సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ నినాదంతో గత ఎన్నికల సందర్భంగా తాము రూపొందించిన మేనిఫెస్టోకు భారీ ప్రజాదరణ లభించడంతో రానున్న ఎన్నికల్లోనూ అదే తరహాలో మేనిఫెస్టోను సిద్ధం చేయాలని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ప్రతిపక్షాలు వెల్లడించాకే తమ మేనిఫెస్టోను విడుదల చేయాలని కేసీఆర్ మొదట భావించినా ఈ విషయంలో విపక్ష పార్టీలు జాప్యం చేస్తుండటంతో టీఆర్‌ఎస్ ఎన్నికల హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఇదే సరైన సమయమని గులాబీ దళపతి భావిస్తున్నారు. పూర్తి మేనిఫెస్టో సిద్ధమయ్యేలోగా ఇప్పటికే నిర్ణయించిన కొన్ని ముఖ్యమైన హామీలతో పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించాలని నిర్ణయించారు. ఈ మేరకు కేసీఆర్ మంగళవారం స్వయంగా పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమవేశంలో పాల్గొంటారు. ఇప్పటివరకు ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, విజ్ఞప్తులపై ఈ సమావేశంలో చర్చిస్తామని టీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె. కేశవరావు చెప్పారు. సమావేశానికి హాజరు కావాలని కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వర్‌రావు, ఈటల రాజేందర్, టి. హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జి. జగదీశ్‌రెడ్డి, అజ్మీరా చందూలాల్, టి. పద్మారావుగౌడ్, ఎ.పి. జితేందర్‌రెడ్డి, జి. నగేశ్, కొప్పుల ఈశ్వర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎండి. ఫరీదుద్దీన్, పి. రాములు, గుండు సుధారాణి, శేరి సుభాష్‌రెడ్డిలకు సమాచారం ఇచ్చారు.
అందరూ మెచ్చేలా...
అన్ని వర్గాల ప్రజలు మెచ్చేలా మేనిఫెస్టో ఉండాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల హామీల అమలు తీరును ప్రస్తావిస్తూనే ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా ప్రణాళిక రూపొందిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆమోదించే రీతిలో కొన్ని కొత్త హామీలను మేనిఫెస్టోలో చేర్చనుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనుంది. చివరి ప్రాధాన్యత అంశంగానే నిరుద్యోగ భృతిని చేర్చాలని భావిస్తోంది. ఎక్కువ మందికి వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆసరా పెన్షన్ల మొత్తాన్ని రూ. వెయ్యి నుంచి రూ. 2 వేలకు పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. అలాగే డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం అమల్లో కొత్త విధానం తీసుకురావాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇంటి స్థలం ఉన్న వారికి ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఆర్థిక సాయం అందించేలా మార్పులు చేస్తున్నట్లు ప్రకటించనుంది. వచ్చే ఎన్నికల్లో సైతం రైతు రుణమాఫీ అంశాన్ని చేర్చాలని భావిస్తోంది. అయితే గత ఎన్నికల తరహాలోనే రూ. లక్ష చొప్పున రుణమాఫీ చేస్తామని ప్రకటించనుంది. టీఆర్‌ఎస్ సేకరించిన సమాచారం ప్రకారం... రెండు లక్షల రూపాయల రుణాలు ఉన్న రైతులు రాష్ట్రంలో 2 శాతంలోపే ఉన్నారు. దీంతో రూ. లక్ష రుణమాఫీ అంశంపైనే దృష్టి సారిస్తోంది.
భారీగా వినతులు...
టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో తమ డిమాండ్లను చేర్చాలని పలు వర్గాల నుంచి భారీగా వినతులు వస్తున్నాయి. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె. కేశవరావును నిత్యం పలు సంఘాల ప్రతినిధులు కలసి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. గత నెల 15 వరకే కమిటీకి 170కిపైగా వినతులు కమిటీకి వచ్చాయి. ఆ తర్వాత మరో 200 వరకు వచ్చినట్లు తెలిసింది. అన్ని వర్గాల వినతులు, సూచనలను కమిటీ పరిశీలిస్తోంది. విధానపరమైన అంశాలపై పలు సంఘాలు చేసే సూచనలను స్వీకరిస్తోంది. మేనిఫోస్టో కమిటీ తొలి భేటీలో చాలా అంశాలపై చర్చించారు. మరోసారి రుణమాఫీ అమలు చేయాలనే వినతిపైనే ఎక్కువసేపు చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని కమిటీలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. నిరుద్యోగులకు భృతిని ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కమిటీ అభిప్రాయపడింది.
అభ్యర్థులతో కేసీఆర్ చర్చలు...
టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ఏయే అంశాలను చేర్చాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పలువురు అభ్యర్థులను అడిగారు. ప్రచారంలో ప్రజలు ఎలా స్పందిస్తున్నారని తెలుసుకున్నారు. సోమవారం పలువురు టీఆర్‌ఎస్ అభ్యర్థులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి కొత్తగా ఏమైనా కోరుకుంటున్నారా..., మేనిఫెస్టోలో ఏయే అంశాలు చేరిస్తే బాగుంటుందని అడిగారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో మార్పులు చేయాలని, మరోసారి రుణమాఫీని పరిశీలించాలని ప్రజలు సూచిస్తున్నట్లు పలువురు అభ్యర్థులు కేసీఆర్‌కు వివరించారు.
Published Tue, Oct 16 2018 2:13 AM | Last Updated on Tue, Oct 16 2018 10:49 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment