అప్రతిహతంగా ఏడు పర్యాయాలు తాను ప్రాతినిధ్యం వహించిన నాగార్జునసాగర్‌కు సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి వీడ్కోలు చెబుతున్నట్లేనా ? తాను మిర్యాలగూడనుంచి, తన తనయుడు రఘువీర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయాలన్న ఆశలపై హై కమాండ్ నీళ్లు చల్లిందా..? ఒక కుటుంబానికి ఒకే టికెట్ నిబంధన జానాకు ప్రతిబంధకంగా మారనుందా..? ఇప్పుడు జిల్లా కాంగ్రెస్‌లో, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో
జరుగుతున్న చర్చ ఇదే .
సాక్షిప్రతినిధి, నల్లగొండ : తన తనయుడికి టికెట్ ఇప్పించుకునేందుకు ఢిల్లీ పర్యటనకు వెళ్లారన్న వార్తలను సీఎల్పీ మాజీనేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి ఖండించినా, కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రయత్నాలు చూస్తుంటే పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను సీఎంను అవుతానని, ఆ ప్రచారంతోనే మిర్యాలగూడ నుంచి బరిలోకి దిగాలన్న ఆలోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. జానారెడ్డి సాగర్‌నుంచి మిర్యాలగూడ మారితే, సాగర్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఒకవేళ ఆయన తనయుడు రఘువీర్‌కు టికెట్ దక్కితే సమస్య లేదు కానీ, కుటుంబానికి ఒకే టికెట్ అన్న నిర్ణయం వల్ల సాగర్‌లో ఎవరు బరిలోకి దిగుతారన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరి ప్రత్యామ్నాయం?
తనకు ప్రత్యామ్నాయం తనయుడు అయ్యే అవకాశం లేనప్పుడు జానారెడ్డి తన దగ్గరి అనుచర నేత దాచిరెడ్డి మాధవరెడ్డి కుటుంబం వైపు మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. పాతికేళ్ల పాటు పెద్దవూర మండలం వెల్మగూడెం సర్పంచ్‌గా పనిచేసిన, ముందునుంచీ జానారెడ్డినే అంటిపెట్టుకుని ఉన్న మాధవరెడ్డి కుటుంబంనుంచి ఆయన తనయుడు రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.వెంకటనారాయణరెడ్డి (డీవీఎన్ రెడ్డి)ని బరిలోకి దింపే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది. వివాదారహితుడు కావడం, జానారెడ్డి ముఖ్య అనుచర నేతలంతా ఆయనను వదిలి టీఆర్‌ఎస్ బాట పట్టిన సమయంలో కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా జానాకు వెన్నుదన్నుగా నిలవడం కారణాలతోపాటు ఎన్నికల ఖర్చును తేలిగ్గా భరించగల ఆర్థిక స్థోమత కూడా ఉండడం కారణంగా చెబుతున్నారు. ఒకవేళ జానారెడ్డి నిజంగానే నాగార్జునసాగర్‌ను వదిలి మిర్యాలగూడ మారడం ఖాయమైతే, సాగర్‌లో తన తనయుడికి టికెట్ ఇప్పించుకోలేని పక్షంలో కచ్చితంగా తనకు ప్రత్యామ్నాయంగా డీవీఎన్ రెడ్డిని ఎంచుకుంటారని చెబుతున్నారు.
దూరమైన అనుచర నేతలు
వాస్తవానికి 2014 సార్వత్రిక ఎన్నికలు జరిగేదాకా మండాలనికో ముఖ్యనేత జానా వర్గంలోనే, ఆయన అనుచర నాయకులుగానే ఉన్నారు. డీసీసీబీ చైర్మన్‌గా పనిచేసిన విజయేందర్‌రెడ్డి, హాలియాకు చెందిన మలిగిరెడ్డి లింగారెడ్డి, ప్రముఖ న్యాయవాది ఎంసీ కోటిరెడ్డి, నిడమనూరునుంచి భాస్కర్‌రావు, హన్మంతరావు, పెద్దవూర నుంచి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి తదితరులంతా జానారెడ్డికి బలమైన టీమ్‌గా ఉండేవారు. గత ఎన్నికల్లో భాస్కర్‌రావుకు మిర్యాలగూడ టికెట్ ఇప్పించింది కూడా జానారెడ్డే. ఆ తర్వాత భాస్కర్‌రావు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇదే మాదిరిగా ఎంసీ కోటిరెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, విజయేందర్ రెడ్డి, కర్నాటి లింగారెడ్డి గులాబీ కండువాలు కప్పుకున్నారు.
కొద్ది రోజుల తేడాతో కర్నాటి లింగారెడ్డి తిరిగి కాంగ్రెస్‌కు వెనక్కి వచ్చారు. ఈ పరిణామాలతో జానా వెంట ముఖ్య నాయకులు ఎవరూ లేకుండా అయ్యారు. నిడమనూరులో హన్మంతరావు, పెద్దవూరలో కర్నాటి లింగారెడ్డి ప్రస్తుతం కనిపిస్తున్నారు. అయితే, కష్టకాలంలో ఆయన వెన్నంటే ఉన్న డీవీఎన్ రెడ్డి వైపు జానా మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు. మరో సీనియర్ నేత రంగశాయి రెడ్డి కూడా జానాతోనే ఉన్నారు. వివిధ సమీకరణలు, కారణాలతో హన్మంతరావు గురించి ఆలోచించడం లేదని, కర్నాటి లింగారెడ్డి విషయంలోనూ కొన్ని ప్రతిపబంధకాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జానారెడ్డి ఎవరు పేరు ప్రతిపాదిస్తే వారికే నాగార్జున సాగర్ టికెట్ దక్కే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment