విశాఖపట్నం, సాక్షి: ‘‘ఒక్కరోజులో మా బతుకులు తలకిందులైపోయాయి. మా వాళ్ల శవాల్ని తెచ్చి ఇక్కడ పెట్టారు. ప్రమాదం జరిగాక.. మా లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ ఎవరూ వచ్చింది లేదు. ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్ నుంచి స్పందన లేదు’’ అంటూ అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీ బాధిత కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి.
గురువారం వైఎస్సార్‌సీపీ నేతలు కింగ్ జార్జ్ ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఆ సమయంలో బాధిత కుటుంబాల ఆవేదన విని.. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చలించిపోయారు. ‘‘అచ్యుతాపురం ఘటన దురదృష్టకరం. కానీ, పాలక పార్టీ తీరు బాధాకరం. బాధితుల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఇంత నిర్లక్ష్యం తగదు. బాధితులకు భరోసా కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఘటనకు బాధ్యులు అయిన యాజమాన్యం మీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.
.. సీఎం చంద్రబాబు కేజీహెచ్‌కు ఎందుకు రాలేదు?. మా పార్టీ డిమాండ్‌ను ఇప్పటికే అధినేత వైఎస్‌జగన్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. మా ప్రభుత్వం ఎల్జీ పాలీమర్స్ ఘటనలో కోటి రూపాయల పరిహారం ఇచ్చింది. కానీ, ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఎన్ని కోట్లు ఇచ్చినా.. పోయిన ప్రాణం తిరిగి రాదు. కానీ, బాధిత కుటుంబాలకు పరిహారంతోనే ఆదుకోవాలి. మృతుల కుటుంబాల్ని ప్రభుత్వం పరామర్శించకపోవడం మంచి సంప్రదాయం కాదు. రేపు బాధితుల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు’’ అని బొత్స తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment