నంద్యాల ఉప ఎన్నిక కసరత్తు
నంద్యాల ఉప ఎన్నిక కసరత్తు
Published Tue, May 2 2017 9:43 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM
–నంద్యాల రిటర్నింగ్ అధికారిగా పీఏ టు స్పెషల్ కలెక్టర్
– తహసీల్దార్లు, పోలీసు అధికారుల వివరాలు కోరిన ఎన్నికల కమిషన్
కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల ఉప ఎన్నికకు కసరత్తు మొదలైంది. పీఏ టు శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ నంద్యాల నియోజక వర్గానికి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. అయితే పీఏ టు స్పెషల్ కలెక్టర్ పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. పీఏ టు స్పెషల్ కలెక్టర్‌గా వెంకటకృష్ణుడు పదవీ విరమణ చేసిన తర్వాత ఈ పోస్టులో ఎవ్వరిని నియమించలేదు. ఇన్‌చార్జ్ నియామకం కూడా జరగలేదు. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఈ పోస్టులో నంద్యాల తెలుగు గంగ ప్రాజెక్టు భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యంను ఇన్‌చార్జ్ పీఏ టు స్పెషల్ కలెక్టర్‌గా నియమించారు. ఉప ఎన్నిక ఉన్నందున రెగ్యులర్ పీఏ టు స్పెషల్ కలెక్టర్‌ను నియమించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఇన్‌చార్జిగా నియమితులైన సత్యం నంద్యాల అసెంబ్లీ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే అవకాశం ఉంది. కాగా ఈ నియోజక వర్గ పరిధిలో తహసీల్దార్లు, పోలీసు అధికారుల వివరాలు పంపాలని ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఎంత కాలం నుంచి నియోజక వర్గంలో పనిచేస్తున్నారు... వారి స్థానికత ఏది తదితర వివరాలను ప్రత్యేక ఫార్మెట్‌లో పంపాలని సూచించారు.
నంద్యాల అసెంబ్లీ ఓటర్లు 2,09,612
నంద్యాల నియోజక వర్గంలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మొత్తం ఓటర్లు 2,09,612 మంది ఉండగా ఇందులో మహిళలు 1,06,223 మంది ఉన్నారు. పురుషులు 1,03,328 ఉన్నారు. ఇతరులు 61 మంది ఉన్నారు. పురుష ఓటర్లతో పోలిస్తే 2895 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.
Advertisement