byelectrion
-
మునుగోడులో టీఆర్ఎస్ దిద్దుబాటు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు శాసనసభా సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన రాజీనామాను తక్షణమే ఆమోదిస్తూ స్పీకర్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ అప్రమత్తమైంది. కాంగ్రెస్ నుంచి గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి ఉప ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేయడం ఖాయం కాగా... ఈ నియోజకవర్గాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగే పరిస్థితి లేదని.. అక్టోబర్, నవంబర్‌లో ఉప ఎన్నికకు అవకాశం ఉండొచ్చని టీఆర్ఎస్ భావిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి, పకడ్బందీగా ఉప పోరుకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. 2014లో టీఆర్ఎస్ గెలుచుకున్న మునుగోడు సీటు 2018 ఎన్నికల్లో ‘హస్త’గతమైంది. కానీ రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్న టీఆర్ఎస్ అందుకోసం హడావుడి నిర్ణయాల జోలికి వెళ్లవద్దని, అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించింది. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించుకొని, అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మరో ఏడాదిలో వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు మునుగోడును దక్కించుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ‘పాజిటివ్ వేవ్స్’పంపాలన్న కృతనిశ్చయంతో ఉంది. స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా గట్టుప్పల్‌ను మండలంగా చేసిన ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా పెండింగ్ ప్రాజెక్టులు, ప్రజావసరాలకు అనుగుణంగా మరికొన్ని నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనుంది. అదే సమయంలో పార్టీ పరంగా కూడా ఆచితూచి వ్యవహరించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. కొత్త చేరికలు.. అసంతృప్తులకు బుజ్జగింపులు... మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమని తెలిసినప్పటి నుంచే మండలాలు, గ్రామాల వారీగా పార్టీ బలాబలాలపై నజర్ పెట్టినట్లు సమాచారం. గ్రామాలను, మండలాలను ప్రభావితం చేయగల ఇతర పార్టీలోని నాయకులను టీఆర్ఎస్లోకి ఆహ్వానించాలని భావిస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరుతున్నా, ఆయన వెంట వెళ్లేందుకు ఆసక్తి చూపని కాంగ్రెస్ అనుచరవర్గానికి గులాబీ గాలం వేస్తోంది. అదే సమయంలో గత ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన స్థానిక బలమైన కేడర్‌ను టీఆర్ఎస్లోకి ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే పార్టీలో కొందరు జెడ్పీటీసీ, ఎంపీపీలు, ఎంపీటీసీలు అసంతృప్తితో ఉన్నట్లు గుర్తించిన అధిష్టానం వారిని హైదరాబాద్ పిలిపించి బుజ్జగించాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను రవీందర్రావు, రవీంద్రకు మార్కు అప్పగించింది. ఇక ఎమ్మెల్యే టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే కూచుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఉండగా, ఎవరినీ ఫోకస్ చేయకుండా పార్టీ పరిస్థితిని చక్కదిద్దిన తరువాతే అభ్యర్థి ఎవరో ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలిసింది. పార్టీ బలోపేతంపై సీఎం ప్రత్యేక నజర్... మునుగోడులో 2014 ఎన్నికల్లో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 2018 ఎన్నికల్లో ఓటమి చెందారు. కోమటిరెడ్డి కుటుంబ ప్రాబల్యం, కాంగ్రెస్ పట్ల అనుకూలతతో పాటు ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పట్ల కొంత ప్రతికూలత జనాల్లో వ్యక్తమైనట్లు పార్టీ గుర్తించింది. పార్టీలో విభేదాలూ ఓటమికి కారణమని తేలింది. ఈ నేపథ్యంలో తొలుత పార్టీలో విభేదాలను పరిష్కరించి, మండలాల స్థాయి నుంచి పార్టీని అభివృద్ధి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావుకు పార్టీ పరిస్థితిని చక్కబెట్టే బాధ్యతలను సీఎం కేసీఆర్ అప్పగించినట్లు తెలిసింది. నియోజకవర్గంలో పార్టీ బలంతో పాటు అంతర్గత విభేదాలు, ఇతర పార్టీల బలాబలాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటమికి ప్రభావం చూపిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. చదవండి: బీజేపీ ఉరకలు.. కాంగ్రెస్‌కు అగ్ని పరీక్ష.. టీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకం! -
కర్ణాటకలో మంగ్లీ ధూమ్‌ధామ్.. ఓటర్లను ఆకట్టుకునేలా
సాక్షి బళ్లారి: ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ గాయని మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ మస్కి నియోజకవర్గంలో బీజేపీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. మంగళవారం ఉగాది సందర్భంగా ఆమె నియోజకవర్గంలోని అడవిబావి, హడగలి తాండాల్లో ఇంటింటా కలియతిరుగుతూ తాండా భాషలో మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నారు. ఇటీవల.. ‘‘కన్నే అదిరింది అనే పాట’’ కన్నడిగులను కూడా కట్టి పడేసింది. ఈ నేపథ్యంలో మంగ్లీకి ఇటీవల కర్ణాటకలో కూడా విశేష ఆదరణ లభించడంతో ఆమెను ప్రచారంలోకి దింపారు. ప్రవాసాంధ్ర క్యాంపులతో పాటు మస్కి పట్టణంలో కూడా ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ విజయానికి కృషి చేయండి రాయచూరు రూరల్: మస్కి ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ సూచించారు. ఆయన సోమవారం సాయంత్రం ముదుగల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అన్ని విధాలుగా అభివృద్ధికి పెద్ద పీట వేస్తామన్నారు. రైతులకు ఉపయోగపడే ఎన్‌ఆర్‌బీసీ 5ఏ ఉప కాలువను నిర్మిస్తామన్నారు. చదవండి: ఈ సారి సాయి పల్లవి కాదు మంగ్లీ స్టెప్పులేసింది! -
14న ‘సాగర్’కు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఈ నెల 14న హాలియా పట్టణ శివారులో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. 14న సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. సభ నిర్వహణకు సంబంధించి హాలియా శివారులోని పెద్దవూర మార్గంలో 20 ఎకరాల ఖాళీ స్థలాన్ని గుర్తించి పార్టీ నేతలు అనుమతులు కూడా పొందారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం నలుమూలల నుంచి జనసమీకరణ చేస్తున్న నేపథ్యంలో 30 ఎకరాలను పార్కింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించారు. బహిరంగ సభ కోసం ఎంపిక చేసిన స్థలాన్ని సీఎం సెక్యూరిటీ విభాగం అధికారులు కూడా సందర్శించి ఆమోదం తెలిపారు. సభ నిర్వహణకు మరో 7 రోజులే వ్యవధి ఉండటంతో జన సమీకరణ బాధ్యతను సాగర్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ఇన్చార్జీ లుగా వ్యవహరిస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు అప్పగించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సభ సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 9, 10 తేదీల్లో రోడ్‌షోల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధం చేశారు. అయితే ఎన్నికల వ్యయ పరిమితిని దృష్టిలో పెట్టుకుని రోడ్‌షోలు రద్దు చేసుకోవాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితి రూ.28 లక్షలు కాగా.. బహిరంగ సభ నిర్వహణకు ఎక్కువ మొత్తంలో ఖర్చువుతున్నట్లు తెలిసింది. ఇన్‌చార్జీలకే ప్రచార, సమన్వయ బాధ్యతలు సాగర్ ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలను కొత్త బృందానికి అప్పగించిన కేసీఆర్ వివిధ వర్గాల నుంచి విభిన్న కోణాల్లో ప్రతిరోజూ అందుతున్న నివేదికలను విశ్లేషిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా తమ పార్టీ ప్రచార వ్యూహాన్ని రోజువారీగా మారుస్తున్నట్లు ప్రచారంలో సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ నేత ఒకరు వెల్లడించారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, రవీంద్రకుమార్, కోరుకంటి చందర్, భూపాల్‌రెడ్డి, కోనేరు కోణప్ప, శంకర్‌నాయక్, భాస్కర్‌రావుతో పాటు కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు వంటి నేతలకు సాగర్ నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీలు, మండలాల వారీగా పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలు అప్పగించడం ద్వారా కేసీఆర్ కొత్త తరహా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. గతంలో వివిధ ఉప ఎన్నికలు, కీలక ఎన్నికల్లో పనిచేసిన సీనియర్లకు బదులుగా కొత్త బృందానికి ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించడం కూడా వ్యూహాత్మకమేనని టీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. నియోజకవర్గంలోని సామాజికవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఇన్చార్జీల ఎంపిక జరిగినట్లు కనిపిస్తోంది. కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్నారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ కూడా మైనార్టీలు, సామాజిక వర్గాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్.. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీతో తలపడిన టీఆర్ఎస్ సాగర్ ఉప ఎన్ని కలో కాంగ్రెస్‌ను ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ విధానాలు, ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డి పనితీరే లక్ష్యంగా ప్రచారం సాగిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పనితీరు, ధరల పెరుగుదల, రాష్ట్రానికి నిధులు, పథకాల అమల్లో వివక్ష తదితరాలపై విమర్శలు గుప్పిస్తున్నా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలంపైనే దృష్టి కేంద్రీకరించింది. గ్రామ స్థాయిలో ఓ మోస్తరు గుర్తింపు పొందిన కాంగ్రెస్ నేతలు, ముఖ్య కార్యకర్తలను పార్టీలో చేర్చుకుంటూ ఆ మేరకు ప్రత్యర్థిని బలహీన పరిచే ఎత్తుగడను అనుసరిస్తోంది.మరోవైపు మండలాలు, గ్రామాల వారీగా వివిధ సామాజిక వర్గాల ఓటర్ల వివరాలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించి వారిని ప్రత్యక్షంగా కలసి టీఆర్ఎస్ యంత్రాంగం ఓట్లను అభ్యర్థిస్తోంది. ప్రచారంలో పైచేయి సాధించి పోలింగ్ నాటికి విపక్ష శిబిరంలో ఆత్మవిశ్వాసం దెబ్బతీయడం ద్వారా భారీ మెజారిటీ సాధించేందుకు టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. చదవండి: సాగర్ ఉప ఎన్నికపై ప్రత్యేక నిఘా -
రాజకీయ ‘సాగరం’: స్థానిక బీసీ నేతకే టీఆర్ఎస్ టికెట్
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ వెలువడటంతో ఇక రాజకీయ పార్టీలన్నీ అటువైపు దారి కట్టనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నిక కోసం ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిన రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు ఇకపై కార్యాచరణను ముమ్మరం చేయనున్నాయి. నిన్నటి వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజీగా ఉన్న పార్టీలు షెడ్యూల్ రాకతో సాగర్‌పై దృష్టి కేంద్రీకరించేందుకు సమాయత్తమవుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలకు మళ్లీ ‘పరీక్ష’ నాగార్జున సాగర్ ఉపఎన్నిక రూపంలో రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాలకు మరో పరీక్ష ఎదురుకానుంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన టీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా సాగర్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఇప్పటికే కొంత కసరత్తు పూర్తి చేసింది. ఈ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉపఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే మండలాల వారీగా ఎమ్మెల్యేలను ఇంచార్జిలుగా నియమించారు. ఇప్పుడు షెడ్యూల్ వెలువడటంతో గ్రామం, వార్డు, పోలింగ్ బూత్ స్థాయిలో టీఆర్ఎస్ ప్రణాళిక అమలు చేయనుంది. అయితే, ఇక్కడ అభ్యర్థి ఎవరన్నది మాత్రం టీఆర్ఎస్ అధిష్టానం ఇంకా తేల్చలేదు. దివంగత శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య కుమారుడు భగత్, ఆ పార్టీ నాయకులు తేరా చిన్నపరెడ్డి, ఎం.సి.కోటిరెడ్డిల పేర్లు మొదట్లో వినిపించినా... సర్వేల అనంతరం స్థానికుడైన బీసీ నాయకుడిని బరిలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ ఎన్నిక కోసం ఏకంగా టీపీసీసీ అధ్యక్ష ఎంపికనే వాయిదా వేసుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా సాగర్‌లో గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నించనుంది. ఇక్కడి నుంచి సీనియర్ నేత కె.జానారెడ్డిని అభ్యర్థిగా మంగళవారం ప్రకటించింది. జానారెడ్డి, ఆయన కుమారుడు రఘువీర్‌లు ఇప్పటికే రెండుసార్లు నియోజకవర్గాన్ని చుట్టివచ్చారు. వీలున్న చోటల్లా తమ నుంచి దూరంగా వెళ్లిన వారిని మళ్లీ అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు అనివార్యం కావడంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఇక నుంచి జానాకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ కూడా ఈ ఎన్నిక కోసం అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. స్థానిక నాయకుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి సతీమణి నివేదిత అభ్యర్థిత్వంతో పాటు టీడీపీ నుంచి వచ్చిన కడారి అంజయ్య యాదవ్, డాక్టర్ రవికుమార్ పేర్లను కూడా పరిశీలిస్తోంది. అయితే, ఈ ముగ్గురిలో ఒకరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారా? లేదా అనూహ్యంగా కొత్త అభ్యర్థిని తెరపైకి తెస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి తోమర్లు కూడా నియోజకవర్గంలో పర్యటించారు. షెడ్యూల్ వెలువడటంతో ఇక రాష్ట్ర కమలనాథులందరూ సాగర్ బాట పట్టనున్నారు. మొత్తంమీద సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల అసెంబ్లీ సంతాపం వ్యక్తం చేసిన రోజే ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడింది. మరో నెలరోజుల పాటు కృష్ణానదీ తీరంలో రాజకీయాలు వేడెక్కనున్నాయి. -
సోలిపేట సతీమణి అభ్యర్థిత్వం ఖరారు!
సాక్షి, సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాత బరిలో నిలవనున్నారు. ఇందుకు సంబంధించి గులాబీ దళ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. దీనిని సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజాత పేరు ఏకగ్రీవం కావడంతో దుబ్బాక, సిద్ధిపేటలో సోలిపేట కుటుంబ అనుచర వర్గం సంబరాలు చేసుకుంటోంది. (చదవండి: దుబ్బాకపై టీఆర్ఎస్ కన్ను) మరోవైపు.. టికెట్ ఆశించి భంగపడి. అసంతృప్తితో ఉన్న చెరకు ముత్యరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డితో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు మంతనాలు జరుపుతున్నారు. కాగా సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో దుబ్బాక శాసన సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో చెరుకు ముత్యంరెడ్డి చనిపోయిన సందర్భంలో ఆయన కుటుంబానికి బాసటగా ఉంటానని, రాజకీయంగా ఆదుకుంటామని కేసీఆర్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఆ తర్వాత సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి అంచనాల కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న సందర్భంలోనే, ఆయన అకాల మృతి నేపథ్యంలో సోలిపేట కుటుంబానికి కూడా హామీ ఇచ్చారు. దీంతో ఇరువురు నేతల తనయులు టిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించగా.. చివరికి సోలిపేట సతీమణి సుజాతకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.(చదవండి: ఉప ఎన్నిక.. తనయులు రాజకీయ అరంగేట్రం!) -
నంద్యాల ఉప ఎన్నిక కసరత్తు
–నంద్యాల రిటర్నింగ్ అధికారిగా పీఏ టు స్పెషల్ కలెక్టర్ – తహసీల్దార్లు, పోలీసు అధికారుల వివరాలు కోరిన ఎన్నికల కమిషన్ కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల ఉప ఎన్నికకు కసరత్తు మొదలైంది. పీఏ టు శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ నంద్యాల నియోజక వర్గానికి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. అయితే పీఏ టు స్పెషల్ కలెక్టర్ పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. పీఏ టు స్పెషల్ కలెక్టర్‌గా వెంకటకృష్ణుడు పదవీ విరమణ చేసిన తర్వాత ఈ పోస్టులో ఎవ్వరిని నియమించలేదు. ఇన్చార్జ్ నియామకం కూడా జరగలేదు. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఈ పోస్టులో నంద్యాల తెలుగు గంగ ప్రాజెక్టు భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యంను ఇన్చార్జ్ పీఏ టు స్పెషల్ కలెక్టర్‌గా నియమించారు. ఉప ఎన్నిక ఉన్నందున రెగ్యులర్ పీఏ టు స్పెషల్ కలెక్టర్‌ను నియమించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఇన్చార్జిగా నియమితులైన సత్యం నంద్యాల అసెంబ్లీ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే అవకాశం ఉంది. కాగా ఈ నియోజక వర్గ పరిధిలో తహసీల్దార్లు, పోలీసు అధికారుల వివరాలు పంపాలని ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఎంత కాలం నుంచి నియోజక వర్గంలో పనిచేస్తున్నారు... వారి స్థానికత ఏది తదితర వివరాలను ప్రత్యేక ఫార్మెట్లో పంపాలని సూచించారు. నంద్యాల అసెంబ్లీ ఓటర్లు 2,09,612 నంద్యాల నియోజక వర్గంలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మొత్తం ఓటర్లు 2,09,612 మంది ఉండగా ఇందులో మహిళలు 1,06,223 మంది ఉన్నారు. పురుషులు 1,03,328 ఉన్నారు. ఇతరులు 61 మంది ఉన్నారు. పురుష ఓటర్లతో పోలిస్తే 2895 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.