సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఈ నెల 14న హాలియా పట్టణ శివారులో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. 14న సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. సభ నిర్వహణకు సంబంధించి హాలియా శివారులోని పెద్దవూర మార్గంలో 20 ఎకరాల ఖాళీ స్థలాన్ని గుర్తించి పార్టీ నేతలు అనుమతులు కూడా పొందారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం నలుమూలల నుంచి జనసమీకరణ చేస్తున్న నేపథ్యంలో 30 ఎకరాలను పార్కింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించారు. బహిరంగ సభ కోసం ఎంపిక చేసిన స్థలాన్ని సీఎం సెక్యూరిటీ విభాగం అధికారులు కూడా సందర్శించి ఆమోదం తెలిపారు.
సభ నిర్వహణకు మరో 7 రోజులే వ్యవధి ఉండటంతో జన సమీకరణ బాధ్యతను సాగర్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ఇన్‌చార్జీ లుగా వ్యవహరిస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు అప్పగించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సభ సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 9, 10 తేదీల్లో రోడ్‌షోల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధం చేశారు. అయితే ఎన్నికల వ్యయ పరిమితిని దృష్టిలో పెట్టుకుని రోడ్‌షోలు రద్దు చేసుకోవాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితి రూ.28 లక్షలు కాగా.. బహిరంగ సభ నిర్వహణకు ఎక్కువ మొత్తంలో ఖర్చువుతున్నట్లు తెలిసింది.
ఇన్‌చార్జీలకే ప్రచార, సమన్వయ బాధ్యతలు
సాగర్ ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలను కొత్త బృందానికి అప్పగించిన కేసీఆర్ వివిధ వర్గాల నుంచి విభిన్న కోణాల్లో ప్రతిరోజూ అందుతున్న నివేదికలను విశ్లేషిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా తమ పార్టీ ప్రచార వ్యూహాన్ని రోజువారీగా మారుస్తున్నట్లు ప్రచారంలో సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్ నేత ఒకరు వెల్లడించారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, రవీంద్రకుమార్, కోరుకంటి చందర్, భూపాల్‌రెడ్డి, కోనేరు కోణప్ప, శంకర్‌నాయక్, భాస్కర్‌రావుతో పాటు కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు వంటి నేతలకు సాగర్ నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీలు, మండలాల వారీగా పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలు అప్పగించడం ద్వారా కేసీఆర్ కొత్త తరహా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
గతంలో వివిధ ఉప ఎన్నికలు, కీలక ఎన్నికల్లో పనిచేసిన సీనియర్లకు బదులుగా కొత్త బృందానికి ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించడం కూడా వ్యూహాత్మకమేనని టీఆర్‌ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. నియోజకవర్గంలోని సామాజికవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఇన్‌చార్జీల ఎంపిక జరిగినట్లు కనిపిస్తోంది. కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్నారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ కూడా మైనార్టీలు, సామాజిక వర్గాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు.
ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్..
దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీతో తలపడిన టీఆర్‌ఎస్ సాగర్ ఉప ఎన్ని కలో కాంగ్రెస్‌ను ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ విధానాలు, ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డి పనితీరే లక్ష్యంగా ప్రచారం సాగిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పనితీరు, ధరల పెరుగుదల, రాష్ట్రానికి నిధులు, పథకాల అమల్లో వివక్ష తదితరాలపై విమర్శలు గుప్పిస్తున్నా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలంపైనే దృష్టి కేంద్రీకరించింది. గ్రామ స్థాయిలో ఓ మోస్తరు గుర్తింపు పొందిన కాంగ్రెస్ నేతలు, ముఖ్య కార్యకర్తలను పార్టీలో చేర్చుకుంటూ ఆ మేరకు ప్రత్యర్థిని బలహీన పరిచే ఎత్తుగడను అనుసరిస్తోంది.మరోవైపు మండలాలు, గ్రామాల వారీగా వివిధ సామాజిక వర్గాల ఓటర్ల వివరాలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించి వారిని ప్రత్యక్షంగా కలసి టీఆర్‌ఎస్ యంత్రాంగం ఓట్లను అభ్యర్థిస్తోంది. ప్రచారంలో పైచేయి సాధించి పోలింగ్ నాటికి విపక్ష శిబిరంలో ఆత్మవిశ్వాసం దెబ్బతీయడం ద్వారా భారీ మెజారిటీ సాధించేందుకు టీఆర్‌ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది.
చదవండి: సాగర్ ఉప ఎన్నికపై ప్రత్యేక నిఘా
Comments
Please login to add a commentAdd a comment