నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు అభ్యర్థిగా నా పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్‌లో వినిపించడం ఉండదు. వెళ్లి వినిపించుకోవడమే ఉంటుంది. నేను వెళ్ల లేదు, వెళ్లి వినిపించుకోలేదు. మరి నా పేరు నాకు వినిపించడం ఏమిటి?!
‘‘ఎనీబడీ హియర్ మీ’ అని మాణిక్యం ఠాగూర్‌ని అనుకుంటా, ఫోన్ చేసి అడిగాను.
‘‘చెప్పండి జానారెడ్డి గారూ మీరేనని తెలుస్తోంది’’ అన్నారు అటువైపు నుంచెవరో!
‘‘నేను జానారెడ్డినని మీకు తెలుస్తూనే ఉంది, మీరు మాణిక్యం ఠాగూర్ అని నాకు తెలిసేదెలా?!’’ అని అడిగాను.
‘‘తెలియకపోయినా ఏమౌతుంది చెప్పండి జానారెడ్డి గారూ. పొరపాటున మీ ఫోన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వెళ్లినా ఏం కాదు. కాంగ్రెస్ నుంచి తను వెళ్లిపోయానని ఆయన అనుకుంటున్నారు తప్ప, ఆయన వెళ్లిపోయినట్లు కాంగ్రెస్ అనుకోవడం లేదు. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో మిమ్మల్ని గెలిపించే బాధ్యత కూడా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిదే. కనుక మీరు నాకు ఫోన్ చేయాలనుకుని ఉత్తమ్‌కి చేసినా, చేయవలసిన వాళ్లకే చేసినట్లవుతుంది. నేనొకటి కాదు, ఉత్తమ్ ఒకటి కాదు’’ అన్నాడు!
ఉత్తమ్ వేరు, మీరు వేరు అని నేను మీతో అనలేదు కదా మాణిక్యం. మన పార్టీలో ఉన్నది ఇదే. ఊహించుకుని మాట్లాడతాం. ఉప ఎన్నికకు అభ్యర్థిగా నా పేరు ఎవరు చెప్పారో నాకై నేను ఊహించుకోలేక మీకు ఫోన్ చేస్తే, నన్ను గెలిపించే బాధ్యత ఎవరి మీద పెట్టారో చెప్పమని అడగడానికి నేను మీకు ఫోన్ చేసినట్లు మీరు ఊహించుకున్నట్లున్నారు! నాగార్జున సాగర్ అభ్యర్థిగా నా పేరును నాకు వినిపించేలా చేసిన ఆ మంచి వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనిపించే ఇప్పుడు మీకు ఫోన్ చేశాను. మీరు తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చినా, ఇక్కడ సోనియాజీకి దగ్గరగా ఉన్న తెలంగాణ నాయకులు మీరే కనుక మీకు ఫోన్ చేశాను? ఢిల్లీలో ఎవరైనా నా పేరు చెప్పారా? లేదంటే తెలంగాణలోనే ఎవరైనా చెప్పారా?’’ అని అడిగాను.
‘‘రెండు చోట్లా కాదు. తమిళనాడులో చెప్పారు’’ అన్నాడు!!
‘‘నాగార్జున సాగర్‌కి జానారెడ్డిని నిలబెడితే బాగుంటుందని తమిళనాడులో చెప్పారా?’’ అన్నాను.
మాణిక్యం నవ్వారు.
‘‘అవును జానారెడ్డి గారూ.. నేను తమిళనాడులో ఉన్నప్పుడు సోనియాజీ ఫోన్ చేసి చెప్పారు. ఉత్తమ్‌కుమార్ వెళ్లిపోయిన ఖాళీని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత భర్తీ చేస్తే బాగుంటుందని మీరు మేడమ్‌కి ఫోన్ చేసి చెప్పారట కదా. ‘అలా చేస్తే పార్టీకి ఎలాంటి ఉపయోగం కలుగుతుందో నాకైతే తెలియదు కానీ ఠాగూర్.. జానారెడ్డి నాకు ఫోన్ చేయడం వల్ల ఒక ఉపయోగం అయితే కలిగింది. నాగార్జున సాగర్‌కి ఎవరైతే బాగుంటుందా అని ఆలోచిస్తున్న టైమ్‌లో ఆయన ఒకరున్నారు కదా అని గుర్తొచ్చింది’ అని మేడమ్ నాతో అన్నారు’’ అని చెప్పాడు మాణిక్యం ఠాగూర్. నాకు తెలియకుండా నేనే నా పేరు వినిపించుకున్నట్లున్నాను!
కాంగ్రెస్‌లో ఏం జరగబోతోందో అందరూ ఊహిస్తూనే ఉంటారు కానీ చివరికి ఎవరూ ఊహించనిదే కాంగ్రెస్‌లో జరుగుతుంది. అదే కాంగ్రెస్ గొప్పదనం.
‘‘నేను అస్సలు ఊహించలేకపోతున్నాను మాణిక్యం..’’అన్నాను.
‘‘పోనీ మీరు కాకుండా నాగార్జున సాగర్‌కు ఎవరున్నారో చెప్పండి. మిమ్మల్ని కాకుండా నాగార్జున సాగర్‌కు ఎవరిని ఉంచాలో నేను చెబుతాను’’ అన్నాడు.
‘‘అర్థం కాలేదు మాణిక్యం’’ అన్నాను.
‘‘నాగార్జునసాగర్‌లో టీడీపీని ఓడించింది మీరే. టీఆర్‌ఎస్‌ని ఓడించిందీ మీరే. ఇప్పుడిక బీజేపీని ఓడించవలసిందీ మీరే కదా జానారెడ్డి గారూ..’’ అన్నాడు!
తెలంగాణ కాంగ్రెస్ కన్నా, తమిళనాడు కాంగ్రెస్ షార్ప్‌గా ఉన్నట్లుంది!!
-మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment