ఇకనైనా గ్రూపు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని తెలంగాణ పీసీసీ...
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్/నిర్మల్‌టౌన్ : ఇకనైనా గ్రూపు రాజకీయాల కు స్వస్తి చెప్పాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా ముఖ్య నాయకత్వానికి హితభోద చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలందరినీ కలుపుకుని పోవాలని, లేకుంటే పార్టీ మరోమారు నష్టపోవాల్సి వస్తుందని ఆయన కొత్తగా ఎంపికైన డీసీసీ అధ్యక్షుడు ఎ.మహేశ్వర్‌రెడ్డికి సూచించారు.
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ న మోదు కార్యక్రమంలో భాగంగా నిర్మల్‌కు వచ్చిన పొన్నాల నేరుగా మహేశ్వర్‌రెడ్డి నివాసంలో జిల్లా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. కొన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జీలు కొంత అభద్రతా భావం తో ఉన్నారని బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల ఇన్‌చార్జీలనుద్దేశించి పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పొన్నాల కార్యకర్తలనుద్దేశించి మా ట్లాడారు.
కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గాల్లో అభిప్రాయ భేదాలుంటాయి కానీ నేతలందరూ కార్యకర్తల మనోభావాలకు అణుగునంగా వ్యవహరించాలని నాయకులకు సూచించారు. సభ్యత్వ నమోదు ప్రగతిపై ఈనెల 23న నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తామన్నారు. కేసీఆర్ పాలన తీరుపై తనదైన శైలిలో విమర్శించిన పొన్నాల.. కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. అనంతరం నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నాయకులు, కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు.
దసరా, దీపావళి వాయిదాలు చెల్లవు..
రెండు బెడ్‌రూంల ఇల్లు నిర్మించి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేసీఆర్ దసరా, దీపావళి వాయిదాలు పెడుతున్నారని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఎద్దేవా చేశారు. కేసీఆర్ హామీ మేరకు దళితులందరికీ మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని పక్షంలో తాము అధికార పార్టీ నేతల ఇళ్ల ఎదుట ధర్నాలు, శవయాత్రలు చేపడుతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జిల్లాలో జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మంజూరైందని మాజీ ఎంపీ వివేక్ పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ నెరవేరేలా బడ్జెట్ కేటాయింపులు లేవని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే సీఎం కేసీఆర్ కూతురు కవిత మాత్రం లండన్‌లో హాలీడే ట్రిప్పుల్లో ఉన్నారని డీసీసీ అధ్యక్షుడు ఎ.మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ సింగాపూర్‌కు మరో ట్రిప్పు కోసం సిద్ధమవుతున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతోందని విమర్శించారు. జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రూ.15 లక్షలు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి, మాజీ మంత్రి వినోద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టీపీసీసీ కార్యదర్శి నరేష్‌జాదవ్, నియోజకవర్గాల నాయకులు అనిల్‌జాదవ్, హరినాయక్, నారాయణరావు పటేల్, సూరిబాబు, శంకర్, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దుర్గాభవాని పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు.