సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ ప్రచార రంగం మరింత వేడెక్కుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పన్నెండు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు నువ్వా–నేనా అన్న చందంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి కేవలం పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఒక విధంగా సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు మాజీ మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఎన్ని కలు కీలకంగా మారాయి. మాజీ అమాత్యులపై పోటీ పడుతున్న వారూ అనూహ్యంగా విజయం సొంతం చేసుకోవాలని శ్రమ పడుతున్నారు. దీంతో ప్రచారం వేడివేడిగా సాగుతోంది. పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులను మాత్రమే కాకుండా, పలువురు తమ తరఫున ప్రచారం చేసేం దుకు కుటుంబ సభ్యులను రంగంలోకి దింపారు.
హాట్ టాపిక్‌గా .. ఐదు చోట్ల ఎన్నికలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రులు పోటీ చేస్తున్న ఆ ఐదు నియోజకవర్గాలు హాట్ టాపిక్‌గా మారాయి. సూర్యాపేట నియోజకవర్గంలో ఆపద్ధర్మ మంత్రి జగదీశ్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రెండో సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే కేసీఆర్ కేబినెట్‌లో అవకాశం దక్కించుకున్న జగదీశ్‌రెడ్డి ఈ సారి గెలుపును సవాల్‌గా తీసుకుని శ్రమిస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే ఐదు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన దామోదర్ రెడ్డి సూర్యాపేట నుంచి 2009లో ప్రాతినిధ్యం వహించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ఈసారి గెలుపుపై దృష్టి పెట్టారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయంపై, మొత్తంగా ఐదో విజయంపై కన్నేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికను కీలకంగా భావిస్తున్నారు. 2009 –2014 లో కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఉమ్మడి ఏపీ ఆఖరి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఈ సారి ఎన్నిక సవాల్‌గా మారింది.
అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డున్న కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి నాగార్జున సాగర్ నుంచి ఎనిమిదో విజయం కోసం శ్రమిస్తున్నారు. ఈసారి ఎన్నికను ఆయన మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండలో ఐదో విజయంపై కన్నేశారు. 2009లో కాంగ్రెస్ ప్రభుతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో ఆయన మంత్రిగా పనిచేశారు. తెలంగాణ కోసం పదవీ త్యాగం చేసి 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. జిల్లాలో మరో సీనియర్ రాజకీయ నాయకుడు , మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మరోసారి ఆలేరు నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన ఇక్కడ నుంచి ఐదు పర్యాయాలు, తుంగతుర్తి నుంచి ఒకసారి గెలిచారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఆలేరు నుంచి పోటీకి దిగుతున్నారు. ఈ సారి ఆయనకు బీఎల్‌ఎఫ్ మద్దతు ఇస్తోంది. సుదీర్ఘ కాలం ఆలేరుకు ప్రాతినిధ్యం వహించిన నర్సింహులు ఆలేరు అభివృద్ధి కోసం తనను గెలిపించాలని కోరుతున్నారు. మొత్తంగా జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాల్లో ఐదుగురు మాజీ మంత్రులు, ఒక ఆపద్ధర్మ మంత్రి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
అదనపు బాధ్యతలతో.. ఒత్తిడి
ఈ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో పోటీ పడుతున్న మంత్రులుగా చేసిన ఆరుగురిలో ఐదుగురిపై అదనపు బాధ్యతల ఒత్తిడి ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆపద్ధర్మ మంత్రి జగదీశ్‌రెడ్డి ఒక వైపు తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ, తన గెలుపు కోసం శ్రమిస్తూనే.. జిల్లాలోని టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎన్నికను పరిశీలించాల్సి వస్తోందంటున్నారు. ప్రధానంగా ఆయన సొంత నియోజకవర్గం తుంగతుర్తిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం కోసం దృష్టి పెట్టాల్సి వస్తోందని అభిప్రాయపడుతున్నారు. సూర్యాపేట స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో ఉన్న మాజీ మంత్రి దామోదర్ రెడ్డి తన సొంత నియోజకవర్గం, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన తుంగతుర్తి బాధ్యతను కూడా చూస్తున్నారు. టీ పీసీసీ చీఫ్‌గా రాష్ట్ర ఎన్నికల సారథ్య బాధ్యతలు మోస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకించి తన నియోజకవర్గంతో పాటు, పొరుగునే ఉన్న కోదాడపైనా దృష్టిపెట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇక్కడి నుంచి ఆయన భార్య, తాజా మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెండో సారి పోటీలో ఉన్నారు.
కోదాడ నుంచి రెండు పర్యాయాలు గెలిచిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోదాడను తమ చేయి దాటిపోకుండా వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. సీనియర్ నేత కె.జానారెడ్డి తన నియోజకవర్గం నాగార్జునసాగర్‌తో పాటు, పొరుగునే ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గ బాధ్యతలు కూడా చూస్తున్నారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్యను గెలిపించాల్సిన బాధ్యత కూడా జానారెడ్డిపైనే పడిందని పేర్కొంటున్నారు. ఐదో విజయం కోసం పోటీలో ఉన్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండలో తన గెలుపుకోసం శ్రమిస్తూనే.. తమ సొంత నియోజకవర్గమైన నకిరేకల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య కోసం కూడా పనిచేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఆయన ఒక సారి ప్రచారానికి వెళ్లి వచ్చారు. ఇలా.. ఒక అపద్ధర్మ మంత్రి, నలుగురు మాజీ మంత్రులకు తమ నియోజకవర్గాలతో పాటు ఇతర స్థానాల బాధ్యత మీద పడిందని విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment