హామీల అమలులో ప్రభుత్వం విఫలం
హాలియా : ఎన్నికల హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి విమర్శించారు. ఆదివారం హాలియా ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు రుణమాఫీ చేసే విషయంలోనూ, విద్యుత్ సరఫరాలోనూ ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే గోదావరి నదిపై నాలుగు స్తంభాలేసి ఛత్తీస్‌గఢ్ నుంచి ఒక్క రోజులో కరెంట్ తెస్తానని ఎన్నికల ముందు చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చి నాలుగు మాసాలైనా ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అభివృద్ధి వేగవంతం అవుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం తీసుకువచ్చానన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని తెలిపారు. ఇందిరమ్మ పథకంలో ఎక్కడో ఒకటి రెండు చోట్ల అవకతవకలు జరిగాయని చెప్పి రాష్ట్రంలో ఈ పథకం కింద ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారుల బిల్లులు ఆపడం సరికాదన్నారు. సమావేశంలో ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటిలింగారెడ్డి, అంగోతు లచ్చిరాంనాయక్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గార్లపాటి ధనమల్లయ్య తదితరులున్నారు.