సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, జాతీయ ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ ఆర్‌సీ కుంతియా తెలిపారు. అన్ని రాష్ట్రాల పార్టీల నాయకులను కూడా కలుస్తామన్నారు. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓటమి చెందిన అభ్యర్థులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని అన్నారు. 38 ఈవీఎంలు పనిచేయలేదని, పోలింగ్ ఓట్లకు కౌంటింగ్ ఓట్లకు చాలా తేడా వచ్చిందన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ తప్పులతో 22 లక్షల ఓట్లు కోల్పోయామని వాపోయారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఓట్లు తొలగించారని ఆరోపించారు. మోదీకి మద్దతుగానే సీఎం కేసీఆర్.. ఒడిశా, బెంగాల్ వెళ్లారని ఆరోపించారు. మోదీకి బీ టీమ్‌గా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు కుంతియా తెలిపారు.
ధర్మపురి, తుంగతుర్తి, కోదాడ, ఇబ్రహీంపట్నం తక్కువ ఓట్ల తో ఓడిపోయామని.. దీనిపై న్యాయం పోరాటం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. స్లిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పిన ఇప్పటి వరకు ఈసీ ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. గెలిచిన ఎమ్మెల్యేలు రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లు తగ్గించడంపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సలీమ్ అహ్మద్, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, సంపత్‌కుమార్, పద్మావతి రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, దామోదర్ రెడ్డి, ప్రేమ్‌సాగర్ రావు, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment