ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వ్యవహారం జిల్లా టీడీపీలో చిచ్చు రేపింది. వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలంటే యర్రగొండపాలెం, కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మార్కాపురం ఇన్‌చార్జిని తప్పించాల్సిందేనని ఆయన సీఎం వద్ద పంచాయితీ పెట్టారు. మాగుంట ప్రతిపాదనకు సీఎం సైతం ఓకే చెప్పారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పునకు కసరత్తు మొదలైంది. దీంతో ఎమ్మెల్సీ మాగుంటపై బాధిత సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కొందరు నియోజకవర్గ ఇన్‌చార్జులు మండిపడుతున్నారు. ఇది జిల్లా టీడీపీలో వర్గ విభేధాలను మరింత పెంచింది.
మాగుంటకు బాబు బుజ్జగింపు..
ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటికే అధికార టీడీపీ వెనుకబడిపోయింది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులురెడ్డి ఓటమి చెందారు. పశ్చిమ ప్రకాశంలో వైఎస్సార్ సీపీకి తిరుగులేని ఆదరణ ఉంది. అన్ని వర్గాలు ఆ పార్టీకి మద్దతు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవరూ ముందకు రాని పరిస్థితి. దీంతో తిరిగి మాగుంటను పోటీ చేయిస్తే కొంతమేరైనా పోటీ ఇస్తాడని సీఎం భావించారు. మంత్రి పదవి ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ మాగుంటను సీఎం బుజ్జగించారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేయాలని, తాను అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని మాగుంటకు హామీ ఇచ్చారు. సీఎం ఒత్తిడితో మాగుంట అంగీకారం తెలిపినట్లు సమాచారం.
షరతులకు సీఎం అంగీకారం..
తాను పోటీ చేయాలంటే పార్లమెంటు పరిధిలో టీడీపీలో భారీ మార్పులు చేయాలని మాగుంట సీఎం వద్ద ఆంక్షలు పెట్టారు. ప్రధానంగా కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, యర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యే డేవిడ్‌రాజులను మార్చి కొత్త అభ్యర్థులకు అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలని షరతు పెట్టారు. కనిగిరి నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేకు టిక్కెట్ ఇవ్వాలంటూ మాగుంట కండిషన్ పెట్టారు. ఇక యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఓ ఐఏఎస్ అధికారిని తానే తీసుకొచ్చి పోటీకి నిలుపుతానని మాగుంట చెప్పినట్లు సమాచారం. ఇక మార్కాపురం ఇన్‌చార్జిగా ఉన్న కందుల నారాయణరెడ్డికి కాకుండా వేరొక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వాలని మాగుంట డిమాండ్ చేశారు.
దర్శి నియోజకవర్గం నుంచి కూడా మంత్రి శిద్దా రాఘవరావును తప్పించే పక్షంలో ఎమ్మెల్సీ కరణం బలరాం కుటుంబానికి చెందిన వ్యక్తిని అక్కడి నుంచి పోటీ చేయించాలని సూచించినట్లు సమాచారం. మాగుంట షరతులకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. మార్పు చేర్పులకు కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని కొత్త అభ్యర్థుల విజయానికి సహకరించాలని, మీకు తగిన న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కనిగిరి, యర్రగొండపాలెం ఎమ్మెల్యేలతో పాటు మార్కాపురం ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డికి కూడా చెప్పినట్లు సమాచారం.
ఎమ్మెల్సీపై ఫైర్..
వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్లు ఇవ్వవద్దంటూ ముఖ్యమంత్రికి చెప్పడంపై కనిగిరి, వై.పాలెం ఎమ్మెల్యేలె బాబూరావు, డేవిడ్‌రాజు, మార్కాపురం ఇన్‌చార్జ్ కందుల నారాయరెడ్డిలు మాగుంటపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న తమను తప్పించడమేమిటంటూ వారు మంత్రి శిద్దా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, సీనియర్ నేత ఎమ్మెల్సీ కరణం బలరాం తదితరుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. తమను కాదని వేరొకరికి అసెంబ్లీ టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని వారు రాష్ట్ర స్థాయి టీడీపీ ముఖ్య నేతలకు సైతం తేల్చి చెప్పారు. తనకు టికెట్ రాకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆరు నూరైనా తానే వచ్చే ఎన్నికల్లో కనిగిరి నుంచి పోటీ చేస్తానని బాబూరావు ఇప్పటికే సవాల్ విసురుతున్నట్లు తెలుస్తోంది.
కాదూ కూడదని కొత్త అభ్యర్థిని పోటీలో నిలిపితే తాను వ్యతిరేకంగా పనిచేస్తానంటూ పార్టీ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇక డేవిడ్ రాజు సైతం వచ్చే ఎన్నికల్లో యర్రగొండపాలెం కాకపోయినా జిల్లాలో వేరొక చోటైనా తనకు టిక్కెట్ ఇస్తేనే పార్టీ అభ్యర్థుల విజయానికి పనిచేస్తానని, అలా కాకుండా తనను వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పిస్తే యర్రగొండపాలెం, సంతనూతలపాడులో టీడీపీ అభ్యర్థుల ఓటమికి పనిచేస్తానని హెచ్చరించినట్లు తెలుస్తోంది. మార్కాపురం నియోజకవర్గంలో ఇన్నాళ్లూ పార్టీకోసం పనిచేసిన తనను కాదని వేరొకరికి టికెట్ ఇవ్వాలనుకోవడంపై కందుల నారాయణరెడ్డి మండిపడుతున్నట్లు సమాచారం. మాగుంట ఒత్తిడితోనే టీడీపీ అధిష్టానం అభ్యర్థుల మార్పుకు సిద్ధపడిందన్న ప్రచారం నేపథ్యంలో బాధిత నేతలు అధిష్టానంతో పాటు మాగుంట పైనా రగిలిపోతున్నారు. ఇప్పటికే జిల్లాలో గ్రూపుల గోలతో సతమతమవుతున్న టీడీపీని మాగుంట తాజా డిమాండ్ల వ్యవహారం మరింత ఇరకాటంలోకి నెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment