నూజివీడు: ఇంకా టీడీపీలో చేరనేలేదు... ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించలేదు... టికెట్ ఇస్తామని ప్రకటించలేదు... కానీ, అప్పుడే కొలుసు పార్థసారథి నూజివీడులో గ్రూపు రాజకీయాలు మొదలు పెట్టారు. దీంతో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వర్గం మండిపడుతోంది. ఇప్పటికే ఇక్కడ టీడీపీలో ఉన్న గ్రూపుల గోల సరిపోదన్నట్లు... పార్థసారథి రాకముందే మరో కొత్త గ్రూపును తయారు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మొదట ప్రగల్బాలు.. చివరకు సొంత సామాజికవర్గ నేతకు ఎసరు
గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పెనమలూరు నియోజకవర్గం నుంచి కొలుసు పార్థసారథి పోటీ చేసి విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ పెనమలూరు నుంచి సీటు ఇవ్వడం సాధ్యం కాదని, ప్రత్యామ్నాయం ఆలోచిద్దామని వైఎస్సార్‌సీపీ అధిష్టానం పార్థసారథికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. ఇందుకు ఆయన అంగీకరించకుండా తాను పెనమలూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. అదే సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును రహస్యంగా కలిసి ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు.
కానీ, అక్కడ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడ్డం తిరగడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. పెనమలూరు తనకు కావాల్సిందేనని బోడే ప్రసాద్ గట్టిగా పట్టుపట్టారని, బీసీ నేత ముద్దరబోయిన అయితే మౌనంగా వెళ్లిపోతారని పార్థసారథిని నూజివీడు నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించినట్లు ప్రచారం సాగుతోంది.
చివరకు తాను పెనమలూరు నుంచే పోటీ చేసి గెలుస్తానని ప్రగల్బాలు పలికిన పార్థసారథి కూడా అస్త్రసన్యాసం చేశారు. పెనమలూరులో బోడే ప్రసాద్‌ను తప్పించి తనకు సీటు ఇవ్వాలని చంద్రబాబును అడిగే ధైర్యం చేయలేక నూజివీడు వచ్చి పదేళ్లుగా టీడీపీని నమ్ముకుని ఉన్న తన సొంత సామాజికవర్గ నేతకు అన్యాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
ముద్దరబోయిన ఫొటోల తొలగింపు
నూజివీడు మండలం రావిచర్లలోని ఓ టీడీపీ నాయకుడి ఇంట్లో బుధవారం జరిగే శుభకార్యానికి పార్థసారథి హాజరుకానున్నట్లు తెలిసింది. ఆయనకు స్వాగతం పలుకుతూ మంగళవారం నూజివీడు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిలో ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫొటో కూడా ఉంది. పార్థసారథి కనీసం టీడీపీలో చేరకుండానే ఆయనకు స్వాగతం పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ముద్దరబోయిన వర్గం కంగుతింది. దీనిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తిని వారు నిలదీయగా.. తనకు ఇద్దరు నాయకులు కావాలని, అందుకే ఇద్దరి ఫొటోలు వేశానని అతను చెప్పినట్టు సమాచారం.
ఇద్దరి ఫొటోలు ఉండటానికి వీల్లేదని ముద్దరబోయిన వర్గం స్పష్టం చేసింది. ముద్దరబోయిన ఫొటోను తీసేయాలని, లేకపోతే తామే తమ నాయకుడి ఫొటోను తొలగిస్తామని హెచ్చరించింది. ఆ తర్వాత ఫ్లెక్సీలపై ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫొటోను వారే కట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం నూజివీడులో హాట్ టాపిక్‌గా మారింది. పార్థసారథి అధికారికంగా టీడీపీలోకి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఈ గ్రూపుల గోల మరింత పెరిగే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
పదేళ్ల నుంచి పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న నేతను అధిష్టానం విస్మరించడం, మరోసారి వలస నేతను తీసుకురావడం, ఆయన మరో కొత్త వర్గాన్ని తయారు చేసుకునే పని ప్రారంభించడంపై నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నాయకులు సైతం మండిపడుతున్నారు. నియోజకవర్గంలో గ్రూపుల గోల వల్ల ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఓడిపోయామని, తాజా పరిణామాలు కూడా రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment