సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ వెలువడటంతో ఇక రాజకీయ పార్టీలన్నీ అటువైపు దారి కట్టనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నిక కోసం ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిన రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు ఇకపై కార్యాచరణను ముమ్మరం చేయనున్నాయి. నిన్నటి వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజీగా ఉన్న పార్టీలు షెడ్యూల్ రాకతో సాగర్‌పై దృష్టి కేంద్రీకరించేందుకు సమాయత్తమవుతున్నాయి.
మూడు ప్రధాన పార్టీలకు మళ్లీ ‘పరీక్ష’
నాగార్జున సాగర్ ఉపఎన్నిక రూపంలో రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాలకు మరో పరీక్ష ఎదురుకానుంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన టీఆర్‌ఎస్ ఈసారి ఎలాగైనా సాగర్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఇప్పటికే కొంత కసరత్తు పూర్తి చేసింది. ఈ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించగా, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉపఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే మండలాల వారీగా ఎమ్మెల్యేలను ఇంచార్జిలుగా నియమించారు. ఇప్పుడు షెడ్యూల్ వెలువడటంతో గ్రామం, వార్డు, పోలింగ్ బూత్ స్థాయిలో టీఆర్‌ఎస్ ప్రణాళిక అమలు చేయనుంది. అయితే, ఇక్కడ అభ్యర్థి ఎవరన్నది మాత్రం టీఆర్‌ఎస్ అధిష్టానం ఇంకా తేల్చలేదు.
దివంగత శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య కుమారుడు భగత్, ఆ పార్టీ నాయకులు తేరా చిన్నపరెడ్డి, ఎం.సి.కోటిరెడ్డిల పేర్లు మొదట్లో వినిపించినా... సర్వేల అనంతరం స్థానికుడైన బీసీ నాయకుడిని బరిలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ ఎన్నిక కోసం ఏకంగా టీపీసీసీ అధ్యక్ష ఎంపికనే వాయిదా వేసుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా సాగర్‌లో గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నించనుంది. ఇక్కడి నుంచి సీనియర్ నేత కె.జానారెడ్డిని అభ్యర్థిగా మంగళవారం ప్రకటించింది. జానారెడ్డి, ఆయన కుమారుడు రఘువీర్‌లు ఇప్పటికే రెండుసార్లు నియోజకవర్గాన్ని చుట్టివచ్చారు. వీలున్న చోటల్లా తమ నుంచి దూరంగా వెళ్లిన వారిని మళ్లీ అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు అనివార్యం కావడంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఇక నుంచి జానాకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు.
బీజేపీ కూడా ఈ ఎన్నిక కోసం అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. స్థానిక నాయకుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి సతీమణి నివేదిత అభ్యర్థిత్వంతో పాటు టీడీపీ నుంచి వచ్చిన కడారి అంజయ్య యాదవ్, డాక్టర్ రవికుమార్ పేర్లను కూడా పరిశీలిస్తోంది. అయితే, ఈ ముగ్గురిలో ఒకరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారా? లేదా అనూహ్యంగా కొత్త అభ్యర్థిని తెరపైకి తెస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి తోమర్‌లు కూడా నియోజకవర్గంలో పర్యటించారు. షెడ్యూల్ వెలువడటంతో ఇక రాష్ట్ర కమలనాథులందరూ సాగర్ బాట పట్టనున్నారు. మొత్తంమీద సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల అసెంబ్లీ సంతాపం వ్యక్తం చేసిన రోజే ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడింది. మరో నెలరోజుల పాటు కృష్ణానదీ తీరంలో రాజకీయాలు వేడెక్కనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment