
'మూడు’ ముక్కలాట
–ఎంపీ జేసీ, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మధ్య ఆధిపత్యపోరు
– అనంతపురంపై ప్రత్యేక దృష్టి సారిస్తోన్న జేసీ
– 2019లోపు 'అనంత' అసెంబ్లీలోని టీడీపీ వర్గీయులను గుప్పిట్లో పెట్టుకునే వ్యూహం
– మేయర్‌తో పూర్తిగా విభేదిస్తున్న ఎమ్మెల్యే చౌదరి వర్గీయులు
– ఎంపీ, ఎమ్మెల్యేతో విభేదించి ఏకాకిగా మారిన మేయర్ స్వరూప
సాక్షి ప్రతినిధి, అనంతపురం : 'అనంత' టీడీపీ మూడు ముక్కలైంది. కీలక ప్రజాప్రతినిధులైన ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్ మూడు గ్రూపులుగా విడిపోయారు. వీరితో పాటు ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు కూడా వర్గాలుగా చీలిపోయారు.వీరి విభేదాల కారణంగా అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్‌తో పాటు పలుశాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ నేత ఆదేశాలు, మరోనేత బెదిరింపులతో ఎటు వెళ్లాలో పాలుపోనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 'అనంత'ది ప్రత్యేక స్థానం. జిల్లా కేంద్రం కావడం, ఇక్కడ టీడీపీ అత్యంత బలహీనంగా ఉండటంతో ఆ పార్టీ కూడా ఈ అసెంబ్లీపై ఎప్పుడూ ఆశలు పెట్టుకోలేదు. టీడీపీ ఆవిర్భావంలో మినహా ఆపై మూడు దశాబ్దాలలో ఆ పార్టీకి ఇక్కడ విజయం దక్కలేదు. అయితే.. 2014 ఎన్నికల్లో ఊహించనివిధంగా అప్పటికే రెండుసార్లు పోటీచేసి ఓడిపోయిన మహాలక్ష్మి శ్రీనివాస్‌ను కాదని ప్రభాకర్‌చౌదరికి టిక్కెట్టు ఇచ్చారు. ఎన్నికల్లో ఈయన విజయం సాధించారు. ఆ తర్వాత ఎంపీ జేసీ, ఎమ్మెల్యే చౌదరి వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. 'అనంత'లోని ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేస్తూ రాజకీయంగా, వ్యక్తిగతంగా 'మైలేజీ' సాధించేందుకు ఇరువురూ యత్నిస్తున్నారు.
రాంనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటే, మంచినీటి పైపులైన్ పనుల్లో జేసీ వర్గం జోక్యం చేసుకుంటోంది. కార్పొరేషన్‌లో కులపిచ్చి పెరిగిపోయిందని, అవినీతి ఉచ్చులో కూరుకుపోయిందని జేసీ చేసిన వ్యాఖ్యలతో కార్పొరేషన్‌లో కుదుపు ఏర్పడింది. దీనిపై ఏకంగా సీఎంకు లిఖిత పూర్వక ఫిర్యాదు కూడా జేసీ చేశారు. ఈక్రమంలో అవినీతి మరకలు తనకు అంటకుండా బయటపడేందుకు చౌదరి యత్నించారు. కమిషనర్ ఓబులేసుకు పొగ»పెట్టి, ఆపై స్వరూపపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో రాజారావు మినహా తక్కిన సభ్యులు మేయర్‌కు వ్యతిరేకంగా పనిచేశారు.ఎన్నికలను కూడా వారు బహిష్కరించి మేయర్ తీరుపై విమర్శలు గుప్పించారు. ఇవన్నీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతున్నాయని భావించిన మేయర్ వర్గం ఆయనతో విభేదిస్తోంది.
అసలు వ్యూహం ఇదేనా?!
'అనంత'లో ఆధిపత్యపోరు వెనుక అసలు వ్యూహం ఏంటనే విషయంపై నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో 'అనంత' అసెంబ్లీని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని జేసీ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. జిల్లాలో సామాజిక సమీకరణలను బేరీజు వేస్తూ ఆ ఖాతాలో 'అనంత'ను తమ చేతుల్లోకి తీసుకోవాలన్న యోచనతో ముందుకెళుతున్నట్లు సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇటీవల ఓ వెబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా 'అనంత' అసెంబ్లీపై జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ..'అనంత చౌదరి జాగీరు కాదు. మాకూ ఇక్కడ హక్కు ఉంది. రాజకీయ చదరంగం ఎవరు ఎలాగైనా ఆడొచ్చని' పరోక్షంగా తమ ఉద్దేశాన్ని బయటపెట్టారు.
ఈ వ్యాఖ్యలకు బలం చేకూరేలా ఎంపీ దివాకర్‌రెడ్డి కూడా పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తక్కిన ఆరింటిని పక్కనపెట్టి 'అనంత'పైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కాలువల పూడికతీత పేరుతో రెండురోజులుగా నగరంలో స్వయంగా పనులు పర్యవేక్షిస్తున్నారు. గురువారం ఆయన తనయుడు పవన్‌కుమార్‌రెడ్డితో కలిసి నగరంలో పర్యటించారు. వీరిద్దరితో పాటు జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా ఇటీవల 'అనంత నగరాభివృద్ధి వేదిక’ పేరుతో వారి అనుచరుడు కోగటం ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరయ్యారు. టీడీపీకి చెందిన కార్పొరేటర్ హరిత భర్త జయరాంనాయుడుతో పాటు ఉమామహేశ్వర్, పలువురు కార్పొరేటర్లు జేసీ బాటలో నడుస్తున్నారు. మొత్తమ్మీద కార్పొరేటర్ల నుంచి కిందిస్థాయి కేడర్ దాకా నియోజకవర్గంలో టీడీపీ మూడు వర్గాలుగా చీలిపోయింది.
అధికారుల అవస్థ
టీడీపీ నేతల ఆధిపత్యపోరుతో అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి చేస్తున్న పనులకు వెళితే ఎమ్మెల్యే, మేయర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెళ్లకపోతే జేసీతో ఇబ్బందులు. ఇదే క్రమంలో కార్పొరేషన్ పనుల్లో మేయర్ ఒకలా, ఎమ్మెల్యే మరోలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో ఎటు మొగ్గాలో, ఎవరు చెప్పినట్లు వినాలో తెలీక అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఒకానొకదశలో ఈ ఉద్యోగం వద్దు...ఎక్కడికైనా బదిలీ చేయించుకుని వెళదామనేలా తమ పరిస్థితి ఉందని కార్పొరేషన్‌కు చెందిన ఓ అధికారి 'సాక్షి'తో ఆవేదన వ్యక్తం చేశారు. నేతల వైఖరి కారణంగా టీడీపీ కేడర్ కూడా మూడు ముక్కలుగా చీలిపోవడంతో ప్రస్తుతం ఆ పార్టీ అత్యంత బలహీనంగా తయారైంది. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న తాము అధికారం మిగిలిఉన్న ఈ రెండున్నరేళ్లలోనైనా కాస్త లబ్ధిపొందాలనే యోచనలో కేడర్ మౌనంగా ఉందని, 2019 ఎన్నికల్లో మాత్రం పార్టీతో పాటు ప్రజాప్రతినిధులకు తీవ్ర ప్రతికూల పరిస్థితులు తప్పవని ఆ పార్టీలోని కీలక వ్యక్తులు అంటున్నారు.