జిల్లా రాజకీయాల్లో రాణించి రాష్ట్ర కేబినెట్‌లో మంత్రి పదవులు దక్కించుకున్నారు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలువురు నాయకులు. జానారెడ్డిలాంటి వారు అత్యధిక కాలం మంత్రిగా పనిచేసి రికార్డు సృష్టిస్తే.. నెల రోజులు మంత్రి పదవిలో ఉన్నవారూ లేకపోలేదు. ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులైతే ఎమ్మెల్సీగా గెలిచి మంత్రి పదవులు పొందినవారూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవులను వదులుకున్న వారూ ఉన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేసిన ప్రజాప్రతినిధులూ ఉన్నారు.
– సాక్షి, యాదాద్రి
జానారెడ్డి రికార్డు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన రికార్డు నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత కుందూరు జానారెడ్డికి దక్కింది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 1983–89 మధ్యకాలంలో ఎన్‌టీఆర్ మంత్రి వర్గంలో, 1992లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రి వర్గంలో, 2004లో వైఎస్.రాజశేఖరరెడ్డి, అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గాల్లో పనిచేశారు. హోంమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్లతో చర్చల సమయంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన తీరు అందరి చేత ప్రశంసలందుకుంది.
కొండా లక్ష్మణ్‌బాపూజీ
చిన్నకొండూరు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొండా లక్ష్మణ్‌బాపూజీ దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గాల్లో మంత్రి పదవులు పొందారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి
రామన్నపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉప్పునూతల జిల్లా రాజకీయాల్లో మకుటం లేని మహారాజుగా వెలుగొందారు. శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు 1971లో కాసు బ్రహ్మానందరెడ్డి, 1973లో జలగం వెంగళరావు మంత్రివర్గాల్లో ఆయన పనిచేశారు
కొమ్ము పాపయ్య
రామన్నపేట నియోజకవర్గం నుంచి గెలిచిన కొమ్ము పాపయ్య ఒకసారి మంత్రిగా ఉన్నారు. టి.అంజయ్య ముఖ్యమంత్రిగా మంత్రివర్గంలో పనిచేశారు.
ఎలిమినేటి మాధవరెడ్డి
భువనగిరి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచిన ఎలిమినేటి మాధవరెడ్డి ఎన్‌టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో పనిచేశారు. ఎన్‌టీఆర్, చంద్రబాబు మంత్రి వర్గాల్లో మాధవరెడ్డి హోంశాఖ మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండగా నక్సలైట్ల మందుపాతరకు బలయ్యాడు
.
ఎలిమినేటి ఉమామాధవరెడ్డి
భర్త మాధవరెడ్డి దుర్మరణంతో రాజకీయల్లోకి వచ్చిన ఉమామాధవరెడ్డి మూడు సార్లు భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. మాధవరెడ్డి మరణంతో జరిగిన ఉపఎన్నికల్లో గెలిచిన ఆమెకు చంద్రబాబు మంత్రి వర్గంలో స్థానం లభించింది.
మోత్కుపల్లి నర్సింహులు
ఆలేరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు, తుంగతుర్తి నుంచి ఒకసారి గెలిచిన మోత్కుపల్లి నర్సింహులు జిల్లా రాజకీయల్లో తనదైన ముద్ర వేశారు. ఎన్‌టీఆర్ మంత్రివర్గంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేశాడు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వైఎస్సార్ మంత్రివర్గం, ఆయన మరణం తర్వాత రోశయ్య మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో పనిచేస్తూ తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశారు.
గుత్తా మోహన్‌రెడ్డి
నల్లగొండ అసెంబ్లీ నుంచి 1978లో ఎమ్మెల్యేగా గెలుపొందిన గుత్తామోహన్‌రెడ్డి మంత్రిగా పనిచేశారు
పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి
మునుగోడు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు గెలిచిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మంత్రిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో ఆయన గుండెపోటుతో చనిపోయారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
అక్కిరాజు వాసుదేవరావు
కోదాడ నియోజకవర్గం నుంచి గెలుపొందిన అక్కిరాజు వాసుదేవరావు కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నర్సింహారావు మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు.
వీరెపల్లి లక్ష్మీనారాయణ
కోదాడ ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన ఎన్‌టీఆర్ ప్రభుత్వాన్ని పడదోసిన నాదెండ్ల భాస్కర్‌రావు మంత్రి వర్గంలో నెలరోజుల పాటు మంత్రిగా పని చేశారు. అతితక్కువ కాలం పనిచేసిన వారిలో ఒకడిగా రికార్డుకెక్కారు.
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి
తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాంరెడ్డి దామోదర్‌రెడ్డి 1992లో నెదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు. 2007లో వైఎస్ మంత్రివర్గంలో క్రీడాశాఖ మంత్రిగా పనిచేశారు
డి.రవీంద్రనాయక్
దేవరకొండ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రవీంద్రనాయక్ కూడా మంత్రిగా పనిచేశారు. 1978, 1983లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈయన భవనం వెంకట్‌రాం మంత్రివర్గంలో పనిచేశారు.
గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 2014లో తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో ముందుగా విద్యాశాఖ మంత్రిగా పనిచేసి, ఆ తర్వాత విద్యుత్‌శాఖ, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment