jana reddy kunduru
-
అక్కడ జానారెడ్డి నిర్ణయమే ఫైనల్ ..
కాంగ్రెస్ పార్టీకి ఇంటిపోరు ఎక్కువైంది. గ్రూపు రాజకీయాలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని.. అది కాంగ్రెస్ పార్టీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కిస్తుందని చెబుతున్న రాష్ట్ర నేతలకు ఉమ్మడి జిల్లాలో గ్రూపుల లొల్లి ప్రధాన అడ్డంకిగా మారబోతోంది. ముఖ్యనేతలే పార్టీలో విభేదాలకు, వర్గపోరుకు ఆజ్యం పోస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీకి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సఖ్యత లేదు. మండల స్థాయిలో గొడవలు పడి రచ్చకెక్కుతున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకుంటున్నారు. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలతో క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో అద్దంకి దయాకర్ ఓటమికి కారణమంటూ సస్పెండ్ చేసిన వడ్డేపల్లి రవిని రెండు రోజుల క్రితం తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకోవడం పార్టీలో గ్రూపు రాజకీయాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. తుంగతుర్తి నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో అద్దకి దయాకర్‌తో పాటు వడ్డేపల్లి రవి టికెట్ అశించారు. పార్టీ టికెట్ దయాకర్‌కు ఇవ్వడంతో రవి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని అప్పట్లో సస్పెండ్ చేసింది. ఆ తరువాత ఆయన టీఆర్ఎస్లో చేరినా అక్కడ సరైన గుర్తింపు లభించలేదని తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చే ప్రయత్నాలు చేశారు. ఇంకోవైపు నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం లేదని దయాకర్‌పైనా విమర్శలు ఉన్నాయి. దాన్ని ఆసరాగా చేసుకొని రవి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రవిపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయకముందే ఎలా పార్టీలో చేర్చుకుంటారని, ఆ చేరిక చెల్లదని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న ప్రకటించారు. మరోవైపు దయాకర్ కూడా ఆయన చేరికపై పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. సూర్యాపేటలోనూ.. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డికి అనుచరులు ఉన్నారు. ఆయన్ని రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నాలను సొంత పార్టీ వారే చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఒకప్పుడు దామోదర్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న రవి వర్గీయులు 2018 ఎన్నికల్లో సూర్యాపేటలో దామోదర్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. దీంతో రవిని దామోదర్‌రెడ్డి దూరంపెట్టారని అంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేయాలని భావిçస్తున్న రవి తనకు పార్టీ పెద్దల మద్దతు అవసరమనే యోచనతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని సంప్రదించారని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. పైగా సూర్యాపేట కాంగ్రెస్ నేత, రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు పటేల్ రమేష్‌రెడ్డి మద్దతు కూడా రవికి ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో దామోదర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వారు కోమటిరెడ్డి వద్దకు చేరుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎవరి ప్రయత్నాలు వారివే.. దేవరకొండ నియోజకవర్గంలో వర్గ పోరు ఉన్నా పెద్దగా బయట పడటం లేదు. అక్కడ మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్, కాంగ్రెస్ పార్టీ ఆదివాసి జాతీయ కోఆర్డినేటర్ నేనావత్ కిషన్‌నాయక్ టికెట్ ఆశించి ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడతాడనే ప్రచారంతో మాజీ మంత్రి పాల్వాయి స్రవంతి తన వర్గాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. నల్లగొండ, హుజూర్నగర్, కోదాడ, నాగార్జునసాగర్‌లో గ్రూపు రాజకీయాలు లేవు. నల్లగొండలో కోమటిరెడ్డి, హుజూర్నగర్, కోదాడలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నాగార్జునసాగర్‌లో జానారెడ్డికి ఎదురుగా వెళ్లి టికెట్ కావాలని సాహసించే నాయకులు పెద్దగా లేరు. బీఎల్ఆర్ వర్సెస్ శంకర్‌నాయక్ మిర్యాలగూడలో సామాజిక వేత్త బత్తుల లక్ష్మారెడ్డి(బీఎల్ఆర్), డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ మధ్య వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎవరికి వారే కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అయితే, అక్కడ జానారెడ్డి నిర్ణయమే ఫైనల్ కానుంది. దీంతో ఆయన శంకర్‌నాయక్ వైపు మొగ్గితే తన పరిస్థితి ఏంటనే ఉద్దేశంతో బీఎల్ఆర్ సొంత ఇమేజీ పెంచుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి కూడా మిర్యాలగూడ టికెట్ ఆశిస్తున్నారు. ఆలేరులో ఆధిపత్య పోరు.. ఆలేరు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ఇటీవలే బయట పడ్డాయి. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైన కల్లూరి రామచంద్రారెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. భువనగిరిలో ఇటీవల జరిగిన సమావేశంలో ఐలయ్య, నగేష్ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. ఐలయ్య సీనియర్లను పట్టిచుకోవడం లేదని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఆరోపణలు చేసుకున్నారు. దీనికి తోడు మరికొంత మంది నాయకులు ఎవరికి వారే ఎమ్మెల్యే అభ్యర్థులం తామేనంటూ గ్రామాల్లో తిరుగుతుండటంతో కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు. భువనగిరిలోనూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గీయులు డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి సహకరించడం లేదనే చర్చ సాగుతోంది. అక్కడ కోమటిరెడ్డి మరొకరిని ప్రత్యామ్నాయంగా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. నకిరేకల్‌లో రెండు గ్రూపులు నకిరేకల్‌లోనూ పార్టీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ప్రస్తుత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరడంతో నాయకత్వ కొరత ఏర్పడింది. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు రంగంలోకి దిగారు. టీపీసీసీ కార్యదర్శి కొండేటి మల్లయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ దైద రవీందర్ మధ్య పోరు మొదలైంది. ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహిస్తుండటంతో పార్టీ శ్రేణులు గందరగోళంలో పడ్డారు. అక్కడ జనాకర్షణ, ఆర్థిక బలం కలిగిన నేతను పార్టీలో చేర్చుకునేందుకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలిసింది. -
14న ‘సాగర్’కు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఈ నెల 14న హాలియా పట్టణ శివారులో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. 14న సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. సభ నిర్వహణకు సంబంధించి హాలియా శివారులోని పెద్దవూర మార్గంలో 20 ఎకరాల ఖాళీ స్థలాన్ని గుర్తించి పార్టీ నేతలు అనుమతులు కూడా పొందారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం నలుమూలల నుంచి జనసమీకరణ చేస్తున్న నేపథ్యంలో 30 ఎకరాలను పార్కింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించారు. బహిరంగ సభ కోసం ఎంపిక చేసిన స్థలాన్ని సీఎం సెక్యూరిటీ విభాగం అధికారులు కూడా సందర్శించి ఆమోదం తెలిపారు. సభ నిర్వహణకు మరో 7 రోజులే వ్యవధి ఉండటంతో జన సమీకరణ బాధ్యతను సాగర్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ఇన్చార్జీ లుగా వ్యవహరిస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు అప్పగించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సభ సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 9, 10 తేదీల్లో రోడ్‌షోల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధం చేశారు. అయితే ఎన్నికల వ్యయ పరిమితిని దృష్టిలో పెట్టుకుని రోడ్‌షోలు రద్దు చేసుకోవాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితి రూ.28 లక్షలు కాగా.. బహిరంగ సభ నిర్వహణకు ఎక్కువ మొత్తంలో ఖర్చువుతున్నట్లు తెలిసింది. ఇన్‌చార్జీలకే ప్రచార, సమన్వయ బాధ్యతలు సాగర్ ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలను కొత్త బృందానికి అప్పగించిన కేసీఆర్ వివిధ వర్గాల నుంచి విభిన్న కోణాల్లో ప్రతిరోజూ అందుతున్న నివేదికలను విశ్లేషిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా తమ పార్టీ ప్రచార వ్యూహాన్ని రోజువారీగా మారుస్తున్నట్లు ప్రచారంలో సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ నేత ఒకరు వెల్లడించారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, రవీంద్రకుమార్, కోరుకంటి చందర్, భూపాల్‌రెడ్డి, కోనేరు కోణప్ప, శంకర్‌నాయక్, భాస్కర్‌రావుతో పాటు కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు వంటి నేతలకు సాగర్ నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీలు, మండలాల వారీగా పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలు అప్పగించడం ద్వారా కేసీఆర్ కొత్త తరహా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. గతంలో వివిధ ఉప ఎన్నికలు, కీలక ఎన్నికల్లో పనిచేసిన సీనియర్లకు బదులుగా కొత్త బృందానికి ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించడం కూడా వ్యూహాత్మకమేనని టీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. నియోజకవర్గంలోని సామాజికవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఇన్చార్జీల ఎంపిక జరిగినట్లు కనిపిస్తోంది. కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్నారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ కూడా మైనార్టీలు, సామాజిక వర్గాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్.. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీతో తలపడిన టీఆర్ఎస్ సాగర్ ఉప ఎన్ని కలో కాంగ్రెస్‌ను ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ విధానాలు, ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డి పనితీరే లక్ష్యంగా ప్రచారం సాగిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పనితీరు, ధరల పెరుగుదల, రాష్ట్రానికి నిధులు, పథకాల అమల్లో వివక్ష తదితరాలపై విమర్శలు గుప్పిస్తున్నా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలంపైనే దృష్టి కేంద్రీకరించింది. గ్రామ స్థాయిలో ఓ మోస్తరు గుర్తింపు పొందిన కాంగ్రెస్ నేతలు, ముఖ్య కార్యకర్తలను పార్టీలో చేర్చుకుంటూ ఆ మేరకు ప్రత్యర్థిని బలహీన పరిచే ఎత్తుగడను అనుసరిస్తోంది.మరోవైపు మండలాలు, గ్రామాల వారీగా వివిధ సామాజిక వర్గాల ఓటర్ల వివరాలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించి వారిని ప్రత్యక్షంగా కలసి టీఆర్ఎస్ యంత్రాంగం ఓట్లను అభ్యర్థిస్తోంది. ప్రచారంలో పైచేయి సాధించి పోలింగ్ నాటికి విపక్ష శిబిరంలో ఆత్మవిశ్వాసం దెబ్బతీయడం ద్వారా భారీ మెజారిటీ సాధించేందుకు టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. చదవండి: సాగర్ ఉప ఎన్నికపై ప్రత్యేక నిఘా -
రాయని డైరీ: కె. జానారెడ్డి (కాంగ్రెస్)
నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు అభ్యర్థిగా నా పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్‌లో వినిపించడం ఉండదు. వెళ్లి వినిపించుకోవడమే ఉంటుంది. నేను వెళ్ల లేదు, వెళ్లి వినిపించుకోలేదు. మరి నా పేరు నాకు వినిపించడం ఏమిటి?! ‘‘ఎనీబడీ హియర్ మీ’ అని మాణిక్యం ఠాగూర్ని అనుకుంటా, ఫోన్ చేసి అడిగాను. ‘‘చెప్పండి జానారెడ్డి గారూ మీరేనని తెలుస్తోంది’’ అన్నారు అటువైపు నుంచెవరో! ‘‘నేను జానారెడ్డినని మీకు తెలుస్తూనే ఉంది, మీరు మాణిక్యం ఠాగూర్ అని నాకు తెలిసేదెలా?!’’ అని అడిగాను. ‘‘తెలియకపోయినా ఏమౌతుంది చెప్పండి జానారెడ్డి గారూ. పొరపాటున మీ ఫోన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వెళ్లినా ఏం కాదు. కాంగ్రెస్ నుంచి తను వెళ్లిపోయానని ఆయన అనుకుంటున్నారు తప్ప, ఆయన వెళ్లిపోయినట్లు కాంగ్రెస్ అనుకోవడం లేదు. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో మిమ్మల్ని గెలిపించే బాధ్యత కూడా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిదే. కనుక మీరు నాకు ఫోన్ చేయాలనుకుని ఉత్తమ్‌కి చేసినా, చేయవలసిన వాళ్లకే చేసినట్లవుతుంది. నేనొకటి కాదు, ఉత్తమ్ ఒకటి కాదు’’ అన్నాడు! ఉత్తమ్ వేరు, మీరు వేరు అని నేను మీతో అనలేదు కదా మాణిక్యం. మన పార్టీలో ఉన్నది ఇదే. ఊహించుకుని మాట్లాడతాం. ఉప ఎన్నికకు అభ్యర్థిగా నా పేరు ఎవరు చెప్పారో నాకై నేను ఊహించుకోలేక మీకు ఫోన్ చేస్తే, నన్ను గెలిపించే బాధ్యత ఎవరి మీద పెట్టారో చెప్పమని అడగడానికి నేను మీకు ఫోన్ చేసినట్లు మీరు ఊహించుకున్నట్లున్నారు! నాగార్జున సాగర్ అభ్యర్థిగా నా పేరును నాకు వినిపించేలా చేసిన ఆ మంచి వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనిపించే ఇప్పుడు మీకు ఫోన్ చేశాను. మీరు తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చినా, ఇక్కడ సోనియాజీకి దగ్గరగా ఉన్న తెలంగాణ నాయకులు మీరే కనుక మీకు ఫోన్ చేశాను? ఢిల్లీలో ఎవరైనా నా పేరు చెప్పారా? లేదంటే తెలంగాణలోనే ఎవరైనా చెప్పారా?’’ అని అడిగాను. ‘‘రెండు చోట్లా కాదు. తమిళనాడులో చెప్పారు’’ అన్నాడు!! ‘‘నాగార్జున సాగర్‌కి జానారెడ్డిని నిలబెడితే బాగుంటుందని తమిళనాడులో చెప్పారా?’’ అన్నాను. మాణిక్యం నవ్వారు. ‘‘అవును జానారెడ్డి గారూ.. నేను తమిళనాడులో ఉన్నప్పుడు సోనియాజీ ఫోన్ చేసి చెప్పారు. ఉత్తమ్‌కుమార్ వెళ్లిపోయిన ఖాళీని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత భర్తీ చేస్తే బాగుంటుందని మీరు మేడమ్‌కి ఫోన్ చేసి చెప్పారట కదా. ‘అలా చేస్తే పార్టీకి ఎలాంటి ఉపయోగం కలుగుతుందో నాకైతే తెలియదు కానీ ఠాగూర్.. జానారెడ్డి నాకు ఫోన్ చేయడం వల్ల ఒక ఉపయోగం అయితే కలిగింది. నాగార్జున సాగర్‌కి ఎవరైతే బాగుంటుందా అని ఆలోచిస్తున్న టైమ్‌లో ఆయన ఒకరున్నారు కదా అని గుర్తొచ్చింది’ అని మేడమ్ నాతో అన్నారు’’ అని చెప్పాడు మాణిక్యం ఠాగూర్. నాకు తెలియకుండా నేనే నా పేరు వినిపించుకున్నట్లున్నాను! కాంగ్రెస్‌లో ఏం జరగబోతోందో అందరూ ఊహిస్తూనే ఉంటారు కానీ చివరికి ఎవరూ ఊహించనిదే కాంగ్రెస్‌లో జరుగుతుంది. అదే కాంగ్రెస్ గొప్పదనం. ‘‘నేను అస్సలు ఊహించలేకపోతున్నాను మాణిక్యం..’’అన్నాను. ‘‘పోనీ మీరు కాకుండా నాగార్జున సాగర్‌కు ఎవరున్నారో చెప్పండి. మిమ్మల్ని కాకుండా నాగార్జున సాగర్‌కు ఎవరిని ఉంచాలో నేను చెబుతాను’’ అన్నాడు. ‘‘అర్థం కాలేదు మాణిక్యం’’ అన్నాను. ‘‘నాగార్జునసాగర్‌లో టీడీపీని ఓడించింది మీరే. టీఆర్ఎస్ని ఓడించిందీ మీరే. ఇప్పుడిక బీజేపీని ఓడించవలసిందీ మీరే కదా జానారెడ్డి గారూ..’’ అన్నాడు! తెలంగాణ కాంగ్రెస్ కన్నా, తమిళనాడు కాంగ్రెస్ షార్ప్‌గా ఉన్నట్లుంది!! -మాధవ్ శింగరాజు -
ఆ ఐదు.. ఆసక్తికరం!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ ప్రచార రంగం మరింత వేడెక్కుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పన్నెండు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు నువ్వా–నేనా అన్న చందంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి కేవలం పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఒక విధంగా సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు మాజీ మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఎన్ని కలు కీలకంగా మారాయి. మాజీ అమాత్యులపై పోటీ పడుతున్న వారూ అనూహ్యంగా విజయం సొంతం చేసుకోవాలని శ్రమ పడుతున్నారు. దీంతో ప్రచారం వేడివేడిగా సాగుతోంది. పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులను మాత్రమే కాకుండా, పలువురు తమ తరఫున ప్రచారం చేసేం దుకు కుటుంబ సభ్యులను రంగంలోకి దింపారు. హాట్ టాపిక్‌గా .. ఐదు చోట్ల ఎన్నికలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రులు పోటీ చేస్తున్న ఆ ఐదు నియోజకవర్గాలు హాట్ టాపిక్‌గా మారాయి. సూర్యాపేట నియోజకవర్గంలో ఆపద్ధర్మ మంత్రి జగదీశ్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా రెండో సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే కేసీఆర్ కేబినెట్లో అవకాశం దక్కించుకున్న జగదీశ్‌రెడ్డి ఈ సారి గెలుపును సవాల్‌గా తీసుకుని శ్రమిస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే ఐదు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన దామోదర్ రెడ్డి సూర్యాపేట నుంచి 2009లో ప్రాతినిధ్యం వహించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ఈసారి గెలుపుపై దృష్టి పెట్టారు. హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయంపై, మొత్తంగా ఐదో విజయంపై కన్నేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికను కీలకంగా భావిస్తున్నారు. 2009 –2014 లో కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఉమ్మడి ఏపీ ఆఖరి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఈ సారి ఎన్నిక సవాల్‌గా మారింది. అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డున్న కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి నాగార్జున సాగర్ నుంచి ఎనిమిదో విజయం కోసం శ్రమిస్తున్నారు. ఈసారి ఎన్నికను ఆయన మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండలో ఐదో విజయంపై కన్నేశారు. 2009లో కాంగ్రెస్ ప్రభుతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. తెలంగాణ కోసం పదవీ త్యాగం చేసి 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. జిల్లాలో మరో సీనియర్ రాజకీయ నాయకుడు , మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మరోసారి ఆలేరు నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన ఇక్కడ నుంచి ఐదు పర్యాయాలు, తుంగతుర్తి నుంచి ఒకసారి గెలిచారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఆలేరు నుంచి పోటీకి దిగుతున్నారు. ఈ సారి ఆయనకు బీఎల్ఎఫ్ మద్దతు ఇస్తోంది. సుదీర్ఘ కాలం ఆలేరుకు ప్రాతినిధ్యం వహించిన నర్సింహులు ఆలేరు అభివృద్ధి కోసం తనను గెలిపించాలని కోరుతున్నారు. మొత్తంగా జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాల్లో ఐదుగురు మాజీ మంత్రులు, ఒక ఆపద్ధర్మ మంత్రి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదనపు బాధ్యతలతో.. ఒత్తిడి ఈ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో పోటీ పడుతున్న మంత్రులుగా చేసిన ఆరుగురిలో ఐదుగురిపై అదనపు బాధ్యతల ఒత్తిడి ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆపద్ధర్మ మంత్రి జగదీశ్‌రెడ్డి ఒక వైపు తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ, తన గెలుపు కోసం శ్రమిస్తూనే.. జిల్లాలోని టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నికను పరిశీలించాల్సి వస్తోందంటున్నారు. ప్రధానంగా ఆయన సొంత నియోజకవర్గం తుంగతుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం దృష్టి పెట్టాల్సి వస్తోందని అభిప్రాయపడుతున్నారు. సూర్యాపేట స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో ఉన్న మాజీ మంత్రి దామోదర్ రెడ్డి తన సొంత నియోజకవర్గం, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన తుంగతుర్తి బాధ్యతను కూడా చూస్తున్నారు. టీ పీసీసీ చీఫ్‌గా రాష్ట్ర ఎన్నికల సారథ్య బాధ్యతలు మోస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకించి తన నియోజకవర్గంతో పాటు, పొరుగునే ఉన్న కోదాడపైనా దృష్టిపెట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇక్కడి నుంచి ఆయన భార్య, తాజా మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెండో సారి పోటీలో ఉన్నారు. కోదాడ నుంచి రెండు పర్యాయాలు గెలిచిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోదాడను తమ చేయి దాటిపోకుండా వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. సీనియర్ నేత కె.జానారెడ్డి తన నియోజకవర్గం నాగార్జునసాగర్‌తో పాటు, పొరుగునే ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గ బాధ్యతలు కూడా చూస్తున్నారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్యను గెలిపించాల్సిన బాధ్యత కూడా జానారెడ్డిపైనే పడిందని పేర్కొంటున్నారు. ఐదో విజయం కోసం పోటీలో ఉన్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండలో తన గెలుపుకోసం శ్రమిస్తూనే.. తమ సొంత నియోజకవర్గమైన నకిరేకల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య కోసం కూడా పనిచేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఆయన ఒక సారి ప్రచారానికి వెళ్లి వచ్చారు. ఇలా.. ఒక అపద్ధర్మ మంత్రి, నలుగురు మాజీ మంత్రులకు తమ నియోజకవర్గాలతో పాటు ఇతర స్థానాల బాధ్యత మీద పడిందని విశ్లేషిస్తున్నారు. -
బరిలో హేమాహేమీలు.. ఎన్నికల పోరు హోరాహోరీనే
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా ఎన్నికల రంగం వేడెక్కింది. ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ప్రత్యర్థులో... ఏయే నియోజకవర్గంలో ఎలాంటి పోటీ జరగనుందో దాదాపు స్పష్టమైంది. మెజారిటీ స్థానాల్లో ఈసారి ద్విముఖ పోటీలే కనిపిస్తున్నాయి. కాగా, కొన్నిచోట్ల మాత్రం బహుముఖ పోటీ తప్పేలా లేదు. టీఆర్ఎస్ పదకొండు, కాంగ్రెస్ పదకొండు స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించాయి. వీరిలో ఇప్పటికే అత్యధికులు నామినేషన్లు కూడా వేశారు. చివరి రోజు అయిన 19వ తేదీన ఎక్కువ నామినేషన్లు దాఖలు కానున్నాయి. టీఆర్ఎస్ కోదాడలో, కాంగ్రెస్ మిర్యాలగూడ స్థానానికి ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికల బరిలో నిలిచిన వారిని పరిగణనలోకి తీసుకుంటే ఈసారి కూడా హేమాహేమీలు పోటీ పడుతున్నారు. దీంతో పోటీ కూడా హోరాహోరీగా సాగనుంది. ఆ.. ఐదుగురు నేతలు టీఆర్ఎస్ నుంచి పోటీ పడుతున్న వారిలో ఒక్కరు మినహా మిగిలిన పది మంది రెండో సారి అంతకంటే ఎక్కువ పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేస్తున్నవారే. ఇక, కాంగ్రెస్‌లో నలుగురు నాయకులు, ఒక ఇండిపెండెంట్ మొత్తంగా ఐదుగురు అభ్యర్థులు నాలుగు అంతకంటే ఎక్కువ సార్లు అసెంబ్లీ బరిలో నిలుస్తున్నవారే కావడం గమనార్హం. ప్రధానంగా సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి ఎనిమిదో విజయం కోసం నాగార్జున సాగర్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య పోటీలో ఉన్నారు. బీజేపీ, బీఎల్ఎఫ్ అభ్యర్థులు కొందరు తొలి ఎన్నికలను ఎదుర్కొంటున్న వారే. హుజూర్‌నగర్‌లో టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఐదో విజయంపై కన్నేశారు. ఆయనకు ప్రత్యర్థిగా టీఆర్ఎస్ నుంచి తొలి సారిగా ఎస్.సైదిరెడ్డి పోటీలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థి రెండో సారి పోటీలో ఉన్నారు. నల్లగొండలో కాంగ్రెస్ సిట్టింగ్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐదో విజయం కోసం పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి చేతిలో ఓడిపోయిన కంచర్ల భూపాల్ రెడ్డి ఈ సారి టీఆర్ఎస్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డిపై కాంగ్రెస్, బీజేపీల నుంచి సీనియర్లే పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఆర్.దామోదర్ రెడ్డి, బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వర్ రావు గత ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థికి ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారే. ఈసారి మరో మారు ఈ ముగ్గురు నేతలూ తలపడుతున్నారు. ఆలేరు బరిలో బీఎల్ఎఫ్ మద్దతుతో బీఎల్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోత్కుపల్లి నర్సింహులు కూడా అత్యధిక పర్యాయాలు విజయాలు సాధించిన నేతనే కావడం గమనార్హం. ఇక్కడనుంచి ప్రభుత్వ విప్‌గా పనిచేసిన గొంగిడి సునిత టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్ పోటీ పడుతున్నారు. ఇక, మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఎం పార్టీల నుంచి పోటీ పడుతున్న నేతల్లో అత్యధికులు రెండో సారి, అంత కంటే ఎక్కువ సార్లు పోటీ పడుతున్న వారే. అసెంబ్లీ బరిలోకి తొలిసారి ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీ బరిలోకి తొలిసారి దిగుతున్న వారు ఎక్కువ మందే ఉన్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (ఎంపీగా పనిచేశారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు) ఎమ్మెల్యే పదవి కోసం తొలిసారి పోటీ పడుతున్నారు. భువనగిరి నుంచి కాంగ్రెస్ తరపున కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, హుజూర్నగర్ నుంచి టీఆర్ఎస్ తరఫున ఎస్.సైదిరెడ్డి మొదటిసారి పోటీ పడుతున్నారు. బీజేపీ, బీఎల్ఎఫ్, సీపీఎం నుంచి తొలిసారి పోటీ చేస్తున్నవారూ ఉన్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బరిలో నిలిచిన వారిలో అత్యధికులు సీనియర్లే కావడంతో పోటీ కూడా హోరా హోరీగా సాగనుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
మన మంత్రులు
జిల్లా రాజకీయాల్లో రాణించి రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవులు దక్కించుకున్నారు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలువురు నాయకులు. జానారెడ్డిలాంటి వారు అత్యధిక కాలం మంత్రిగా పనిచేసి రికార్డు సృష్టిస్తే.. నెల రోజులు మంత్రి పదవిలో ఉన్నవారూ లేకపోలేదు. ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులైతే ఎమ్మెల్సీగా గెలిచి మంత్రి పదవులు పొందినవారూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవులను వదులుకున్న వారూ ఉన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేసిన ప్రజాప్రతినిధులూ ఉన్నారు. – సాక్షి, యాదాద్రి జానారెడ్డి రికార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన రికార్డు నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత కుందూరు జానారెడ్డికి దక్కింది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 1983–89 మధ్యకాలంలో ఎన్టీఆర్ మంత్రి వర్గంలో, 1992లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రి వర్గంలో, 2004లో వైఎస్.రాజశేఖరరెడ్డి, అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గాల్లో పనిచేశారు. హోంమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్లతో చర్చల సమయంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన తీరు అందరి చేత ప్రశంసలందుకుంది. కొండా లక్ష్మణ్‌బాపూజీ చిన్నకొండూరు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొండా లక్ష్మణ్‌బాపూజీ దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గాల్లో మంత్రి పదవులు పొందారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి రామన్నపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉప్పునూతల జిల్లా రాజకీయాల్లో మకుటం లేని మహారాజుగా వెలుగొందారు. శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు 1971లో కాసు బ్రహ్మానందరెడ్డి, 1973లో జలగం వెంగళరావు మంత్రివర్గాల్లో ఆయన పనిచేశారు కొమ్ము పాపయ్య రామన్నపేట నియోజకవర్గం నుంచి గెలిచిన కొమ్ము పాపయ్య ఒకసారి మంత్రిగా ఉన్నారు. టి.అంజయ్య ముఖ్యమంత్రిగా మంత్రివర్గంలో పనిచేశారు. ఎలిమినేటి మాధవరెడ్డి భువనగిరి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచిన ఎలిమినేటి మాధవరెడ్డి ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో పనిచేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రి వర్గాల్లో మాధవరెడ్డి హోంశాఖ మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండగా నక్సలైట్ల మందుపాతరకు బలయ్యాడు . ఎలిమినేటి ఉమామాధవరెడ్డి భర్త మాధవరెడ్డి దుర్మరణంతో రాజకీయల్లోకి వచ్చిన ఉమామాధవరెడ్డి మూడు సార్లు భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. మాధవరెడ్డి మరణంతో జరిగిన ఉపఎన్నికల్లో గెలిచిన ఆమెకు చంద్రబాబు మంత్రి వర్గంలో స్థానం లభించింది. మోత్కుపల్లి నర్సింహులు ఆలేరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు, తుంగతుర్తి నుంచి ఒకసారి గెలిచిన మోత్కుపల్లి నర్సింహులు జిల్లా రాజకీయల్లో తనదైన ముద్ర వేశారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేశాడు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వైఎస్సార్ మంత్రివర్గం, ఆయన మరణం తర్వాత రోశయ్య మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో పనిచేస్తూ తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశారు. గుత్తా మోహన్‌రెడ్డి నల్లగొండ అసెంబ్లీ నుంచి 1978లో ఎమ్మెల్యేగా గెలుపొందిన గుత్తామోహన్‌రెడ్డి మంత్రిగా పనిచేశారు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు గెలిచిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మంత్రిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో ఆయన గుండెపోటుతో చనిపోయారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అక్కిరాజు వాసుదేవరావు కోదాడ నియోజకవర్గం నుంచి గెలుపొందిన అక్కిరాజు వాసుదేవరావు కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నర్సింహారావు మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. వీరెపల్లి లక్ష్మీనారాయణ కోదాడ ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడదోసిన నాదెండ్ల భాస్కర్‌రావు మంత్రి వర్గంలో నెలరోజుల పాటు మంత్రిగా పని చేశారు. అతితక్కువ కాలం పనిచేసిన వారిలో ఒకడిగా రికార్డుకెక్కారు. రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాంరెడ్డి దామోదర్‌రెడ్డి 1992లో నెదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు. 2007లో వైఎస్ మంత్రివర్గంలో క్రీడాశాఖ మంత్రిగా పనిచేశారు డి.రవీంద్రనాయక్ దేవరకొండ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రవీంద్రనాయక్ కూడా మంత్రిగా పనిచేశారు. 1978, 1983లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈయన భవనం వెంకట్రాం మంత్రివర్గంలో పనిచేశారు. గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూర్యాపేట ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 2014లో తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో ముందుగా విద్యాశాఖ మంత్రిగా పనిచేసి, ఆ తర్వాత విద్యుత్‌శాఖ, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. -
మా ప్రయోజనాలకు అడ్డుపడితే చంద్రబాబునైనా సహించం: జానా
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో సీట్ల పంపకం తుది దశకు చేరుకుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత కే. జానారెడ్డి తెలిపారు. ఎంతో ఉత్కంఠ రేపుతున్న అభ్యర్థుల ఎంపిక పూరైందని.. రేపు సాయంత్రానికి అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ చర్చించిన తుది జాబితాలో పేరు లేని ఆపార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్యయ్య టిక్కెట్‌కు లైన్ క్లియర్ చేశామని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బీసీలకు గతంలో ఇచ్చినట్లు ఈసారి కూడా సీట్లు ఇస్తామని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ కుంతియాలు దుబాయ్ పర్యటనలో ఉన్నారని వారు రాగానే భాగస్వామ్య పక్షాలతో కలిసి అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడితే చంద్రబాబు నాయుడిని సైతం సహించబోమన్నారు. కేసీఆర్‌ను ఓడించి ప్రజలే రికార్డు బ్రేక్ చేస్తారు.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఓడించి ప్రజలే రికార్డు బ్రేక్ చేస్తారని జానారెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కంటే కేసీఆర్ గొప్పవాడేం కాదన్న జానా.. అప్పులు చేసిన కేసీఆర్ అభివృద్ధి అంటూ గొప్పులు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నిర్ణయాలు ఆలస్యమైనప్పటికీ గెలుపు తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గెలిచేవారే మిర్యాలగూడ అభ్యర్థిగా ఉండాలనేది తన అభిప్రాయమన్నారు. ‘ కార్యకర్తలు నన్ను కానీ, నా కొడుకును కానీ పోటీ చేయాలంటున్నారు. హైకమాండ్ ఒకే అంటే నా కొడుకు పోటీ చేస్తాడు. సీఎం ఎవరు అవుతారన్నది చర్చకాదు.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. 2014లో కేసీఆర్ మాటలతో గెలిచాడు.. ఇప్పుడు మూటలతో గెలవాలని చూస్తున్నాడు. ఆశావాహుల్లో అసంతృప్తి అనేది సహజంజ తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఎవరినైనా సహించం. తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడితే చంద్రబాబునైనా సహించం. కేసీఆర్ ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఆయన్న కూడా సహించటం లేదు. ఇక బయటవారిని సహిస్తామా? పొత్తు కోసం మేము వెళ్లలేదు.. చంద్రబాబే మా వద్దకు వచ్చారు’ అని జానారెడ్డి తెలిపారు. -
రేపు సాయంత్రం కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
-
జానారెడ్డితో ఆర్. కృష్ణయ్య కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత జానారెడ్డితో బీసీ సంఘం నేత, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మహా కూటమికి బీసీ సంఘాల మద్దతుపై ఇరువురు నేతలు చర్చించారు. భేటీ ముగిసిన అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టామని తెలిపారు. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇదివరకే బీసీ సంఘం ప్రతినిధులు తమను కలిసి పలు విజ్ఞప్తులు చేశారని.. బీసీల న్యాయమైన డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తామని తెలిపారు. తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేరుస్తామని జానారెడ్డి పేర్కొన్నారు. కూటమి సీట్ల సర్దుబాటుపై వారంలో స్పష్టత వస్తుందని, త్వరలో తెలంగాణలో జరుగునున్న రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కేసీఆర్ కాఫీ కోట్టారని.. తమ ప్రకటనలకు బడ్జెట్ సరిపోదన్న కేసీఆర్ ఇప్పుడేం సమాధానం చెప్తురని ప్రశ్నించారు. బీసీలకు 90 శాతం సబ్సిడీ.. జానారెడ్డితో భేటీలో భాగంగా బీసీలకు మెజార్టీ సీట్లు ఇవ్వాలని కోరినట్లు బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీ సబ్‌ప్లాన్, 90శాతం సబ్సిడీతో బీసీలకు రుణాలు వంటి అంశాలపై వారితో చర్చించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఉద్యోగ నోటిషికేషన్లు ఇవ్వాలని.. బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చాలని కాంగ్రెస్ పార్టీని కోరినట్లు ఆయన వెల్లడించారు. -
ఆర్. కృష్ణయ్యతో జానారెడ్డి కీలక భేటీ
-
నాగార్జునసాగర్‌లో.. ప్రత్యామ్నాయం?
అప్రతిహతంగా ఏడు పర్యాయాలు తాను ప్రాతినిధ్యం వహించిన నాగార్జునసాగర్‌కు సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి వీడ్కోలు చెబుతున్నట్లేనా ? తాను మిర్యాలగూడనుంచి, తన తనయుడు రఘువీర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయాలన్న ఆశలపై హై కమాండ్ నీళ్లు చల్లిందా..? ఒక కుటుంబానికి ఒకే టికెట్ నిబంధన జానాకు ప్రతిబంధకంగా మారనుందా..? ఇప్పుడు జిల్లా కాంగ్రెస్‌లో, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ ఇదే . సాక్షిప్రతినిధి, నల్లగొండ : తన తనయుడికి టికెట్ ఇప్పించుకునేందుకు ఢిల్లీ పర్యటనకు వెళ్లారన్న వార్తలను సీఎల్పీ మాజీనేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి ఖండించినా, కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రయత్నాలు చూస్తుంటే పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను సీఎంను అవుతానని, ఆ ప్రచారంతోనే మిర్యాలగూడ నుంచి బరిలోకి దిగాలన్న ఆలోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. జానారెడ్డి సాగర్‌నుంచి మిర్యాలగూడ మారితే, సాగర్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఒకవేళ ఆయన తనయుడు రఘువీర్‌కు టికెట్ దక్కితే సమస్య లేదు కానీ, కుటుంబానికి ఒకే టికెట్ అన్న నిర్ణయం వల్ల సాగర్‌లో ఎవరు బరిలోకి దిగుతారన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ప్రత్యామ్నాయం? తనకు ప్రత్యామ్నాయం తనయుడు అయ్యే అవకాశం లేనప్పుడు జానారెడ్డి తన దగ్గరి అనుచర నేత దాచిరెడ్డి మాధవరెడ్డి కుటుంబం వైపు మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. పాతికేళ్ల పాటు పెద్దవూర మండలం వెల్మగూడెం సర్పంచ్‌గా పనిచేసిన, ముందునుంచీ జానారెడ్డినే అంటిపెట్టుకుని ఉన్న మాధవరెడ్డి కుటుంబంనుంచి ఆయన తనయుడు రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.వెంకటనారాయణరెడ్డి (డీవీఎన్ రెడ్డి)ని బరిలోకి దింపే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది. వివాదారహితుడు కావడం, జానారెడ్డి ముఖ్య అనుచర నేతలంతా ఆయనను వదిలి టీఆర్ఎస్ బాట పట్టిన సమయంలో కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా జానాకు వెన్నుదన్నుగా నిలవడం కారణాలతోపాటు ఎన్నికల ఖర్చును తేలిగ్గా భరించగల ఆర్థిక స్థోమత కూడా ఉండడం కారణంగా చెబుతున్నారు. ఒకవేళ జానారెడ్డి నిజంగానే నాగార్జునసాగర్‌ను వదిలి మిర్యాలగూడ మారడం ఖాయమైతే, సాగర్‌లో తన తనయుడికి టికెట్ ఇప్పించుకోలేని పక్షంలో కచ్చితంగా తనకు ప్రత్యామ్నాయంగా డీవీఎన్ రెడ్డిని ఎంచుకుంటారని చెబుతున్నారు. దూరమైన అనుచర నేతలు వాస్తవానికి 2014 సార్వత్రిక ఎన్నికలు జరిగేదాకా మండాలనికో ముఖ్యనేత జానా వర్గంలోనే, ఆయన అనుచర నాయకులుగానే ఉన్నారు. డీసీసీబీ చైర్మన్‌గా పనిచేసిన విజయేందర్‌రెడ్డి, హాలియాకు చెందిన మలిగిరెడ్డి లింగారెడ్డి, ప్రముఖ న్యాయవాది ఎంసీ కోటిరెడ్డి, నిడమనూరునుంచి భాస్కర్‌రావు, హన్మంతరావు, పెద్దవూర నుంచి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి తదితరులంతా జానారెడ్డికి బలమైన టీమ్‌గా ఉండేవారు. గత ఎన్నికల్లో భాస్కర్‌రావుకు మిర్యాలగూడ టికెట్ ఇప్పించింది కూడా జానారెడ్డే. ఆ తర్వాత భాస్కర్‌రావు కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరారు. ఇదే మాదిరిగా ఎంసీ కోటిరెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, విజయేందర్ రెడ్డి, కర్నాటి లింగారెడ్డి గులాబీ కండువాలు కప్పుకున్నారు. కొద్ది రోజుల తేడాతో కర్నాటి లింగారెడ్డి తిరిగి కాంగ్రెస్‌కు వెనక్కి వచ్చారు. ఈ పరిణామాలతో జానా వెంట ముఖ్య నాయకులు ఎవరూ లేకుండా అయ్యారు. నిడమనూరులో హన్మంతరావు, పెద్దవూరలో కర్నాటి లింగారెడ్డి ప్రస్తుతం కనిపిస్తున్నారు. అయితే, కష్టకాలంలో ఆయన వెన్నంటే ఉన్న డీవీఎన్ రెడ్డి వైపు జానా మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు. మరో సీనియర్ నేత రంగశాయి రెడ్డి కూడా జానాతోనే ఉన్నారు. వివిధ సమీకరణలు, కారణాలతో హన్మంతరావు గురించి ఆలోచించడం లేదని, కర్నాటి లింగారెడ్డి విషయంలోనూ కొన్ని ప్రతిపబంధకాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జానారెడ్డి ఎవరు పేరు ప్రతిపాదిస్తే వారికే నాగార్జున సాగర్ టికెట్ దక్కే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. -
జానారెడ్డికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి గురువారం అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఆయన అక్కడే స్పల్వ అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. హుటాహుటిన ఆయనకు హాస్పిటల్‌కు తరిలించారు. లంగ్స్ ఇన్ఫెక్షన్తో జానారెడ్డి బాధపడుతున్నట్టు సమాచారం. డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెస్తాం
బీబీనగర్ :తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. బీబీనగర్‌లో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతుందని తెలిసినా, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీని గెలిపించి సోనియాగాంధీకి కానుకగా ఇస్తామని పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు నిరాశ పడవద్దని, భవిష్యత్ అంతా కాంగ్రెస్‌దేనని చెప్పారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. భౌతికం గా ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులో ఉందని సభ్యత్వ నమోదు ద్వారా రుజువు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీబీనగర్‌లో నిమ్స్‌కు శంకుస్థాపన చేసి సగం పనులు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి చేసిందన్నారు. మిగతా పనులు పూర్తిచేయించి ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. సీసీఎంబీ నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సత్తా ఉన్నవాళ్లే కాంగ్రెస్‌లో ఉంటారు : కుంత్యా సత్తా ఉన్నవాళ్లే కాంగ్రెస్‌లో ఉంటారని.. లేని వాళ్లు పార్టీని వీడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంత్యా పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్రగల కాంగ్రెస్ పార్టీ ఎన్నో గెలుపు, ఓటములను చవిచూసిందని, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. రాహుల్‌గాంధీ ఆలోచనల మేరకు బూత్, బ్లాక్, జిల్లా, రాష్ట్ర కమిటీలను ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. పేదలను ఆదుకున్నది కాంగ్రెస్సే : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలంగాణలోని పేద ప్రజలను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజలను అభద్రతా భావానికి లోను చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకుందన్నారు. టీఆర్ఎస్ అసమర్ధ పాలన కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, నిరుద్యోగులు, ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిమ్స్, సాగునీటి కాల్వలను పూర్తి చేయిస్తామన్నారు. పవిత్ర కార్యంగా భావించాలి : తూడి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కార్యకర్తలు పవిత్ర కార్యంగా భావించాలని డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి అన్నారు. పదేళ్లల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు పోట్టోళ్ల శ్యామ్‌గౌడ్, ప్రధాన కా ర్యదర్శి పంజాల రామంజనేయులుగౌడ్, కాం గ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ బస్వయ్య, సర్పంచ్ స్వరుపారాణి, నాయకులు ప్రమోద్‌కుమార్, కాసుల ఆంజనేయులు, రవికుమార్, టంటం లక్ష్మ య్య, అచ్చయ్యగౌడ్, సుర్వి వేణు, మగ్తానాయక్, ఆగమయ్య, బాలచందర్ పాల్గొన్నారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
హాలియా : ఎన్నికల హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి విమర్శించారు. ఆదివారం హాలియా ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు రుణమాఫీ చేసే విషయంలోనూ, విద్యుత్ సరఫరాలోనూ ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే గోదావరి నదిపై నాలుగు స్తంభాలేసి ఛత్తీస్‌గఢ్ నుంచి ఒక్క రోజులో కరెంట్ తెస్తానని ఎన్నికల ముందు చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చి నాలుగు మాసాలైనా ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అభివృద్ధి వేగవంతం అవుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం తీసుకువచ్చానన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని తెలిపారు. ఇందిరమ్మ పథకంలో ఎక్కడో ఒకటి రెండు చోట్ల అవకతవకలు జరిగాయని చెప్పి రాష్ట్రంలో ఈ పథకం కింద ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారుల బిల్లులు ఆపడం సరికాదన్నారు. సమావేశంలో ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటిలింగారెడ్డి, అంగోతు లచ్చిరాంనాయక్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గార్లపాటి ధనమల్లయ్య తదితరులున్నారు.