బ్లాక్ రైస్ సాగుపై రైతుల్లో పెరుగుతున్న ఆసక్తి
నంద్యాల జిల్లాలో నాలుగేళ్లుగా సాగు
పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ
నంద్యాల: నల్ల బియ్యం.. ఇటీవల ప్రజల నోళ్లలో నానుతున్న పదం. నంద్యాల జిల్లాలో నాలుగేళ్ల క్రితం బ్లాక్ రైస్(Black Rice) సాగు మొదలైంది. పోషకాల గనిగా భావించే నల్ల (కాలా) వరి పంటపై జిల్లాలోని ఔత్సాహిక రైతులు మక్కువ చూపుతున్నారు. ఈ పంట ఎందుకంత స్పెషల్ అని ప్రశ్నిస్తే ‘ఇవి చక్రవర్తులు తిన్న బియ్యం’ అని గర్వంగా చెబుతున్నారు. ఆరోగ్యకరమైన సమాజానికి ఇలాంటి ఆహారం అవసరం అనే ఉద్దేశంతోనే పండిస్తున్నామంటున్నారు. జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, పాణ్యం, నియోజకవర్గాల్లో గత ఏడాది 75 ఎకరాల్లో బ్లాక్‌రైస్ పంటను రైతులు సాగు చేయగా.. ఈ ఏడాది 150 ఎకరాల్లో పంట సాగు చేశారు.
దిగుబడి తక్కువ..ధర ఎక్కువ
అత్యంత పోషక విలువలున్న ఈ నల్ల బియ్యాన్ని చైనా సహా వివిధ దేశాల రాజవంశీకులు వాడేవారట.. వీటిని సామాన్యులు తినకుండా నిషేధం ఉండేదట. అందుకే వీటిని ‘ఫర్ బిడెన్ రైస్’ (నిషేధించిన బియ్యం) అని కూడా పిలుస్తుంటారు. సాధారణ వరి కంటే బ్లాక్ రైస్(Black Rice) దిగుబడి తక్కువగా ఉంటుంది. ధర మాత్రం ఎక్కువగానే ఉంది. సాధారణ రకం ధాన్యం ఎకరాకు 25–30 బస్తాల (బస్తాకు 75 కిలోలు) దిగుబడి వస్తే బ్లాక్ రైస్ మాత్రం 10–15 బస్తాలు మాత్రమే వస్తుంది.
సాధారణ ధాన్యం కిలో రూ.55–రూ.60 ఉంటే బ్లాక్ రైస్ కిలో రూ.170 నుంచి రూ.190కి విక్రయిస్తున్నారు. బ్లాక్ రైస్ సాగుకు పెట్టుబడి కూడా తక్కువే. సాధారణంగా వరి పండించాలంటే.. ఎకరాకు రూ.28వేల నుంచి రూ.30వేల వరకు పెట్టుబడి అవుతుంది. బ్లాక్ రైస్ పంటకు మాత్రం ఎకరానికి రూ.20 వేలు సరిపోతుంది.
బ్లాక్ రైస్‌కు గోఆధారిత జీవామృతం, గోమూత్రం, ఆవుపేడ, ద్విదల గింజలతో తయారు చేసిన ఎరువును వినియోగిస్తారు. అందువల్ల బ్లాక్‌రైస్‌కు తెగుళ్లు సోకే ఆస్కారం ఉండదు. పురుగుల ముందులు పిచికారి చేయాల్సిన అవసరం ఏర్పడదు. సాధారణ వరి 120 నుండి 130 రోజుల్లో పంట చేతికొస్తే బ్లాక్ రైస్ మాత్రం 140 నుండి 150 రోజులు పడుతుంది.
నల్ల బియ్యంతో ప్రయోజనాలు ఇవీ..
» ఈ బియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. ఇవి ఆరోగ్యాన్ని ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
» నరాల బలహీనత ఉన్న వారికి ఈ బియ్యాన్ని మసాజ్ చేసేందుకు కేరళ ఆయుర్వేద వైద్య విధానంలో ఉపయోగిస్తారు.
» మధుమేహం, కేన్సర్, గుండె జబ్బులను నియంత్రిస్తుంది. శరీరంలోని అనవసర కొవ్వును కరిగిస్తుంది.
» విటమిన్–బీ, విటమిన్–ఈ, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజ విలువలు అధికంగా ఉంటాయి. » ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కణాలను శుభ్రపరుస్తుంది.
» అధిక రక్తపోటు సమస్య నుంచి తప్పించుకోవచ్చు.
» నల్ల బియ్యంలో యాంథో సైనిన్లు అధికంగా ఉంటాయి. ఇవి కంటి వ్యాధులను నయం చేస్తాయి.
» ఈ బియ్యంలో ఫైబర్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఓబెసిటీ సమస్యను కూడా తగ్గిస్తాయి.
ఆసక్తి గల రైతులకు విత్తనాన్ని అందిస్తా
బ్లాక్ రైస్ మంచిదని వ్యవసాయాధికారులు చెప్పడంతో ఈ ఏడాది రెండెకరాల్లో బ్లాక్ రైస్ సాగు చేస్తున్నా. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నందున రైతులు వీటిని తప్పనిసరిగా తమ కుటుంబ ఆహారంలో భాగం చేసుకోవాలన్నదే నా కోరిక. దీనికోసమే సన్నరకం బ్లాక్ రైస్ సాగు చేస్తున్నా. ఆసక్తి గల రైతులకు వచ్చే ఖరీఫ్‌లో బ్లాక్ రైస్ విత్తనాన్ని అందిస్తా. – సుధాకర్, నాగిరెడ్డిపల్లె
సేంద్రియ ఎరువులతోనే సాగు
ఈ ఏడాది మూడెకరాల్లో బ్లాక్ రైస్ సాగు చేస్తున్నా. ఈ పంటకు క్రిమిసంహారక మందులు వాడటం లేదు. మామూలు వరికి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు తప్పనిసరి. బ్లాక్ రైస్‌కు గోఆధారిత జీవామృతం, గోమూత్రం, ఆవుపేడ, ద్విదల గింజలతో తయారు చేసిన ఎరువును వినియోగిస్తున్నాం. దీనివల్ల బ్లాక్‌రైస్‌కు తెగుళ్ల ఆస్కారం ఉండదు. – మద్దిలేటి, రైతు, జిల్లెళ్ల గ్రామం
మందులు వాడకుండానే..
బ్లాక్ రైస్ నాలుగేళ్లుగా నంద్యాల జిల్లా రైతులు సాగు చేస్తున్నారు. క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రియ ఎరువులతోనే పండిస్తున్నారు. ఈ బియ్యం ఆరోగ్యానికి ఎంతో మంచిది. బ్లాక్ రైస్ పంటను సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. – నరేంద్రకుమార్‌రెడ్డి, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు అధికారి, నంద్యాల
Comments
Please login to add a commentAdd a comment