తాండూరు ‘కారు’లో చిచ్చురేగింది. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఆధిపత్య పోరు చినికిచినికి గాలివానలా మారింది. అధికార పార్టీలో ఉన్న ఇద్దరు నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు తార స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాలుగా విడిపోయిన నాయకులు ఒకరిపై ఒకరు మాటల కత్తులు దూసుకుంటున్నారు.
చదవండి: కేసీఆర్ క్లారిటీకి వచ్చారా?
తాండూరు(వికారాబాద్ జిల్లా): ఇద్దరు బలమైన నేతల నడుమ.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు నలిగిపోతున్నారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గాల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. ప్రస్తుతం ఈ గొడవ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ విషయం పలుమార్లు అధిష్టానం దృష్టికి వెళ్లినా రాజీ కుదరలేదు. దీంతో సదరు నాయకులిద్దరూ ఎవరికివారే తెరవెనుక గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ వచ్చారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టికెట్ తనకేనని ఇరువురూ బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డిని ఫోన్‌లో దూషించారనే ఆడియో వైరల్‌గా మారింది.
తివాచీతో ముదిరిన వివాదం
జిల్లాలో తాండూరు రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అసెంబ్లీకి ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చనే సంకేతాల నేపథ్యంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇదే సమయంలో ఇరు వర్గాలకు చెందిన నాయకులు పైచేయి కోసం ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న ఈ వ్యవహారం ఇటీవల జరిగిన భద్రేశ్వర రథోత్సవం నేపథ్యంలో మరోసారి బయటపడింది. ప్రొటోకాల్ ప్రకారం అధికారులు, నిర్వాహకులు నేతలకు సరైన ప్రాధాన్యం ఇవ్వాలి. రథోత్సవానికి ముందుగా హాజరైన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి వెళ్లి కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన వేదికపై కూర్చున్నారు.
ఆ తర్వాత ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వచ్చారు. ఆయన ఎమ్మెల్సీ పక్కన కూర్చోకుండా.. వారి ముందు మరో తివాచీ వేయించుకుని తన వర్గీయులతో కూర్చున్నారు. దీంతో ఎమ్మెల్సీ వర్గం వారు వెనుక వరుసలోకి వెళ్లారు. దీనిపై లోలోపల మండిపడిన మహేందర్‌రెడ్డి వర్గీయులు వేడుకలకు ఆటంకం కలిగించవద్దనే ఉద్దేశంతో మిన్నకుండిపోయారు. ఈ విషయంలో తమకు అవమానం జరిగిందని భావించిన ఎమ్మెల్సీ మరునాడు సీఐ రాజేందర్‌రెడ్డికి ఫోన్ చేసి మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఐని దుర్భాషలాడినట్లు ఉన్న ఆడియోలను ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
తోఫాల పంపిణీలో రగడ
రంజాన్ సందర్భంగా గత మంగళవారం యాలాల, బషీరాబాద్, తాండూరులో తోఫాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సమయంలో ప్రొటోకాల్ పాటించలేదని ఎమ్మెల్సీ వర్గీయులు అధికారులపై మండిపడ్డారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌ఐ అరవింద్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రెండున్నరేళ్లుగా వార్..
తాండూరు టీఆర్‌ఎస్‌లో రెండున్నరేళ్లుగా రచ్చ సాగుతోంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి పోటీ చేసిన మహేందర్‌రెడ్డిపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రోహిత్‌రెడ్డి విజయం సాధించారు. ఆరు నెలల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత రోహిత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆరోజు నుంచి ఇరువర్గాల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంపై పట్టుసాధించేందుకు నేతలిద్దరూ సిద్ధమయ్యారు. పోటాపోటీగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
సర్వాత్ర విమర్శలు..
తాండూరులో టీఆర్‌ఎస్ పార్టీ నేతల తీరుపై సర్వ త్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ టీఆర్‌ఎస్ బలంగా ఉంది. ఇద్దరు బలమైన నేతలు ఒకే పార్టీలో ఉండటం, ఇరువురికి పొసగక తరచూ గొడవలు జరగడంపై అధికార పార్టీ అభిమానులు, ప్రజలు విమర్శలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment