కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెస్తాం
బీబీనగర్ :తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. బీబీనగర్‌లో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతుందని తెలిసినా, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీని గెలిపించి సోనియాగాంధీకి కానుకగా ఇస్తామని పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు నిరాశ పడవద్దని, భవిష్యత్ అంతా కాంగ్రెస్‌దేనని చెప్పారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. భౌతికం గా ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులో ఉందని సభ్యత్వ నమోదు ద్వారా రుజువు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీబీనగర్‌లో నిమ్స్‌కు శంకుస్థాపన చేసి సగం పనులు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి చేసిందన్నారు. మిగతా పనులు పూర్తిచేయించి ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. సీసీఎంబీ నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సత్తా ఉన్నవాళ్లే కాంగ్రెస్‌లో ఉంటారు : కుంత్యా
సత్తా ఉన్నవాళ్లే కాంగ్రెస్‌లో ఉంటారని.. లేని వాళ్లు పార్టీని వీడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంత్యా పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్రగల కాంగ్రెస్ పార్టీ ఎన్నో గెలుపు, ఓటములను చవిచూసిందని, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. రాహుల్‌గాంధీ ఆలోచనల మేరకు బూత్, బ్లాక్, జిల్లా, రాష్ట్ర కమిటీలను ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరుగుతుందన్నారు.
పేదలను ఆదుకున్నది
కాంగ్రెస్సే : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
తెలంగాణలోని పేద ప్రజలను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజలను అభద్రతా భావానికి లోను చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకుందన్నారు. టీఆర్‌ఎస్ అసమర్ధ పాలన కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, నిరుద్యోగులు, ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిమ్స్, సాగునీటి కాల్వలను పూర్తి చేయిస్తామన్నారు.
పవిత్ర కార్యంగా భావించాలి : తూడి
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కార్యకర్తలు పవిత్ర కార్యంగా భావించాలని డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి అన్నారు. పదేళ్లల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు పోట్టోళ్ల శ్యామ్‌గౌడ్, ప్రధాన కా ర్యదర్శి పంజాల రామంజనేయులుగౌడ్, కాం గ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ బస్వయ్య, సర్పంచ్ స్వరుపారాణి, నాయకులు ప్రమోద్‌కుమార్, కాసుల ఆంజనేయులు, రవికుమార్, టంటం లక్ష్మ య్య, అచ్చయ్యగౌడ్, సుర్వి వేణు, మగ్తానాయక్, ఆగమయ్య, బాలచందర్ పాల్గొన్నారు.