కాంగ్రెస్ పార్టీకి ఇంటిపోరు ఎక్కువైంది. గ్రూపు రాజకీయాలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి నెలకొంది. టీఆర్‌ఎస్ పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని.. అది కాంగ్రెస్ పార్టీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కిస్తుందని చెబుతున్న రాష్ట్ర నేతలకు ఉమ్మడి జిల్లాలో గ్రూపుల లొల్లి ప్రధాన అడ్డంకిగా మారబోతోంది. ముఖ్యనేతలే పార్టీలో విభేదాలకు, వర్గపోరుకు ఆజ్యం పోస్తున్నారని, టీఆర్‌ఎస్ పార్టీకి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సఖ్యత లేదు. మండల స్థాయిలో గొడవలు పడి రచ్చకెక్కుతున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకుంటున్నారు. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలతో క్యాడర్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో అద్దంకి దయాకర్ ఓటమికి కారణమంటూ సస్పెండ్ చేసిన వడ్డేపల్లి రవిని రెండు రోజుల క్రితం తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకోవడం పార్టీలో గ్రూపు రాజకీయాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది.
తుంగతుర్తి నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో అద్దకి దయాకర్‌తో పాటు వడ్డేపల్లి రవి టికెట్ అశించారు. పార్టీ టికెట్ దయాకర్‌కు ఇవ్వడంతో రవి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని అప్పట్లో సస్పెండ్ చేసింది. ఆ తరువాత ఆయన టీఆర్‌ఎస్‌లో చేరినా అక్కడ సరైన గుర్తింపు లభించలేదని తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చే ప్రయత్నాలు చేశారు. ఇంకోవైపు నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం లేదని దయాకర్‌పైనా విమర్శలు ఉన్నాయి. దాన్ని ఆసరాగా చేసుకొని రవి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రవిపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయకముందే ఎలా పార్టీలో చేర్చుకుంటారని, ఆ చేరిక చెల్లదని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న ప్రకటించారు. మరోవైపు దయాకర్ కూడా ఆయన చేరికపై పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు.
సూర్యాపేటలోనూ..
సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డికి అనుచరులు ఉన్నారు. ఆయన్ని రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నాలను సొంత పార్టీ వారే చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఒకప్పుడు దామోదర్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న రవి వర్గీయులు 2018 ఎన్నికల్లో సూర్యాపేటలో దామోదర్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. దీంతో రవిని దామోదర్‌రెడ్డి దూరంపెట్టారని అంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేయాలని భావిçస్తున్న రవి తనకు పార్టీ పెద్దల మద్దతు అవసరమనే యోచనతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని సంప్రదించారని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. పైగా సూర్యాపేట కాంగ్రెస్ నేత, రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు పటేల్ రమేష్‌రెడ్డి మద్దతు కూడా రవికి ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో దామోదర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వారు కోమటిరెడ్డి వద్దకు చేరుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఎవరి ప్రయత్నాలు వారివే..
దేవరకొండ నియోజకవర్గంలో వర్గ పోరు ఉన్నా పెద్దగా బయట పడటం లేదు. అక్కడ మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్, కాంగ్రెస్ పార్టీ ఆదివాసి జాతీయ కోఆర్డినేటర్ నేనావత్ కిషన్‌నాయక్ టికెట్ ఆశించి ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడతాడనే ప్రచారంతో మాజీ మంత్రి పాల్వాయి స్రవంతి తన వర్గాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. నల్లగొండ, హుజూర్‌నగర్, కోదాడ, నాగార్జునసాగర్‌లో గ్రూపు రాజకీయాలు లేవు. నల్లగొండలో కోమటిరెడ్డి, హుజూర్‌నగర్, కోదాడలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నాగార్జునసాగర్‌లో జానారెడ్డికి ఎదురుగా వెళ్లి టికెట్ కావాలని సాహసించే నాయకులు పెద్దగా లేరు.
బీఎల్‌ఆర్ వర్సెస్ శంకర్‌నాయక్
మిర్యాలగూడలో సామాజిక వేత్త బత్తుల లక్ష్మారెడ్డి(బీఎల్‌ఆర్), డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ మధ్య వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎవరికి వారే కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అయితే, అక్కడ జానారెడ్డి నిర్ణయమే ఫైనల్ కానుంది. దీంతో ఆయన శంకర్‌నాయక్ వైపు మొగ్గితే తన పరిస్థితి ఏంటనే ఉద్దేశంతో బీఎల్‌ఆర్ సొంత ఇమేజీ పెంచుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి కూడా మిర్యాలగూడ టికెట్ ఆశిస్తున్నారు.
ఆలేరులో ఆధిపత్య పోరు..
ఆలేరు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ఇటీవలే బయట పడ్డాయి. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైన కల్లూరి రామచంద్రారెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. భువనగిరిలో ఇటీవల జరిగిన సమావేశంలో ఐలయ్య, నగేష్ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. ఐలయ్య సీనియర్లను పట్టిచుకోవడం లేదని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఆరోపణలు చేసుకున్నారు. దీనికి తోడు మరికొంత మంది నాయకులు ఎవరికి వారే ఎమ్మెల్యే అభ్యర్థులం తామేనంటూ గ్రామాల్లో తిరుగుతుండటంతో కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు. భువనగిరిలోనూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గీయులు డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి సహకరించడం లేదనే చర్చ సాగుతోంది. అక్కడ కోమటిరెడ్డి మరొకరిని ప్రత్యామ్నాయంగా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
నకిరేకల్‌లో రెండు గ్రూపులు
నకిరేకల్‌లోనూ పార్టీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ప్రస్తుత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరడంతో నాయకత్వ కొరత ఏర్పడింది. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు రంగంలోకి దిగారు. టీపీసీసీ కార్యదర్శి కొండేటి మల్లయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ దైద రవీందర్ మధ్య పోరు మొదలైంది. ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహిస్తుండటంతో పార్టీ శ్రేణులు గందరగోళంలో పడ్డారు. అక్కడ జనాకర్షణ, ఆర్థిక బలం కలిగిన నేతను పార్టీలో చేర్చుకునేందుకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment