సాక్షి, తూర్పుగోదావరి: ప్రేమ పేరుతో కొందరు ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. తమను ప్రేమించలేదనే కారణంగా యువతులపై దాడులకు తెగబడుతున్నారు. ఏపీలో ఒకేరోజు రెండు చోట్ల దాడి ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది.
తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్ల గ్రామంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గుర్రాల రాజు(23) అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఓ యువతిని వేధింపులకు గురిచేశారు. కొద్దిరోజులుగా ఆమె వెంట పడుతూ తనను ప్రేమించాలని వేధించాడు. ఈ క్రమంలో బాధితురాలు పట్టించుకోకపోవడంతో ఆమెపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆమెపై దాడి చేసేందుకు బాధితురాలి ఇంటికి వెళ్లాడు. యువతిపై దాడి చేసే సమయంలో ఆమె తల్లి అడ్డురావడంతో కోపంతో.. ఆమెపై దాడి చేశాడు. ఈ సందర్భంగా బాధితురాలి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కాగా, దాడి చేసిన తర్వాత రాజు అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అలాగే, నిందితుడు రాజు కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.
ఇక, నంద్యాల జిల్లాలో కూడా ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదనే కారణంగా యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని తాను ప్రేమిస్తున్నానంటూ రాఘవేంద్ర వేధింపులకు గురిచేశాడు . అయితే యువతి అతని ప్రేమను అంగీకరించకపోవడంతో.. లహరిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అనంతరం తాను నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా యువతి పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment