121 రోజులైనా దొరకని పాప ఆచూకీ
ముచ్చుమర్రి కేసులో పోలీసుల అలసత్వం.. పట్టించుకోని ప్రభుత్వం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేసినా లేని ఫలితం
తమకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రుల కన్నీళ్లు
నంద్యాల, సాక్షి: ప్రతీకార రాజకీయంతో దాడులు, ఆడపడుచులపై అఘాయిత్యాలు.. చిన్నారులను చిదిమేస్తున్న మానవ మృగాలు.. ఏపీలో నాలుగు నెలలుగా అసలేం జరుగుతోంది?. పైగా బాధితులకు న్యాయం జరగకపోగా.. నిందితులు యధేచ్ఛగా బయట తిరుగుతున్నారు.
సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి బాలిక హత్యచార ఘటన కేసులో న్యాయం అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. నిందితులకు బెయిల్ లభించడంతో వాళ్లు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ పరిణామంతో.. ఆ బాలిక తల్లిదండ్రులు ప్రభుత్వంపై ఆక్రోశం వ్యక్తం చేశారు.
‘‘121 రోజులైంది. మాపాప ఆచూకీ ఇంత వరకు దొరకకపోవడం ఏమిటి?. అసలేం జరుగుతోంది. నిందితులు బెయిల్ వచ్చి స్వేచ్చగా బయట తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని మేం బిడ్డను దూరం చేసుకుని శిక్ష అనుభవించాలా?. వాళ్లకు బహిరంగంగా ఉరిశిక్ష వేస్తేనే మా కూతురి విషయం న్యాయం జరిగినట్లు’’ అని ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేసు నేపథ్యం ఇలా..
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో తొమ్మిదేళ్ల బాలికను జూలై 7న అదేగ్రామానికి చెందిన 15, 14, 9 వయసున్న ముగ్గురు మైనర్ బాలురు హత్యాచారానికి పాల్పడ్డారు. అయితే వాళ్లకు సహకరించిన మరో ముగ్గురు పెద్దలను సైతం పోలీసులు ఈ కేసులో చేర్చారు. దీంతో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లయ్యింది.
అయితే.. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు, నిందితులు వెల్లడించిన వివరాలు అన్నీ అనుమానాస్పదంగా ఉన్నవే. నేరం జరిగి 90 రోజులు గడవడంతో పోలీసులు ప్రిలిమనరీ చార్జిషీట్ ఫైల్ చేశారు. క్రైం నంబర్ 69/2024లో నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాదనలు విన్న కర్నూలు పోక్సో కోర్టు ఏ4 కాటం యోహాన్, ఏ5 బొల్లెద్దుల సద్గురు అలియాస్ సద్గురుడు, ఏ6 అంబటి ప్రబేష్‌కు అక్టోబర్ 24వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. అలాగే.. కేసులో కొద్ది రోజుల క్రితం ముగ్గురు మైనర్ నిందితుల్లో ఇద్దరికి జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. చైల్డ్ ఇన్ కాంఫ్లిట్ విత్ లా(సీసీఎల్2)14 ఏళ్ల బాలుడు, సీసీఎల్3 అయిన తొమ్మిదేళ్ల బాలుడికి బెయిల్ మంజూరైంది. అయితే.. సీసీఎల్1 అయిన పదిహేనేళ్ల బాలుడు మాత్రం ప్రస్తుతం జువైనల్ జస్టిస్ హోంలో ఉన్నాడు.
ఇదెక్కడి న్యాయం?
ఈ కేసులో పోలీసుల అలసత్వంపై మొదటి నుంచి విమర్శలున్నాయి. తల్లిదండ్రులు బాలిక కనిపించకుండా పోయిన రోజున ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ప్రజా సంఘాల ఒత్తిడితో రెండు రోజుల తర్వాత నుంచి విచారణ ప్రారంభించారు. జులై 10న నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తే చిన్నారిని రేప్ చేసి చంపేసినట్లు నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులు బాలిక శవాన్ని మాయం చేయడంతో గుర్తించడంలో పోలీసులు పూర్తి వైఫల్యం చెందారని బాధితులు చెబుతున్నారు. అలాగే.. ప్రభుత్వం స్పందించిన తీరుపైనా ఆ టైంలో తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. తమకు న్యాయం చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆ తల్లిదండ్రులు పలు ఇంటర్వ్యూల ద్వారా విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అటుపై ఈ కేసును ప్రభుత్వం, పోలీసులు పూర్తిగా గాలికొదిలేశారు. సుమారు 121 రోజులు గడుస్తున్న ఇంకా పాప ఆచూకీ దొరకలేదన్న బాధలో ఉన్న ఆ తల్లిదండ్రులు.. ఇప్పుడు న్యాయం అందకపోవడంపై ఆవేదన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment