సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగియడంతో ప్రజాకూటమి నేతలు ఇప్పుడు లెక్కలు వేసే పనిలో పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పోలింగ్ సరళి పరిశీలనతో పాటు ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి అనుకూలంగా ఉందనే దానిపై క్షేత్రస్థాయి నుంచి కసరత్తు మొదలుపెట్టారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన బృందంతో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల పోలింగ్ సరళిపై దృష్టి పెట్టారు. ఫలానా నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి... అందులో పోలింగ్ స్టేషన్లవారీగా ఎలా పోలింగ్ జరిగింది... గతం కన్నా ఎక్కువ లేదా తక్కువ ఓట్లు ఆ పోలింగ్‌స్టేషన్ పరిధిలో ఎందుకు వచ్చాయి.. పోలైన ఓట్లలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఎన్నిఓట్లు పడ్డాయి.. టీఆర్‌ఎస్ వైపు ఎంతమంది ఓటర్లు మొగ్గు చూపారనే దానిపై ఆయన కూలంకషంగా కసరత్తు ప్రారంభించారు. ఉత్తమ్‌తోపాటు కూటమిలోని ఇతరపార్టీల నేతలు కూడా ఈ పనిలోనే శనివారమంతా బిజీబిజీగా గడిపారు.
నేరుగా పార్టీ నేతలతో...
పోలింగ్ సరళిని అంచనా వేయడంతోపాటు నియోజకవర్గాలవారీగా పోలింగ్ అనుకూలతలు, ప్రతికూలతలపై కూటమినేతలు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టారు. నియోజకవర్గాలవారీగా ఓ అవగాహనకు రావడంతోపాటు పోటీ చేసిన అభ్యర్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ తెప్పించుకుంటున్నారు. దీంతోపాటు పార్టీ మండల, బ్లాక్, జిల్లా అధ్యక్షులతో నేరుగా మాట్లాడుతున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలోని 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మొత్తం మీద ఎన్నికల ఫలితాలపై ఆయన ప్రత్యేక కసరత్తు చేస్తూ పూర్తిస్థాయి సమాచారాన్ని నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఇంటెలిజెన్స్ సర్వేలు ఏం చెపుతున్నాయి.. వివిధ సర్వే సంస్థలు ఎలాంటి ఫలితాలనిస్తున్నాయి...అనే దానిపై కూడా కూటమి నేతలు ఆరా తీస్తున్నట్టు సమాచారం.
మిత్రుల స్థానాల్లో ఎనిమిదింటిపై ఆశ
పార్టీలవారీగా చూస్తే కూటమి భాగస్వామ్యపక్షాలైన కాంగ్రెస్ 99, టీడీపీ 13, టీజేఎస్ 8, సీపీఐ 3 స్థానాల్లో పోటీ చేశాయి. టీడీపీ, టీజేఎస్, సీపీఐలు తాము పోటీ చేసిన స్థానాల్లోని పరిస్థితులపై ఆరాకు పరిమితం కాగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం కూటమి పెద్దన్నగా ఇతర పార్టీలు పోటీ చేసిన నియోజకవర్గాల్లో కూడా లెక్కలు తీస్తోంది. టీడీపీ 13, టీజేఎస్ 4 (కాంగ్రెస్ అభ్యర్థులు లేనివి), సీపీఐ 3 కలిపి మొత్తం 20 స్థానాల్లో వాస్తవ పరిస్థితి ఏంటనే దానిపై పరిశీలన చేస్తోంది. టీడీపీ పోటీ చేసిన కొన్ని స్థానాలు మినహా, మిగిలిన చోట్ల పరిస్థితి ఆశాజనకంగా లేదనే అంచనాకు కూడా వచ్చింది. దీంతో మిత్రపక్షాలు పోటీ చేసిన చోట్ల గరిష్టంగా 7–8 స్థానాలు మాత్రమే తమకు రావచ్చని, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తాము కనిష్టంగా 53 స్థానాలు గెలవాల్సి ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment