతల్లో చిచ్చుపెడుతోంది. పెందుర్తి, భీమిలి, గాజువాక, ఎలమంచిలి నియోజకవర్గాల్లో పార్టీని ఏళ్లతరబడి నమ్ముకుంటే ఇప్పుడు వీరొచ్చి ఆ సీట్లు తమవేనని ప్రకటిస్తూ ఉండడం పార్టీలో చిచ్చు రేపుతోంది. గంటా బృందం ఏకపక్షంగా చేస్తున్న ప్రకటనలతో ప్రస్తుత పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు కారాలు మిరియాలు నూరుతున్నారు. భీమిలి ఎమ్మెల్యే అవంతి టీడీపీలో చేరినప్పటినుంచి విశాఖ ఉత్తరం సీటు తనదేనని చాటుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భరణికాన రామారావు మండిపడుతున్నారు. తమను సంప్రదించకుండానే చేస్తున్న ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. గంటా వైఖరిపై ఇన్చార్జిలు, కొందరు మాజీ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటినుంచే తమపై పెత్తనాన్ని వీరంతా సహించలేకపోతున్నారు. భరణికాన బుధవారం క్యాడర్‌తో సమావేశమై అవంతి వైఖరిపై చర్చిం చారు. గంటా బృందాన్ని అలాగే కొనసాగనిస్తే భవిష్యత్తులో తమకు ప్రాధాన్యం ఉండదని, క్యాడర్‌కూ నష్టమని తీర్మానించారు. భీమిలిలో సీనియర్ నేత, మాజీ మంత్రి అప్పలనరసింహరాజు కూడా అవంతి వైఖరిపై గుర్రుగా ఉన్నారు. పెందుర్తిలోనూ అదే పరిస్థితి. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న పంచకర్ల చేరికతో అక్కడున్న సీనియర్ నేత బండారు సైతం లోలోపల గుబులు చెందుతున్నారు. బాబు వద్ద గంటా చక్రం తిప్పి పంచకర్లకు సీటు ఇప్పించుకుంటారేమోనని క్యాడర్ అనుమానాలు వ్యక్తం చేస్తుండడంతో బండారు కలత చెందుతున్నారు. పాయకరావుపేటలోనూ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ఎమ్మెల్యే కన్నబాబురాజు పదేళ్లపాటు పార్టీ కార్యకర్తలను, నేతలను ఇ బ్బందులకు గురి చేశారని వీరు ఆరోపిస్తున్నా రు. అటువంటి వ్యక్తిని పార్టీలో ఎలా చే ర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. గంటా బృందాని కి వ్యతిరేకంగా నేతలంతా ఈ నెల 12న ప్ర జాగర్జన సభకు హాజరుకానున్న బాబు ముం దు పంచాయతీ పెట్టాలని నిర్ణయించారు. -
అదిలాబాద్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు
-
తుమ్మలకు ‘నామా’లు!
ఎంపీ ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఎమ్మెల్యే వర్గం సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా తెలుగుదేశం పార్టీలో ముఠా తగాదాలు మరోసారి బట్టబయలయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అవుతున్న తరుణంలో తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం అధినేత చంద్రబాబు నాయకుడు సమక్షంలో శనివారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ పదిజిల్లాల స్థాయి సమావేశానికి, అనంతరం జరిగిన జిల్లా పార్టీ సమీక్షా సమావేశానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గం డుమ్మా కొట్టింది. స్వయంగా తుమ్మలతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు సండ్ర వెంకటవీరయ్య, ఇతర నాయకులు ఈ సమావేశాలకు హాజరుకాలేదు. జ్వరం వచ్చిందని తుమ్మల, తోడల్లుడి కర్మ పేరుతో వెంకటవీరయ్యలు వెళ్లలేదు. తుమ్మల వర్గం నుంచి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాత్రమే హాజరయ్యారు. మరోవైపు ఎంపీ నామా నాగేశ్వరరావు వర్గం ఈ సమావేశాల్లో హవా నడిపించింది. ఆయన వర్గానికి చెందిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావుతో పాటు ముఖ్య నేతలంతా సమావేశాలకు వెళ్లారు. ఇల్లెందు ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య మాత్రం ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కీలక సమావేశానికి తుమ్మల వర్గం డుమ్మా కొట్టడం వెనుక కారణాలు లేకపోలేదని పార్టీ వర్గాలంటున్నాయి. ఒకప్పుడు జిల్లా పార్టీలో వెలుగొందిన తుమ్మలను అన్ని రకాలుగా అణగదొక్కేందుకు ఎంపీ నామా ప్రయత్నాలు చేయడం.. ఇందుకు స్వయంగా పార్టీ అధినేత సహకారం అందిస్తున్న కారణంగా తాము పార్టీలో సరిగా ఇమడలేకపోతున్నామని తుమ్మల వర్గీయులంటున్నారు. పట్టుకోసం ఎత్తులు.... పార్టీలో ఆధిపత్యం కోసం, తుమ్మల నాగేశ్వరరావుపై పట్టు సాధించేందుకు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పనిచేస్తున్న నామా నాగేశ్వరరావు ఇటీవలి కాలంలో తన దూకుడును మరింత పెంచారు. పార్టీ అధినేతతో ఉన్న ‘సంబంధాల’తో వీలుంటే ప్రత్యక్షంగా, లేదంటే పరోక్షంగా తుమ్మల వర్గంతో సై అంటే సై అన్నారు. ఒక దశలో తుమ్మల ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గం నుంచి కూడా తన మార్కు నిరూపించుకునేందుకు నామా పెద్ద ప్రణాళికనే రూపొందించారు. అవసరమైతే తుమ్మలకు పోటీగా ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థిగా తన వర్గీయుడి పేరును కూడా ఆయన పార్టీల పెద్దల వద్ద ప్రస్తావనకు తెచ్చినట్లు తెలిసింది. ఇక, తుమ్మల వర్గం బలంగా ఉన్న పాలేరు నియోజకవర్గంలో కూడా ఆయన చేయని ప్రయత్నం లేదు. తన వర్గానికి చెందిన మద్దినేని బేబీ స్వర్ణకుమారిని ఏకంగా పార్టీ అభ్యర్థిగానే ప్రకటించేసి పెద్ద దుమారమే సృష్టించారు. దీనికి తోడు పుండు మీద కారం చల్లినట్లు తుమ్మల వర్గానికి చెందిన ముగ్గురు నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. దీంతో తుమ్మల వర్గం నామా ఆధిపత్యంపై ప్రత్యక్ష పోరాటానికే దిగింది. పాలేరుకు చెందిన దాదాపు 200 మంది కార్యకర్తలు పార్టీ జిల్లా కార్యాలయానికి వచ్చి పార్టీ అధ్యక్షుడు కొండబాలతో వాదనకు దిగారు. నామా ఇంటి ముందు టెంట్ వేస్తామని హెచ్చరించడంతో సస్పెన్షన్లను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇక తుమ్మల సొంత నియోజకవర్గంలో కూడా నామా తనదే పైచేయి అని చూపించుకునే ప్రయత్నం చేశారు. తుమ్మల సొంత మండలానికే చెందిన నాగప్రసాద్ అనే వ్యాపారవేత్తను తెరపైకి తెచ్చారు. హంగూ, ఆర్భాటాలతో పార్టీలో చేర్చించి పాలేరు తుమ్మల వర్గం అభ్యర్థి అయిన బాలసానికి పోటీగా నిలిపారు. అదే విధంగా సత్తుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సండ్ర వెంకటవీరయ్య అనుచరులను కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. మొత్తం మీద తుమ్మలతో పాటు ఆయన ప్రధాన అనుచరులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలను కూడా బలహీనపరచడం ద్వారా పూర్తిగా జిల్లాలో తన హవా మాత్రమే ఉండాలనే రీతిలో నామా వేసిన ఎత్తులు ఇరు వర్గాల మధ్య తీవ్ర విభేదాలను రగిలించాయి. పూలమ్మిన చోటే..... ఇక ఒకప్పుడు జిల్లాలో టీడీపీ అంటేనే తుమ్మల... తుమ్మల అంటేనే టీడీపీ అనే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఆ చిత్రం మారిపోయింది. నామా నాగేశ్వరరావు రూపంలో తుమ్మలకు జిల్లాలో గట్టి పోటీ ఎదురవుతోంది. ఆర్థికంగా, సామాజికంగా, ఇతర కోణాల్లో కూడా నామా తనదైన శైలిలో ముందుకెళుతూ తుమ్మలను వెనక్కు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వర్గాల నుంచి కూడా నామాకు పెద్ద ఎత్తున సహకారం అందుతున్నట్లు ప్రచారం. జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం శ్రమించిన తుమ్మలను వీలున్నంత వరకు వాడుకుని ఆ తర్వాత తనకు ‘అన్ని రకాలుగా’ ఉపయోగపడే నామా దొరకడంతో ఇప్పుడు ఆయనను చంద్రబాబు పక్కనపెడుతున్నారని, నామాపై తుమ్మల వర్గం చేస్తున్న ఫిర్యాదులను అసలు పట్టించుకునే పరిస్థితి కూడా లేదని తుమ్మల వర్గీయులు వాపోతున్నారు. రానురాను తుమ్మల పేరే పార్టీలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని, ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందని, అంతా నామా నాగేశ్వరరావు పెత్తనమే ఉంటే ఇక పార్టీలో తామెందుకు ఉండాలని వారంటున్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికలను పార్టీ ఎలా ఎదుర్కొంటుందో, గ్రూపు గొడవలతో ఎలా గట్టెక్కుతుందోనన్న ఆవేదన సగటు తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. -
భగ్గుమన్న కాంగ్రెస్ వర్గ విభేదాలు
-
రేణుక, రాంరెడ్డి వెంకటరెడ్డి వర్గాల ఘర్షణ
-
రాష్ట్ర కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేధాలు